Friday, 23 December 2016

ముగ్గురికీ తెలుసు !!

వడియాలు గాడి అంత కక్కుర్తి గాడిని మీరు ఇంతవరకు చూసి ఉండరు.
రెండు గంటల నుండి రిలయన్స్ మాల్ మొత్తం కలియతిరిగాడు.
ఆఫర్ లో ఉన్న లోయర్ లు మూడు పాక్  కొన్నాడు. 599 బిల్లుకి రిలయన్స్ కార్డు లో పాయింట్లు జత చేయించుకుని రెండు రూపాయలు కారిబాగ్ కి ఇవ్వాల్సివస్తుందని కూడా తెచ్చుకున్న క్లాత్ బాగ్ లో పెట్టుకున్నాడు.
“ఇక పద పోదాం” అన్నాడు.
“కొద్దిగా పని ఉందిరా. కాలేజీ డే పాంప్లెట్ లు ప్రింటింగ్ చేయ్యించాల్సిన పని ఉంది.”
“సరే అది చూసుకుని పోదాం’’ అన్నాడు.
నేను సెల్ లో ఫీడ్ చేసుకున్న బాల కృష్ణన్ కి ఫోన్ చేశాను.
“రామనాదం గారు చెప్పారు. ప్రింటింగ్ వర్క్  ఉంది”
అటునుండి ఆరవ తెలుగులో అతను రావాల్సిన చోటు చెప్పాడు. మేమున్న చోటుకి అయిదారు కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్లేస్. ఊరికి దూరం గా అగ్రహారం రైల్వే గేటు దగ్గర. అక్కడ అద్దెలు తక్కువని విని ఉన్నాను.
ఊర్లో ప్రింటింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు గాని బాల కృష్ణన్ తక్కువ రేటుకి ప్రింట్ చేస్తాడని  విని ఉన్నాను కనుక అతన్ని సంప్రదించాను.
“అగ్రహారం వెళ్తున్నామ్ రా.” వడియాలు గాడితో చెప్పాను.
బండి తీసి అగ్రహారం గేటు వైపు బయలు దేరాం. చీకటి చిక్క బడుతుంది. చల్లటి గాలి.
అతను చెప్పిన పాయింట్ వద్దకి చేరేసరికి అక్కడ ఒక వ్యక్తి సైకిల్ పట్టుకు నిలబడి ఉన్నాడు.
మమ్మల్ని చూడగానే నమస్కరిస్తున్నట్టు   చేతులు జోడించి. “నేనే బాలకృష్ణన్. నాతో రండి” అంటూ సైకిల్ ఎక్కి వేగంగా తొక్కసాగాడు. నడివయసు దాటి సన్నగా ఉన్న ఆతని ముఖం మీది మడతలు అతని వయసుని మరో పదేళ్ళు ముందుకు తోస్తున్నట్టు ఉన్నాయి.
రెండు మూడు సందులు తిరిగి ఒక ఇంటి ముందు ఆగాడు.
రేకులు కప్పిన ఒక మాదిరి చిన్న ఇల్లు అది. గది తలుపు తీసి లోపల లైటు వేసి మమ్మల్ని ఆహ్వానించాడు.
గది కి అనుకుని చిన్న వంట గది ఉంది. వెనుక మరో గది ఉంది. ఆ గదిలో ఒక మడత మంచం ఉంది. దానిమీద కుప్పగా బట్టలు వేసి ఉన్నాయి. పక్కనే చిన్న ఆఫ్సెట్ ప్రింటింగ్ మెషీన్ వెంటిలేటర్ మీదున్న పెషంటు లాగా ఉంది.
ఒక సాదారణ స్విచ్ బోర్డ్ కి సాకెట్ ద్వారా లూజు వైరు తో కనెక్ట్ చేసి ఉంది.
నేను  కూర్చున్న కుర్చీ విరిగిన చోట తాడు తో బిగించి కట్టి ఉంది. వడియాలు కుర్చీలో వెనక్కి వాలకుండా ముందుకు వంగి కూర్చున్నాడు. వంట గదిలో ఒక ఇండక్షన్ స్టౌ, పక్కనే నెత్తిన పొయ్యి ఉన్న చిన్న సిలిండర్ స్టౌ ఉంది. కొద్దిగా వంట పాత్రలు ఉన్నాయి. గదంతా నానా కాగితాలతో కలగా పులగంగా ఉంది.
ఎక్కువ సేపు కూర్చోవటం ఇష్టం లేక ‘’మొత్తం నాలుగు వేల కాపీలు కావాలి’’ అని తయారు చేసి వెంట తెచ్చుకున్న  మాస్టర్ కాపీ  ఇచ్చాను. అతను ఒక సారి తన ప్రింటర్ లో దాన్ని సెట్ చేసి  చూసుకుని తన రేటు చెప్పాడు. బజారులో కంటే చాలా తక్కువ. నాకు వెయ్యి మార్జిన్ తో బిల్లు పెట్టుకునే అవకాశం ఉంది.
“మరో రెండు వందలు తగ్గించుకో” అన్నాను.
“రోజంతా పట్టే మీ పని లో నాకు అయిదు కేజీల బియ్యం కూడా మిగలవు” అన్నాడు అతను.
తమిళ నాడు నుండి వచ్చి అక్కడ చిన్న చిన్న పనులు ఒప్పుకుని పదో పరకో కూడబెట్టుకుని ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి బార్య కి పిల్లలకి ఇచ్చి వస్తుంటానని, ఆమె అక్కడ ఆయాగా పని చేస్తూ ఉంటుందని. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె కి పోలియో వ్యాది ఉందని, ఇక్కడ  ఒక్కడే వండుకుని తింటూ తనకు చాతనయిన ప్రింటింగ్ పని తో నెట్టు కొస్తున్నానని మాటల్లో అతను చెప్పాడు.  తన బార్య కి ఆరోగ్యం అంతంత మాత్రమే అని చెప్పెటప్పుడు అతను మొహం తిప్పుకున్నాడు.
అప్పటిదాకా మూల నున్న పాత టేబుల్  మీద ఉన్న డోలక్ ని గమనిస్తున్న వడియాలు బాలకృష్ణన్ వైపు అనుమానంగాను, ఆశ్చర్యంగాను  చూశాడు.
లేచి డోలక్ తీసుకుని రెండు వైపులా ట్యూనింగ్ చేసి చిన్న దరువు వేశాడు.
“సరే నువ్వు అడిగినంత ఇస్తాను.  బిల్లు మాత్రం నేను చెప్పిన రేటుకి ఇవ్వాలి. ఒకసారి ప్రింట్ క్వాలిటీ చూద్దామా?”
ప్రింటర్ ఉన్న గది లోకి అడుగు పెడుతూ చెప్పాను.
అతను సరే అన్నట్టు తల ఊపి ప్రింటర్ ని ఆన్ చేసి వన్సైడ్ పేపర్ ఫీడ్ చేసి నాలుగయిడు ప్రింట్లు తీశాడు.
క్వాలిటీ తో తృప్తి పడ్డాక నేను అతనితో కలిసి ముందు గది లోకి నడిచాను.
అప్పటి దాకా డోలక్ పైన దరువు వేస్తున్న వడియాలు చేత్తో కొత్త అయిదువందల నోటు పట్టుకుని, బాలకృష్ణన్ ని చూస్తూ “ఈ కాగితాలలో పడి ఉంది మీదే అయి ఉంటుంది. తీసుకోండి “ అంటూ డోలక్ తో పాటు టేబుల్ మీద ఉంచాడు.
అది ఆబద్దమని గది లో ఉన్న ముగ్గురుకి తెలుసు.
మాటలు మరిచి పోయిన నన్ను చేత్తో తడుతూ “ఇక వెళదామా?” అన్నాడు వడియాలు




No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...