Tuesday, 28 August 2018

తమ్ముడు

17 గంటల పైగా జర్నీ చేసి 23 మద్యానం ఇంటికి వచ్చినప్పటి నుండి సాయి ( తంజావూరు లో చదువు కుంటున్న మా అబ్బాయి) కి కొంత రెస్ట్ అవసరం అని నాకు స్పురించలేదు. 
ఇంట్లో అందరికి సాయి నామ స్మరణే...
సాయి ఆర్కేహోటల్ దాకా వెళ్లి ..
సాయి టైలర్ దగ్గరికి వెళ్లి అక్క బ్లౌజ్ లు..
సాయి బాబు ఏడుస్తున్నాడు చూడు..
సాయి అక్క.. మామయ్య కార్లో వెళ్తుందట.. శుబ్రం గా తుడువు.
సాయి పెద బావ వస్తున్నాడట చూడమ్మా..
సాయి ఇల్లంతా చిందర వందరగా ఉంది .. కొంచెం సర్దు.. గుంటూరు విజయ పిన్ని కి ఫోన్ చెయ్యి.
మనోజ్ వాళ్ళు వచ్చారట. వెళ్లి హోటల్ లో రూమ్ ఏర్పాటు చూడు.
అర్జంటుగా ఇక్కడ ఉన్నట్లు గా వెళ్లి రెండు లీటర్లు పెరుగు తీసుకురా ...
భోజనం చేసావా, రాత్రి నిద్ర పోయావా? పాలు తాగుతావా? ఇలాటివి అడిగినట్లు గుర్తు లేదు.
24 వ తేది జరిగిన మా చిన్నమ్మాయి పెళ్లి లో మా అందరికి తలలో నాలుక అయిపోయాడు.
**
25 మేము తిరుపతి వెళ్లి వచ్చేసరికి, వాళ్ళ నానమ్మ తో కలిసి చిందర వందర గా ఉన్న ఇంటిని ఒక షేప్ కి తెచ్చాడు. పెద్దమ్మాయి కి కావాల్సిన షాపింగ్ చేయించాడు. బుడ్డోడి అన్నప్రాసన కి అవసరం అయిన పనులు చేసాడు.
26 న, చీమకుర్తి లో మనమడి అన్నప్రాసన పూర్తవగానే, భోజనం చేసి అందరం ‘మొటుమాల’ జీవన_కిరణ్ వద్దకి వెళ్లాం. 42 కిలోమీటర్లు కారు తనే తోలాడు. “మీరు కూర్చోండి రెండ్రోజులు రాత్రి జర్నీలు కదా?” అన్నాడు.
మల్లారెడ్డి కొత్త జంట తో అనేక విషయాలు మాట్లాడాడు. ఎవరికో జరిగిన విషయాలుగా మలుస్తూ, ఎవరి బాధ్యతలు ఏవో, ఒకరి తో ఒకరు ఎలా ఉండాలో చలోక్తులతో కలిపి చాలా సేపు మాట్లాడాడు.
మాట్లాడుతూ ఉన్నంత సేపు జీవన తన పట్టు చీర కొంగునుండి దారాలు లాగుతూ కనిపించింది. శ్రద్దగా వినే తను అలా ఎందుకు ఉందొ అర్ధం అవలేదు.
భోజనం చేసిబయలు దేరాం.
సాయి జాగర్తగా డ్రైవ్ చేస్తూ రాత్రి పదకొండుకి ఒంగోలు ఇంటికి చేర్చాడు.
అత్తగారి ఇంట్లో చిన్నమ్మాయి ఉండిపోయింది.
27 ఉదయం తను వచ్చి..
“నాన్నా ఈ రోజు మద్యాన్నమే నా ట్రైన్” అని సాయి చెప్పెంతవరకు నాకు గుర్తే లేదు.
వాళ్ళ అమ్మ, వాడి బట్టలు అన్నీ వేరు చేసి ఇస్త్రీ కోసం చాకలిని పిలిచి ఇచ్చింది.
సడన్ గా నలుగు రోజుల నుండి వాడు బొంగరం లా తిరుగుతున్న విషయం గుర్తుకొచ్చింది.
“సాయి ... కొద్దిసేపు పడుకుని నిద్రపో.. మళ్ళీ 17 గంటల జర్నీ ఉంది. కదా?” అన్నాను.
“పర్లేదు ట్రైన్ లో రిజర్వేషన్ ఉంది కదా .. అప్పుడు నిద్ర పోతాను”
ఈ లోగా మా వియ్యంకుడు ఫోన్ చేసాడు.
“అబ్బాయి ..కాలేజి కి ఎప్పుడు బయలుదేరుతాడు?” అని.
“మద్యానం రెండున్నరకి. భోజనం చేసి ఎక్కేస్తాడు.”
“సాయంత్రం వీళ్ళు అక్కడికి వస్తారు. బావమరిది కాళ్ళు కడగాలి కదా?”
నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. “ అయిదు నిమిషాల్లో నేను ఫోన్ చేస్తాను.” అని చెప్పాను.
పక్కనే ఉన్న సాయి తో విషయం చెప్పాను.
“సరే నాన్నా నేను మిడ్ నైట్ సర్కార్ కి వెళ్తాను. తాంబరం నుండి బస్ పట్టుకుంటాను.”
“రిజర్వేషన్ లేదు కదా?”
“పర్లేదు.. జనరల్ లో పేపర్ పరుచుకుని పడుకుంటాను. ఏం పర్లేదు.”
నేనూ ఎదో చెప్పబోయేసరికి
“బావ వాళ్ళు వచ్చేసరికి మనం ఏం ఏర్పాట్లు చెయ్యాలి?” అన్నాడు.
వాడి ఎనర్జీ లెవెల్స్ కి ముచ్చట వేసింది.
ఈ లోగా వాళ్ళ అమ్మ ఏమేం చేయాలో, ఏమేం కావాలో చెప్పింది.
“నేనూ వస్తాను.” అన్నాను.
“వద్దు నాన్నా .. మీరు కొంచే సేపు రెస్ట్ తీసుకోండి. నేనూ జాగర్త గా ఇవన్నీ చేసేస్తాను.”
వాలెట్ చూసుకుని కారు తాళం తీసుకుని బయటకి వెళ్ళాడు. మళ్లీ రాత్రి పదకొండున్నర దాకా బొంగరం లా పనులు అటెండ్ అవుతూనే ఉన్నాడు.
**


అర్దరాత్రి దాటాక ట్రైన్ మరో పదినిమిషాల్లో ఫ్లాట్ ఫారం కి వస్తుందనగా స్టేషన్ కి తీసుకు వచ్చాను.
ట్రైన్ వచ్చింది. సాయి తన బాగ్ తో రద్దీగా ఉన్న జనరల్ బోగీ లో ఎక్కాడు.
కిటికీ లో నుండి తొంగి చూస్తూ.. “నెల్లూరు లో ఖాళీ దొరుకుతుంది లే నాన్నా” అన్నాడు.
అది అబద్దం అని మా ఇద్దరికీ తెలుసు.
సాయి చేతిని పట్టుకుని మెల్లగా వీడ్కోలు చెప్పాను.
వాడి చేతికి పట్టు చీర పోగుల తో చేసిన రాఖీ ఉంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...