Sunday, 2 April 2017

తీగ – చెట్టు

వానలు మొదలయ్యాయి.
నేలలో విత్తనం నీరు తగలగానే ఉత్సాహం గా మొలకెత్తింది.
మొలకెత్తటం ఏమిటి చర చరా పాకింది.
మూడో రోజుకి చిగురు వేసింది. 
చూస్తుండగానే పెరిగి చెట్టుని చుట్టుకుంది.
బిరబిరా పెరిగింది. పచ్చని ఆకులతో పర పరా ఎదిగింది.
చక చకా చెట్టుని చుట్టుకుంటూ ప్రాకేసింది.
రోజుల్లోనే అది చెట్టుని కనబడకుండా చేసింది.
తీగకి గర్వం పెరిగి పోయింది. చెట్టుని గేలి చేసింది.
ఎదగటం తనని చూసి నేర్చుకొమంది.
ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంత ఎదిగామన్నది ముఖ్యం అంది.
చెట్టు మౌనంగా వింటూనే ఉంది.
చెట్టు మాట్లాడలేదు.
తీగ అహంకారం పెరిగిపోయింది.
అది అవాకులు చెవాకుల రూపంలో బయటకి వచ్చింది. అట్టహాసాలు, వికటాట్టహాసాల రూపంలో వినిపించింది.
చెట్టు మాట్లాడలేదు.
వానలు ఆగిపోయాయి.
నేలలో తేమ ఆవిరైపోయింది.
తీగ వేళ్లకు లోతు లేదు. నీరందడం లేదు.
ఆకులకు ఆశచచ్చింది. ఊపిరందడం లేదు.
ఆకులు రాలిపోయాయి.
తీగ రెండ్రోజుల్లో ఎండిపోయింది.
కళకళలాడిన తీగ ఆఖరి శ్వాసలతో విలవిలలాడసాగింది.

"ప్రతి సంవత్సరం వానలు పడగానే తీగలు ఎదుగుతాయి.
అక్టోబర్/ నవంబర్ వచ్చే సరికి అవి ఎండిపోతాయి.
రెండొందల యాభై ఏళ్లుగా ఇదే చూస్తున్నాను. వేళ్లకు లోతు ఉండదు.
కాండానికి బలం ఉండదు. కొద్ది గంటల పాటు నీరు లేకుండా బతక లేవు.
కాసింత ఎండకు తాళలేవు. పుబ్బలో పుట్టి మఖలో చచ్చిపోతాయి.
అయినా ఇంత మిడిసిపాటు ఎందుకో." అనుకుంది ఆ చెట్టు జాలిగా.....

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...