Sunday, 5 August 2018

ఒక అరగంట


రోడ్డు వారగా కారు ఆపి, పెయింట్ మీద తాజా గా పడిన గీత ని మళ్ళీ చూసుకుని “దిగు” అన్నాను.
హ్యాండ్ బాగ్ లో మరి కొన్ని శుభలేఖలు సర్దుకుని తను కారు దిగింది. 
పల్లెటూరిలో కట్టిన విశాలమయిన ఇల్లు. పెద్ద గేటు.
లోపలి వెళ్లి మొదటి అంతస్తు గ్రిల్ గేటు వద్దకి వచ్చి గేటు తీయబోయేసరికి బలంగా ఉన్న తెల్లటి బొచ్చు కుక్క వెనుక కాళ్ళ మీద నిలబడి పెద్దగా అరవసాగింది.
మా శ్రీమతి కి కుక్క పిల్లలంటే బెరుకు. వాటిని ఎందుకు అంత ముద్దు చేస్తారో ఆవిడకి అర్ధమే కాదు.
లోపలినుండి మా మిత్రుడి బార్య వచ్చి “కొత్త వాళ్ళని తనే ముందు పలకరించాలని రాణి ఆత్రం” అంది నవ్వుతూ
“బాగున్నారా? రండి.” దాని మెడలో ఉన్న తోలు బెల్టు కి చైన్ బిగిస్తూ పలకరించింది
మేం లోపలి అడుగేట్టాం. మా వాడు రూమ్ లో నుండి షర్ట్ వేసుకుంటూ బయటకి వచ్చాడు.
పలకరింపుగా నవ్వాడు.
"రండి కూర్చోండి" అన్నాడు. సోఫా చూయిస్తూ...
విశాలమయిన ఇల్లు. గాలి వెలుతురూ విధ్యుత్ తో సంబంధం లేకుండా.
నలబై అడుగుల మించి పొడవు ఉన్న హాలు.
రాణి ఇంకా గోల గోలగా మా కాళ్ళ చుట్టూ తిరుగుతూ రెండు కాళ్ళ మీద లేచి నిలబడి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉంది.
“దాన్ని పలకరించనిదే అది మనన్ని మాట్లాడుకోనివ్వదు” అన్నాడు వెంకట్.
రెండు చేతులు చాచి పిల్లాడిలా ఎత్తుకుని దాని మెడ నిమిరాక నెమ్మదించింది.
“అమ్మాయి పెళ్లి ఈ నెల 24 న “ ప్రారంభంగా చెప్పాను.
“ఆ తెలుసు.” అన్నాడు మా వాడు.
ఈలోగా మా ఆవిడ ఆమెకి కుంకుమ బొట్టు పెట్టి శుభలేఖ అందించింది.
పిచ్చాపాటి మాటలు మొదలయ్యాయి.
“అబ్బాయి ది ఎక్కడ? ఏం చదివాడు ? ఏం చేస్తున్నాడు” అని మాత్రమే అడిగాడు.
స్నేహితులు “ఎంత ఇస్తున్నావు ?” అని ప్రశ్నించక పోవటం పొద్దుట నుండి మా శ్రీమతి గమనిస్తూనే ఉంది.
వెంకట్ పెద్ద కుమార్డు యు ఎస్ లోను చిన్న వాడు బెంగుళూరు లోను పని చేస్తున్నారు. పెద్దాడు వచ్చి రెండేళ్ళు దాటినట్లు, చిన్నవాడు చుట్టపుచూపుగా మూడు నాలుగు నెలలకి ఒక సారి వచ్చి పోతున్నట్లు చెప్పాడు.
స్కూల్ టీచర్ గా మరో ఆరేళ్ళ సర్వీస్ ఇక్కడే ఉండాలని “ఎవరి జీవితాలు వారివి.” అని నవ్వాడు.
ఈ లోగా రాణి మా వాడి ని చూసి పలకరింపుగా మొరిగింది.
“నీకు చెప్పలేదనా? మా ఫ్రెండ్ ఈయన. చిన్నప్పుడు ఇక్కడ హైస్చూల్ లో చదివినప్పుడు మా జూనియర్. వాళ్ళ రెండో అమ్మాయి పెళ్లి కి పిలవటానికి వచ్చారు.” అచ్చు మరో మనిషికి చేబుతున్నంత సిన్సియర్ గా చెప్పాడు.
మా వైపు తిరిగి “మాటల్లో తన ప్రసక్తి లేనిదే ఒప్పుకోదు” అన్నాడు.
రాణి విని అర్ధం చేసుకున్న మాదిరిగానే కుర్చుని తల ఉపింది.
"మాకు కాలక్షేపం ఇదే." అన్నాడు మళ్ళీ తనే.
శలవు తీసుకుని మేట్లుదిగుతుంటే..
“పెట్స్ ఎందుకో పెంచుకుంటారో అర్ధం అయింది.” అంది మా ఆవిడ.
నాకు శ్రమ తగ్గిస్తూ..

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...