Sunday, 4 March 2018

మతిమరుపుకి మరో పేరు

తెలుసండీ తెలుసు.. గతం తో ఆమెని కోప్పడి తిట్టిన సంఘటనలు తేదీలతో సహా చెప్పగలను.
డైరీ వ్రాసే అలవాటు ఉంది. వాటిని చూడక పోయినా సరిగ్గా చెప్పగలను అంత జ్ఞాపక శక్తి ఉంది నాకు.
అయితే మాత్రం మా ముసల్దానికి మతిమరుపు ఎక్కువవుతుంది. ఎప్పుడో రెండు గంటల క్రితం రోడ్డు పక్క దాబా హోటల్ లో తిన్నాం. అక్కడ మర్చిపోయిందట కళ్ళజోడు.
దాదాపు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఇప్పుడు తీరిగ్గా చెబుతుంది.
“కళ్ళజోడు బోజనం చేసిన చోట మరిచి పోయానని.”
ఖరీదయిన కళ్ళజోడు ప్లాటినం ఫ్రేం, బ్రాండెడ్ అద్దాలు పోయిన నెల లోనే దాదాపు ఒక నెల పెన్షన్ మొత్తం ఖర్చు చేసి కొనిచ్చాను.
ఆడాళ్ళకి మతిమరుపు ఎక్కువండీ. అప్పటికి చెబుతూనే ఉంటాను.
నా లాగా సుడోకు లు, వర్డ్ పజిల్స్ చేస్తూ ఉండు. బ్రైన్ షార్ప్ గా అవుతుంది.
మతిమరుపు అనేది దగ్గరకి రాదు. అని. వింటేనా?
ఏం చేస్తాం.. కారు వెనక్కి తిప్పాను.
మళ్ళీ రెండు గంటలు ప్రయాణం. దారిలో టోల్ ప్లాజా ఒకటి...
తిరుగు ప్రయాణం మొత్తం తిడుతూనే ఉన్నాను.
కిక్కరుమన లేదు. తప్పు వాళ్లదగ్గర ఉన్నప్పుడూ ‘కుయ్ కయ్’ మని అనరు.
ఇదే అవకాశం గా కడుపులో ఉన్న కసంతా తీర్చుకున్నాను.
“అసలు నిన్ను కాదే? మీ అమ్మా బాబుని అనాలి. ఒక్కటి... ఒక్కటంటే ఒక్క పని వయినంగా చేసి చచ్ఛావా? నలబై ఏళ్ళు కాపరం చేశావు నలుగురిని కన్నావ్. అరడజను మంది మనమలు మనమరాళ్ళు , కాస్తన్నా బుర్ర పని చెయ్యొద్దా?
మళ్ళీ రెండు గంటలు వెనక్కి తోలుకొచ్చాక.
ఆ హోటల్ రాగానే కారు డోరు తీసుకుని గబాలున కిందకి దిగి మోకాళ్ళు నొప్పి కూడా లెక్క చెయ్యకుండా లోపలికి పరుగు లాటి నడకతో వెళ్లే ఆవిడని పెద్దగా 'కేక' వేసి పిలిచాను.
“మనం భోజనం చేసిన టేబుల్ మీదే నా టోపీ, SBI క్రెడిట్ కార్డు పెట్టాను. అవి కూడా పట్టుకురా?.”
ఏం చెబుతున్నాను?.. ఆ .. అసలు మతిమరుపుకి మరో పేరు ఆడది.



No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...