Sunday, 28 January 2018

వేటూరి

1982-1986 మద్య కాలం లో ఒంగోలు డి‌ఏ గవర్నమెంటు పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివాను.
క్లాసులో అల్లరి లో నెంబర్ టూ స్థానం కోసం  కొంతమంది పోటీ పడుతుండేవాళ్లు.
ఒక లెక్చర్ ఉండేవాడు. చెప్పేది తక్కువ. స్వత్కోర్ష ఎక్కువ. 
అప్పట్లో నేను.... అక్కడ పని చేసే రోజుల్లో .... అంటూ పీరియడ్ లో ఎక్కువ బాగం సోది చెప్పేవాడు.
మనం ఇంటివద్ద చదవం కాబట్టి క్లాసులో శ్రద్ధగా వినేవాడిని. అల్లరి మామూలే ..
ఒక రోజు ఆయన వచ్చే సరికి బోర్డు మీద “__________________” అని వ్రాసి ఉంది.
అంత స్పృజనాత్మకత ఉన్న పిల్లాడిని కనిపెట్టటం చానా వీజీ...
అప్పటి నుండి నన్ను టార్గెట్ చెయ్యటం మొదలెట్టాడు. ప్రశ్నలతో నా మీద దాడి చేయటం మొదలెట్టాడు.
నేను అతనికి చిక్కేవాడిని కాదు. చెప్పబోయే చాప్టర్ కూడా చదివి సిద్దం గా ఉండేవాడిని.
నన్ను మా క్లాసు లో ఉన్న ఏకైక బ్యూటీ ముందు హేళన చేయాలని పట్టుదలగా ఉండేవాడు.
నేను స్టువాట్ పురం దొంగ లాగా వళ్ళంతా సబ్జెక్ట్ పూసుకుని తిరుగుతుండే వాడిని.
చివరికి ఒక రోజు ఆయన బయట పడి పోయాడు.
“ఒరేయ్ నువ్వు ‘వేటూరి’ వి రా “నీ అమ్మ నా అత్త” అనగలవు. “శంకరా నాధ శరీరాపరా” అని కూడా అనగలవు. దొంగ గాడిద. "అని ముద్దుగా కొప్పడ్డాడు.
***
కట్ చేస్తే ఆ  యాడాది ఆయన సెట్ చేసిన ప్రశ్నా ప్రత్రమే సెలెక్ట్ అయి సెం ఎక్సామ్ లో వచ్చింది.
మొత్తం ముప్పై తొమ్మిది మంది లో ముగ్గురమే పాసయ్యాము.
ఇందులోనూ  'నెంబర్ వన్' స్థానం నిలబెట్టుకున్నాను. 

Saturday, 27 January 2018

ఏది నిజం?!?

కుటుంబం, సమాజం మనన్ని అనుక్షణం నియంత్రిస్తుంటాయి.
మానవ సంభందాలు కూడా అదుపు చేస్తూ ఉంటాయి.
మనస్పూర్తిగా మాట్లాడటానికి, నిష్కపటం గా ఉండటానికి ఏదీ మనన్ని అనుమతించదు.
మన సంతోషాన్ని అదుపు చేసుకోవాలి. మన బాధలని హద్దులో ఉంచుకోవాలి. నవ్వును మనుషులని బట్టి అనుమతించాలి. కొందరి వద్దే మనసు విప్పాలి. ప్రయోజనాల పరంపర లో మనుష్యులు నిజమయిన స్వేచ్చని, స్వతంత్రాన్ని ఎప్పుడో కోల్పోయారు.
మనం అదుపు చేసినవి, అణిచి పెట్టినవి ఎక్కడికీ పోవు. అవి మనసు పొరల్లో ఉండి పోతాయి. మన లోనే ఉంటాయి. అవే కలలుగా వస్తాయి. మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మన భావాలని సహజం గా వ్యక్తపరచ లేని పక్షం లో అవి అనేక వికారాలుగా మారతాయి.
***
ఒక అన్యోన్యమయిన దంపతులు ఉండేవారు. ఇరుగు పొరుగు ఈర్ష పడేంత అన్యోన్యత. ఒకరంటే ఒకరకి గౌరవం ప్రేమ.
భర్త కి కావలసినవన్నీ సమకూర్చేది. తను ఉద్యోగం చేసేది. అతని ఇంటివద్ద అప్పులని తీర్చడానికి తన జీతం లోంచి డబ్బు ఇచ్చేది. భర్త మాట వేదవాక్కులా ఉండేది. ఇంటా బయటా ఒక్క మాట అని గాని, వ్యతిరేకించి గాని ఎరగదు.
అతనికి కూడా బార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె సలహా లేనిదే ఏమి చేయడు. ఆమెకి కావలసిన అవసరాలన్నీ అతనే సమ కూరుస్తాడు. ఆమె తాలూకు బట్టలు, నగలు కూడా అతనే ఎన్నిక చేస్తాడు.
అంత చక్కని జంట.
..
వాళ్ళ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. లోపల మంచి పూల చెట్లు ఉన్నాయి. ఒక పందిరి కింద ఊగుటుయ్యాల ఉంది. ఇద్దరికీ నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఒక రోజు ఇద్దరు నిద్రలో నడుస్తూ తోట లోకి వచ్చారు ఒకరికి ఎదురుగా ఒకరు నిల్చున్నారు. మాట్లాడుకోవటం మొదలెట్టారు.
“దుర్మార్గుడా? ఆడబిడ్డల పెళ్లి అప్పులు నా జీతం తో తీర్చాలా? నా కంటూ స్వతంత్రం లేదా. ఇష్టపడిన బట్టలు కూడా నేను కొనుక్కో కూడదా? నా జీవితం నీ లాటి అయోగ్యుడి చేతిలో నాశనం అవాల్సిందేనా?” అంది ఆవిడ.
“సంపాదిస్తున్నాని ఎంత పొగరే నీకు? ఏనాడన్నా జీతం మొత్తం.. ఇంటి మొగాడిని నా చేతిలో పెట్టావా? ఎవడో పరాయి వాడికి ఇస్తున్నట్టు అంతా దాచుకుని చిల్లర విదిలిస్తావా? మిగిలిన సొమ్ముమీ అమ్మకి, అయ్యకి పంపుతున్నావా? ఎన్నాళ్లే.. నీ నాటకాలు? ఏదో ఒక రోజు నాకు కాలం కలిసి వస్తుంది. అప్పుడు నీ పని ...” అతను కేకలు వేశాడు.
ఇద్దరు తిట్టుకుని, అలసి పోయి పందిరి ఉయ్యాలలో పడి నిద్ర పోయారు.
ఉదయాన్నే ఆవిడ నిద్ర లేచి “ఏవండీ ఇంత మంచులో ఇక్కడ పడుకుండి పోయారు. కనీసం దుప్పటి కూడా కప్పుకోలేదు. జలుబు చెయ్యదూ?? లేవండి లేచి ఇంట్లో కి రండి.” అంది.
“అయ్యో నువ్వు నాకోసం ఈ వేళ ఆరుబయట వెతుకుతున్నావా? కాసేపు నిద్ర పోకూడదు. మళ్ళీ పొద్దుటే మొదటి షిఫ్ట్ డ్యూటి కి వెళ్ళాలి కదా? ఇంట్లో బోలెడు పని. పద.. పద నేనూ సాయం చేస్తాను.” అన్నాడు.
**
మెలకువ నిజమా ??? నిద్ర లో మాటలు నిజమా???

Wednesday, 24 January 2018

ఎవరికి చెప్పుకోవాలి?

సాగర్, సవీంద్ర హైదరాబాదు 'బుక్ ఫెస్టివల్' లో తోపుడుబండి stall వద్ద సాయం కోసం వెళ్ళారు.
మూడో రోజు ఉంటున్న లాడ్జి కి వస్తూ ఉంటె.. ఒకావిడ వీది మలుపులో మిద్దె మీద నుంచుని చిన్నగా చెయ్యి ఊపి చిరునవ్వు నవ్వింది.
సవీంద్ర హటాత్తుగా ఆగాడు.
“అన్నా ... నువ్వు వెళ్ళు అన్నా.. నాకు అర్జెంట్ పని ఉంది మా చిన్నాయన అపోలో లో ఉన్నాడు ఒక తూరి చూసోస్తాను. వీలయితే రాత్రికి వస్తాను. లేటయితే పొద్దుటే వస్తాను. “ అన్నాడు.
కళా సాగర్ ఒక్క నిమిషం ఆగి” తమ్ముడూ ఎందుకు చెబుతున్నానో విను.. నువ్వు చెయ్యాలనుకుంటున్న పని కరెక్ట్ కాదు” అన్నాడు.
"అబ్బే లేదన్నా మా చిన్నాయనకి ఆపిలు కాయలు ఇచ్చేసి వస్తాను...."
***
సవీంద్ర ఆవిడ ని కలిసి ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చే సరికి కింద పోర్టికోలో కారు సౌండ్ వచ్చింది.
“మా ఆయనొచ్చాడు.”
సవేంద్ర కి గుండె జారిపోయింది.
ఆవిడే ఒక ఉపాయం చెప్పింది. “ ఇదుగో ఇక్కడ ఉతికిన బట్టలు ఉన్నాయి. వీటిని ఇస్త్రీ చేస్తున్నట్టు నటించు.., దోబీ అని చెబుతాను. అయన నైట్ డ్యూటీ కి వెళ్ళగానే పని చూసుకుని వెళ్ళొచ్చు. “ కల్ల జోడు తీసి అతడి బుగ్గ మీద చిటిక వేసింది.
***
మర్నాడు ఉదయం ఎర్రటి కళ్ళతో రూముకి చేరాడు సవీ ..
‘హే మయ్యింది.?”
బావురుమన్నాడు సవీంద్ర. మొత్తం కధ చెప్పి “రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడు మొగుడు. బట్టలన్నీ శుబ్రంగా ఇస్త్రీ చేసి పెట్టి, ఇప్పుడే బయట పడ్డాను”
“వార్నీ ఇస్త్రీ చేసినందుకే ఇంత పొజా? నిన్న రాత్రి అవన్నీ ఉతికి ఆరేసిన వాడిని నన్ను ఎవరికి చెప్పుకోమంటావు?”
  

Friday, 19 January 2018

కార్డు మీద ఫోటో

నాలుగో రౌండ్ గ్లాసు దించిన తర్వాత అతను గంభీరం గా అయిపోయాడు. 
మాటలు లేకుండా ఎటో చూస్తూ సాలోచనగా తల ఉపాడు. 
“రావు గారి కి సరిపోయినట్లుంది” సాగర్ అన్నాడు. 
రావు ఏమి మాట్లాడలేదు.
“సాగర్ గారూ.. మీకో విషయం చెప్పాలి”
ఏమిటన్నట్లు చూశాడు సాగర్.
“నేను చనిపోయి ఈ రోజు కి నిండా పది.”
సాగర్ చేతిలో గ్లాసు ఆగిపోయింది. కుర్చీ లో వెనక్కి కూర్చుని జోగుతున్న బాగీ అంత మత్తులోను చురుగ్గా చూశాడు.
“రావు గారికి ఎక్కువయింది” మాటలు కూడా దీసుకుంటూ అనుమానంగా సాగర్
రావు గారి పొడవాటి జుట్టు ముఖం ముందుకు వేలాడుతుంది. నోట్లో సిగిరెట్టు పొగ జుట్టు పాయల్లోంచి బయటకి వస్తుంది. కుర్చీలో ముందుకి వంగి ఉన్నాడు.
“సుయొధనా.. రావు గారి కాళ్ళు గమనింపుము” బాగి నవ్వుతూ అన్నాడు.
“కొన్ని చూసినా నమ్మరు. నమ్మేవాటికి ఆధారాలు ఉండవు.” రావు సాలోచనగా చెప్పాడు.
ఇక వెల్ధామా? సాగర్ బిల్లు సెటిల్ చేస్తూ అన్నాడు.
ముగ్గురూ బయటకి నడిచారు.
చీకటి చిక్కగా ఉంది. చలి దాడి మొదలయ్యింది.
ఆటొ ఆపాడు బాగి. “మార్కెట్ సెంటర్ కి వస్తావా?”
“వస్తాను యాబై ఇవ్వండి”
“న్యాయం ఇంకా నడుస్తుంది. ముగ్గురికి యాబై లక్షణంగా ఇవ్వొచ్చు?”
‘ఇద్దరేగా? మూడో అతను ఎక్కడ?”
పక్క నుండి వచ్చి రావు కూడా ఆటో ఎక్కాడు. సాగర్, బాగి ఒక పక్కగా సర్దుకున్నారు.
“చివరికి జరక్కండి. బాలన్స్ ఉండదు. సిమెంట్ రోడ్ల మీద టర్నింగ్ ల వద్ద జారుద్ది”
మార్కెట్ సెంటర్లో దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు.
డ్రస్ మార్చుకుని సాగర్ నిద్ర కి పడక చేరాడు. ఫోన్ మోగింది.
అటునుండి బాగి. “సాగర్ నేను రూముకి వచ్చేసరికి ఒక కార్డు ఉంది. కాటుక పూసి ఉంది. పెద్దకర్మ అని ప్రింట్ అయి ఉంది.”
“ఉంటే.. ?!!”
“కార్డు మీద రావు గారి ఫోటో ఉంది.” 


*****
ఫోన్ కట్ చేయగానే బాగి ఫోన్ మోగింది. అటునుండి రావు గారు,
“మనం అనుకున్నట్లే చెప్పావా?”
“ఊ .. చెప్పాను. ఈ రోజు నిద్ర పోడు. ఖాయం.”
“కొన్నాళ్లు నేను ఫోన్ తియ్యను. కాలర్ టోన్ మంచి దెయ్యం మ్యూజిక్ కి మార్చాను. పెద్దాడి దగ్గరకి వెళ్తున్నాను. రెండు నెలలు ఇక్కడ కనిపించను.”
ఇద్దరు నవ్వుకున్నారు.
“నిన్న కాక మొన్న సిగిరెట్లు మానేసిన కన్నె సామి, నాకు మా ఆవిడ ముందు సలహాలు ఇస్తున్నాడు." రావు తో చెప్పాడు భాగి.

Tuesday, 16 January 2018

కోస

నాలుగేళ్ల తర్వాత సంక్రాంతికి..సామర్లకోట.
కెనడా నుండి హైదరాబాదు.. అక్కడి నుండి రాజమండ్రి..
టాక్సీ లో స్వంతూరు ...
వ న జ.
రెండు జడల సీత. పల్లెటూరి పిల్ల. ఒద్దికయిన పిల్ల. పెద్ద కళ్ళతో అంతే పెద్ద బొట్టు తో తల కదిలించకుండానే చుట్టూ గమనిస్తుండేది. రెండు వీదుల అవతల.. దూరపు వరసకి మేనత్త కూతురు.
తీరా తను కెనడా వెళుతూ అమ్మా, నాన్నవద్ద గడిపిన చివరి వారం లో ..
హటాత్తుగా ‘మేనత్త’ సాయంత్రం తను ఇంట్లో ఉన్నప్పుడు “వనజ’ విషయం చెప్పింది.
అమ్మ “అంతా వాడిష్టం” అంది.
“నేను ఎం‌ఎస్ చెయ్యాలి అత్తా.. ఉద్యోగం లో స్థిరపడాలి. కనీసం నాలుగయిదు ఏళ్ళు పట్టోచ్చు”
“నీ ఇష్టం బాబు ” అందావిడ.
**
ఎం‌ఎస్ చేయటం అక్కడే మంచి ఉద్యోగం లో చేరటం అన్నీ అయ్యాయి.
ఇంటివద్ద ఉన్న అప్పులు తీర్చేశాను.
నాన్న కొంత పొలం కూడా కొన్నారు.
ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ సంక్రాంతికి ఇంటికి వచ్చాను.
ఊరంతా తిరుగుతూ అందరినీ పలకరించాను.
వనజ కనిపించలేదు. అమ్మని అడగాలంటే బెరుకు.
ఈరోజు చింత తోపు లో కోడిపందాలు చూడటానికి వెళ్ళాను.
అక్కడ కనిపించింది.
చీరకట్టులో పెద్దరికం వచ్చింది.
నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు.
పక్కనే ఒక పొడవాటి యువకుడు . అతని బుజాలమీద కూర్చుని ఉన్న చిన్న పాప అచ్చు వనజాలాగా... తండ్రి ఏదో చెబుతుంటే నవ్వుతుంది.
ఆమె కళ్ళకి దొరికాను.
“శేఖరం .. మా ఆయన .. మీ నాన్న కొన్న పొలం కూడా మేమే సేద్యం చేస్తున్నాం.” భర్త ని పరిచయం చేసింది.
“ఓహ్ కెనడా శేఖరమా.. ఈ రోజు మా ఇంటికి భోజనానికి రండి. స్పెషల్ ‘కోస మాంసం’ రుచి చూద్దురు.” అన్నాడతను చెయ్యి కలుపుతూ..
ఆ చెయ్యి దృడంగా .. ఆరోగ్యం గా ఉంది.

Sunday, 14 January 2018

సంక్రాంతి శుభాకాంక్షలు

అప్పుడు:
'బండి మీద ప్రయాణం తగ్గించండి' అని వైద్యులు చెప్పినప్పుడు కారుకి మారాడు.
ఉంటున్న ఇంట్లో కొళాయిలు లు వాస్తు ప్రకారం లేవని, 
ఖాళీ స్తలం లో 'వాస్తు హోమం' చేయించి మరీ ఇల్లు కట్టించాడు.
ఇన్సూరెన్స్ ఏజంటుగా అన్నీ ఎత్తులు చూశాడు.
యడాదికి లక్షల్లో కమిషన్ తీసుకున్నాడు.
**
పరిచయాలని వాడుకున్నాడు. చేతులు నోప్పెట్టేదాకా నోట్లు వ్రాసి ఇచ్చాడు.
అమరావతి లో స్థలం కొన్నాడు. పావలా ఇచ్చి అగ్రిమెంట్ అయ్యాడు.
ఆశించినంత హైక్ రాలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చింది.
ఇల్లు అమ్మాడు. కారు అమ్మాడు. అందిన డబ్బు అందినట్టు మద్యవర్తి సాక్షం గా చేల్లెశాడు.
రిజిస్ట్రేషన్ డబ్బు సమకూర్చుకున్నాడు.
అమ్మకందార్లు ముగ్గురిలో ఒకాయనకి ఇంకో అరగంటలో రిజిస్ట్రేషన్ ఆనంగా హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ ... వైద్యం ... కాలం చెయ్యటం అన్నీ అయిపోయాయి.
ఎప్పుడో వదిలేసిన అతని బార్య వేదిక మీదికి  వచ్చింది. అమ్మకం మీద 'స్టే' తెచ్చింది. ఆస్తి అమ్మటానికి లేదని లాయరు చేత ప్రకటన ఇప్పించింది. రిజిస్టరు గారికి కాపీ పంపింది.
ఇప్పుడు:
సాయంత్రం నాలుగు గంటలు శ్రమిస్తే గాని ఆ ఇల్లు కనుక్కుని చేరుకోలేక పోయాను.
ఔట్ స్కర్ట్స్ లో ఉన్న ఏమాత్రం డెవెలెప్ కానీ లోకాలిటీలో ఉన్న ఒక రేకుల ఇల్లు.
తలుపు మీద చప్పుడు చేయగానే పదేళ్ళ ఒక అమ్మాయి కిటికీలోంచి చూసి లోపలికి వెళ్లింది.
తర్వాత ఆవిడ వచ్చి తలుపు తీసింది.
శుబ్రంగా లేని పట్టు పంచ కట్టుకుని అతను దైవ ప్రార్ధన చేస్తున్నాడు.
“బాగున్నారా?” బయంగానే అడిగిందావిడ.
నేనేమీ మాట్లాడలేదు. చుట్టూ చూస్తూ ఉండిపోయాను.
ఇద్దరు పిల్లలు ఆమె ఏదో బట్టల మీద అద్దకం పనులు చేస్తూ ఉన్నట్టుగా వాతావరణం.
“కాఫీ తాగుతారా?” అని అడిగింది.
ఆమె పలకరింపుగా అడిగిన విషయం అర్ధం అయ్యేలోపు హడావిడిగా అతను పూజ ముగించాడు.
అలానే వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుని “ఈ నెలలో అయిపోతుంది. ఎవరవి వాళ్ళకి ఇచ్చేస్తాను.” అన్నాడు.
అతని చేతికి ఉన్న కుంకుమ నా బట్టలకి అంటుకుంది.
“మానసిక వైద్యశాలలో చూయిస్తున్నాను.” అందామే.. పొడిపొడిగా..
**
చేతి సంచీలో ఉన్న అరిశల పోట్లాం తీసి పిల్లలకి ఇచ్చి,
బయలుదేరుతూ “సంక్రాంతి శుభాకాంక్షలు” అని చెప్పాను.

Thursday, 4 January 2018

New year resolutions

పాత డైరీలు చిత్తుకాగితలకి వేస్తుంటే కోప్పడి ఆపాను ..
తీరిగ్గా ఒక్కోటి తిరగేస్తుంటే..
***
New year resolution #1.
2014 :: ఎలాగయినా సరే ఈ సంవత్సరం 80 కిలోల నుండి 68 కి తగ్గాలి
2015 ::ఈ యాడాది బాడి మిద శ్రద్ధ పెట్టాలి 85 నుండి 75 కి తగ్గాలి.
2016 :: పట్టుదల ఉంటె సాదించలేనిది ఏమి లేదు. 90 నుండి 70 కి వస్తాను.
2017 ::కళా నేను కలిసి నప్పుడు చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోవాలని అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల లోను క్వింటాల్ దాటకూడదు.
New year resolution #2
2014 :: ఇవాళ ఒక కోడిని కోయటం చూసాను. అబ్బ ఎంత హింస?! నాన్ వెజ్ మానేస్తాను.
2015 :: షబ్బీర్ గాడి వద్ద వేట మాసం మంచి క్వాలిటి ఉంటుంది. అయినా సరే ఈ సంవత్సరం మాంసం ముట్టను.
2016 :: చినగంజాం లో పీతలు, బాగా దోరుకుతున్నాయి. ఆకు పచ్చగా ఉండేవి గుడ్ల సేరు తొ చాలా రుచి గా ఉంటున్నాయి. చికెన్, మటన్ మానేస్తాను. పీతలు రొయ్యలు ఎప్పుడన్నా.. పండక్కి పబ్బానికి తప్పులేదు.
2017 :: వారం లో నాలుగు రోజులు నాన్ వెజ్ తినకూడదు. అసలు ఆపేస్తాను. ఈ రోజు గెస్ట్ లు వస్తున్నారు కనుక తప్పదు .. ఈ రోజు తొ స్టాప్, అంతే స్టాప్ అంటే stop.
New year resolution #3
2014 :: చిన్న చిన్న చేబదుళ్ళు మానేయాలి.
2015 :: బ్యాంకు కి emi లు బాకీ పడ్డంత బుద్ది తక్కువ మరొకటి లేదు. ఈ ఏడాది అన్ని emi లో క్లోజ్.
2016 :: ముష్టి మూడు లక్షల అప్పుకి బజార్లో అడుగుతాడా వాడు. ఛి . వాడి మోహన కొట్టెస్తాను. బ్యాంకు వాళ్ళ నస ఎక్కువయింది. ఫోన్ తీస్తే ఒక చావు. తియ్యకుంటే మరోటి.
2017 :: ఎక్కడికయినా పారిపోతామా ఏమిటి?. లక్ష ఇచ్చినోడు కుడా అడగటమే? పది ఇచ్చినోళ్ళకి ఇంతవరకు గతి లేదు. అప్పులన్నీ లాగించేస్తాను.
New year resolution #4
2014 :: ఇదే చివరి పెగ్గు. ఇక ఈ యాడాది ముట్టితే ఒట్టు.
2015 :: వారానికి ఒక రోజు 90 పర్లేదంట. మొన్ననే ఒక డాక్టర్ చెప్పాడు. అయినా మందు మంచిది కాదు. ఆపేస్తాను.
2016 :: అబ్బే రోజు తాగటం మానేస్తాను. చంద్రబాబు మీద ఒట్టు. అంతే
2017 :: అషలు తాగితే తప్పెంటష?? నేనేమన్నా రోజంతా అదే పని మీద ఉన్నానా?? శేప్పు ??
New year resolution #5
2014 :: అబ్బే కనకం తొ మాట్లాడేదే లేదు. చ చ పరాయి .. ఎక్కడో ఫోన్ నెంబరు వ్రాసిన కాగితం ఉండాలి. దొరగ్గాన్నే చింపెస్తాను.
2015 :: కనకం .. పాపం నామీద బెంగ పెట్టుకుంది. అయినా ఏమడిగింది? ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పలకరించమనేగా? ఎదో బాధల్లో ఉన్న మనిషి.
2016 :: అబ్బే కనకానికి నాకు కుదరదు. మరీ నెత్తి కి ఎక్కుతుంది. అయినా పక్కింటి పుల్లకూర తొ అసలు మనకేం పని? తనకి నాకు కటిఫ్.
2017 :: అబ్బే విశ్వాసం లేని మనిషి. నెలకి ఎంత ఖర్చు పెడుతున్నాను? ఎదో ఇబ్బందుల్లో ఉండి తనడిగిన నక్లెస్ కొనివ్వలేక పోయాననుకో .. అంతమాత్రాన .. ఛ ఛ ..
***
ఇదిగో నిన్నే.. ఈ అట్ట పెట్టెలో పాత డైరీలు ఉన్నాయి గాని బోగిమంట కి వాడు.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...