Thursday, 6 October 2016

పి హెచ్ డి

కొత్త ప్రొఫెసర్ బోర్డ్ వైపు తిరిగి డిస్ప్లే స్రీన్ మీద ఉన్న సిద్దంతాన్ని వివరించేటప్పుడు ఉన్నట్టు ఉండి క్లాస్ లో వెనుకనుండి ఎవరో పిల్లాడు విజిల్ వేశాడు చెవులు దిబ్బడి పోయేట్టు శబ్దం.
.. 
ప్రొఫెసర్ వెనక్కి తిరిగాడు. “ హూ ఈజ్ ఇట్ ?” అన్నాడు. 
..
యదావిదిగా ఎవరు మాట్లాడలేదు. 
..
అందరూ మౌనం వహించారు. ముసి ముసి నవ్వులు కామనే.
***
ప్రొఫెసర్ పాఠం ఆపేశాడు.
బయటకి వెళ్లబోతూ ఆగాడు.
..
“ఇంకా అరగంట ఉంది. మీకో తమాషా చెప్తాను.”..
..
అందరూ ఆసక్తి గా వినసాగారు. ..
..
“రాత్రి నేను మన యూనివర్సిటీ నుండి మా ఫ్లాట్ కి వెళుతుంటే.. ..
బీచ్ రోడ్డు లో ఎదురుగా తెల్లటి డ్రస్ వేసుకున్న ఒక ..ఆవిడ కారు ఆపి లిఫ్ట్ అడిగింది. నేను కారు ఆపగానే ఆమె కారు ఎక్కింది.
విరబోసుకున్న జుట్టు ఎడం చేతి ముని వేళ్ళతో వెనక్కి నెట్టుకుంటుంది.
పర్ఫ్యూమ్ వాసన మత్తుగా ఉంది. మేము మాట్లాడు కుంటూనే ఉన్నాం.
ఇద్దరం ఒక హోటల్ కి బోజనానికి వెళ్ళాం. ఎంతో కాలం నుండి తెలిసిన వాళ్లలా మేము అర్ధరాత్రి దాకా మాట్లాడుకుంటా ఉండి పోయాం.
తన గురించి చాలా విషయాలు చెప్పింది తనకో తమ్ముడున్నాడని మన యూనివర్సిటీ లో నే చదువుతున్నాడని, అద్బుతంగా విజిల్ వేస్తాడని, చెవులు దిబ్బడి పోయేట్టు శబ్దం వస్తుందని “
..
క్లాసు లో అందరూ  ఒక పిల్లాడి వైపు చూశారు.

Wednesday, 5 October 2016

K


(Whats app ప్రేమికుల సంభాషణ) 
ఆమె: కార్తీక్ నాకో 7k పంపవా?
అతను: ఎందుకు ?
ఆమె: “దసరా కి ఒక డ్రస్ కొనొక్కోవాలి దానికో 4k . ఫేషియల్, బ్యూటీ పార్లర్ ఖర్చు 2k, మంచి సాండీల్స్ కొనుక్కోవాలి.”

అతను: “సరే పంపుతున్నాను K K K K K K K K K రెండు K లు ఎక్కువ పంపాను. పర్ఫ్యూమ్ కొనుక్కో. ఇంకా మిగిలితే కొంచెం తెలివి కూడా “

Tuesday, 4 October 2016

యువ సన్యాసి

మండు వేసవి. పెటేల్మని ఎండ. మిట్ట మద్యాన్నం. ఆ యువ  సన్యాసి ‘టారి గేటు ‘ స్టేషన్ లో దిగి నేలపై ఒక సంభాన్ని అనుకోని కూర్చుని ఉన్నాడు. ఎండ నిప్పులు చెరుగుచున్నది. సన్యాసి వద్ద ఎటువంటి నగదు లేదు. అతనికి అమితమయిన ఆకలి గాను, దాహం గాను ఉంది.
ఒక ధనవంతుడు ఎదురుగా కూర్చుని మంచి ఆహారం తీసుకుంటూ సన్యాసిని చూసి “అన్నపానీయాలు లేకుండా మాడుటే సన్యాసుల  గతి “ అని హేళన చేశాడు. ఆ యువ సన్యాసి ఆ వాక్యాలని స్వీకరించలేదు.

అంతలో ఒక మిటాయి దుకాణాదారుడు, రుచి కరమయిన బోజనాన్ని చల్లటి మజ్జిగను  తీసుకుని వచ్చి సన్యాసి ఎదుట ఉంచి “స్వామి వీటిని భుజించండి” అని బ్రతిమాలాడు.
ఆ సన్యాసి అతనితో “ మీరెవరు? నాకు మీరు పరిచయం లేదు. మీరు మరెవరో అనుకుని బ్రమపడి నావద్దకు వచ్చినట్లున్నారు “ అని బోజనం తీసుకోకుండా తిరస్కరించాడు.
దానికా వర్తకుడు “ స్వామి! నా ఇష్ట దైవమయిన శ్రీ రామ చంద్ర ప్రభువు నాకు కలలో కనిపించి, రైల్వే స్టేషన్ లో ఉన్న మిమ్ములను చూపించి ‘అదిగో అతను నిన్నటి నుండి అతడు ఆహారం లేకుండా ఉన్నాడు. నా మనసు తల్లడ్డిళ్ళు తుంది. వెంటనే ఆహార పానీయాలను తీసుకు పోయి అతనికి అందచేయుము’ అని ఆదేశించి యున్నాడు.”
నేను నిద్ర నుండి మేలుకుని ‘ఇది కలే కదా అని నిర్లక్షం తో మళ్ళీ నిద్ర కి ఉపక్రమించాను. మళ్ళీ అదే ‘కల’ ఎవరో తట్టి లేపినట్లు అయినది. ఆయన ఆజ్ఞానుసారము ఈ బోజనం తీసుకు వచ్చాను. ఖచ్చితంగా మిమ్మల్నే శ్రీరామ చంధ్ర ప్రభువు నాకు చూయించారు. దయచేసి వీటిని స్వీకరించండి” అని ప్రాదేయ పడ్డాడు.
పరమేశ్వరుని లీలకు ఆశ్చర్యముతో కన్నీరు విడుచుచూ  సన్యాసి  ఆ వర్తకుని కి కృతజ్ఞత తెలిపి వాటిని స్వీకరించాడు. ఎదురుగా కూర్చుని ఉన్న దనవంతుడు సన్యాసి పాదముల పట్టుకుని తన మూర్ఖత్వాన్ని క్షమించమని వేడు కున్నాడు.
“ఎవరు ఇతర చింతలు లేకుండా నన్నే ఉపాసింతురో వారి యోగ క్షేమములు లకు నేను బాద్యత వహించేదను “ అని గీతలో శ్రీకృష్ణుని పలుకులను ఆ దనవంతునికి సన్యాసి అయిన వివేకానందుడు గుర్తు చేశాడు.


తోడు

అర్ధరాత్రి పై ఫ్లోర్ లో ఉన్న ఇంటి ఓనర్ కాలింగ్ బెల్ కొట్టాడు సుబ్బారావు.
అయిదునిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఇంట్లో అందరూ నిద్ర లేచినట్లున్నారు. 
..
"ఏమిటి విషయం?" టెనెంట్ ని చికాకుగా అడిగాడు ఒనరుడు...
..
నేరుగా విషయం లోకి వచ్చాడు సుబ్బారావు "ఈ నెల దసరా మామ్ముళ్ళు, పోయిన నెల గణేశ్ చందాలు .. చాలా ఇబ్బందిగా ఉంది ఈ నెల కూడా అద్దె ఇవ్వలేను."..
...
సర్రున మండింది ఆయనకి. ...
" అర్ధరాత్రి వచ్చి చెప్పాలా ?? రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు కదా?'
...
"నిజమే అనుకోండి.. రాత్రంతా నేను ఒక్కడినే బాదపడటం ఎందుకా? అని" సుబ్బారావు నసిగాడు.

Monday, 3 October 2016

మత విశ్వాసం

ఇంగ్లండ్ లో ఐ సి యస్ డిగ్రీ చదివిన భారతీయ యువకుడు ఒకరు ఉత్తర ప్రదేశ్ లోని  ఇటావా జిల్లా కలెక్టర్ గా ఉండేవాడు.
ఆగ్రా నుండి ‘యునైటెడ్ ప్రొవిసన్స్ ఆఫ్ ఇండియా’ కి కమిషనర్ గా పనిచేస్తున్న  విన్సెంట్ ఆర్థర్ స్మిత్, పర్యవేక్షణ నిమిత్తం  కలెక్టర్ గారి హెడ్ క్వార్టర్స్ కి వచ్చారు. పాశ్చాత్య పద్దతులు పూర్తిగా ఎరిగిన కలెక్టర్ గారు ఆయనని గౌరవించడానికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాడు.
స్మిత్ గారికి బోజనమ్ లో ఆయనకి అత్యంత ప్రియమయిన వంటకం మొదటగా వడ్డించగానే..  ఒక్క క్షణం ఆయన దానిని చూసి పక్కకి నెట్టేశాడు.
కలెక్టర్ గారికి ఆశ్చర్యం వేసింది.” మీకోసం ప్రత్యేకంగా చేయించాను. దానిని గుర్తుపట్టలేదా?? పక్కకి నెట్టేశారు?” అన్నాడు.
అతను మెల్లగా “నాకు తెలుసు. గుర్తుపట్టాను” అన్నాడు
“మీకు ఇష్టం లేదా?” అడిగాడు కలెక్టర్.
“ఇష్టమో లేదో వేరే విషయం. ఇక్కడ భారత దేశం లో ‘ఆవుని’ మాత గా పూజిస్తారు. ఈ దేశం లో ఉన్నంత కాలం నేను ఈ ప్రజల మత విశ్వాసాలని గౌరవించడం నా విది. నేను అంత అనాగరికుడిని కాను” అన్నాడు.
కలెక్టర్ గారు సిగ్గుతో తలెత్తుకోలేక పోయారు.
*****
Sir Vincent Arthur Smith,  (1848–1920) గ్రేట్ బ్రిటన్ & ఐర్లాండ్  యునైటెడ్ కింగ్ డమ్ లో జన్మించారు. 23 వయసుకి ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాసయ్యాడు. 1871-1900 మద్య కాలం లో యునైటెడ్ ప్రొవిసన్స్ ఆఫ్ ఇండియా కి కమిషనర్ గా పనిచేశాడు.

తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి పోయాక భారతదేశం గురించి, గొప్ప రాజుల గురించి అనేక గ్రంధాలు వ్రాశాడు (The Early History of India and The Oxford History of India, Buddhist emperor, Ashoka and the Mughal emperor, Akbar, and a history of fine arts in India and Ceylon ఆయన వ్రాసిన వాటిలో కొన్ని )

Sunday, 2 October 2016

చక్కెర పొంగలి

స్నానం చేసి బయటకి వెళ్తుంటే హల్లో చదువుకుంటున్న మా పెద్దమ్మాయి అడిగింది.
“గుడికా ?!! ప్రసాదానికి ఇంకా పావుగంట ఉంది” అంది. 
భీబత్చమయిన  బక్తులకే తప్పలేదు అవమానాలు. మనం ఎంత? 
“అమ్మ, నానమ్మ ఇద్దరు వెళ్లారు. మనిద్దరికి ప్రసాదాలు వస్తాయి " అంది. 
"చక్కెర పొంగలి చల్లారి పోతుంది. నేను అక్కడే తింటాను" అని నవ్వేసి గుడికి వచ్చాను.
..
మా వీదిలో ఉండే పిల్లల్ని కొంతమందిని పోగుచేసి, చాలీసా పారాయణం, మంగళ హారతి అబ్యాసం చేయిస్తున్నాం. పిల్లలు రాగ యుక్తంగా పాడలేక పోయినా ఆ పసి గొంతుల్లో స్వచ్చత ఉంటుంది. అమాయకత్వం ఉంటుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు పాడటం అవగానే చప్పట్లు కొట్టి గట్టిగా మెచ్చుకోవటం నాకు అలవాటయిపోయింది. అందుకే ఎక్కడున్నా పూజ ముగిసే సమయానికి గుడికి వెళ్తున్నాను. 




శుభరాత్రి.

కాలం

ఒక వ్యక్తి సంచి నిండా ఇంట్లో చాన్నాళ్లుగా ఉన్న గులక  రాళ్ళు పోసుకుని ఊరి వెలుపలికి వెళ్ళాడు. అక్కడ ఒక నది పారుతూ ఉంది. నది ఒడ్డున ఒక పొడవాటి చెట్టు ఉన్నది. దాని కొమ్మల మీద పక్షులు ఉన్నాయి. రంగు రంగుల పక్షులు.
అతను సంచి లోని రాయి తీసుకుని గురి చూసి ఒక పక్షి  మీదకు విసిరాడు. అది పక్షికి తగల లేదు ప్రవహించే కాలవలో పడిపోయింది. మరొకటి విసిరాడు. అది కూడా తగల లేదు. ఏదో ఒకటి తగలక పోతుందా అని విసురుతూనే ఉన్నాడు.
పక్షులు ఒక చోట నుండి మరొక చోటకి ఎగురుతున్నాయి గాని దేనికి రాళ్ళు తగల లేదు. రాళ్ళన్ని నదిలోకి పోయి పడ్డాయి.
ఆఖరుకు ఒక రాయి మిగిలింది. మెరుస్తున్న దానిని తీసుకుని అతను వెనక్కి వచ్చాడు. ఊరి మొదట్లో ఒక దుకాణాదారునికి దాన్ని చూపించాడు. వ్యాపారి దాన్ని చూసి అబ్బురం చెందాడు. “ఇది మామూలు గులక రాయి కాదు. చాలా విలువయినది. దీని ఖరీదు కూడా నేను చెప్పలేను. నిపుణులయిన వారు మాత్రమే చెప్పగలరు” అన్నాడు
అప్పుడా వ్యక్తి ‘అయ్యో నేను విలువయిన రాళ్ళు వృధాగా నదిలో జారవిడుచుకున్నానే’.. అని భాదపడి ‘మిగిలిన ఒక్క దానిని అయినా సద్వినియోగం చేసుకోవాలి’ అనుకున్నాడు.

ఆ రాళ్లే జీవితకాలం లో విలువయిన తిరిగిరాని సంవత్సరాలు, నెలలు. చెట్టుమీదున్న పక్షులే ఆశలు, కోరికలు. ఆ నదే మృత్యువు. వ్యాపారే గురువు.
ఇది ఒక క్రైస్తవ నీతి కధ. 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...