Tuesday, 20 March 2018

దేవుడి పటం


ఊరికి దూరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం లో ఉన్నదా ఇల్లు. వరండా తో కలిసి నాలుగు గదుల నిలువు ఇల్లు.
చుట్టూ ప్రహరి గోడ ఉన్న స్తలం లో గోడ వారగా కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఉన్నట్లు మసక వెలుగులో కనిపిస్తూ ఉంది. గేటు నుండి ఇంటి వరండా వరకు నాపరాళ్ళు పరిచి ఉన్నాయి. నాపరాళ్ళ మద్య మెత్తటి గడ్డి.
ఎక్కడయినా ఒక్క వీది లైటు వెలుగుతూ ఉంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ప్రాంతం. అప్పుడప్పుడూ వచ్చి పోయే సర్విస్ ఆటో లు తప్ప పెద్దగా జన సాంద్రత లేని ప్రాంతం.
ప్రశాంతమయిన వాతావరణం. ఎక్కడ ఏం జరిగినా అంత తొందరగా మిగిలిన వారికి తెలిసే అవకాశం లేని ప్రాంతం.
ఒక పాత మోటార్ సైకిల్ వచ్చి వీది మొదట్లో ఉన్న ఆ ఇంటి ముందు ఆగింది. గేటు తీసుకుని బండి లోపలి కి తెచ్చి పార్క్ చేసాడతను. బిడియం గా గేటు వద్ద నిలబడి చుట్టూ పరికిస్తున్న ఆమెని “వచ్చేయ్” అన్నాడు మెల్లిగా.
వరండా లైట్ వెయ్యకుండానే చీకట్లో తాళం తీసాడు.
ఇద్దరు లోపలి వెళ్ళాక తలుపు వేసాడతాను.
గదిలో ఎల్యీడి లైటు వెయ్యగానే కిటికీ పరదాలు సరిచేసాడు.
“కూర్చో “ చక్క సోఫా చూపిస్తూ ఆమెతో అన్నాడు.
“బట్టలకి బురద అంటింది “ అతన్ని గమనిస్తూ అంది.
మెయిన్ రోడ్డు మీద నుండి మలుపు తిరిగేటప్పుడు మంచి నీటి పైపు పగిలి అయిన మడుగులో వేగంగా ఎదో లారి వెళ్ళినప్పుడు చిమ్మిన బురద. వళ్ళంతా చింది ఉంది.
“నువ్వు కూడా తడిచి పోయావ్” అన్నాడు ఆమెని మళ్లీ గమనిస్తూ..
ముఖానికి పుసుకున్న పౌడర్ సరిగా అతకలేదు. కనకాంబరాలు, మల్లెలు కలిసిన పూలదండ వాడిపోటానికి సిద్దంగా ఉంది.
నడుం మీద ప్రౌడ వయసుతో వచ్చిన ముడత అందం గా ఉంది.
ఆతను ఆమె దగ్గరగా వచ్చి బుగ్గ లు నిమిరాడు. నడుం మడత మీద చెయ్యి వేసాడు.
శరీరం తయారుగా లేదు.
“బాత్ రూము ఎక్కడ?” అంది.
ఆతను పక్కకి జరిగి హల్లో నుండి వంట గది లో నుండి పెరడు లోకి నడుస్తూ ‘అక్కడ” అన్నాడు.
ఆమె అలవాటు అయిన చీకట్లో ఇంటికి పది అడుగుల దూరం లో ఉన్న బాత్రుం లోకి నడిచింది.
డోరు పక్కనే లైట్ స్విచ్ ఉంది.
బాత్ రూము శుబ్రంగా ఉంది ఒక ప్లాస్టిక్ పీపా లో నీళ్ళు నింపి ఉన్నాయి. రెండు మగ్గులు బోర్లించి ఉన్నాయి.
ఒక పక్క గోడకి ఉన్న చిన్న అరమారా లో బాత్రుం శుబ్రం చేసుకొనే లిక్విడ్స్ , సబ్బులు ఒక పేపర్ రోల్, ఒక వేస్ట్ బక్కెట్ ఒక ప్లాస్టిక్ సానిటరీ బ్రష్..
ఆమె తన చీర విప్పి తడిచిన బాగాన్ని నీళ్ళతో శుబ్రం చేసుకుంది. గట్టిగా పిండి మళ్లీ కట్టుకుంది. గోడకి ఉన్న చిన్న అద్దం లో ముఖం చూసుకుని బయటకి వచ్చింది.
లైట్ ఆర్పి ఆమె తిరిగి గదిలోకి వచ్చే సరికి ఆతను పొయ్యి మీద నీళ్ళు కాచుకుంటున్నాడు.
“అయిదు నిమిషాలు కూర్చో వచ్చేస్తాను” అంటూ వేడినీళ్ళు బక్కెట్లో పోసుకుని టవల్ తీసుకుని బాత్రుం కి వెళ్ళాడు.
ఆమె సోఫాలో కూర్చో బోతూ వాటిలో ఉన్న కుషన్ వైపు చూసింది. మాటి క్లాత్ మీద రెండు నెమళ్ళ బొమ్మలు రంగు రంగుల ఎంబ్రాయిడి దారం తో అల్లి ఉన్నాయి. అన్ని కుషన్ల మీదా అదే డిజైన్, అన్నీ చేత్తో కుట్టినవే...
ఆమె పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ లో కూర్చుంది.
గదిలో గోడ మీద ఒక పెద్ద ఫ్రేం కట్టిన బోర్డు ఉంది.
రంగు రంగుల గుండి లతో మాటి క్లాత్ మీద కుట్టిన మూడు అక్షరాల పేరు అది. “మాధవ్”
అర్మారా లో పోద్దిగ్గా సర్దిన బొమ్మలు, ఎక్కువ గా చేత్తో చేసినవే...
మద్య గది ఆనుకుని ఉన్న పడక గది. నవారు మంచం మీద మెత్తటి పరుపు. అలిగి పడుకోటానికి సరిపోనంత వెడల్పు. గోడ మీద ఒక కలర్ ఫోటో. అతను బార్య తొ కలిసి సముద్రం ఒడ్డున తడిచిన బట్టలతో అంటుకుని నిలబడ్డ ప్రైవేట్ ఫోటో. శుబ్రం గా ఉన్న గది. పొందికగా శ్రద్ధగా సర్ది ఉన్న గది. ఆమె గోడ మీది ఫోటో లో ఉన్న అతని బార్య ని తదేకంగా చూసింది. ఏంతొ కాలం తపస్సు చేసాక దొరికిన ‘ఫలాన్ని’ అందుకున్నట్లు... అతను అపురూపమయినట్లు
అందగత్తె... ఆ అందం శారీరకమైనదే కాదు. మరేదో తనకి అర్ధం కాని గంభీరమయిన అందం.

ఆమె ఆ గది దాటి ముందుకు వచ్చి కర్టెన్ తొలగించి వంట గదిలో కి చూసింది.
కొద్ది సామాను శ్రద్ధగా శుబ్రంగా ఉన్నాయి. ప్రతి వస్తువు ఎక్కడివక్కడ పొందికగా.. ఆవిడ చూస్తూ ఉండి పోయింది.
వంట గదిలో ఒక వైపు చిన్న దేవుడి గూడు. సీతా రాములు ఉన్న ఒకే ఒక్క ఫోటో, మట్టి ప్రమిదలు, నూనె ఉన్న సీసా అగరువత్తీలు, పూజా సామాగ్రి ..
***
ఆతను స్నానం చేసి లుంగీ కట్టుకుని బాత్రుం తలుపు వేసి ఇంట్లోకి వచ్చాడు.
ఆమె గది లో లేదు.
టీ షర్ట్ వేసుకుంటూ బయట వరండా లో చూసాడు. లేదు. బయట లైటు వేసి ఇంటి చుట్టూ చూసాడు. లేదు.
గేటు వద్దకి వెళ్లి రోడ్డు మీద చూసాడు. దూరంగా వెళ్తున్న అటో శబ్దం తప్ప అంతా ప్రశాంతం.
అతనికి భయం వేసింది. గబ గబా లోపలి వచ్చి చూసాడు. టేబుల్ మీద ఉంచిన వాలెట్ బద్రం గా ఉంది. డబ్బు దాదాపు సరిగ్గానే ఉంది ఒకటి రెండు నోట్లు తప్ప.
ఇంట్లో విలువయిన వస్తువులు అన్నీ చూసుకున్నాడు. బీరువా తాళాలు దానికే ఉన్నాయి. బీరువాలో బట్టలు, విలువయిన సామాను అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి.
వంట గదిలో ను, హల్లో ను మరో సారి వెతికాడు.
దేవుడి గూటి ముందు కనకాంబరాల పూలదండ పడి ఉంది.
‘సీతా రాముల’ పటం వెనక్కి తిప్పి ఉంది.


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...