Wednesday, 8 July 2015

మా వారు కారు కొంటున్నారు



హటాత్తుగా మావారు నిన్న రాత్రి బోజనాలపుడు 'రేపు మనం కారు కొందాము' అన్నాడు .
ఇంటర్ చదువుతున్నఒక్కగానొక్క మా అమ్మాయికి, నాకు., కొద్ది సేపు ఏమి అర్ధం కాలేదు.
మధ్య తరగతి కుటుంబం అని దైర్యంగా చెప్పుకోలేని ఆర్దిక స్థితి మాది .
మా మామగారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తీసుకున్న పర్సనల్ లోనులు,
ఎప్పుడూ బాగోని నా ఆరోగ్యం.. దాని కోసం తీసుకున్న చేబదుళ్ళు, వాటి సర్దుబాట్లు ..
ఈ మహారణ్యం లో ఇంటి అద్దెలు , పప్పు.. ఉప్పులు, రోగాలు రొప్పులు అవసరాలు.... అనేకం
వీటితో కుస్తీ పట్టటం తోనే సరిపోయే మా కుటుంబానికి !?!?
ఆయన చెప్పిన మాటలు చాలా వింతగా అనిపించాయి.
మేము కరెక్టుగా నే విన్నామని ఋజువు చెయ్యటానికా అన్నట్లు .
ఆయన మరో సారి అన్నారు "రేపు ఉదయం టాటా షో రుము లో యూస్డ్ కార్స్ వేలం జరుగుతుంది, మనం వెళుతున్నాం కారు కొంటున్నాం "
.
ఈ మధ్యకాలం లో ఈయన మానసిక పరిస్తితి అంత బాగున్నట్లు అనిపించలేదు.
చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం తో ఒంటి చేతి మీద కుటుంబాన్ని లాక్కురావటం ,
ఆర్ధికంగా మాపెద్దల నుండి ఏవిదమయినా సపోర్ట్ లేకపోవటం ,
ఏదయినా కొద్ది ఖర్చు ఎక్కువ తగిలిన నెలలో ఆయన విలవిల లాడటం నాకు తెలుసు. .
.
ఈ మధ్యే చుట్టు పక్కల వాళ్ళ తో సోది మాటాడటం కట్టిపెట్టి
నేను మగ్గం పని నేర్చుకుంటున్నాను, వేడి నీళ్ళకు చన్నీళ్ళు గా
మా కుటుంబాన్ని నిలకడగా ఉంచాలని నా వంతు ప్రయత్నం.
.
అలాటి మా కు ఆయన మాటలు వింత గాను 'ఒకింత' భయం గాను అనిపించాయి.
ఆయన ఏమి తమాషా చెయ్యటం లేదని... మర్నాడు అమ్మాయిని కాలేజీ కి పంపకుండా, మా ఇద్దరినీ కలుపుకుని సిటీ బస్ ఎక్కించి టాటా షోరూం కి తీసుకెళ్ళాడు. .
.
ఊరికి కొద్ది దూరంగా ఉన్న ఆ షో రూము గారేజ్ లో అనేక కార్లు పార్కు చేసి ఉన్నాయి.
కారు అద్దం లోపల వైపు 'ఆ కారు మోడల్ , సి‌సి , తిరిగిన మైలేజ్, కండిషన్, సుమారుగా ధర రాసిన కాగితాలు అంటించి ఉన్నాయి..
.
మమ్మల్ని ఆశ్చర్యం నుండి తేరుకొనివ్వకుండా మంచి కారు సెలెక్ట్ చెయ్యమని, దాని రంగు బాగుండాలని, చూడటానికి అందంగా ఉండాలని, పక్కన నిలబడి పోటో తీయించుకుంటే హుందాగా ఉండాలని, ఇంజను ఎలా ఉన్నా పర్లేదనీ, కాగితాలలో ఎన్ని లొసుగులున్నా, ఫైనాన్స్ లో ఉన్న కారయినా పర్లేదనీ ఒక ట్రాన్స్ లో ఉన్నవాడి లాగా చెప్పాడు .
..
చెప్పటమే కాదు, మంచి కలర్ లో ఉండి చూడటానికి అంధంగా ఉన్న కారొకటి సెలెక్ట్ కూడా చేశాడు
ఎలాఉంది ? మా అమ్మాయిని అడిగాడు.
అప్పటికే అయోమయంగా ఉన్న మా అమ్మాయి 'బాగుంది' అన్నట్లు తల ఊపింది.
సంతోషం కన్నా అయోమయం ఎక్కువగా ఉంది ఆమె మొహంలో. నాకయితే నోట మాట రాలేదు.
"ఏం జరుగుతుందండి?" భయంగా అడిగాను.
"తిక్కమొహం దానా (ఆయన నన్ను అలానే పిలుస్తారు)" మనమ్మాయి పెళ్ళికి ఈ కారు గిఫ్ట్ చేస్తాను. నెల నెల కిస్తిలు కట్టి దీన్ని కొంటాను. షౌరూమ్ యజమాని నాతో హైస్కూల్ చదివినవాడు .
నెల నెలా ఇంస్టాల్మెంట్స్ కి ఒప్పుకున్నాడు. ఆయన ఆనందంగా చెప్పాడు.
మిమ్మల్ని ఇంటి వద్ద దించి వచ్చి, కారు మొదటి ఇంస్టాల్ మెంట్ కడతాను.
తిరునాళ్ళలో పీచు మిఠాయి తినే పిల్లాడిలాగా సంబరంగా చెప్పాడు ..
.
అప్పటి దాకా మౌనంగా ఉన్న మా అమ్మాయి
“నాన్నా, మీకు తెలుసు నేను మెడిసన్ చదువుతాను , అది చిన్నప్పటినుండి నా కోరిక, మెడిసిన్ పూర్తి అయ్యిందాకా పెళ్లి చేసుకొను. ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల తరవాత జరగబోయే దానికి ఇప్పటి నుండి పాత కారుకి ఇంస్టాల్ మెంట్స్ కడతారా?”..
ఒక్క నిమిషం గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడాయన...
“ఎమ్మా కారు బాలేదా ? అయినా మైలేజ్ కూడా బాగానే వస్తుందట “..
“నాన్నా .. మీరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు.
మనం కారు కొనదలుచుకున్నప్పుడు అప్పటికి మార్కెట్ లో ఇంతకన్నా మంచి కార్లు, మోడల్స్ రావచ్చు అప్పుడు ఎంచుకుని మంచి కారు కొనుక్కోవచ్చు కదా?”.
వాళ్ళ నాన్నతో ఇంత స్పష్టంగా మమ్మాయి మాట్లాడగలదని నేను ఊహించలేదు.
ఒకింత కోపం కూడా నాకు కలిగింది...
మా వారు నవ్వారు. తల మీద బరువును దించుకున్నట్లు రిలీఫ్ గా ఉన్నారు...
“నీ ఎనలైజేషన్ బాగుంది. నువ్వు పెద్దాదానివవుతున్నావు. యు ఆర్ నో మోర్ ఎ కిడ్ .”. అన్నాడు రిలీఫ్ గా .
"మరి రోజుకి రెండు గంటలు నువ్వు మాట్లాడే మీ క్లాస్స్ మెట్.
' సుదాకర్' కి ఈ సూత్రం వర్తించదా?..' సూటిగా అడిగారు ఆయన..
.
మా ముగ్గురి మధ్య ఒక విస్ఫోటం జరిగింది..
నేను దిగ్బ్రాంతికి లోనయ్యాను .
..
మా అమ్మాయి ముఖం లో తెలీని బాద. జ్ణాన దంతం వచ్చేటప్పుడు కలిగే బాద ..
   ..

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...