Monday 16 April 2018

నాన్నొచ్చాడు.


అజ్ఞాతం లో ఉంటున్న నాన్న అమీర్పేట హాస్టల్ కి వచ్చాడు.
ఆర్నెల్లు దాటింది నాన్నని చూసి. తెల్లగడ్డం చింపిరిగా ఉంది. చర్మానికి ఏదో అయ్యింది. కళ్ల చుట్టూ నల్లగా ఉంది. 
నుదురు మీద పగుళ్లు కనిపిస్తున్నాయి. నోట్లో నుండి గుట్కా వాసన వస్తుంది. ఎప్పటిలాగా లెనిన్ ఫాంటు, బ్రాండెడ్ చొక్కాలో లేదు. ఫ్లాట్ ఫార్మ్ మీద అమ్మే లాటి బట్టలు వేసుకుని ఉన్నాడు.
బాంకు లో పని ముగించుకుని హాస్టల్ కి వస్తుంటే కింద పార్కింగ్ లో ఎదురుచూస్తున్నాడు.
“నాన్నా..” గుర్తు పట్టాక ఆమె పిలిచింది. కష్టం గా నవ్వాడు.
ఆమె కళ్ళు మసక బారాయి. “ఏమన్నా తింటావా?”.
వద్దన్నాడు కానీ ఆ సైగలో చాలా ఆకలి ఉంది.
రోడ్డు మీద అమ్మే ఇడ్లీ నాలుగు తిని నీళ్ళు తాగాక తెప్పరిల్లాడు.
“డబ్బు కావాలి.. “ అన్నాడు.
ఊరినిండా చేసిన అప్పులు పెరిగి మురిగి మాయామయిన నాన్న ఆచూకీ తెలీదని లోకాన్ని నమ్మించలేక రెండునెలలక్రితం ఆసిడ్ తాగి గొంతు కోల్పోయిన అమ్మ గురించి గాని, కృష్ణానగర్ లో ఏంచేస్తుందో ఎలా బతుకుతుందో తనకే స్పష్టత లేని అక్క గురించి కానీ అడుగుతాడేమో అని ఆశపడింది.
“నా జీతం పదిహేడు వేలు చేసేది ప్రైవేట్ బ్యాంక్ లో. ఉంటానికి తింటానికి ఆరున్నర వేలు, సిటీ బస్సులకి, మిగిలిన ఖర్చులకి రెండు మూడు వేలు. నెలనెలా అమ్మకి పంపేది అయిదు వేలు నావద్ద పది పన్నెండు వేలు మించి ఉండవు నాన్నా..”
“నాకు అయిదు లక్షలు కావాలి. “
“అయిదు లక్షలా? “ నోరు పెద్దది చేసింది.
“నేను మీ బ్యాంక్ లో మాట్లాడతాను. రేపు ఉదయం మీ బ్యాంక్ కి వస్తాను.” వెళ్ళేటప్పుడు పర్సులో ఉన్న రెండు వందలు తీసుకుని వెళ్తున్న నాన్నని 'ఎలా వున్నావు?' అని అడుగుతాడేమోనని కనిపించే వరకు చూసింది ఆమె.
**
నెలకి అయిదువేలు కటింగ్. మిగిలిన పన్నెండు వేలు నెల జీతం అయిదు లక్షల అప్పు తీరెంతవరకు పెరగదు. ఉద్యోగం మానటం కుదరదు. కండిషన్స్ మీద ఆమె ఎన్నాళ్ళకి బాకీ తీరుతుందో లెక్కలు వేసుకుంటూనే ఉంది.
నెక్స్ట్ వీక్ హాస్టల్ మారాబోతుంది ఆమె. వేరే చవక హాస్టల్ కి. నెలకి ఆరున్నరవెయ్యి అంటే కష్టం.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...