“విల్ పవర్ ఉండాలండీ విల్ పవర్” అంది మా ఆవిడ రెండు వారాల క్రితం.
దేనికో ఎసరు పెట్టినప్పుడు ప్రారంభ వాక్యాలు ఇలానే ఉంటాయి.
చేతికి ఇచ్చిన టీ కప్పులోకి తీక్షణం గా చూస్తుంటే ..
“ఏమిటి చూస్తున్నారు?” అంది సోఫాలో పక్కనే కూర్చుంటూ
“నువ్వు చెప్పింది కలిపావో లేదో అని” నవ్వాను.
“బానే ఉంది సంబడం. మన వీది లో మంచి నీళ్ళ టాంకర్ డ్రైవర్ తెలుసుగా?”
“అవును .. జాకీర్ వాళ్ళ పాప పెళ్ళికి పిలిసాడు. ఏం వండారే మటన్ బిర్యాని. నోట్లో వేసుకుంటే కరిగి పోయిందనుకో.”
“ఆహా మనుషులని గుర్తు పెట్టుకోటానికి ఏం ట్యాగ్ లు పెట్టు కుంటారు మహాను భాావా?”
“మళ్ళీ పలావ్ పార్టీ కి పిలిసాడా ఏమిటి?”
“అసలు ఎప్పుడూ నాన్ వెజ్ మీదే ఉంటుంది ద్యాస”
“నీకు తెలుసు కదా . ఇంట్లో వండితే తప్ప హోటల్ లో తినననీ”
“అవుననుకో .. ఇకనుండి ఇంట్లో కూడా నాన్ వెజ్ బంద్.”
“అదేంటే..అంత హఠాత్ నిర్ణయం .. రుణ మాఫీ లాగా దశలవారి ఉండాలి గానీ”
“నా కవన్నీ తెలీదు. బంద్ అంటే బంద్ అంతే. యాభై దాటాక నాన్వెజ్ మంచిది కాదంట మొన్న డాక్టర్ చెప్పాడు.”
“ఎవడా డాక్టర్.. నాగిరేడ్డేనా చెప్పు. అతను వాగెన్ ఆర్ రోడ్డు మీదే పెట్టి ఉంటుంది. ఆయిల్ ట్యాంక్ లో అర కేజీ చక్కర పోసి వస్తాను. దుర్మార్గుడు. అయినా నా కడుపు కొట్టినోడు ఏం బాగు పడతాడు."
“హోల్డాన్ హోల్డ్ ఆన్ .. ఆయన కాదు .. youtube లో చూసాను”
“ ఈ నెల నెట్ బిల్లు కట్టలేదే. ఇంకా కనెక్షన్ ఉంచాడా? బొచ్చు పీకిన కోడి మొహం వాడు.”
“మీరు ఎన్నయినా చెప్పండి. నో నాన్ వెజ్ ..దేనికయినా విల్ పవర్ ఉండాలి”
“ఇదుగో తినే తిండి దగ్గర నానా గాడిదలు చెప్పిన మాటలు వింటే విల్ పవర్ కాదు ‘విల్’ ఒక్కటే మిగులుతుంది.”
“డెసిషన్ ఈజ్ టేకెన్. నో అమెండ్మెంట్ అలోడ్”
“నీ ఇంగ్లిష్ కి నిప్పెట్ట. మనవడి కోసం నేర్చుకుంటున్నావా? లేక పొతే నా పొట్ట కొట్టటానికా? ఎన్నాళ్ళు ఈ మంకు?”
“ఎప్పటికీ”
“యాబై ఏళ్ళు పాలు పోసి పెరుగు పోసి, చికేనూ, మటనూ, చేపలు తిని పెంచిన వళ్ళు . తేడా కొడుతుంది. నీ ఇష్టం”
“ఏం లేదు విల్ పవర్ ఉండాలి. మీరు చెప్పిన ఆ జాకీర్ చిన్నప్పటి నుండి తాగేవాడట. వాళ్ళావిడ కి మాటిచ్చాడు టక్కున మానేసాడు.”
“వాడి బొంద .. వయసులో ఉన్నాడు. పెళ్ళాం తో కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మానేసినట్టు ఒక బిల్డప్. అంతే. అవన్నీ మనసులో పెట్టుకోకు."
“కుదరదు.. ది మేటర్ ఈజ్ క్లోజేడ్ “ అంది కిరాతకంగా...
***
ఈ రోజు వస్తూ అరకేజీ తెచ్చుకున్నాను.
ఈ రోజు వస్తూ అరకేజీ తెచ్చుకున్నాను.
“అర్జంటుగా వండు. చపాతీలు చెయ్యి. ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి”
“చెప్పాగా వండేది లేదని. పనమ్మాయిని పిలిచి ఈ పాకెట్ ఇచ్చి పంపుతాను”
“ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తాను. ఊరినుండి మనవడు రాగానే”
“ఏం పర్లేదు. విల్ పవర్ ఉండాలి మనిషి అన్నాక.”
రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంది. మేడ మీదికి వినిపిస్తుంది.
“వెళ్లి చూడు.” స్నానానికి వెళ్తూ చెప్పాను.
నైట్ డ్రెస్ తగిలించుకుని వచ్చే సరికి వంటింట్లో నుండి గుండమ్మ మార్క్ మషాలా వాసన గుమాయిస్తుంది.
“కింద గొడవ ఏమిటి?”
“ జాకీర్ వాళ్ళ ఆవిడ. గుడి దగ్గర పడి పోయిన అతని నెత్తిన బక్కెట్టు తో నీళ్ళు గుమ్మరించి మంత్రాలు చదువుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్తుంది.”
1 comment:
గుండమ్మగారికి విల్ పవర్ అస్సలు లేదని అర్ధం అయిపోయింది.
Post a Comment