Wednesday, 19 April 2017

ప్రతాపం

34 లక్షలు అంతకు మించి ఒక్క రూపాయి తగ్గినా క్వాలిటీ లో రాజీ పడాల్సి వస్తుంది. 
బిల్డర్ ఖరాకండిగా చెప్పాడు. 
“అయినా మీరు అడగాల్సిన పనే లేదు మేడమ్. సారు మాకు ఎంతో సన్నిహితుడు. సార్ ఆఫీసులో మాకు ఎన్నో పనులు ఉంటాయి. మీకు తెలీదు గాని సార్ ఎంత చెబితే అంతే.. ఆఫీసులో అందరూ భయపడేది సారుకే. ఆయన మా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనటం మా అదృష్టం. అలాటి ఆయన కి ఏమాత్రం అవకాశం ఉన్న మేము రూపాయి కూడా ఎక్కువ చెప్పం. మీరింతగా అడుగుతున్నారు. సార్ మీద గౌరవం తో ఆ కరెంటు ట్రాన్స్ఫోర్మ్ కి కట్టాల్సిన 15 వేలు తగ్గించుకోండి. ఇక మీరు అడగొద్దు” బిల్డర్ ఆవిడ నోటినే కాదు, అతని నోటిని కూడా మూయించాడు.
చదరపు అడుక్కి 100 ఎక్కువ అడుగుతున్నాడని, డీవియేషన్ పది శాతం కంటే ఎక్కువ ఉందని, పర్మిషన్ లేని పెంట్ హౌస్ కట్టడని, సెల్లార్ లో పార్కింగ్ జాగా లో షాపు కట్టి అద్దెకి ఇచ్చుకున్నాడని అతనికి తెలుసు. కానీ అడగలేదు.
అతను గట్టిగా అడిగితే జనరేటర్ ఖర్చు కూడా మిగిలేదోమో గాని.. బిల్డర్, మాజీ ఎంపీ గారి తమ్ముడు, ధనికుడు, పైగా బార్య ముందు పొగిడే సరికి మొహమాట పడ్డాడు. గొంతులో మాటలు బయటకి రాలేదు.
యబైవేలు పన్నెండు సార్లు లెక్క పెట్టి రశీదు కుడిచేత్తో పుచ్చుకుని, బార్యకి ఇచ్చాడు. ఆమె కళ్ళకి అడ్డుకుని హండు బాగ్ లో పెట్టుకుంది. బిల్డర్ తెప్పించిన కాఫీ తాగి ఇద్దరూ బయలు దేరారు.
ఎన్నో ఏళ్ల నుండి టౌన్ లోకి మారాలని ఆమె కోరిక. పక్కనే ఇరవై కిలోమీటర్ల దూరం లో పంపకాల్లో వచ్చిన పాత మిద్దోకటి ఉంది. కానీ స్వంతంగా ఒక ఇల్లు అది టౌన్ లో.. ఇన్నాల్టికి నెరవేరబోతుంది.
టౌన్ దాటేసరికి చీకటి ముసురుకుంటుంది. బండి ముందు చక్రం ఫ్లాట్ అయింది.
హెల్మెట్ తీసి అద్దానికి తగిలించి పంచర్ షాపు కోసం వెతుక్కుంటూ నడవసాగారు.
కొద్ది దూరం లోనే ఒక చిన్న సైకిల్ షాపు. అక్కడో పది హేనేళ్ళ పిల్లాడు షాపు మూసేయ్యబోతున్నాడు. పది నిమిషాల్లో పంచర్ వేసి, తొక్కుడు పంపుతో బండి రెడీ చేశాడు.
“ట్యూబు లెస్ టైర్లు వాడండి సార్, ఇలా ఇబ్బంది పెట్టదు. ఇంటికి చేరుస్తుంది” చెప్పాడు.
“ఎంత?” అతను పర్సు తీశాడు.
“యాబై”
“ఎందుకురా యాబై? ముప్పై తీసుకో. అసలు రోడ్డు పక్క షాపు ఎవరి పర్మిషన్ తో పెట్టావ్?. నేనెవరో తలుసా? రెప్పొద్దుట మునిసిపాలిటీ వాళ్ళని పంపిస్తాను. ఇక్కడ షాపు పీకించేస్తాను. అర్ధమయిందా?” అతను పులి అయిపోయాడు.
“అంత పనేందుకు సార్. మీరు ఇవ్వదలుచుకుంది ఇవ్వండి” పిల్లాడు సరెండర్ అయిపోయాడు.
అతను ఎక్కి హెల్మెట్ తగిలించుకుని, ఆవిడ వెనుక కూర్చున్నాక
“ మీ ప్రతాపాలు మాలాటి వాళ్ళ దగ్గరేగా?” అన్నాడు.
అతనికి వినబడిందో లేదో కానీ, బండి స్టార్ట్ అయింది. 
Post a Comment