Sunday, 2 December 2018

మిగిలిన సమయం



అవును ....
పదమూడేళ్ళ వయసులో నన్నో పశువు కిడ్నాప్ చేసాడు... తొమ్మిది నెలలు హింస... 
మా అమ్మ పోలిస్ ల సాయం తో నన్ను రేస్క్యు చేసేంత వరకు ... మానసికంగా .. శారీరకంగా .. హింస.
అప్పటికే మా నాన్న లేరు. 
నన్ను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చిన రోజు మా అమ్మ నన్ను నాన్న ఫోటో ముందు నిలబెట్టింది. 
అప్పుడు అమ్మ చెప్పిన మాట నాకింకా గుర్తు ఉంది.
“ఒక్క నిమిషం.. కాదు కాదు ఒక్క సెకండ్ ఈ తొమ్మిది నెలల కాలం గురించి మాట్లాడినా, ఆలోచించినా, బాధ పడినా ఈ టైం కూడా దానికి కలుస్తుంది. నీ జీవితం లో ఇప్పటికే కోల్పోయిన సమయం చాలు. ఇంకొక్క క్షణం కూడా వృధా చెయ్యనని నాన్న కి మాట ఇవ్వు “ 
***
మా అమ్మా నేనూ ఊరు మారాం. మమ్మల్ని గుర్తు ఎరగని చోట జీవితం ప్రారంభించాం. అమ్మ స్కూల్ లో క్రాఫ్ట్ టీచర్ గా చేసేది. జూట్ బాగ్ లు తయారు చేసేది. ఆదివారాలు పబ్లిక్ ఎక్కువ గా తిరిగే చోట సైకిల్ మీద వెళ్లి అమ్మే దాన్ని. 
ప్రభుత్వ స్కూల్ లో చదువుకునే దాన్ని. మాలాటి మరికొందరిని పోగుచేసి జూట్ బాగ్ లు పెద్ద స్థాయిలో తయారు చేసేవాళ్ళం. జిల్లా అధికార్లు మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. బ్యాంకు లో తక్కువ వడ్డీకి ఋణం దొరికింది.
పన్నెండేళ్ళు ఇష్టపడి కష్టపడ్డాం. 
ఇప్పుడు మాతో పాటు ఇరవై మంది ఉన్నారు. ఈ సంవత్సరం మా టర్నోవర్ అరవై ఏడు లక్షలు. 
వచ్చే సంవత్సరం కోటి ని అందుకుంటాం. అరిటాకు ప్లేట్స్ తయారి యూనిట్ ని కొత్తగా ప్రారంభిస్తున్నాం. అది కూడా విజయవంతంగా నడిపించగలం అని నమ్మకం తో ఉన్నాం. 
నాకిప్పుడు పెళ్లయింది. నా భర్త కూడా మాతో ఉన్నాడు. మరో పది మందికి కొత్తగా ఉపాది కల్పిస్తాం. 
***
మళ్ళీ చెబుతున్నాను. గుర్తుంచుకోండి.. కాలం చేసిన గాయాలని గెలుక్కుని చేతిలో ఉన్న సమయాన్ని సానుభూతి కోసం, ఓదార్పు కోసం పాడుచేసుకోకండి. లేవండి లేచి మీరు నడవండి. మీతో కలసి నడక పంచుకోటానికి సిద్దంగా ఉన్న వాళ్ళని గుర్తిస్తూ సాగిపొండి. All the best. 
(పరిచయం ఇష్టం లేని/ఇష్ట పడని ఒక యువతి కధ)

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...