Tuesday 27 June 2017

మనం ఏం నేర్పబోతున్నాం?


రెండున్నర టిక్కెట్ తీసుకుని, మూడు సీట్లు ఆక్రమించుకుని, నాలుగంటల ప్రయాణం చేసి సాయంత్రం అయిదుకి బస్ స్టాండ్ లో దిగి 'కాబ్' లో ఇంటికి చేరి ప్లాట్ లోకి వచ్చేసరికి నాలుగేళ్ల మా అమ్మాయి, మా ఆవిడ నీరస పడ్డారు.
అప్పటి దాకా బస్సులో నిద్ర పోయిన మా పాప 'ఆకలో' అంటూ గొడవ..
మా ఆవిడ వంట గది ప్రవేశం చేసింది.
'టు మినిట్స్' మాగి అయిదు నిమిషాల్లో చేసి హాల్లోకి వస్తూనే..
“నా పాస్ పోర్ట్” అంటూ గావుకేక పెట్టింది.
కెనడా లో ఉండే మా బామర్ధి తన పెళ్లి కి ఆడబిడ్డ కట్నం అనబడే రౌడీ మామూలు కింద ‘బ్లాక్ బెర్రి పాస్పోర్ట్’ ఫోన్ కొనిచ్చాడు. సుమారుగా అరలకారం ఖరీదు ఉంటుంది.
“బాగ్ లో ఎక్కడో పడిఉంటుంది కంగారు పడకుండా వెతుకు. “
ఆవిడ బాగ్ లో బట్టలు చిందరవందర చేసే లోగా నేను తన నెంబరుకి కాల్ చేశాను.
రింగవుతుంది. కానీ ఇంట్లో కాదు.
“నా ఫోన్. మా తమ్ముడు కొనిచ్చాడు.” అలివిమాలిన విపత్తు వచ్చినట్లు ఆమె మాట్లాడుతుంది.
మళ్ళీ రింగ్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు లిఫ్ట్ చెయ్యటం లేదు
స్విచ్ ఆఫ్ చేయటానికి వీలవదు. పేట్రాన్ లాక్ చేసి ఉంది.
మూడోసారి రింగ్ చేసినప్పుడు. ఫోన్ లిఫ్ట్ చేశారు.
“హలో ..” ఎవరో స్త్రీ
ఈ లోగా నా చేతి లో ఫోన్ తను తీసుకుంది.
“ హలో .. నమస్తే ఆండీ.. అది మా ఫోన్ గంట క్రితమే శ్రీశైలం నుండి బస్సులో వచ్చాం. ఎక్కడో పడి పోయింది. బస్సు లో కానీ లేదా కాబ్ లో కానీ ..”
మా ఆవిడ అంత మర్యాదగా మాట్లాడగలదా?
నేను వాష్ రూమ్ కి వెళ్ళి వచ్చే సరికి
“వెళ్ళండి.. వెళ్ళండి .. బస్ స్టాండ్ లో నే ఉండావిడ. మెరూన్ కలర్ కాటన్ చీర, తెల్ల జుట్టు కి
పోన్నిటైల్ కట్టుకుని ఉంటుంది.”
“కాస్త మానవ భాషలో చెప్పవే.. “
“పన్నెండో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ “
సెల్లార్ లో ఉన్న కారు తీసి బస్ స్టాండ్ కి వెళ్ళాను.
***
గంటన్నర తర్వాత ఇంటికి వచ్చిన నన్ను వాకిట్లో నే నిలేసింది.
“దొరికిందా? “
ఫోన్ చేతిలో పెట్టాను.
“ఇంత సేపు పట్టింది??. లాక్ ఉండే సరికి ఎటూ పనికిరాదని తెలిసి ఉంటుంది ముసల్దానికి”
తనని చెయ్యి ఎత్తి వారించాను.
“ఫోన్ ఇవ్వటం కోసం ఆమె అమ్మనబ్రోలు బస్సు మిస్ చేసుకుంది.
వాళ్ళ ఊరు వెళ్ళి ఇంటివద్ద దించి వస్తున్నాను. మీకు ఇవ్వమని ఈ సీసా జున్ను పాలు ఇచ్చింది.“
అన్నీ ముగించుకుని నిద్ర కి ఉపక్రమించే ముందు
“ శ్రావణి.. మనం బస్సులో వచ్చేటప్పుడు ఒకావిడ మన పక్కనే నిలబడి ఉంది కదా? మనం సర్దుకుని ఆమెని కూర్చొనివ్వొచ్చు కానీ మనం అలా చేయలేదు. రెండు గంటల పాటు ఆవిడ నిలబడే ఉంది. పెద్దవయసుని కూడా మనం గౌరవించలేదు. మనం ఏం నేర్చుకున్నాం? మన పాప కి ఏం నేర్పబోతున్నాం?”
‘నాది మరీ చాదస్తం’ అన్నట్లు నా వైపు చూసింది.
ఆ 'పెద్దావిడ' నే నేను దించి వచ్చింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...