Tuesday, 25 September 2018

మారుతీ రావు

మెయిన్ బాజారు నుండి ఒక సన్నటి వీదిలో పాతకాలం నాటి పెంకు ఇంటికి పెద్ద అక్షరాలతో “హరికా స్టూడియో ‘ అన్న ఒక బోర్డు ఉంది.
మండల కేంద్రం అయినా పొగాకు వ్యాపార ఆధారిత ప్రాంతం. ఒక మాదిరి టౌన్.
వరండా కి ఒక ఇనుప గ్రిల్లు ఉంది.
ఒక పక్కగా నీలం రంగు బాగ్ గ్రౌండ్ బోర్డు మరో రెండు పక్కలా చిక్కటి కర్టెన్లు అవసరాన్ని బట్టి వాడుకునే విధంగా ఉన్నాయి.
బయట గ్రిల్లు కి అమర్చిన చెక్క మీద ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు ఆయన.
లోపల నుండి ఒక పాతికేళ్ళ అమ్మాయి వాకిలి కర్టెన్ తొలగించి వచ్చింది.
“గంగాధరం లేరండీ. హై స్కూల్ లో టెన్త్ పిల్లలకి పాస్ పోర్ట్ ఫోటో లు తీయటానికి వెళ్ళారు. మధ్యాహ్నం అవుతుంది అని చెప్పారు.”
నేను నీ కోసమే వచ్చానమ్మా.. “లావణ్య కదూ?”
తెలియని వ్యక్తి తన పేరు చెప్పటం అదీ తనకోసమే వచ్చానని చెప్పటం ఆమెని ఆశ్చర్య పరచింది.
‘రండి కూర్చోండి’ అంది దారి ఇస్తూ..
..
“మొన్న ఆదివారం మార్కెట్ లో నువ్వు పర్సు పారేసుకున్నట్లు ఉన్నావు.” అయన చేతి సంచీ లో నుండి ఒక వెల్వెట్ తో చేసి నగిషీలు అంటించిన ఒక చేతి పర్సు తీసి చూపించాడు.
“లేదండీ ఇది నా పర్సు కాదు. పైగా నాకు మార్కెట్ కి వెళ్ళే అవసరం లేదు. మీరు కరెక్ట్ చిరునామాకే వచ్చారా?”
ఈ లోగా లోపల ఉయ్యాల లో నుండి ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది.
“కూతురా? ఎన్నో నెల? హారిక కదూ పేరు?”
లావణ్య లోపలి వెళ్తూ అతన్ని అనుమానంగా చూసింది.
పసిబిడ్డ ని ఎత్తుకుని ఏడుపు మాన్పిస్తూ బయటకి వచ్చింది. “అసలు మీకేం కావాలి అంది” అసహనంగా..
ఆతను అదేమీ పట్టించు కోకుండా పర్సు లోనుండి మడత పెట్టిన తెల్ల కాగితాలు తీసాడు.
“వీటిని చూడమ్మా. ఏమయినా గుర్తుకి వస్తుందేమో “
కాగితాలు చేతిలో కి తీసుకుంటూ నే ఆమె కి కాళ్ళు వణికాయి. నిలబడలేనట్టు ఆమె అక్కడే కూల బడి పోయింది.
‘మీరు? మీరు?” అంది.
“నేను రాకేశ్ వాళ్ళ తండ్రిని. నువ్వు రాకేశ్ అర్దరాత్రి దాటాక చాటింగ్ లో మాట్లాడుకున్న సంభాషణలు ఇంకో వంద పేజీలు ఉన్నాయి.”
లావణ్య బేలగా చూసింది.
“గతం గురించి పోస్ట్ మార్టం కోసం నేను రాలేదు. తెలిసీ తెలియని అడాలిసెన్స్ లో ఎదో జరిగిపోయింది. మీ మధ్య అంత బలమయిన నమ్మకం కాని ఓపిక గాని లేవు. ఇద్దరూ చెరో దారి అయ్యారు. నీకు హరిక పుట్టింది. మా వాడు కూడా త్వరలో తండ్రి అవబోతున్నాడు. మీ సంభాషణ అంతా ఆరోనెల గర్భిణి.. నా కోడలు చదివింది. ఒక్క సారి ఆలోచించు ఆమెకి ఎలా ఉంటుంది.”
అక్కడ మౌనం పరుచుకుంది.
“తప్పు మావాడి వద్దా ఉంది. వాడిని కూడా మందలిస్తాను. కాని దీనీ వల్ల ఎక్కువగా నష్ట పోయేది నీ జీవితమే.
అటునుండి మరో సారి నీకు ఫోన్ రాకుండా నేను చేస్తాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మీ మధ్య ఎలాటి పలకరింపులు ఉండకూడదు.”
“గంగాధరం మంచి కుర్రాడు. అతన్ని దూరం చేసుకోకు.
అతనికి హైస్కూల్ ఫోటో ల పని చెప్పించింది నేనే.
ఏదయినా బ్యాంకు లో అప్పు ఇప్పిస్తాను. స్టూడియో అభివృద్ధి చేసుకోండి. చక్కగా ఆరోగ్యం గా బతకండి. ఇది నాకు నా కోడలికి నీకు మాత్రమె తెలుసు. .. ప్రస్తుతానికి” చివరి పదం గట్టిగా వత్తి చెప్పాడు.
ఆతను కుర్చీ లోనుండి లేచి “అర్ధం కానంత చిన్న పిల్లవి మాత్రం కాదనే నమ్మకం ఉంది. నీకు ఏదయినా సాయం కావలసి ఉంటె ఫోన్ చెయ్యి నా నెంబరు అందులో ఉంది.”
ఆతను బయటకి వస్తూ “నా పేరు మారుతీ రావు. గుర్తు ఉంచుకో”అన్నాడు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...