Wednesday, 15 April 2020

చెప్పులు

ఒక అధికారిక ప్రోగ్రాం కి, శలవు రోజు న అటెండ్ అయి మండల స్పెషల్ అధికారి అయిన DEO గారి కార్లో, జిల్లా హెడ్ కార్యాలయానికి బయలు దేరేసరికి మద్యానం రెండు దాటింది. (రెండేళ్ళ క్రితం సంఘటన)
..
మరో గంట ప్రయాణం ఉంది. ఆకలి ని బిస్కెట్ల తో బై పాస్ చేసి, చల్లటి మంచి నీళ్ళతో కడుపు నింపాము.
మీరు షార్ట్ స్టోరీస్ వ్రాస్తారని ఎంఇఓ గారు చెప్పారు. అన్నాడాయన కారు మెయిన్ రోడ్డు ఎక్కగానే.
సీరియస్ రైటర్ ని కాదు. కాని మనసుకి నచ్చినది అక్షరాలలోకి మారుస్తుంటాను.
అయితే మీకో ఇన్సిడెంట్ చెబుతాను.
‘చెప్పండి’ ఆసక్తిగా ఆయన వైపు చూసాను.
..
కొన్నాళ్ళ క్రితం దోర్నాల వద్ద ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ కి వెళ్లాను. మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం నిర్వహణ గురించి.
ఘాట్ లో ఒకటిన్నర కిలోమీటర్ల ప్రయాణం చేసి, నాలుగు ఫర్లాంగులు దూరం కాలి నడకన వెళ్ళాల్సి వచ్చింది.
మొత్తం ముప్పై మంది పిల్లలు ఉండొచ్చు. నాలుగు అయిదు తరగతుల్లో పది, పన్నెండు మంది మించరు.
వాళ్ళతో పాటు మద్యాన్న భోజనం చేసి రెండు గంటల పైగా గడిపాను.
చుట్టూ ఉన్న తండా ల నుండి రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఉండే దారిలో నుండి కాలి నడకన సిమెంటు గోతాల లో పుస్తకాలు చుట్టుకుని వస్తుంటారు.
అక్కడ ఉన్న ఏకైక ఉపాద్యాయుడు భాద్యత గా ఉండటం నేను గమనించాను.
ఇర్రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చే పిల్లలకి సాద్యపడిన వరకు చదువు చెప్పినట్లు పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసింది.
విషయం అంత ఆసక్తి దాయకం గా ఉండక పోవటం తో నేను వింటున్నానా లేదా అని అయన నన్నో సారి గమనించాడు.
‘మా (ప్రభుత్వ) స్కూల్ ల లో చదివే పిల్లలు మెజారిటీ బాగా బీద కుటుంబాల నుండి వచ్చే వాళ్ళు అయివుంటారు. మద్యాన భోజనం కోసం వచ్చే పిల్లలు అధికం. కనీస వసతులు కూడా ఉండవు. స్కూల్ లో ఇచ్చే ఏకరూప దుస్తుల గురించి మీకు చెప్పేదేముంది.’ ఆయన నన్ను చూసి నవ్వాడు.
నేనే ఏ స్కూల్ కి వెళ్ళినా పిల్లల్ని ఎదో ఒకటి అడిగి కొంచెం శ్రద్దగా నేర్చుకుంటున్న పిల్లలకి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి నా కారు డిక్కీ లో ఎప్పుడూ ఉండే చెప్పుల (స్లిప్పర్) జతలు, పెన్నులు, పుస్తకాలు, పలకలు ఇస్తూ ఉంటాను. పిల్లలని ప్రోత్సహించడానికి ఇలా చేస్తుంటాను. నాకు ఇదో వ్యసనం.
నవ్వాడాయన. నేను ఆయన్ని అభిమానం గా చూసాను.
ఆరోజు ఒక చెప్పుల జత టేబుల్ మీద పెట్టి...
నాలుగు అయిదు తరగతి పిల్లలకి మొత్తం పన్నెండు మంది కి తలా ఒక ఏఫోర్ కాగితం ఇచ్చి కొన్ని ప్రశ్నలు బోర్డు మీద వ్రాసి వాటికి సమాధానాలు కాగితం మీద వ్రాసి ఇవ్వమని చెప్పాను. బాగా వ్రాసిన వాళ్లకి చెప్పుల జత బహుమతి అని చెప్పాను.
కాగితం కుడి పక్క మూలన వాళ్ళ పేరు, క్లాసు వ్రాసి ఇవ్వమని అడిగాను.
వ్రాసాక పేపర్లు టీచర్ కి ఇచ్చి బాగా వ్రాసిన పిల్లాడిని సెలెక్ట్ చేసి వాటిని గిఫ్ట్ గా ఇవ్వమని చెప్పి రిటర్న్ అయ్యాను.
ఆయన చెప్పటం అయిపొయింది అన్నట్లు ఆపాడు.
ఇదొక సంఘటన. సాదా సీదా ది. ప్రత్యేకంగా చెప్పుకోటానికి ఏమీ లేదు. ఈయన డబ్బా తప్ప అని మనసులో అనుకుంటున్నప్పుడు. ..
కధ అయి పోలేదు... అన్నాడాయన.
పేపర్లు నేను దిద్దుతానని అనుకుని పన్నెండు మంది పిల్లల్లో ఎనిమిది మంది ఒకే పేరు వ్రాసారు ట ..
'కుప్పయ్య' అని ...
వాళ్ళందరిలో ఉత్త కాళ్ళతో స్కూల్ కి వచ్చే వాడి పేరు అది.

3 comments:

నీహారిక said...

మీరు వ్రాసే కొసమెరుపులు నాకిష్టం.

Anonymous said...

Very nice sushri Garu. Please write frequently

అన్యగామి said...

మీ శీర్షిక టాగ్ లైనులో ఉన్నట్టు, మీ కొసమెరుపులెప్పుడు నన్ను నిరుత్సాహపరచలేదు. ఈమధ్యన తక్కువ వ్రాస్తున్నట్టున్నారు. అంతే.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...