Friday, 7 August 2015

నిండిన కాఫీ లోటా


ఇనమనమెళ్ళూరు (నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా , AP)
నాకు గుర్తున్న బాల్యం, ఎక్కువ భాగం  ఇక్కడే గడిచింది. నేను ఈ ఊర్లో నే పుట్టానట .
జామ తోటలు లో తిరగటం, దోర కాయలు కోసుకు తినటం , గుండ్లకమ్మ వాగులో తమ్ముడితో షికార్లు , సరదాలు .. అన్ని ఇక్కడే !!
దేవరపల్లి కోటిరెడ్డి (బంగారు రెడ్డి కోటిరెడ్డి ) అని ఒక ఆజాను బహుడు ఉండేవారు. ఆయన ధర్మపత్ని అనసూర్యమ్మ .
వారి కుమార్తెలు అంజమ్మ, సుగుణ, రమాదేవి, సౌజన్య (చిన్నమ్మాయి) , కొడుకు కోసం ఇంకా ఎదురు చూస్తున్న రోజులు , (1967 ప్రాంతం)
ఆయన పెద్ద మోతుబరి రైతు. పెద్ద వ్యవసాయం. నలుగురు పాలేర్లు, ఇరవై సెంట్ల లో కట్టిన పెద్ద సీమ పెంకు ఇల్లు. ఒక మూల దిబ్బ, ప్రహరి గోడ మీద నుండి వాలిన సపారం అందులో టైరు బండ్లు, గోడ అంచుకు గాడి. గాడి ముందు ఎద్దులు, బర్రెలు .. పెద్ద సంస్థానం. ముఖ్యంగా కోటిరెడ్డి గారి తల్లి (నాయినమ్మ) దొడ్లో చుట్టిల్లు వద్ద , రింగుల జుట్టు, భారి శరీరం తో  నాలుగు కాళ్ళ పీట మీద కూర్చుని , కేక వేస్తే బజార్న పోయే వారి వళ్ళు జలదరించాల్సిందే ..అంత గొంతు .. పాలేర్లకి ఆమె పనులు పురమాయిస్తుండేది.
అలాటి సితారావమ్మ పెద్దమ్మ కి మా అమ్మ అంజమ్మ కి మంచి స్నేహం. మా నాన్న గారు ఆ వూరు లో ఎలిమెంటరి స్కూల్ టీచరు గా పని చేస్తుండేవారు . మా కుటుంబం వారి కుటుంబం దగ్గరలోని చిన్న ఇంట్లో ఉండేది .
మా అమ్మ వారి ఇంటి వసారా లో కుట్టు మిషను పెట్టుకుని , బట్టలు కుడుతుండేది. రైతువారి పనులకి వెళ్తుండేది. తన కష్టం తో ఇల్లు గడిపి మా నాన్న గారి నెల  జీతం ( పాత పంతుళ్ళ పొట్టి  జీతాలు ) పొదుపు చేస్తుండేది. నేను అక్కా ఇద్దరిమే పిల్లలం . అక్క నాలుగేళ్ళు పెద్దది నాన్న తో పాటు స్కూల్ కి వెళ్తూ ఉండేది. నేను అమ్మతో పాటు ఉండేవాడిని .
 కుట్టు మిషను వద్ద మిగిలిన రంగు రంగుల  బట్టలతో రక రకాల డ్రెస్సులు కుట్టి నాకు తొడుగు తుండేది అమ్మ. నేను లావుగా నల్లగా, ఇల్లంతా దోగాడుతూ ఉండేవాడిని. మా పెద్దమ్మ గాని  పెదనాన్న గాని (కోటిరెడ్డి, అనసూర్యమ్మ దంపతులు), మా అక్కలు గాని నన్ను ముద్దు చేయకుండా ఉండే వాళ్ళు కాదు. మా పెద్దమ్మ అప్పట్లో నిండు మనిషి . మా అక్క లందరూ నన్ను చంక దించ కుండా తిప్పుతుండేవాళ్ళు , లోటాలో (పెద్ద గ్లాసు) జొన్నలు తీసుకెళ్ళి అంగడి లో పోసి , బిస్కెట్లు కొని నాకు పెడుతుండేవారు .ఇంటి ముందు బజార్లో సైకిలు మిద తినుబండారాలు అమ్మే  వాళ్ళవరయినా సరే  ఆగకుండా వెళ్ళటానికి లేదు
చక్కెర చిలకలు , నువ్వు జీడీలు, పీచుమిఠాయి ఏవయినా సరే కోటిరెడ్డి గారి ఇంట్లోంచి అమ్మాయిలు గింజలు పోయ్యాల్సిందే .. అవి నా నోట్లోకి చేరాల్సిందే .
తర్వాత కాలంలో తమ్ముడు పుట్టాడు . వాడి పేరు శ్రీనివాస రెడ్డి (ప్రస్తుతం హైదరాబాదు, అమీర్ పేట లో విమెన్ హాస్టల్ నడుపుతున్నాడు)
వాడు ఉయ్యాలలో ఉన్నప్పుడు గాని, కొంచెం పెరిగి దోగాడే టప్పుడు గాని ఆ ఇంట్లో మా ఇద్దరకి మధ్య వ్యత్యాసం చూపినట్లు ససేమిరా నాకు గుర్తు లేదు . అందరు అక్కల మద్య మేమిద్దరం అల్లారు ముద్దుగా పెరిగాం .
దొడ్లో వంట కోసం ఒక చుట్టిల్లు (circular planned kitchen ) ఉండేది దాని పక్క నుండే బయట కి వెళ్ళటానికి దోవ ఉండేది. ఆ నడవాలో పిల్లలందరం కుర్చుని వరసగా పళ్ళాలలో జొన్న సంకటి , సాంబారు కారం/పప్పు చారు , కరిగించిన నెయ్యి గురుగు లో వేసుకుని తింటుడే వాళ్ళం. మా నాయినమ్మ అక్కడే పీట మీద కుర్చుని ఉండేది. మీగడ పెరుగు తో పెట్టిన సంకటి శుబ్రంగా తినే దాకా వదిలేది కాదు .
ఒక సారి మా ఇల్లంతా హడావిడిగా ఉంది . మా అంజమ్మ అక్క కి ఏదో చేస్తున్నారు.. మాతో కలవ కుండా పడమటి గదిలో ఒక చాప మీద కూర్చో బెట్టారు. మమ్మల్ని ఎవర్ని దగ్గరకి రానివ్వట్లేదు. అక్క కుడా బయటకి రాట ల్లేదు.
నేను, తమ్ముడూ సాహసించి లోపలికి దూరినా మా చొక్కాలు , నిక్కర్లు విప్పి పంపుతున్నారు.. ఎదో జరుగుతుంది. చాలా మంది బందువులు వస్తున్నారు. పడమటి గది లోకి వెళ్లి అక్క తో మాట్లాడి వెళ్తున్నారు. ఏవేవో వంటలు చేసి తెస్తున్నారు . అక్క తింటుందో లేదో కాని మేమంతా తింటున్నాం .
ఒక రోజు మమ్మల్ని అందరినీ  నడవాలో వరసగా  కూర్చోబెట్టి   లోటాలలో  కాఫీ పోసి తాగమని ఇచ్చింది మా నాయినమ్మ. ఆమె కేక కి జ్వరం వచ్చే ప్రమాదం ఉంది కనుక బుద్దిగా అందరం కూర్చున్నాం. ముందు రమక్క ఒక పుస్తకం తెచ్చి కాఫీ లోటాని విసర సాగింది. “ఎందు కక్కా పుస్తకం ఊపు తున్నావు ?”
“కాఫీ వేడి గా ఉన్నాయిరా. విసిరితే చల్ల బడతాయి.. నోరు కాల కుండా  తాగొచ్చు” రమక్క చెప్పింది .
దానికి తెలివి ఎక్కువ. అందుకే తలలో పేలు కుడా ఎక్కువే. ఎప్పుడు చక్క దువ్వేన తో జుట్టు  పీక్కుంటా ఉండేది .
క్షణాల్లో మా అందరం తలో పుస్తకం , వంటింట్లో మూతలు తో రెడి . అందరం లోటా  మిద కి గాలి విసురుతున్నాం ..
సరిగ్గా అప్పుడు నా లోటా కి విసురుతున్న మూత తగిలి  దొర్లి పోయింది.  నేను బిక్క ముఖం వేసాను . దొర్లిన వేడీ కాఫీ వంటికి తగిలి కాల  కుండా సుగుణక్క  నన్ను  వెంటనే లేపి నిల బెట్టింది.
చిన్న గుడ్డతో  పట్టుకుని తన వేడి   గ్లాసు లోంచి కాఫీ ని కొంచెం నా గ్లాసు లోకి వంచింది, రమక్క , సౌజన్య , లక్ష్మి (మా అక్క ) తలా కొంచెం కాఫీ వంచారు . వారందరి ప్రేమ తో నా గ్లాసు నిండింది .
****


నాలుగేళ్ల క్రితం ఒక వేడుక లోఅందరం కలిసాం మొదటి  ఫోటోలో మా తమ్ముడు దేవరపల్లి శ్రీనివాస రెడ్డి తో నేను. మా అబ్బాయికి నేను దోగాడిన ఆ స్వర్గం  చూయించాను (చుట్టింటి వాకిట్లో నిలబడింది మా అబ్బాయి సాయి చందు) రెండో ఫోటో లో.  

No comments: