Wednesday, 4 January 2017

అద్బుతం గా ఉండేది

“నిన్నటి వరకు అద్బుతం గా ఉండేది. ఈ రోజు ఏమి లేదు.” మళ్ళీ నిట్టూర్చాడు పార్కులో పక్కనే కూర్చుని ఉన్న అతను.
తనలో తానే గొణుక్కున్నట్లు గా ..
“ఎంత బావుండేది?.. కడుపునిండా తిండి, వారానికి రెండు మూడు సార్లు నాన్ వెజ్, మంచి రూము, పడక, ఫాను రోజు రెండు మూడు భాషల్లో పేపర్లు, టీవి, ఇంటర్నెట్. బొల్దన్ని పుస్తకాలు.రెగ్యులర్ గా విజిట్ చేసే డాక్టర్లు, మెడికల్ కవరేజి, నా బిల్డింగ్ బయట, సెక్యూరిటి, ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద కారు.. “
“తెల్లవారే సారీ ఏమి లేవు. బజార్లో  పడ్డాను. చేతిలో చిల్లీ గవ్వ లేదు, తింటానికి, ఉండటానికి ఏమి లేదు ..” మళ్ళీ నిట్టూర్చాడు అతను.
ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. ఏమయి ఉంటుంది.
“విడాకులు? ఊహూ అయి ఉండదు. గాంబ్లింగ్? రేసులు? పేకాట?” ఊహూ నా వల్ల కాలేదు..
...
“ఏమయింది?” అనునయంగా అడిగాను.
..
..
..
..
..

“నిన్ననే విడుదల చేశారు.” బావురు మన్నాడు. 

సంతోషం

శిష్యుడు గురువు వద్దకి చేరాడు. 
పాదాల చెంత కూర్చున్నాడు. గురువు శిష్యుని అంతరంగం గమనించాడు.
“ఏం కావాలి నాయనా??”
“నాకు సంతోషం కావాలి” 
గురువు శాంతంగా ఏది ఆ పలక మీద వ్రాయి అన్నాడు.
శిష్యుడు వ్రాశాడు.
“నాకు సంతోషం కావాలి “
ఇప్పుడు మొదటి పదం తుడిచెయ్యి. నేను / నాకు అనేవి ఆహానికి సంభందించినవి.
ఇప్పుడు ఏమి మిగిలింది.
“సంతోషం కావాలి”
‘కావాలి’ అనేది కోరిక / కామం దానిని తుడిచెయ్యి.
శిష్యుడు గురువు చెప్పినట్లు చేశాడు.
 ఇప్పుడు నీవు కోరుకున్నది దొరికింది కదా? ఎవరయినా ఆహాన్ని, కోరికని తొలగించుకుంటే మిగిలేది సంతోషమే నాయనా.
శిష్యుడి మొహం లో వెలుగు నిండింది.

పరమవీరచక్ర

‘పరమవీరచక్ర’ ప్రతి సైనికుడికీ ఒక బంగారుకల.
నిరుపమాన శౌర్య, అద్భుత సాహసం, సర్వం అర్పణ చేసే తెగువ, రాజీలేని దేశభక్తి.... వీటన్నిటికీ చెరగని చిహ్నం పరమవీరచక్ర.
మూడున్నర సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఈ కంచుపతకం, దానికి అల్లుకున్న 32 మి.మీ ఊదారంగు రిబ్బన్ –
ఇది ఛాతీ మీద అలంకరించుకోవాలన్నదే ప్రతి వీరజవాను కల.
అలాంటి పరమవీరచక్ర పతకానికి రూపకల్పన చేసింది ఒక విదేశీ మహిళ.
‘’’
ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ పౌరసత్వాన్ని పొంది, పరదేశంలోనే అయినవాళ్లు, ఆస్తిపాస్తులు ఉంటూ అరువుభారతీయతను చూపించే మహిళ కాదు ఆమె.
పుట్టింది ఎక్కడో స్విట్జర్లాండ్ లో అయినా కట్టుబొట్టు, జీవన వ్యవహారాలన్నిటా అణువణువునా భారతీయత నిండిన వ్యక్తి ఆమె. మరాఠీ, సంస్కృత భాషల్లో అద్భుత ప్రావీణ్యం ఆమె సొంతం.
ఆమె పేరు ‘ఇవా వాన్ మే డిమారోస్’ , ఆ పేరు ఆమె పుట్టిన స్విట్జర్లాండ్ లో ఎవరికీ తెలియదు.
కానీ సావిత్రీ బాయ్ ఖానోలికర్ అని అడగండి. మన దేశంలో పాత తరం వారు కొద్దిమందికి తెలుస్తుంది.
ఆమె వ్రాసిన సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర అన్న పుస్తకం (భారతీయ విద్యాభవన్ ప్రచురణ) బహుళ ప్రజాదరణ పొందింది. వేలాది ప్రతులు అమ్ముడైంది.
..
ఈవా జులై 20. 1913 న స్విట్జర్లాండ్ లోని న్యూ చాటెల్ లో జన్మించింది.
తండ్రి హంగేరియన్. ఆయన పేరు ఆండ్రీ డీ మాడే. తల్లి రష్యన్. పేరు మార్తె హెజ్డ్ జెల్డ్.
తల్లి చిన్నప్పుడే పోయింది. దానితో ఈవా మనసు ఆధ్యాత్మికం వైపు మరలింది.
గంటలు గంటలు సముద్రం ఒడ్డున గడిపేది. అలలు తల్లి వక్షస్థలంగా,
ఇసుక తిన్నెలు తల్లి ఒడిలా అనిపించేది. క్రమేపీ ఆమె ధ్యాస భారతీయ ఆధ్యాత్మికత వైపు మరలింది.
..
ఈ సమయంలోనే ఇంగ్లండ్ లోని సాండ్ హర్ట్స్ లో సైనిక శిక్షణ పొందుతూ సెలవులు గడిపేందుకు వచ్చిన భారత సైనికాధికారి విక్రమ్ ఖానోలికర్ తో ఆమెకి పరిచయం అయింది.
పరిచయం ప్రేమగా మారింది. అది జరిగింది 1929లో.
1932 లో ఆమె జెనీవా వదలి భారత్ కి వచ్చేసింది. ఈవా తండ్రి దీన్ని వ్యతిరేకించాడు.
కానీ ఆమె పట్టుదల ముందు ఆయన పంతం నిలబడలేదు.
ఈవా, విక్రమ్ లు లక్నోలో స్థిరపడ్డారు.
అక్కడే వారిద్దరికీ వివాహం అయింది. పెళ్లితో ‘ఈవా’ పదహారణాల భారతీయ వనితగా మారిపోయింది.
ఆమె పేరు ‘సావిత్రిబాయి ఖానోలికర్’ అయింది.
ఇక్కడి భాషను, కట్టుబొట్టు, రీతి రివాజుల్ని నేర్చుకుంది. పురాణ, శాస్త్రాదులను అధ్యయనం చేసింది.
మరాఠీ, సంస్కృతాలను అవుపోసన పట్టింది.
శ్రీరామకృష్ణ వేదాంతాశ్రమానికి సన్నిహితురాలై పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది.
దేశ విభజన సమయంలో మహిళా శరణార్ధుల కోసం పలు సేవా శిబిరాలను కూడా నిర్వహించింది.
సప్త సముద్రాలకవతల నుంచి మన దేశానికి వచ్చిన సావిత్రీబాయి పరమవీరచక్ర పతకాన్ని రూపొందించిన వైనం కూడా చాలా ఆసక్తిదాయకం.
మేజర్ జనరల్ విక్రమ్ ఖానోలికర్ కి మేజర్ జనరల్ హీరాలాల్ అటల్ కి మంచి స్నేహం ఉండేది.
1948 ప్రాంతాల్లో భారతీయ సైన్యానికి సర్వోత్తమ పోరాటపటిమకి ప్రతీకగా ఇచ్చేందుకు పరమవీర చక్ర అన్న పతకాన్ని రూపొందించే బాధ్యత ‘అటల్’ పై బడింది. ఆ పతకం ఎలా ఉండాలన్న విషయంలో ఆయన తర్జన భర్జనలు పడుతూ ఉండేవారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతి, సభ్యత, గౌరవోజ్వల పరంపరలకు పరమవీర చక్ర ప్రతీకగా ఉండాలని ఆయన పదేపదే అంటూండేవారు. ఈ విషయంలో ఆయన విక్రమ్, సావిత్రీబాయిలతో పలుమార్లు చర్చలు జరిపేవారు.
పురాణయుగంలో వృత్రాసురుడిని వధించేందుకు మహర్షి ధధీచి తన వెన్నెముకనే ఆయుధంగా చేసుకొమ్మని దేవతలకు తన శరీరాన్ని ఇచ్చేశాడు. ఆ వెన్నెముకే వజ్రాయుధం అయింది. అలా వజ్రాయుధం అద్భుత త్యాగానికి, అసమాన పౌరుషానికి, అజేయ శక్తికి ప్రతీక. సావిత్రీబాయి అదే విషయాన్ని హీరాలాల్ అటల్ కి చెప్పింది. అంతే కాకుండా టిబెటన్ సాహిత్యంలో లభించే వజ్రాయుధం నమూనాని కూడా ఆయనకు చూపించింది.భగవతీ ప్రసాదంగా ఛత్రపతి శివాజీకి లభించిన పవిత్ర భవానీ ఖడ్గం హైందవీ రాజ్యస్థాపనకి దోహదం చేసింది.
నాలుగు వజ్రాయుధాలు, ఇరువైపులా భవానీ ఖడ్గాలు, మధ్యలో అశోకచిహ్నం ఉండేలా పరమవీర చక్రను రూపొందించారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే మొట్టమొదటి పరమవీరచక్ర సావిత్రీబాయికి వరుసకు అల్లుడయ్యే మేజర్ సోమనాథ శర్మకే దక్కింది.
1947 లో కశ్మీర్ లో పాక్ చొరబాటుదారులను ప్రతిఘటిస్తూ పరమోన్నత త్యాగం చేసిన మేజర్ శర్మ సోదరుడు విక్రమ్, సావిత్రీబాయిల కుమార్తెను వివాహం చేసుకున్నారు.
తరువాత కాలంలో సావిత్రీబాయి సైనికులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమంపై దృష్టి సారించింది. సైనికుల భార్యల సంక్షేమం కోసం నారీ ఉపకార్ సేన అన్న సంస్థను స్థాపించింది. దేశ రాజధానిలో సమాజసేవాకార్యక్రమాల్లో తనదైన విశిష్టస్థానాన్ని సంపాదించుకుంది.
1952 లో విక్రమ్ చనిపోవడంతో సావిత్రీబాయి ఒంటరిదైపోయింది. ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిపోయింది. శ్రీరామకృష్ణ పరమహంసనే తన పరమగురువుగా భావించి, నిత్యం ధ్యానంలో మునిగిపోయింది.
ఒక పదిహేనేళ్ల తరువాత ఒక రోజు ఆమె కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా నిద్రలో తుది శ్వాస విడిచింది.


Tuesday, 3 January 2017

రామ నామీ లు

కొన్ని యుగాల క్రితం రామ నామానికి పరవశించే ఒక మారుతి ని “ఏమోయ్ ఎప్పుడు రాముడూ రాముడూ అంటావు!! ఆయన ఎక్కడ? నీలో ఉన్నాడా?”అని అడిగితే తన గుండెను చీల్చి, లోపల కొలువై ఉన్న రామ లక్షను లని చూపించాడట. 
***
నూట ఇరవై మూడేళ్ళ క్రితం ఒక వర్గాన్ని కొంత మంది పెద్ద మనుష్యులు “మీకు రాముని గుడిలో ప్రవేశం లేదు. రామ నామాన్ని సైతం ఉచ్చరించ కూడదు” అని కట్టడి చేశారు. 
ఆ వర్గం ఎటువంటి వివాదాలకి దిగకుండా ‘రామ’ నామాన్ని పచ్చబొట్టుగా శరీరం లో అంగుళమయినా విడవ కుండా, ఆఖరికి అరచేతి లో సహా రామ నామాలంకరణ చేసుకున్నారు.
పెద్ద మనుష్యుల కాపీ రైట్ కి గండి పడింది. ఆ వర్గాన్ని స్వయానా వల్లే “రామ నామీలు” గా సంభోదించడం మొదలయ్యింది.
త్రేతాయుగం లో ‘రామ భక్త హనుమాన్’, కలియుగం లో ‘రామ నామీ’లు
చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని బిలాస్ పూర్, రాజ్ ఘడ్, రాయపూర్ జిల్లాలలో మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసించే ‘రామ నామి’ ల జనాభా సుమారు అయిదు లక్షలు. ప్రభుత్వ లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల వర్గీకరణ లో ఉన్నారు.
**
ఇదంతా రాయగడ్ జిల్లా లోని చపారా గ్రామానికి చెందిన పరుశురామ్ అనే వ్యక్తి కారణంగా మొదలయ్యింది. 1894 ప్రాంతం లో అతనికి రాముడే స్వయంగా కనిపించి మీ శరీరం రామమయం చేసుకుని తికరణశుద్దిగా రామ నామాన్ని జపించమని మార్గదర్శనం చేశాడట. అప్పటి నుండి పరుశురామ్ రామ నామీ అయ్యాడు.
ఊరూరా తిరిగి రామ నామాన్ని ప్రచారం చేయ సాగాడు. గుండెల్లోంచి వెల్లువై పేళ్లుభుకిన రామ బక్తి ఆ నిర్భయులని ఒకటిగా చేసి, రామ నామ సంపదతో ముంచేసింది. రామ నామం ఒక మహా ఉద్యమమయిపోయింది.
కాపీ రైట్ తమదే అనే భావించే పెద్దలకి ఇది మింగుడు పడలేదు. వారి మూఢ బక్తి అర్ధం కాలేదు.
బ్రిటిష్ అదికార్లకి అర్జీలు పెట్టుకున్నారు. రాయపూర్ హై కోర్ట్ కి మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి వాదనలు నడిచాయి.
 1911 లో రాముడే గెలిచాడు. రామ నామాన్ని ఉచ్చరించడమే కాదు , పచ్చ బొట్టు గా పొడిపించుకునే హక్కు అధికారం అందరికీ ఉన్నాయని కావాలంటే నాలుకపై కూడా రామ నామం ముద్రించుకోమని తీర్పు చెప్పింది.
అప్పటి నుండి రామ నామీలు తమ శరీరాన్నే రామకోటి పుస్తకంగా మార్చేసుకున్నారు. నడిచే రామకోటి అవటం కోసం వాళ్ళంతా సూదులతో పొడిపించు కునే వారు. ఇది మొత్తం 18 రోజుల పాటు నియమ నిష్టలతో జరిగే కార్యక్రమం.




ఈ రామ నామీలు తోటి రామ నామిలని పరమ భక్తులుగా భావించి ఆతిద్యం ఇస్తారు. ఊరు పేరు అవసరం లోడు. పచ్చబొట్లే బందుత్వం, ‘ రాం రాం ‘ లో పలకరింపులు. రామనామిల ఒంటి పై ఉండే శాలువా కూడా రామ నామాల తో అలంకరింపబడి ఉంటుంది. వాటి మీద రామ నామాల అద్దకం కూడా 18 రోజుల పాటు సాగుతుంది.
 రామ నామిల దేవాలయాలు కూడా ప్రత్యకమయినవి. వాటిలో విగ్రహాలు ఏమి ఉండవు. కేవలం రామ నామమే ఉంటుంది.
రామనామీలు చిన్న బుద్దుల పెద్దవారికి చెంప దెబ్బ లాటి వారు. దేవుడు అందరి సొత్తు అని చెప్పే పరమ భాగవతోత్తములు.
గుడిలోకి రావద్దన్న సాకును చూపి మతం మార్చే వారి డొల్ల తనాన్ని ఈ వర్గం సవాలు చేస్తుంది.
వారందరికి ఈ ఉదయం మనం “జై శ్రీరాం” లతో అభినందనలు తెలుపుదాం .
జై శ్రీరాం _/][\_

Monday, 2 January 2017

నమ్మకం


ఒక బార్యా బర్తా ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు.
సముద్రం అల్లకల్లోలం కాసాగింది. తుఫాను మొదలయ్యింది. హోరున వర్షం. ఎగసిపడే కెరటాలు.
ఆమె భయం తో వణికి పోతుంది. బర్త ఆమెకి రాజాయి కప్పాడు.
నీకు భయం లేదా? అంది.
ఎందుకు?
“పడవ మునిగి పోతే? మనం మిగలం”
“భయపడితే మునగకుండా నిలుస్తుందా? “
“నీకు హృదయం లేదు”
“ఎందుకు లేదు? అందులో నా దేవుడు ఉన్నాడు”
అతను పక్కకి వెళ్ళి ఒక పదునైన కత్తి తెచ్చాడు. ఆశ్చర్యంగా చూస్తున్న  ఆమె గొంతు మీద ఉంచాడు.
“నీకు భయం లేదా?” అడిగాడు.
“ఆమె పదునైన కత్తిని చూసింది. అది పట్టుకున్న అతని చేతిని, అతని కళ్లని చూసింది”
“లేదు.”
“ఎందుకని?”
“నీ మీద నాకు నమ్మకం”
అతను చప్పున చేతిని వెనక్కి తీసుకుని నవ్వాడు.
“నాకూ నా దేవుడి మీద నమ్మకం” 

అ స హ నం

ఎప్పుడూ ప్రశాంత వదనం తో ఉండే రంగారావు ఆ వేళ ధుమధుమ లాడుతున్నాడు.
వాకింగ్ కి వెళ్ళి వచ్చి రాగానే.. వాకిట్లో ముగ్గువేసి లోపలికి వస్తున్న బార్యతో  విసురుగా
‘’మోడి వెధవ. బోడి.. వెదవన్నర వెధవ”. అన్నాడు. ఆమె విచిత్రం గా  చూసింది.
ఇంట్లోకి వెళ్ళి  కాఫీ తెచ్చేసరికి పక్కింటి వాళ్ళ పేపర్ అందుకుని ఆబగా చదవటం మొదలెట్టాడు.
“వీడెవడో బి కామ్ లో ఫిజిక్స్ చదివాడట.. అప్రాచ్యుడు..” అన్నాడు పేపరు విసిరేస్తూ..
కాఫీ ఒక్క గుటక తాగి.. “ఇదేమిటి ఇలా ఎడ్చింది. కాఫీ వాసన ఉందా అసలు?” ఆమె వింత గా అతన్ని గమనిస్తుంటే..
ఇంట్లోంచి ఇంటర్ చదివే పిల్లాడు లేచి ఆవులిస్తూ బయటకి వచ్చాడు.
“దేశం నాశనం అవుతుందంటే అవదూ? ఏడుగంటలకా నిద్రలేవటం?” కయ్యి మన్నాడు.
వీదిలో పెద్దావిడ ఒకరు చేపలు అమ్ముతుంది. ఇంట్లోంచి టామి వాసన పసిగట్టి పరిగెత్తుకు వచ్చి తోక ఊపుతుంది.
“పొద్దుటే అప్రాచ్యపు మాటలు వినాల్సి వస్తుంది. ఇదిగో వింటున్నావా? టామి ని ఇటు లాక్కురా?”
పిల్లాడు ఆయన్ని వింతగా చూశాడు.
“దేశం బ్రష్టు బట్టి పోయింది. ఒక్కడికి కూడా బాద్యత లేదు. సమాజం అంటే గౌరవం లేదు”

పిల్లాడు తల్లి వైపు తిరిగి “ ముందు ఆ కాళ్ళకి వేసుకున్న ‘నా షూ’ విప్పమను. తనవని తగిలించుకున్నట్లు ఉంది. కాళ్ళు కరుస్తున్నట్టున్నాయి” 

Sunday, 1 January 2017

పాత పుస్తకాలు

నగరం లోని ఆ పురాతన గ్రంధాలయం కి మొత్తం 1400 మంది సబ్యులు ఉన్నారు. 
సబ్యులందరూ చాలా కాలం నుండి అవసాన దశలో ఉన్న పుస్తకాలు చక్కగా అట్టలు వేసి తిరిగి 31 వ తేదీ నాటికి లైబ్రరీకి తిరిగి ఇచ్చేయాలని పోయిన ఆదివారం తీర్మానం చేసి అందరికీ తెలియపరచటం జరిగింది. 
ఆడవారికి ఒక్కొక్కరికి 6 పుస్తకాల బాద్యత, మగవారికి 4 పుస్తకాల బాధ్యత ఇవ్వాలని అనుకున్నారు. 
రాత్రి ఆ ప్రకారం అందరికీ పాత పుస్తకాలు ఇవ్వటం జరిగింది. లైబ్రరీ మూసే సరికి సరిగ్గా మొత్తం ఆడవారిలో సగం మంది, మగవారిలో ముప్పాతిక మంది పుస్తకాలు పట్టుకెళ్లారు. 


రాత్రి కొత్త సంవత్సర వేడుకలకీ మేలుకుని యధాలాపంగా అన్నీ పుస్తకాలు మంచిగా అట్టలు వేసి ఉదయాన్ని తిరిగి అక్కడ ఉన్న అటెండర్ కి అప్పగించారు.
ఉదయం లైబ్రరీ తెరిచే వేళకి మొత్తం ఎన్ని పుస్తకాలు ముస్తాబయ్యాయో లెక్క పెట్టి చెప్పమని ఒక పిల్లాడికి పురమాయిస్తే.. వాడు రాత్రి జాగారం చేసి ఇప్పుడే నిద్ర లేచి కోడి స్నానం చేసి వెళ్ళి రెండు నిమిషాల్లో సరయిన సమాదానం ఫోన్ లో చెప్పాడు. ఎక్కడో వ్రాసుకున్నాను. కాగితం కనిపించడం లేదు.
మీరేమయినా సాయం చేస్తారా??
మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. _/][\_

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...