Friday, 15 February 2019

సరళంగా సాంకేతిక విషయాలు.(పోలవరం _4)

డబ్బు మెరక కి వెళ్తుందేమో కాని నీరు మాత్రం న్యాయంగా పల్లానికే ప్రవహిస్తుంది.
నీటి ప్రవాహం వైపు (పల్లం వైపు చూస్తూ) నిలబడినప్పుడు కుడి వైపు కాలవని right canal, అలాగే రెండో దానిని left canal గానూ పిలుస్తాం.
గరాటు లో ఎక్కడ నీరు పోసినా అది దిగువ నున్న సన్నటి భాగం లోకి వస్తుంది. అలాగే ఎగువ ప్రాంతాలనుండి గ్రావిటీ (వాటం/వాలు) ద్వారా పల్లానికి చేరి రిజర్వాయర్/చెరువు వద్ద పోగవుతుంది. ఆ ప్రవాహ ప్రాంతాన్ని కేచ్మేంట్ ఏరియా (catchment area) అంటారు.
నదీ ప్రవాహాన్ని అడ్డుకట్ట కట్టటం అంత సాధారణమయిన పనేం కాదు. కొంత దూరం గా కట్టిన రెండు సమాంతర గోడలు (coffer dam) ల మధ్య పటిష్టమయిన డయాఫ్రం గోడ నిర్మిస్తారు.
రాక్ కం ఎర్తెన్ డాం అని, డయాఫ్రం వాల్ అని,
దీన్ని రికార్డు కాలం లో 414 రోజుల్లో పూర్తి చేసి నట్లు శిలా ఫలకాలు ఉంటాయి కంగారు పడొద్దు.
స్థూలంగా చెప్పాలంటే ఒక సాండ్విచ్ లాటిది రెండు బ్రెడ్ ముక్కల (coffer dams) మద్య ఆమ్లెట్ (డయాఫ్రం వాల్/రాక్ కం ఎర్త్ డాం) లాటి నిర్మాణం.
పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధాన మయిన DAM ని సాంకేతికంగా’ స్పిల్ వే’ అంటారు. ఇది నేల మీద అడ్డంగా పడుకున్న సొర చాప లాగా ఉంటుంది.
దాని మద్య వెన్ను పూస లాగా ఒక దీర్ఘ చతురస్రాకారపు సొరంగం లాటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ‘గేలరీ’ అంటున్నాం.
ఈ గెలరీని స్పిల్ వే నిర్వహణకోసం వాడతారు. డాం సీపీజ్ (ఊట నీరు) కొంత ఈ గెలరీ వే లో చేరుతుంది. అందుకే పక్కన ఒక కాలవ లాటి నిర్మాణం ఉంటుంది. మోటార్ల ద్వారా ఆ నీటిని downstream side కి పంపుతారు.
spillway/dam కి సమాంతరంగా గ్యాలరీ మార్గం ద్వారా అటునుండి ఇటూ, ఇటునుండి అటూ వెళ్ళవచ్చు.
శ్రీ శైలం డాం లో కూడా ఈ ఏర్పాటు ఉంది. (ఒకప్పుడు గాలరీ ఉండేది కాదు. ఆధునిక స్పిల్ వే లలో మాత్రమే ఇలా డిజైన్ చేస్తున్నారు.)
స్పిల్ వే మీద పటిష్టంగా కాంక్రీట్ పిల్లర్లు ఉంటాయి వాటి మద్య పై కి కిందకి హైడ్రాలిక్ పవర్ తో కదిలించగల గేట్లు బిగిస్తారు. (మన షాపు లకి ఉండే రోలింగ్ షట్టర్ లాటివి అనుకోండి)
పోలవరం ప్రాజెక్ట్ లో మొత్తం 1.1 కిలోమీటరు పొడవయిన స్పిల్ వే ని మొత్తం 49 పిల్లర్లతో నిర్మిస్తున్నారు. వాటి మధ్య మొత్తం 48 గేట్లు బిగిస్తారు. సహజం గానే గాలరీ 1.1 కిలోమీటరు పొడవు ఉంటుంది గదా!!
ప్రస్తుతం పోలవరం లో 40 వ పిల్లరు 41 వ పిల్లరు మద్య ఒకే ఒక గేటు ట్రైల్ గా బిగించారు. ఈ మధ్య సోషల్ మీడియా లో వైరల్ అయిన "భజన" వీడియో అక్కడిదే..
మొత్తం గేట్లు మూసేసి నీటిని నిలవ ఉంచితే సుమారు 150 అడుగుల/41.5 మీటర్లు లోతు ఉన్న రిజర్వాయిర్ ఏర్పడుతుంది.
ఇక్కడ ఆగుదాం.
ఇప్పుడు రెండు ప్రశ్నలు. అంతా బానే ఉంది నదీ ప్రవాహం ఎక్కడ ఉంది. మీ పాటికి మీరు నదీ ప్రవాహాన్ని తప్పించి పక్కన ఎక్కడో స్పిల్ వే కట్టుకుంటూ పొతే రిజర్వాయిర్ ఎలా ఏర్పడుతుంది.?? అనేవి.
దిగువ coffer dam ఇంకా పూర్తి కాలేదు. సుమారు గా 196 మీటర్లు వర్క్ పెండింగ్ ఉంది. డయాఫ్రం వాల్ నది మట్టం వరకు కట్టారు.
రాక్ కం ఎర్త్ డాం ఎప్పుడు కడతారు.?
దిగువ coffer డాం నిర్మాణానికి ప్రస్తుతం ప్రవహిస్తున్న నది లోతు ఇబ్బంది గా ఉంది. వేసవి కాలం లో మాత్రమె పని చెయ్యటం వీలవుతుంది. కొంత నీటి మట్టం తగ్గాల్సి ఉంది.
1.7 కిలో మీటర్ల వెడల్పు గలిగిన గోదావరి నుండి, spill way 1.1 కి మీ ల నిర్మాణం, పూర్తి అయ్యి గేట్లు బిగించి సాకేంతికంగా క్లియరెన్స్ వచ్చాక Y ఆకారం లో ఎగువ ప్రాంతాన్ని లోతుగా తవ్వి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు.
అదేవిదంగా రెండో వైపు దిగువ ప్రవాహాన్ని కూడా దారి మళ్ళించడానికి వీలుగా తవ్వి కాంక్రీట్ తో విశాలమయిన ఫ్లాట్ ఫారం నిర్మిస్తారు.
ఈ కాంక్రీటింగ్ ని ఒకే రోజు చేసి గిన్నిస్ బుక్ లో నమోదు చేయించారు.
స్పిల్ వే పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం జరిగి పూర్తి అయ్యాక డయాఫ్రొం పునాది మీద రాక్ ఎర్త్ ఆనకట్ట నిర్మాణం నదీ ప్రవాహానికి అడ్డుగా కడతారు.
ఇది రిజర్వాయర్ అడ్డుకట్టగా మిగిలి పోతుంది. తర్వాత జాగర్త గా caffer dam లని కూల్చేస్తారు.
స్పిల్ వే కి ఎగువ ప్రాంతాన్ని (అంటే crab/ పీత లాగా ఉండే) ప్రాంతాన్ని upstream side అనీ, ఎత్తిన స్పిల్ వే గేట్లు నుండి కిందికి దూకి అక్కడి నుండి కుడి ఎడమల కాలువలికి వెళ్ళే వైపు ని downstream side అనీ అంటారు.
మరొక్క మాట పోలవరం లో రెండు coffer dams మద్య, డయాఫ్రం వాల్ ఆధారంగా “hydro power plant” నిర్మాణం జరగనుంది.
dam ఎత్తుని కొన్ని లాలూచీల కారణంగా తగ్గించి, పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపేస్తారని ఒక ఆధారం లేని న్యూస్ కూడా ప్రచారం లో ఉంది.
ఏది ఏమైనా పవర్ ప్లాంట్ నిర్మాణం ఇంకా మొదలవలేదు. ఇంకా ఉంది...













Thursday, 14 February 2019

గోదావరి మలుపులు (పోలవరం_3)

2004 లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తన పూర్తి దృష్టిని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (జల యజ్ఞం) మీద పెట్టింది. అనేక ప్రధాన ప్రాజెక్ట్స్ ని, పరిశీలించింది. చాలా ప్రాజెక్ట్స్ కి నిధులు మంజూరు చేసి ప్రారంభించింది.
అప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండి ‘రామ పాద సాగర్ ప్రాజెక్ట్’ నుండి ”పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్” గా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ అప్పటి ముఖ్యమంత్రి ని ఎంతో ఆకర్షించింది. అప్పటికే దాని అంచనా వ్యయం 8200 కోట్లు.
సహజంగా భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కేంద్ర ప్రభుత్వ అధీనం లో జరుగుతాయి. కాని అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుకూలత చూసుకుని మంత్రి వర్గం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నే ప్రారంభించాలని నిర్ణయించుకుంది..
ఈ నిర్ణయం వెనుక అనేక ఆకర్షణీయమయిన/ అద్బుతమయిన కారణాలు ఉన్నాయి.
గోదావరి నది సహజసిద్దమయిన వంపు తిరిగి ప్రాజెక్ట్ కట్టుకోవటానికి అనుకూలంగా ఉండటం.
కేచ్మేంట్ ఏరియా(catchment area)* ఎక్కువగా ఉండటం, స్టోరేజ్(storage)* కెపాసిటీ ఎక్కువగా ఉండటం, గోదావరి నదికి వరద నీరు ఎక్కువగా వస్తూ ఉండటం, అనేక లక్షల cusec ల నీరు సముద్రం లో కి విడవాల్సి రావటం లాటివి.
మరీ ముఖ్యంగా “ప్రాజెక్ట్ పూర్తి అయి పూర్తి స్థాయి లో రిజర్వాయర్ లో నీరు నిలవ ఉంచగలిగితే” అది దిగువ ప్రాంతాల కి #వరసగా#నాలుగు_కరువు_సంవత్సరాల ని తట్టుకుని పంట/ తాగు నీరు ఇవ్వగలగటం. అంత పెద్ద భారీ ప్రాజెక్ట్.
2004 లో కుడి కాలవ పనులు మొదలయ్యాయి. 2005 లో ప్రాజెక్ట్ మొదలయ్యింది.
అంతే వేగంగా 2006 మే లో డాం నిర్మాణం ఆగి పోయింది.
అటవీ శాఖ, మైనింగ్, వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి, ముంపు ప్రాంత నిర్వాసితుల సమస్య లాటి అనేక కోర్టు సమస్యలు, విఘాతల కారణంగా నిర్మాణం అపెయ్యవలసి వచ్చింది.
అయితే ప్రధాన డాం పని అగినప్పటికి కాలవ పనులు మాత్రం కొనసాగాయి.
రాష్ట్ర ప్రభుత్వ చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారం తో ప్రాజెక్ట్ ఇబ్బందులు అన్నీ 2009 కి మబ్బుల్లా విడిపోయాయి.
దాదాపు నూరు శాతం అనుమతులతో ప్రాజెక్ట్ పనులు పరిగెత్తాల్సిన సమయం వచ్చింది.
తెలుగు రాష్ట్రం లో అక్టోబర్, 2009 ఒక విషాదం చోటు చేసుకుంది.
రాష్ట్రం ఒక #ముఖ్యమంత్రిని కోల్పోయింది.
జలయజ్ఞం కింద మొదలయిన చాలా పనులు ఆగిపోయాయి. ఆపధర్మ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మరలించలేక పోయారు. ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి.
#నిర్మాణ_వ్యయం మాత్రం రోజు రోజుకి పెరిగి పోతూ ఉంది.
కొన్నాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం “పోలవరం ప్రాజెక్ట్” కి జాతీయ హోదా కావాలని విన్నపాలు మొదలెట్టింది.
జాతీయ హోదా అంటే ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వటం.
అప్పటి ప్రధాని అంగీకరించలేదు. మౌన ముద్ర వీడలేదు. ఒక రాష్ట్రానికి ఆ స్థాయిలో నిధులు అందించడం సాద్యం కాదనేది ఆయన ప్రబుత్వ వాదన.
కాలం పరిగెడుతూనే ఉంది.
నాటకీయం గా తెలుగు రాష్ట్రం బహువచనం అయ్యింది.
విడిపోయిన ఆంధ్రపదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నందున పోలవరం కి నేషనల్ స్టేటస్ ఇస్తామని ప్రబుత్వం హామీ ఇచ్చింది.
2014 ఎన్నికల తర్వాత రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. కేంద్రం లో అధికారం లోకి కొత్త ప్రభుత్వం వచ్చింది. రాష్టం లో సీనియర్ నాయకుడి ప్రభుత్వం ఏర్పడింది.
రాష్త్రం విడిపోయే ముందు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ హోదాని కొత్త ప్రబుత్వం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి చేసింది.
ఎన్నికలలో సపోర్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ అబ్యర్ధన న ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం కి స్పెషల్ స్టేటస్ #ఇచ్చింది.
అంతా బాగుంది ఇక ఆటంకాలు లేవు ప్రాజెక్ట్ తిగిరి పట్టాలు ఎక్కే దశ లో ఒక అవాంతరం వచ్చింది.
కొంతమంది హ్యూమన్ రైట్ activist లు ...
వారి వాదన ఇలా ఉంది..




ప్రాజెక్ట్ పూర్తి అయితే అప్ స్ట్రీమ్ (upstream side*) లో ఉన్న సుమారు 276 గ్రామాలు ముంపుకి గురవుతాయి. ఆ గ్రామాల ప్రజలకి నష్టం వాటిల్లుతుంది. వారి కి సరైన మార్గాంతరం చూపకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగించా రాదు.
అనేక వందల ఎకరాల అడవి ప్రాంతం నీట మునిగి పోతుంది. తిరిగి రెట్టింపు వైశాల్యం లో అడవిని పెంచాలి,
అటవీ వన్య మృగ రక్షణ కి చర్యలు చేపట్టాలి.
ముందుగా ఇవన్నీ సంతృప్తికరంగా చేసాక మాత్రమే ప్రాజెక్ట్ తిరిగి మొదలెట్టాలి ..
ప్రాజెక్ట్ పని మొదలవకుండానే ఆగి పోయింది.

Wednesday, 13 February 2019

T.M.C / cusec (ఒక పరిచయం)

చాలా మందికి తెలిసినప్పటికీ
ఇంకా నాలాటి మందమతులు ఉంటారని ఒక నమ్మకం తో ఈ పదాలని మీకు పరిచయం చేస్తున్నాను.
తరచుగా మన వింటున్న మరియు వినబోతున్న ఒక పదం TMC
TMC అంటే? ఇది ఒక కొలత.
మనకి చాలామందికి 90 అంటే తెలుసు. ఇది ఒక కొలత. ఈ కొలత కూడా తెలియని వారిని క్షమించరాదు. 
మన లెక్కలో చెప్పాలి అంటే cft = ఒక ఘనపు అడుగు = 32.33 బీర్లు (720 ml)
విషయానికి వస్తే... ఒక పెద్ద బక్కెట్టు లో సుమారుగా ఒక 20 లీటర్ల నీరు పడుతుంది.
సౌలబ్యం కోసం వాటర్ బబూల్ తీసుకోండి. దాని పరిమాణం 20 లీటర్లు.
28.3 (28.3168) లీటర్లు నీరుని ఒక ఘనపు అడుగు అంటారు.
ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే అడుగు (12 అంగుళాలు) పొడవు, అడుగు వెడల్పు, అడుగు ఎత్తు ఉంటె ఒక పెట్టె లో నీరు పోస్తే 28.3 లీటర్లు పడతాయి. ఇది ఒక cft (cubic feet) అనుకుందాం.
ఇప్పుడు డబ్బు/cft లెక్క లోకి వద్దాం.
1 cft (ఒకటి)
10 cft (పది)
100 cft (వంద)
1,000 cft (వెయ్యి)
10,000 cft (పదివేలు)
1,00,000 cft (లక్ష)
10,00,000 cft (పది లక్షలు లేదా మిలియన్)
1,00,00,000 cft ( కోటి లేదా పది మిలియన్లు)
10,00,00,000 cft (పది కోట్లు లేదా వంద మిలియన్లు)
1,00,00,00,000 cft (వంద కోట్లు లేదా వెయ్యి మిలియన్లు )
ఇక్కడ ఆగుదాం.
ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు కలిగిన ఘనపు అడుగులు (అనగా 28316800000 లీటర్లు) పరిమాణాన్ని ఒక T M C గా కొలుస్తారు. (Thousand Million Cubic feet)
1000 అడుగుల పొడవు, 1000 అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల ఎత్తు ఉన్న తొట్టి నిండా ఉన్న నీరు TMC కి సమానం. ఉహకే జైగాంటిక్ గా ఉంది కదా!!
(5.321 కిలోమీటర్ల పొడవు, 5.321 కిలోమీటర్ల వెడల్పు, ఒక మీటరు ఎత్తు ఉన్న తొట్టి లో పట్టే నీరు.)
2. cusec/ క్యూసెక్
-------------------------
రెండో పదం క్యూసెక్
ఇది కాలానికి పరిమాణానికి సంభందం చెప్పే పదం.
మావాడు ఒక్క నిమిషం లో ఫుల్ బీరు తాగుతాడు అంటే.. సాంకేతికంగా నిమిషానికి (అరవై సెకండ్లకి) 720 మీ లీటర్ల వినియోగం జరుగుతుంది. అని.
ఒక కొళాయి నుండి వచ్చే నీటిని కొలిస్తే నిమిషానికి ఒక లీటరు ఉంది అనుకుందాం
.
సెకండ్ కి 1/60 లీటర్లు ఉంటుంది.
అదే ఒక పెద్ద కాలువ నుండి పైపు ద్వారా వచ్చే నీరు ఒక సెకండు కి 28.3 లీటర్లు ఉన్నట్లయితే, ఆ నీటి ప్రవాహాన్ని సెకండ్ కాలానికి ఒక ఘనపు అడుగు (CUbic feet per one SECond) క్యూసెక్ / cusec అంటారు.
ఈ లెక్క/ పదాలు మీకు తెలియదని కాదు.
కొన్ని సంకేతిక పదాలు క్లుప్తంగా తెలుసుకుంటే గాని, కొన్ని వార్తలు అర్ధం కావు అందుకే ఈ పరిచయం. _/|\_

కాఫర్ డాం - అండర్ వాటర్ నిర్మాణాలు (Polavaram-2)


అండర్ వాటర్ కన్స్ట్రక్షన్ అనేది ఫిబ్రవరి పద్నాలుగున ఒంటరిగా బార్లో కూర్చుని యాపిల్ జ్యూసు తాగడం లాటిది.

సుమారు ఏడెనిమిది ఏళ్ల క్రితం ఒంగోలు హౌసింగ్ బోర్డ్ కాలనీ లో ఒక ఇంటికి పునాది వేస్తున్నప్పుడు నాలుగు అడుగుల పిట్ లో నీరు ఊరటం మొదలయ్యింది.
దగ్గరలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండటం, వర్షాకాలం అవటం, వాటర్ టేబుల్ అందుబాటులో ఉండటం లాటి కొన్ని కారణాలు.

కొన్నాళ్ళ పాటు ఆగితే కాని పరిస్థితి అనుకూలించదు. కాని కాలం విలువయినది. footing పిట్స్ విరిగి పడే చాన్స్ కూడా ఉంది.

నాలుగు అడుగుల కన్ను ఉన్న RCC రింగు తెప్పించి దాన్ని నీళ్ళలో దించి, మోనో బ్లాక్ మోటార్ తో గుంటలో నీళ్ళు తోడిస్తూ, పొడి కాంక్రీట్ వేశాం. కాంక్రీట్ గట్టిపడేవరకు నీళ్ళు bail (తోడటం) చేస్తూనే ఉన్నాం.

కాస్త అటూ ఇటుగా ఇదే టెక్నిక్ పెద్ద పెద్ద నిర్మాణాలు (నీళ్ళ లో) చేసేటప్పుడు వాడతారు.
పునాది వెయ్యాల్సిన చోటు కి గుండ్రంగా మహేష్ బాబుని రౌండప్ చేసినట్లు ఒక తాత్కాలిక నిర్మాణాన్ని, రేకు/ప్రీ కాస్ట్ రింగులు/ కాఫర్ డాం లు చుట్టూ బిగించి నిర్మాణ స్థలం లోకి నీరు రాకుండా జగర్తపడతారు.

కావాల్సిన విధం గా QHPC (Quick Hardening Portland Cement) వాడి VRCC (Vibrated Reinforced cement concrete) తో పునాది నిర్మాణం చేస్తారు.
నదులు లాటి ప్రవాహక ప్రాంతాలలో ఇసుక దాదాపు వంద అడుగుల లోతు ఉంటుంది.
అంత లోతు వరకు రేకు/కాఫర్ డాం ఏర్పాటు చేసినప్పటికి నీరు ఇసుక క్రింద నుండి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా అడ్డుగా ఉంచిన రేకు/ కాఫర్ డాం ని “నిల్వ నీళ్ళు” బలంగా నెడుతుంది.
అప్పుడు బూమి లోపలి కి piles డ్రిల్లింగ్ చేసి కింద బలమయిన రాయి దొరికేవరకు తోవ్వుతారు. రాతిలో కూడా కొంత లోతు వరకు తొవ్విన రంద్రం లోకి స్టీల్ బోను చొప్పించి వత్తిడితో మేలురకం కాంక్రీట్ తో నింపుతారు.
(పోలవరం కాఫర్ డాం మూడు వందల అడుగుల లోతు కి వెళ్ళవలసి వచ్చింది. గోదావరి నది పోలవరం ప్రాజెక్ట్ వద్ద మొత్తం పదిహేడు వందల మీటర్ల వెడల్పుఅంటే 1.7 కి.మీ వెడల్పు ఉంది.)


వరుసగా ఇలాటి పిల్లర్స్ తో నేల మట్టం వరకు దుర్భేధమయిన కాంక్రీట్ గోడ నిర్మాణం ఉంటుంది. ఏమాత్రం గాప్ ఉన్నా మొత్తం ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. కనుక అత్యంత జాగర్తగా చెయ్యాల్సిన పని.

పై భాగం లో నది లోతు**(ఈ రెండు చుక్కల వివరాలు నా తర్వాత పోస్ట్లు చదివితే కాని అర్ధం కాదు) ను బట్టి గోడ లాటి నిర్మాణం చేస్తారు. #ఇదంతా స్లాబ్ కి షట్టరింగ్ చెయ్యటం లాటిది.

ప్రదానమయిన ఆనకట్ట (dam/ spill way కాదు) ఎర్తేన్ డాం లేదా డయాఫ్రం వాల్ నిర్మాణం చెయ్యటానికి కావలసిన తాత్కాలిక ఏర్పాటు. మాత్రమే.
గోదావరి నదికి ఆనకట్ట కోసం రెండు వైపులా coffer dam లు నిర్మిస్తున్నారు. ప్రమిద ఆరిపోకుండా రెండువైపులా చేతులతో గాలిని ఆపినట్లు.
కాఫర్ డాం ఎంతో ఖర్చు తో కూడిన భూమి లోపలి నిర్మాణం. పైకి ఏమీ కనిపించదు. ప్రదర్శనకి వీలవదు. :(

ఎగువ కాఫర్ డాం 2.05 km వెడల్పు ఉంది.
ప్రస్తుతం ఇది పూర్తి అయి ఉంది. దిగువ కాఫర్ డాం పని జరగాల్సి ఉంది. ఆ తదుపరి రెండిటి మధ్య నదికి అడ్డుగా earthen dam నిర్మాణం సాగుతుంది.
ఇదంతా రెండవ ప్రధాన భాగం .. .






www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...