Sunday, 22 April 2018

అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.


మేమంతా మట్టిలో దొర్లాడాము. 
పేడలో పోర్లాడాము.
ఏం తిన్నామో గుర్తులేదు. ఏ
మి కట్టుకున్నామో కుడా గుర్తులేదు.
పాకల్లో ఉన్నాం. 
గోడల సావిట్లోనే పడుకున్నాం.
నువ్వు పుట్టాకే పాకా  వేసుకున్నాం. 

పేగు తెంచుకుని రక్తం పంచుకుని పుట్టిన నిన్ను క్రిష్ట్నుడిలా పెంచుకున్నాం.
నువ్వు దోగిన నేలమీద పట్ట వేసుకుని పడుకున్నాం. నువ్వు తిని వదిలేసినా తిండే మేము తిన్నాం.
పండక్కి రంగు రంగుల చొక్కాలు తోడిగాం. తిరునాళ్ళకి మెడ మీద కూచోబెట్టుకుని ఊరంతా తిప్పాం .
నువ్వు ఆడింది ఆట. పాడింది పాట. నీకు నలతగా ఉంటె ఎన్ని దినాలు అమ్మతల్లికి పస్తులున్నామో తెలుసా బిడ్డా..
నువ్వు పెరుగుతుంటే మురిపెంగా చూసుకున్నాం. గుండె నిండా మిద్దెలు కట్టుకున్నాం.
ఎదిగిన కొడుకు చక్కగా చదువుతున్నాడని అయ్యవార్లు చెబితే మురిసిపోయాం.
ఏనాడు నిన్ను గొడ్ల మేతకి పంపలేదు. పొలం పని చేయించలేదు. పేనం బాగున్న లేకున్నా మేమే అన్నీ చేసుకున్నాం.
పట్నం లో చదివించాం. బిడ్డ కోసం ఇల్లు కట్టాం. ఉన్న పొలం కాపాడుకున్నాం. చాకిరీ చెయ్యటానికి రాత్రో పగలో ఎప్పుడు చూసుకోలేదు. అసలది చాకిరి అని కుడా అనుకోలేదు బిడ్డా.. నీ కోసం ఏదయినా మిగిల్చాలి అనుకున్నాం.
నిన్ను మంచి బడిలోనే వేసినాం. నీ కావలసినవి కొనిచ్చాం.
నువ్వు చదివిన చోట ఎదో కంపెని కొలువు వచ్చిందని చెప్పినప్పుడు.. బిడ్డా ..మీ నాయన నవ్వుకున్నాడయ్యా.. అంత నవ్వు ఎప్పుడూ చూడలే ..నా కడుపు నిండినదయ్యా..
పరిక్షలు అయిపోయినాయి అని చెప్పావు. చివరి రోజు మిగిలిన పరీక్షా చూసుకుని వస్తానని చెప్పావు.
..
ఇంట్లో గోతం లో గుళికలు గుప్పిట్లో ఎప్పుడు తీసుకున్నవో.. ఎందుకు తీసుకున్నావో చెప్పావా? బిడ్డా..
మా కడుపు కోత కోసావే.. నోరు తెరిచి చెప్పావా బిడ్డా...
మొరటు దాన్ని నాకు చెప్పు బిడ్డా..
మీ అయ్యికి అయినా చెప్పు బిడ్డా.. నీ పాటికి నువ్వు పోయావే...
ఇన్నాళ్ళు మన ఇంట్లో లేంది. ఇంకెక్కడో ఉంది. ఏంది బిడ్డా... ఒక్క సారి చెప్పు..
అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.
#susri

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...