Tuesday 1 January 2019

O A H


సి పి ఓ గారి వీధి ఈ రోజు నిండుగా ఉంది. వచ్చే పోయే కార్లు, బండ్లు, దండలు,బొకేలు, కేకులు, యాపిల్స్, గ్రీటింగులు, పొద్దుటే ఏడుకి మొదలయిన సందడి, పదకొండుకి పలచబడింది.
జిల్లా అధికారి ని విష్ చేయటం కోసం దూర ప్రాంతాల నుండి, తెల్లవాలుఝామునే బయలు దేరి వచ్చిన డిపార్ట్మెంట్ ఉద్యోగుల సందడి. అంతటా పండగ వాతావరణం.
పదకొండు తర్వాత అయన, జిల్లా కలెక్టర్ ని కలవటానికి వెళ్ళాక కొంత సద్దుమణిగింది.
CPO గారి భార్య అపర్ణ కి చేతినిండా పని పడింది.
అసలు మొగుళ్ళ హోదా ప్రదర్శించు కోటానికి ఇదొక వేదిక.
చుట్టూ పక్కల ఇండ్ల వారందరికి, బొకేలు, తక్కువ రకం స్వీట్స్ పాకెట్లు, కేకు ముక్కలు సర్ది పంపింది.
పూల దండలు కొన్ని గుమ్మాలకి కట్టించింది. ఆయన కారుకి, ఇంట్లో వాహనాలకి అలంకరించింది.
కేకులు, యాపిల్స్ రెఫ్రిజిరేటర్ లో ఓపిగ్గా సర్దింది. స్వీటు పాకెట్లు, డైరీలు, మెమెంటో లు అన్నీ అరమారాల్లో సర్ది, పని మనిషి చేత ఇల్లు శుభ్రం చేయించే సరికి సాయంత్రం అయింది.
మధ్యాహ్నం వెళ్ళిన మనిషి ఎనిమిది దాటాక గాని ఇంటికి రాలేదు.
కలెక్టర్ ని అటునుండి అటు MLA లని, మినిస్టర్స్ ని కలిసి శుభాకాంక్షలు చెప్పి .. వచ్చేసరికి .
వస్తూనే ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుండి పోయాడు.
“టిఫిన్ ఏమయినా చెయ్యనా?” అంది అపర్ణ.
“వద్దు .. ఈ రోజు నానా చెత్త తిన్నాను. ఈ పూట ఏమీ తినను.”
“కిరణ్ ఫోన్ చేసాడా?”
“ఉదయం మనం హడావిడిలో ఉన్నప్పుడు చేసాడు. కాలేజ్ వాళ్ళు ఎక్కడికో తీసుకు వెళ్తున్నారు అని చెప్పాడు. ఈ గోల లో సరిగా వినబడలేదు. నేను జాగర్త అని చెప్పాను.”
“ఇప్పుడు ఫోన్ చెయ్యి.” అపర్ణ కి చెప్పాడు.
ఆమె ఫోన్ కలిపి స్పీకర్ ఆన్ లో ఉంచి టీపాయ్ మీద ఉంచింది.
“హలో .. కిరణ్ “
“హ .. డాడీ.. ఇప్పుడే వచ్చారా?”
“అవును .. ఎక్కడికో వెళ్తాను అన్నావట మమ్మీ తో “
“అదా మా కాలేజ్ వాళ్ళు కొత్త సంవత్సర వేడుకలు ఓల్డ్ ఏజ్ హోం లో చేద్దామని ప్లాన్ చేసారు.”
“బెజవాడ లో నేనా?”
“అవును డాడీ .. ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరం మా కాలేజ్ నుండి”
“అక్కడ వారికి పంచడానికి దుప్పట్లు, యాపిల్స్, బ్రెడ్స్, కొన్ని టాబ్లెట్స్ తీసుకెళ్ళాం”
“మంచిది.” శ్రధగా వింటున్న అపర్ణ ని గమనించాడు ఆతను.
ఆమె అసహనంగా కదిలింది.
“ఓల్డ్ ఏజ్ హోం (OAH) బాగుంది డాడీ. బాగా ఖాళీస్థలం ఉంది పెద్ద చెట్లు, మద్యలో బెంచీలు, పెద్ద హాలు, కలర్ టివి, ప్రతి గదికి ఒక కిటికీ, వాష్ బేసిన్, సీలింగ్ ఫ్యాను , గ్రాండ్ పా ఉన్న OAH కన్నా బాగుంది.”
బార్యా భర్తలు ఇద్దరూ ఒకరి నొకరు చూసు కున్నారు. మౌనం వాళ్ళని చుట్టేసింది.
“డాడీ... “
“ఊ “
“ఇక్కడ ఏసీ గదులు కూడా ఉన్నాయి. నార్త్ వెస్ట్ లో అటాచ్డ్ ఉన్న రూము ఒకటి చూసాను. చాలా బాగుంది. కిటికీల లో నుండి చూస్తే కాయ కూరల చెట్లు, బంతి పూల చెట్లు కనిపిస్తున్నాయి. మంచి గాలి, వెలుతురూ... మమ్మీకి ఈ గది బాగా...... “
గబాల్న వచ్చిన అపర్ణ ఫోన్ కట్ చేసింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...