Saturday, 6 July 2019

అమ్మాయేగా?

చలమయ్య వాకింగ్ నుండి వచ్చేసరికి జయమ్మ జొన్న రొట్టెలు చెయ్యటానికి పిండి సిద్దం చేస్తూ ఉంది.
కుర్చీ లో కూర్చుని షూ విప్పి ముందు గది లో ఉన్న రాక్ లో సర్ది, సాక్స్ తీసుకుని ప్లాస్టిక్ బాగ్ లో వేసి, వెళ్లి ఉతకాల్సిన బట్టల పక్కనే ఉంచి, చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చి సోఫా లో కూర్చునే సరికి, చేతిలో రాగి గ్లాసులో నీళ్ళు తీసుకు వచ్చింది జయమ్మ.
గడియారం లో గంటల ముళ్ళు ఏడు వద్ద ఉంది.
ఇది దైనందికం. చలమయ్య ఖచ్చితమయిన మనిషి.
ఆర్మీ నుండి రిటైర్ అయ్యాక ఒక బ్యాంకు లో సెక్యూరిటీ గార్డు గా చేరాడు. ప్రబుత్వం ఇచ్చిన పొలం ఆతను రిటైర్ అయ్యేసరికి స్థలం గా మారింది.
కొంత స్థలం ఒక బిల్డర్ కి డెవలప్మెంట్ కి ఇచ్చి పది ఫ్లాట్స్ తీసుకున్నాడు. అయిదు అమ్మేసుకుని నెలసరి ఆదాయం వచ్చేట్టు మ్యూచువల్ ఫండ్స్ లో పొదుపు చేసుకుని మరో నాలుగు అద్దెకి ఇచ్చుకున్నాడు.
రెగ్యలర్ వ్యాయామం, పల్లెటూరి తిండి జయమ్మ ఇద్దరు కొడుకులు వెరసి ఒక చక్కటి ప్రణాళికతో ఉండే కుటుంభం చలమయ్యది.
**
మీరేవరయినా కొత్త వాళ్ళయి అతని గురించి నేను పరిచయం చేసిన మాటలు మాత్రమె తెలుసుకుని అతనితో మాటలు కలిపారంటే.. మీకు దెబ్బడి పోవటం ఖాయం.
ఏమయినా అడగండి. “మీకు ఎంతమంది పిల్లలు?” అని మాత్రం అడక్కండి.
“ఒక్కడు. ఒక్కడే” అని సమాధానమూ మరియూ లోపలి గది లో నుండి జయమ్మ నిట్టూర్పు వినబడుతుంది.
మీరు మరీ ఆసక్తిగా హల్లో కి తొంగి చూసారనుకోండి.
గోడ మీద ఒక ఆరోగ్యమయిన కుర్రాడు పక్కనే బురఖా లో ఉన్న అమ్మాయి, ఇద్దరి మెడ లకి పూల హారాలు ఉన్నది పెద్ద పోటో ఒకటి కనబడుతుంది.
ఇంకొంచెం పరీక్షగా చూస్తే బురఖా పిల్ల మొహం మీద ఒక కాగితం అంటించి ఉండటం దానిమీద ‘రాబందు’ అనే అక్షరాలూ ఉండటం కూడా కనిపిస్తుంది
.
అంతటితో మీరు మెడ వెనక్కి లాక్కొండి.
లేదా మీ టైం బాలేక “ ఆ ఫోటో లో అబ్బాయేనా?” అని అడిగారో మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
మీ బతుకు ఒక పార్టీ అభిమానుల పోస్ట్ రెండో పార్టీ సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో నలిగి నట్లు నాశనం అయి పోవాల్సిందే.
**
“కిరణ్ ఎక్కడ?” జయమ్మని అడిగాడు.
బెడ్ రూమ్ వైపు చూపించింది. ఆవిడ.
“వాడు కూడా తగలడ్డాడా?”
అడగాలా? అన్నట్టు చూసి ఆవిడ లోపలి వెళ్ళింది.
ఈ వాడు అనేవాడు #వెంకటేశం. కిరణ్ కి ఈ మధ్యే పరిచయం.
గడ్డం మీసాలు రాలేదు గాని వయసు బానే ఉంటుంది.
ఎర్రటి వళ్ళు నడుం వద్ద వంపు, బిగుతుగా ఉండే డ్రెస్ లు వేసుకుని తాడుమీద నడుస్తున్నట్లు, నడుం మీద బిందె తో తడిచిన చీర లో ఏటి ఒడ్డున నడిచే పిల్ల లాగా..... అదో రకం..
చలమయ్య కి ‘వెంకటేశం’ గాడు అంటే కచ్చ.
'అటూ ఇటూ కానోడి తో స్నేహం ఎంటిరా?' అని కొడుకుని చాలా సార్లు మందలించాడు.
కాని వాళ్ళ బంధాన్ని విడగోట్టలేక పోయాడు.
జైపూర్ లో ఆర్మీ లో మంచి పొజిషన్ లో ఉండే కిరణ్ కి ప్రతి మూడు నెలలకి ఒక నెల సెలవలు ఉంటాయి.
ఆతను ఇలా ఊర్లో కి అడుగు పెట్టీ పెట్టగానే వెంకటేశం తగులు కుంటాడు సారీ వచ్చేస్తాడు.
ఇక ఇద్దరూ సినిమాలు షికార్లు, పుస్తకాలు, రూముల్లో దూరి తలుపులు వేసుకోవటం, గంటల తరబడి ...
చలమయ్యకి గన్ పేల్చడం వచ్చు కాని అతనికి లైసెన్స్ ఉన్న గన్ను లేకపోవటం వెంకటేశం అద్రుష్టం గా చెప్పుకోవచ్చు.
హల్లో ఉన్న పేపరు అన్యమనస్కంగానే తిరగేసి కిరణ్ గది తలుపు తట్టాడు.
రెండు మూడు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది.
వెం క టే శం ...
“వీడేడి?”
“నిద్రపోతున్నాడు మామయ్యా!” వెంకటేశం సమాదానం.
తెరిచిన తలుపు సందులో నుండి లుంగీ కట్టుకుని చొక్కా లేకుండా బోర్లా పడుకుని నిద్రపోతున్న కొడుకు కనిపించాడు.
"మామయ్యా అన్నావో మర్యాదగా ఉండదు."
చలమయ్య పళ్ళు కొరికిన శబ్దం కి వెంకటేశం నవ్వాడు.
**
హల్లో కి వచ్చిన చలమయ్య తో “జొన్న రొట్టెలు లు గుమ్మడి కాయ కూర చేసాను వేడిగా తింటారా?” అన్న జయమ్మ మాటలు వినబడలేదు.
టీవీ లో వస్తున్న ఒక ప్రోగ్రాం చూస్తుండి పోయాడు.
భర్త వద్ద నుండి ఏ సమాదానమూ రాక పోయేసరికి జయమ్మ హల్లో కి వచ్చింది.
ఒక సంప్రదాయబద్దం గా జరుగుతున్న పెళ్లి వేడుక ని ఆతను నోరు తెరుచుకు చూస్తున్నాడు.
రంగు రంగుల దీపాల అలంకరణ, నృత్యాలు, వంటలు, విందులూ మేళ తాళాలు, పురోహితులూ గొప్ప ఫోటోగ్రఫీ ..
కానీ .... దంపతులు ఇద్దరూ #మ_గ_వా_ళ్ళు.
కిరణ్ గది లో నుండి నవ్వుల శబ్దం వినిపిస్తుంటే చలమయ్య బార్యని ఉరిమి చూసాడు.
చేతికి అందిన రాగి గ్లాసు ని టివి మీదకి విసిరాడు.
**
#ఇక_చదవండి.
“మామీ జీ .. రేపు హాస్పిటల్ కి వెళ్ళి వచ్చి చెప్తాను.” మెల్లగా చెప్పింది ఫాతిమా..
“అర్జున్ ఏమి చేస్తున్నాడు?”
“నిద్ర పోతున్నాడు. లేపనా?”
“వద్దులెమ్మా.. జాగర్త.. మరీ నీరసంగా ఉంటే చెప్పు. నేను ఈయనకి ఏదొకటి చెప్పి వస్తాను.”
జయమ్మ ఫోన్ కట్ చేసి వంట గదిలో నుండి బయటకి వచ్చే సరికి చలమయ్య హల్లో సోఫా లో దిగాలుగా కూర్చుని ఉన్నాడు.
“పాలు తోడు పెట్టటం మర్చిపోయాను. మీరెంటి నిద్ర పట్టలేదా?”
చలమయ్య కూర్చోమన్నట్లు చూసి,
అర్జున్ ఫాతిమా ఫోటో చూయించాడు.
“పక్కనే కిరణ్ పెళ్లి ఫోటో ఉన్నట్లు కలోచ్చింది.”
“మంచిదేగా?”
“ఏం మంచిది. కిరణ్ వెంకటేశం కలిసి ఒకే దండలో ఉన్న ఫోటో అది.”
“ఛీ .. ఛీ “ జయమ్మ చీదరించుకుంది.
"మన కిరణ్ అలాటోడేనంటావా? కాలేజీ రోజుల్లో స్నేహితురాళ్ళు ఉండేవాళ్లు కదే ? తీరా ఇప్పుడు వయాసొచ్చాక ఈ చండాలం మొదలయ్యింది.”
“అసలు తప్పు మనదే. మంచి సంభంధం చూడండి. ఈసారి వాడు శెలవలకి వచ్చే సరికి పెళ్లి చేసేద్దాం.” జయమ్మ భరోసా ఇచ్చింది.
“పెద్దోడు చూస్తే కులాన్ని బ్రష్టు పట్టించి, ఆ ముస్లిం పిల్లని చేసుకున్నాడు. పిల్ల చక్కటిదే కానీ. ఆ బూబెమ్మ కోసం కన్న తండ్రిని వదులుకున్నాడు. వీడు చూస్తే శిఖండి లాగా తయారయ్యాడు. ఛీ.. ఇద్దరు మొగ పిల్లలు నీకేమిరా అని అందరూ అంటుంటే ఆనందపడ్డాను. ఈ గాడిదలు అంతా ఆవిరి చేశారు.’
“మీరేం బాధ పడకండి. పెద్దాడి బార్య నీళ్ళు పోసుకుంది. మిల్టరీ వాళ్ళకి అంత తేలిగ్గా అర్ధం అయి చావదు. కోడలు ఫాతిమా నెల తప్పింది. “
చలమయ్య “నిజమా?” అన్నాడు ఆసక్తిగా..
“నీ కెలా తెలుసు?”
“మొన్న పెద్దోడి ఆఫీసు లో పని చేసే అమ్మాయి మార్కెట్ లో కలిసినప్పుడు చెప్పింది. “
**
మర్నాడు జయమ్మ తయారయ్యి బయటకి వెళ్తుంటే “ఎక్కడికి?” అని అడగలేదు చలమయ్య.
సాయంత్రం ఇంటి కి వచ్చే సరికి ఇంట్లో వాతావరణం మరింత వేడిగా ఉంది.
హల్లో సోఫాలో కిరణ్ కూర్చుని ఉన్నాడు. పక్కనే వెంకటేశం. దాదాపు వళ్ళో కూర్చున్నట్లు.
“అమ్మా కూర్చో. ఒక ముఖ్యమయిన విషయం మాట్లాడాలి.”
చలమయ్య కంపరం గా చూశాడు.
వెంకటేశం సిగ్గు పడ్డాడు.
కిరణ్ గొంతు సర్దుకుని “ పెళ్లి విషయం ..” అన్నాడు స్పష్టం గా..
వెంకటేశం సర్దుకుని... “ అసలు రెండు నెలల నుండి ఎలా చెప్పాలో అర్ధం కాక సతమతమయి పోయాం. కిరణ్ కి ఈ వారం తో క్వార్టర్లీ సెలవలు అయిపోతాయి. ఇక ఎప్పుడయినా తప్పేది కాదు...” వెంకటేశం మళ్ళీ సిగ్గు పడ్డాడు.
చలమయ్య ఈ చండాలం వినటానికే ఇంకా బతికి ఉన్నానా? అన్నట్లు బేలగా బార్య వైపు చూశాడు
“నా స్నేహితుడి చెల్లెలు #మేరీ అని బాగా చదువుకుంది. మంచి పిల్ల. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది.”
చలమయ్య కళ్ళు పెద్దవి చేశాడు. “మళ్ళీ చెప్పు.”
“మేరీ అని ఏజీ బీఎస్సీ చదివింది. మంచి సంస్కారం ఉన్న అమ్మాయి. మంచి ఫామిలీ.”
చలమయ్య గట్టిగా గాలి పీల్చి వదిలాడు.
“లక్షణం గా చేసుకో.. వెళ్ళి అన్నా వదినలనకి కూడా చెప్పు . వాళ్ళని ఇంటికి రమ్మను. వారం రోజుల్లో పెళ్లి చేసేస్తాను.”
వెంకటేశం లేచి ఎదురుగా ఉన్న కుర్చీ లో ఠీవిగా కూర్చుంటూ కుడిచేయి పిడికిలి బిగించి బొటన వేలు పైకి చూపించాడు.

2 comments:

Mohana said...

బాగుందండి

Anonymous said...

బాగుంది.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...