Saturday, 3 June 2017

ఎంతవారు గాని !!

“ఇంత చాతగాని వాడనుకోలేదు” 
వెనక సీట్లో కూర్చున్న అత్త మెత్తగా మెల్లగా అయినా స్పస్టంగా అంది. 
డ్రైవింగ్ చేస్తున్న అతనికే వినబడింది. పక్కన కూర్చున్నా ఆవిడకి వినబడదా?
అతను అసలే కుమిలి పోతున్నాడు. ఇన్నాళ్ళు కష్టం ఉపయోగపడలేదు.
నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మొదటకి వచ్చాడు. అనుభవ రాహిత్యం, కార్పొరేట్ ప్రవేశం, ఖర్చులు, రవాణాలు పెరిగిపోవటం, వెహికల్స్ కొన్ని ప్రమాదలకి గురి అవటం, సరిపడా ఇన్సూరెన్స్ రాకపోవటం, వడ్డీలు పెరగటం, కోర్టు కేసులు... ఇలా చాలా .. మొత్తం కార్లన్ని అమ్మటం/ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేయటం వెరసి మళ్ళీ మొదటకి రావటం.
ఏం మిగిలింది.? అన్నీ ఊడ్చి పెట్టేశాయి. తను మిగిలాడు. ఆమె మరో ఇద్దరు పిల్లలు, పల్లెటూరిలో కొద్దిగా పొలం. మరి కొన్ని నగలు అంతే..
కానీ అతనికి నమ్మకం .. తను పడి లేచే కెరటం అని.
మరో సారి తను జాగర్తగా అడుగులు వెయ్యగలనని.
మగాడు దేన్నయినా నెగ్గ గలడు. ఒక్క ఆడదాన్ని తప్ప.
“అంతా ఖర్మ. ఇంకేమీ మతలబులో ఉన్నాయో. లేకుంటే లక్షల వ్యాపారం ఇలా అవుతుందా?” ఇద్దరు పిల్లలతో కూర్చున్న అత్త వెనక సిట్లోంచి మళ్ళీ అంది.
ఎర్రటి ఎండలో నేషనల్ హై వే మీద పల్లెటూరి వైపు వెళ్తూ ఉంది ఆ పాత కారు.
వాళ్ళిద్దరూ మాట్లాడటం ఆపితే బావుండు. కానీ ఆపరు. అతని కి తల కొట్టేసినట్లు ఉంది.
“అదిగో ఆ రోడ్డు రోలరు తోలే వాడిని చేసుకున్నా బావుండేది.” ఆగిన ట్రాఫిక్ లో సిగ్నల్ కోసం నిలబడి ఉన్న రోడ్డు రోలర్ ని చూస్తూ ...
ఈ మాటలు కూడా అతనికి వినబడ్డాయి.
అతను కారు దిగాడు. వెనుక సీట్లో నిద్ర పోతున్న పిల్లలిద్దరిని చూశాడు.
“ప్రమీలా .. జాగర్త “
వడివడిగా నడిచాడు.
***
ఆకుపచ్చ సిగ్నల్ లైట్ మారింది.
నది రోడ్డు మీద రోడ్డు రోలర్ కింద ఒక శరీరం నలిగి పోయింది. సలసల కాగే రోడ్డు వేడి కి క్షణాల్లో నల్లగా మారుతూ ఉంది.
పక్కనే పాత కారు ఆగే ఉంది. ఇంజను ఆడుతూనే ఉంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...