Tuesday, 30 April 2019

టైం బ్యాంకు

నవీన్ కి ఆ పెద్దావిడ ఒక ప్రశ్నార్ధకం.
తను ఉండే సర్వీస్ అపార్ట్మెంట్ కి దగ్గరలోనే ఉంటుంది ఆవిడ. ఖరీదయినది కాక పోయినా సౌకర్యమయిన స్వంత ఇల్లు. విశ్రాంత ఉద్యోగి ఏదో స్కూల్ లో పని చేసినట్లు నవీన్ కి చెప్పింది కాని “స్విస్” స్లాంగ్ కి పూర్తిగా అలవాటు కాని నవీన్ కి ఆ స్కూల్ పేరు అర్ధం అవలేదు.
నవీన్ రొబాటిక్స్ లో 'ఎమ్మెస్' చేయటానికి వచ్చాడు. తన యూనివర్సిటీ దగ్గరలో మిత్రులతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్ లో నివాసం.
అసలావిడ (రోజీ) తో పరిచయమే తమాషాగా జరిగింది.
మొదటి సారి సుమారుగా డెబ్బై ఏళ్ల వయసు లో ఉండే ఒక సన్నటి మగమనిషి తో డాక్టర్ ఆఫీస్ (హాస్పిటల్) వద్ద కనిపించింది.
రిసెప్షన్ లో అడిగే ప్రతి చిన్న ప్రశ్నకి అతన్ని అడిగి ఓపిగ్గా సమాదానం చెబుతుంది.
అతను మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పెరాలసిస్ తో అతని నోటి నుండి వచ్చే మాట స్పష్టంగా లేదు. ఆమె ఓపిగ్గా అతని భావాన్ని డీకోడ్ చేస్తుంది. అది కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది. చాలా చిన్న ప్రశ్నలకి కూడా ఆమె అతన్ని అడగటం.
భోజనం వేడిగా చేస్తారా? రాత్రి పూట తరచూ వాష్ రూమ్ కి వెళ్తారా? ఇలాటి మామూలు ప్రశ్నలకి కూడా అతన్ని అడిగి మరీ ఈవిడ చెప్పటం వింతగా ఉంది.
తర్వాత ఒక ఆదివారం పార్క్ కి వెళ్ళినప్పుడు వీల్ చైర్ ని నెట్టుక్కుంటూ అతనికి పార్క్ లో ఆడుతున్న పిల్లలగురించి నవ్వుతూ ఏదో చెబుతుంది.
ఆ చైర్ లో ఉన్న మనిషి లావుగా పూర్తి బట్టతల తో ఉన్నాడు. అతని కాలు ఒకటి సర్జరీ చేసి తొలగించినట్లు చూడగానే తెలుస్తుంది. ఇతను హాస్పిటల్ లో చూసిన #అతను కాదు. మరెవరో !!
**
నవీన్ కి 'రోజీ' మేడం ఇప్పుడొక ప్రశ్న.
ఆవిడని ఆసక్తిగా గమనించడం మొదలెట్టాడు.
తరచూ పలకరించు కోవటం మొదలయ్యింది.
ఆవిడ వయసు అరవై దాటిందనీ, సౌకర్యమయిన పెన్షన్ వస్తుందనీ.. ఏ ఆర్ధిక ఇబ్బందులు లేని ఒంటరి (విడో) అని తెలుసుకున్నప్పుడు అతని ఆశ్చర్యం రెట్టింపు అయింది.
“మిమ్మల్ని పార్క్ లో చూసాను. ఎవరినో వీల్ చైర్ లో తిప్పుతూ నవ్విస్తున్నారు.”
“ఓహ్ అతనా? రాబర్ట్ అని నాలాగే ఒంటరి జీవి. పిల్లలు ఉన్నారు. ఎల్లకాలమూ తండ్రి వద్ద గడపలేని జీవితాలు, జీతాలు. అతనికి ఆక్సిడెంట్. ఎండం కాలు తీసేయాల్సి వచ్చింది. వీలయినంత కాలం వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు
అతను కూడా ‘టైం బ్యాంకు’ సభ్యుడు . వాలంటీర్ కోసం అప్లై చేసాడు.
నేను అటెండ్ అవుతున్నాను. రోజుకి రెండు గంటలు. అతని ఫ్లాట్ శుబ్రం చేసి, వంట చేసి పెట్టి, ఒక అరగంట కబుర్లు చెప్పి వస్తాను.
“టైం బ్యాంకు? కాలానికి కూడా ఒక బ్యాంకు ఉంటుందా?” అనుమానంగానే అడిగాడు నవీన్.
రోజీ నవ్వింది. " అవును ఉంది. డబ్బుతో అవసరం లేని బ్యాంకు. కేవలం సేవ మాత్రమే జమ/ఖర్చు చేసే బ్యాంకు. నేను డబ్బు కోసం ఈ పని చేయడం లేదు, నా సమయాన్ని 'టైమ్ బ్యాంక్ ' లో దాచుకుంటున్నాను. వృద్ధాప్యంలో, నేను కదలలేని పరిస్థితుల్లో తిరిగి వినియోగించుకుంటాను." అంది.
టైం బ్యాంకు గురించి చెప్పమని ఆవిడని ఆసక్తి గా అభ్యర్ధించాడు నవీన్.
టైమ్ బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. ప్రజలు తాము యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధులకు,అనారోగ్యంగా ఉన్నవారికి సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరమున్నపుడు ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి, ప్రేమపూర్వక సంభాషణా నైపుణ్యం కల్గి ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ జమ చేస్తుంది.
అలా ఆమె వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్లేది.వారి గదుల్ని శుభ్రం చేయడానికి,సరుకులు తేవడానికి,వారికి సన్ బాత్ లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చడించడానికీ సమయాన్ని కేటాయించేది.
అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైమ్ బ్యాంక్ ఆమె/అతని సేవాకాలాన్ని లెక్కించి, 'టైమ్ బ్యాంక్ కార్డు'జారీ చేస్తుంది.
వారికి ఇతరుల సహాయం అవసరమున్నపుడు తమ కార్డును ఉపయోగించుకుని తమ ఖాతాలో ఉన్న సమయాన్ని ‘వడ్డీ’ తో సహా తిరిగి వాడుకోవచ్చు.. వారి ధరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు.
అనుకోకుండా #రోజీ కీ ఒక ఇబ్బంది జరిగింది.
ఒకరోజు నవీన్ ఆమె ఇంట్లో కిచెన్ లో సాయం చేస్తుండగా ఆమె, కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పై నుండి జారి పడింది.
నవీన్ క్లాస్సేస్ కి వెళ్ళకుండా వెంటనే సెలవు పెట్టి, ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు.
ఆమె కాలు మడమ దగ్గర విరిగి, కొంత కాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది. నవీన్ కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమౌతుంటే, ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదన్నది.
ఆమె అప్పటికే టైమ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నది. ఆశ్చర్యకరంగా రెండు గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వాలంటీరును పంపించింది.
ఆ నెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజూ ఆవిడ బాగోగులు చూసుకుంటూ, రుచికరమైన వంటలు చేస్తూ, సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది.
సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలైంది. తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైమ్ బ్యాంక్ లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆమె.
నవీన్ కి యునివర్సిటీ లో నేర్చుకునే దానికన్నా ఇదే విలువయిన విద్య అనిపించింది.
(ఈ రోజుల్లో స్విట్జర్లాండ్ లో వృద్ధులకు టైమ్ బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణమైంది. ఈ విధానం దేశ భీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక, అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది. స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం కూడా ఈ 'టైమ్ బ్యాంక్ 'విధానాన్ని చట్టబద్ధం చేసింది.)
ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా "ఒంటరి గూటి-వృద్ధ పక్షులు" పెరిగి పోవడం ఒక సామాజిక సమస్యగా మారుతున్నది.
దీన్ని మన దేశం లో అమలు చెయ్యటం అసాధ్యమా? ఒక ఆలోచన చేద్దాం.
HAPPY SUNDAY. _/|\_

విల్ పవర్


“విల్ పవర్ ఉండాలండీ విల్ పవర్” అంది మా ఆవిడ రెండు వారాల క్రితం.
దేనికో ఎసరు పెట్టినప్పుడు ప్రారంభ వాక్యాలు ఇలానే ఉంటాయి.
చేతికి ఇచ్చిన టీ కప్పులోకి తీక్షణం గా చూస్తుంటే ..
“ఏమిటి చూస్తున్నారు?” అంది సోఫాలో పక్కనే కూర్చుంటూ
“నువ్వు చెప్పింది కలిపావో లేదో అని” నవ్వాను.
“బానే ఉంది సంబడం. మన వీది లో మంచి నీళ్ళ టాంకర్ డ్రైవర్ తెలుసుగా?”
“అవును .. జాకీర్ వాళ్ళ పాప పెళ్ళికి పిలిసాడు. ఏం వండారే మటన్ బిర్యాని. నోట్లో వేసుకుంటే కరిగి పోయిందనుకో.”
“ఆహా మనుషులని గుర్తు పెట్టుకోటానికి ఏం ట్యాగ్ లు పెట్టు కుంటారు మహాను భాావా?”
“మళ్ళీ పలావ్ పార్టీ కి పిలిసాడా ఏమిటి?”
“అసలు ఎప్పుడూ నాన్ వెజ్ మీదే ఉంటుంది ద్యాస”
“నీకు తెలుసు కదా . ఇంట్లో వండితే తప్ప హోటల్ లో తినననీ”
“అవుననుకో .. ఇకనుండి ఇంట్లో కూడా నాన్ వెజ్ బంద్.”
“అదేంటే..అంత హఠాత్ నిర్ణయం .. రుణ మాఫీ లాగా దశలవారి ఉండాలి గానీ”
“నా కవన్నీ తెలీదు. బంద్ అంటే బంద్ అంతే. యాభై దాటాక నాన్వెజ్ మంచిది కాదంట మొన్న డాక్టర్ చెప్పాడు.”
“ఎవడా డాక్టర్.. నాగిరేడ్డేనా చెప్పు. అతను వాగెన్ ఆర్ రోడ్డు మీదే పెట్టి ఉంటుంది. ఆయిల్ ట్యాంక్ లో అర కేజీ చక్కర పోసి వస్తాను. దుర్మార్గుడు. అయినా నా కడుపు కొట్టినోడు ఏం బాగు పడతాడు."
“హోల్డాన్ హోల్డ్ ఆన్ .. ఆయన కాదు .. youtube లో చూసాను”
“ ఈ నెల నెట్ బిల్లు కట్టలేదే. ఇంకా కనెక్షన్ ఉంచాడా? బొచ్చు పీకిన కోడి మొహం వాడు.”
“మీరు ఎన్నయినా చెప్పండి. నో నాన్ వెజ్ ..దేనికయినా విల్ పవర్ ఉండాలి”
“ఇదుగో తినే తిండి దగ్గర నానా గాడిదలు చెప్పిన మాటలు వింటే విల్ పవర్ కాదు ‘విల్’ ఒక్కటే మిగులుతుంది.”
“డెసిషన్ ఈజ్ టేకెన్. నో అమెండ్మెంట్ అలోడ్”
“నీ ఇంగ్లిష్ కి నిప్పెట్ట. మనవడి కోసం నేర్చుకుంటున్నావా? లేక పొతే నా పొట్ట కొట్టటానికా? ఎన్నాళ్ళు ఈ మంకు?”
“ఎప్పటికీ”
“యాబై ఏళ్ళు పాలు పోసి పెరుగు పోసి, చికేనూ, మటనూ, చేపలు తిని పెంచిన వళ్ళు . తేడా కొడుతుంది. నీ ఇష్టం”
“ఏం లేదు విల్ పవర్ ఉండాలి. మీరు చెప్పిన ఆ జాకీర్ చిన్నప్పటి నుండి తాగేవాడట. వాళ్ళావిడ కి మాటిచ్చాడు టక్కున మానేసాడు.”
“వాడి బొంద .. వయసులో ఉన్నాడు. పెళ్ళాం తో కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మానేసినట్టు ఒక బిల్డప్. అంతే. అవన్నీ మనసులో పెట్టుకోకు."
“కుదరదు.. ది మేటర్ ఈజ్ క్లోజేడ్ “ అంది కిరాతకంగా...
***
ఈ రోజు వస్తూ అరకేజీ తెచ్చుకున్నాను.
“అర్జంటుగా వండు. చపాతీలు చెయ్యి. ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి”
“చెప్పాగా వండేది లేదని. పనమ్మాయిని పిలిచి ఈ పాకెట్ ఇచ్చి పంపుతాను”
“ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తాను. ఊరినుండి మనవడు రాగానే”
“ఏం పర్లేదు. విల్ పవర్ ఉండాలి మనిషి అన్నాక.”
రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంది. మేడ మీదికి వినిపిస్తుంది.
“వెళ్లి చూడు.” స్నానానికి వెళ్తూ చెప్పాను.
నైట్ డ్రెస్ తగిలించుకుని వచ్చే సరికి వంటింట్లో నుండి గుండమ్మ మార్క్ మషాలా వాసన గుమాయిస్తుంది.
“కింద గొడవ ఏమిటి?”
“ జాకీర్ వాళ్ళ ఆవిడ. గుడి దగ్గర పడి పోయిన అతని నెత్తిన బక్కెట్టు తో నీళ్ళు గుమ్మరించి మంత్రాలు చదువుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్తుంది.”

రంగు కళ్ళద్దాలు

(ఒక్క సారి నలబై ఏళ్ల వెనక్కి వెళ్దాం )
రధానికి కట్టిన మోకులు రోడ్డు మీద సమాంతరంగా పరిచి ఉన్నాయి.
రధం మీద రంగనాయకుడు కొలువై ఉన్నాడు. పూలతో రధం నిండుగా ఉంది.
ఇరుసుకి కందెన పెట్టిన నిలువెత్తు చక్రాలు కదలటానికి సిద్దంగా ఉన్నాయి. చొప్పాలు (చక్రాల వేగం తగ్గించాడానికి బ్రేకుల లాటి త్రికోణం కొయ్యలు) పట్టుకుని గ్రామ కంసాలి కుటుంబం లోని మగ వాళ్ళు సిద్దంగా ఉన్నారు.
రెండు వైపులా మోకులు పట్టుకుని భక్తులు సిద్దంగా ఉన్నారు.
ఎర్రటి ఎండ ని ఎవరూ లక్ష పెట్టటం లేదు.
టైర్ బండి మీద పీపా తో తెచ్చిన నీళ్ళు తోవ పొడుగునా రోడ్డు మీద కారుస్తున్నారు.
రోడ్డు కి అడ్డంగా ఉన్న కరెంటు తీగలు కనెక్షన్ లు విప్పేసి తేరు (రధం) తిరగటానికి సిద్దం చేస్తున్నారు.
ఆకాశం వైపు అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
అంతా సిద్దం.
బొబ్బలేక్కే కాళ్ళని ఎవరూ పట్టించుకోవటం లేదు.
నీడకి వెళ్లి తిరిగి వచ్చే సరికి మోకు లాగే అవకాశం మరొకరు లాగేసు కుంటారని ఎవరు కదలటం లేదు.
తలలోనుండి కారే చెమట కొత్త చొక్కాల్లోకి కారి పోతూ ఉంది.
నుదిటి సింధూరం బొట్లు ముక్కు మీదకి జారి పెదాలకి చేరుతున్నాయి.
రోశయ్య పంతులు తన పాత కాలం నాటి సైకిల్ తొక్కుకుంటూ అప్పుడే గుడి పక్కకి చేరాడు.
దిగి సైకిల్ ముందు కండవాచుట్టి పురికొస కట్టి ఏర్పాటు చేసిన సీటు మీది పిల్లాడిని కిందకి దించాడు.
అక్కడికి ఎనిమిది మైళ్ళ దూరం నుండి ఎండలో సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. కాని నిజానికి ఎప్పుడో రావలసింది.
దారిలో సైకిల్ పంచరవటం దాన్ని బాగుచేయించు కుని రావటం వళ్ళ లేటయ్యింది
పిల్లాడిని దించ గానే కండవా విప్పి బుజాన వేసుకున్నాడు.
నడుముని ఉన్న మొలతాడు కి సైకిల్ తాళం కట్టుకున్నాడు.
తనవి పిల్లాడివి చెప్పులు తీసి సైకిల్ లజేజ్ స్టాండు కి కాగితం లో చుట్టి పెట్టాడు.
“ఇక పద”
“నాన్నా ఈ సారి నాకు కళ్ళ జోడు (అట్ట తో చేసి, రంగు కాగితం అంటించి రబ్బరు తల వెనక్కి తగిలించుకునేట్టు ఉండే బొమ్మ కళ్ళజోడు) కొనిపెట్టాలి.” పిల్లాడు అడిగాడు.
ఆ రోజు అది ఎన్నోసారో గుర్తే లేదు.
“ అలాగే “
“ఎర్ర రంగు ది. రబ్బరు గట్టిగా ఉండాలి “
“సరే రా ఖచ్చితంగా .. గుళ్ళోకి వెళ్లి స్వామి ని చూసి వచ్చి వెళ్ళేటప్పుడు అలాగే కొంటాను.”
రెండు అడుగులు వేసారో లేదో పిల్లాడు మళ్ళీ “నాన్నా” అన్నాడు.
“ఏమయింది?”
కాళ్లు కాలుతున్నట్లు కాలు మార్చి కాలు మీద గబా గబా నిలబడుతున్నాడు.
అయన వెంటనే పిల్లాడిని బుజం మీదికి ఎత్తుకుని కండవాతో అరికాళ్ళు అద్దాడు.
రంగనాధుడు తేరు మీదికి చేరడాన్ని అప్పటికే గమనించాడాయన.
పరుగు లాటి నడకతో గుడి ప్రవేశ ద్వారం వైపు నడిచాడు.
దారిలో కొబ్బరి కాయ, పూజా ద్రవాలు కొనుక్కుని తువాళ్ళో వేసుకుని గుడి లోకి నడిచాడు.
ధ్వజ స్థంభం చుట్టూ పిల్లాడి తో ప్రదక్షణలు చేసాడు.
గుడి చుట్టూ ప్రదక్షణలు చేసే చోట బండలు కాలి పోతూ ఉన్నాయి.
కొబ్బరి పీచు అక్కడక్కడా కాళ్ళు బొబ్బలు పోకుండా వేసి ఉన్నారు.
రంగానాధుని దర్శనం చేసుకుంటుంటే బజార్లో పెద్ద గా " #నారాయణ .. #నా#రా # #" అని వినిపించింది.
బక్తులంతా ముక్త కంఠం తో అరుస్తున్నారు.
రధం మీద అయ్యవారు ప్లేట్లో కర్పూరం వెలిగించి హారతి ఇవ్వసాగాడు.
మంగళ వాయిద్యాల మోత మొదలయ్యింది.
“అదుగో గరుత్మంతుడు.”
ఎవరో ఉద్వేగంగా అరిచాడు.
పిల్లాడిని ఎత్తుకుని కాళ్ళు రెండు తలకి రెండువైపులా వచ్చేట్టు కోర్చోబెట్టుకుని “వాసు చూడు అదిగో గరుత్మంతుడు. గుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఇక రధం లాగుతారు.”
ఆయన రధం వద్దకి పరుగు లంకించుకున్నాడు.
అప్పటికే రద్దీ మొదలయ్యింది. గోల గోల గా నారాయణ అంటూ మోకు పట్టుకున్న వాళ్ళు లాగటం ఆకాశం లోకి మతాబులు పేల్చడం, రధం కదిలింది.
ఎవరో ‘హర హరా “ అన్నారు పెద్దగా.
అందరూ కోరస్ గా #హర #హరా అంటూ చెట్టు మాను సైజులో ఉన్న మోకులు బలంగా లాగారు.
ఒక్క కుదుపుతో రధం కదిలింది.
రధం మీద పసుపు ఉన్న ప్లేటు దొర్లింది.
గాలి గట్టిగా వీచింది. ఎవరో ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని నాట్యం చేయటం మొదలయ్యింది.
మరెవరో బక్కేట్లతో నీళ్ళు గుమ్మరిస్తున్నారు.
రధం ఎటుపైపు లాగాలో ఒక పెద్దాయన గొంతు చించుకు అరుస్తున్నాడు.
చొప్పాలు వేసి రధం వేగం నియంత్రన చేస్తున్నారు.
అంతా 'నారాయణ' మయం. అందరూ ఎదో ఉన్మాదం లో ఉన్నారు.
రోశయ్య పంతులు పిల్లాడిని తల మీద నుండి దించకుండానే వచ్చి రధం మోకు పట్టుకోటానికి జనం లో దూరాడు.
గుంపులో అతికష్టం మీద చోటు చేసుకుని మోకు ముట్టుకున్నాడు. బుజం మీద బిడ్డ చేత ముట్టించాడు.
తోక్కుకుంటున్న జనం లోనుండి బయటకి వచ్చి దూరంగా ఒక చెట్టు కింద నిలబడి చేతులెత్తి రంగనాయకుని కి నమస్కరించాడు.
మొదలు పెట్టటం లేటే గాని గంటలో రధం నాలుగు వీధులు తిరిగి మళ్లీ గుడి ముందు దాని స్థానం లోకి వచ్చి చేరింది.
రధం తో పాటు ప్రదక్షణలు చేసిన గరుత్మంతుడు మాయం అయ్యాడు. సందడి సద్దు మణిగింది.
“నాన్నా కళ్ళ జోడు.” పిల్లాడు మళ్లీ మొదలెట్టాడు.
రోశయ్య పంతులు జేబులో చెయ్యి పెట్టాడు. అది #ఖాళీగా ఉంది.
పిల్లాడిని మోసుకుంటూ తను తిరిగిన ప్రతి చోట వెతకటం మొదలెట్టాడు.
ఆయనకి తెలిసిన వాళ్ళు కొందరు తారస పడ్డారు.
“ఏమయింది పంతులు గారు “
అయన ఆదుర్దాగా “నా డబ్బులు ఎనిమిది రూపాయలు ఉండాలి. ఇంకా చిల్లర కూడా, రెండు పావలాలు “
కాళ్ళు అరిగేలాగా తిరిగాడు. డబ్బు కనిపించ లేదు.
తిరునాళ్ళ లో పీచు మిఠాయి ని, గుర్రపు శాలని, రంగుల రాట్నాన్ని, చక్కర చిలకలని, బెల్లం మిఠాయిని, రంగు గోలీ శోదాలని, బూరలని, రక రకాల గాలిపటాలని, గిల్లక్కాయాలని, గోలీలని,
రేకు కప్పలని, చెక్క బొమ్మలని, కీ ఇస్తే డోలు కొట్టే కుందేలు బొమ్మని , చెరుకు గడలని, పిల్లాడు ఆశగా చూస్తూనే ఉన్నాడు.
తండ్రి డబ్బులు పారేసుకున్న సంగతి వాడికి అర్ధం అయింది. పిల్లాడికి కళ్ళద్దాలు కొనటానికి చిల్లరయినా మిగిలిందేమోనని జేబులు వెతికాడు.
“నాన్నా నాకు కళ్ళ జోడు వద్దు. చలివేంద్రం లో మంచినీళ్ళు తాగి ఇంటికి వెళ్లిపోదాం. నన్ను దించు ” అన్నాడు తండ్రి తో
***.
#సుశ్రీ 23-04-19

ఆచరణ


పూర్వం ఒక ధనవంతునికి చిన్న సమస్య వచ్చింది.
అతని కన్ను ఒకటి విపరీతంగా సలపటం మొదలయ్యింది. 
అతను వైద్యం కోసం అనేక మంది వైద్యులని సంప్రదించాడు. రక రకాల చిట్కాలు వాడాడు.
కాని ఫలితం లేక పోయింది.
చివరికి అతను ఒక గురువు ద్వారా మమునా తీరాన ఉన్న ఒక సాధువుని కలిసాడు.
కంటి భాధ చెప్పుకున్నాడు.
ఆయన పరికించి చూసి, యాడాది పాటు ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తే ఉపశమనం కలుగుతుంది. అని చెప్పాడు.
దానికా ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. వింతగా ఉన్న వైద్య సలహా ఆచరించడం తప్ప మరో మార్గం లేక పోయింది.
అతను ఇంటికి వెళ్ళిపోగానే పీపాల కొద్దీ పచ్చరంగు కొన్నాడు. నౌకర్లు కి పురమాయించి ఇల్లు, పరిసరాలు అంతా పచ్చరంగు పూయించాడు.
భార్యా పిల్లలకి పచ్చటి బట్టలు కుట్టించాడు, ముఖాలకి పచ్చటి పరదాలు.
పనివాళ్ళకి పచ్చటి బట్టలు. ఎటు చూసినా పచ్చటి రంగు మయం.
కొన్నాళ్ళు గడిచాయి.
సాధువు ఆ గ్రామం గుండా పోతూ ఈ ధనవంతుడిని పలకరించడానికి వెళ్ళాడు.
ప్రహరీ గోడ నుండి లోపలి అడుగు పెట్టగానే నౌకర్లు అతని మీద ఒక పీపా పచ్చ రంగు దోర్లించారు.
“కషాయం రంగు యజమాని కళ్ళకి కీడు చేస్తుంది. మొత్తం పచ్చగానే ఉండాలనేది ఆయన ఆజ్న”
సాధువు నవ్వాడు.
లోకాన్ని మార్చాలనుకోవటం భ్రమ. ముందు మనం మారాలి. మార్పు మనవద్ద నుండే మొదలవ్వాలి.
పచ్చరంగు అద్దం కంటికి అడ్డుగా ఉంచుకుని తలపాగా చుట్టుకుంటే సరిపోయేది కదా? అని ఆ ధనవంతునితో చెప్పి తిరిగి ప్రయాణం అయ్యాడు.

ఖాళీ పెట్టె

"తాతా నాన్న ఎప్పుడొస్తాడు." అంది మనమరాలు.
కుర్చీలో కూర్చుని కాఫీ చప్పరిస్తున్న రామనాధం తో..
రామనాధం మనమరాలిని దగ్గరకి తీసుకున్నాడు. “రేపు వచ్చేస్తాడు. ఈ పాటికి బయలు దేరి ఉంటాడు. అక్కడ విమానం ఎక్కి జుమ్మని వచ్చి హైదరాబాదు లో దిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. బుజ్జి తల్లిని చూడటానికి” ఆరేళ్ళ మనమరాలికి చక్కిలి గిలి పెట్టాడాయన.
లావణ్య నవ్వింది. సిగ్గు పడింది. “నాకు బోలెడు బొమ్మలు తెస్తాడు. గౌనులు, ఇంకా కర్జూరాలు, చాక్లెట్లూ ,,” కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది.
“అవును ... అమ్మకి, నాకు అమ్మమ్మ కి కూడా బోలెడు తెస్తాడు. నాకు కొత్త కళ్ళజోడు తెస్తాడు. అమ్మమ్మ పెద్దదయిపోయింది కదా వెండి జుట్టు కి రంగు తెస్తాడు. అమ్మ కి కూడా బోలెడు బహుమతులు తెస్తాడు.”
“తాతయ్యా మనకి నాన్న అన్నీ తెస్తాడు గదా? మరి నాన్నకి బహుమతులు ఎవరు ఇస్తారు?”
అంది చక్రాల్ల లాంటి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ..
రామనాదం వద్ద రెడీమేడ్ సమాదానం ఏమీ మిగల్లేదు.
అతన్ని ఆ ఇబ్బంది నుండి తప్పించడానికి లోపలి నుండి అతని బార్య కృష్ణ వేణి వచ్చింది.
“లవ్వూ ఇవాళ స్కూల్ కి వెళ్ళవా?” అంది.
లావణ్య మూతి సున్నాలా చుట్టింది. “చూడు తాతా ..అమ్మమ్మ .. నాన్న వస్తుంటే..”
లోపలి నుండి తల్లి అపర్ణ కేక వేసింది.
“లవ్వూ వచ్చి స్నానం చెయ్యి స్కూల్ టైం అయింది”
సున్నా మూతితోనే లావణ్య ఇంట్లోకి వెళ్ళింది.
అపర్ణ మాట అంటే నే మనమరాలికి భయం.
“డాడీ వచ్చేది రేపు. రేపు శెలవు తీసుకో. ఈ రోజు స్కూల్ కి వెళ్ళాల్సిందే. అల్లరి చెయ్యకుండా రెడీ ఆవు” లోపలినుండి అపర్ణ నచ్చచేబుతూ ఉంది.
“అమ్మా .. నాన్నకి గిఫ్ట్లు ఎవరు ఇస్తారు ?” మళ్లీ తల్లిని అడిగింది.
“ఎవరూ ఇవ్వరు. నాన్నే మనకి అవన్నీ కొని తెస్తారు. నీకోసం మంచి బొమ్మలు కొని అట్టపెట్టె లో పెట్టించి దాన్ని మంచి కాగితం వేసి పాక్ చేయించి తీసుకు వస్తారు.”
“అమ్మా .. పాకింగ్ ఎందుకు చేస్తారు.” క్వశ్చన్ బ్యాంకు ఓపెన్ చేసింది లావణ్య.
“మనకి తెచ్చే బొమ్మలు ఎవరూ చూడకుండా, ఇంకెవరూ కాజేయకుండా పెట్టెలో పెట్టి కాగితం తో అంటించి తెస్తారు.”
ప్లేట్లో ఇడ్లీ ని తినిపిస్తూ చెప్పింది తల్లి.
లావణ్య కి బూట్లు తొడిగి తండ్రి తో “ నాన్నా లవ్వు ని స్కూల్ దగ్గర దించి రండి. లేటవుతుంది.” అంది.
రామనాధం లేచి అప్పటికే సిద్దంగా ఉంచుకున్న స్కూటర్ మీద మనమరాలిని ఎక్కించుకున్నాడు.
**
లావణ్య నిద్ర లేచే సరికి ఇల్లు సందడిగా ఉంది.
"నా బంగారు తల్లి లేచింది." అంటూ తండ్రి వచ్చి పిల్లని బుజానికి ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు.
మీసాలు గుచ్చుకుని చక్కిలి గిలి పుట్టింది.
“నాన్నా ఎప్పుడు వచ్చావ్ “ అంది లావణ్య తండ్రిని వాటేసుకుని.
"ఇప్పుడేనమ్మా.. ఇవిగో నీకోసం అంటూ ట్రావెల్ బాగ్ లో నుండి బట్టల పాకెట్, కుకీస్ టిన్ లు బయటకి తీసాడు.”
వాళ్ల ఇద్దరి సందడి చూడటానికి కాఫీ గ్లాసు తో అపర్ణ వచ్చింది.
లావణ్య తండ్రి చేతుల్లోంచి తప్పుకుని తన స్కూల్ బాగ్ తీసుకొచ్చి అందులో నుండి ఒక పట్టు బట్ట లో మూట కట్టిన అట్టపెట్టె ని తండ్రికి ఇచ్చింది. "నాన్నా ఇది నీకు. గిఫ్ట్" అంది ముద్దుగా
తల్లికి ఏమీ చెప్పొద్దని గుండ్రటి కళ్ళతో సైగ చేసింది.
తండ్రి జాగర్తగా దాని ముడి విప్పాడు. అట్ట పెట్టె తెరిచాడు.
అందులో ఏమీ లేదు. అది ఖాళీగా ఉంది.
అతని మొహం చిన్న బోయింది.
'ఇందులో ఏమీ లేదుగా' అన్నాడు దిగులుగా లావణ్య ని చూస్తూ...
“రాత్రి నిద్ర పోయేంత వరకు ముద్దులు దాస్తూనే ఉంది” అంది అపర్ణ.
తండ్రి బిడ్డని హత్తుకున్నాడు.
అతని కళ్ళు చెమ్మగిల్లటం అపర్ణ తడి కళ్ళతో గమనించింది.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...