Sunday, 27 January 2019

వంద


"జేబులో వంద కాగితం నువ్వు తీసావా?" మద్య గది లోనుండి కేక వేసాడు నరసింహం.
“లేదే.. ఎక్కడయినా పెట్టి మర్చి పోయారేమో చూసారా?”
“అంతా వెతికాను. నెలాఖరు లో మిగిలిన వంద నోటు. సీరియల్ నెంబరు చివర్లో మన కాల్ గ్యాస్ నెంబరు ఉంది. అంత జ్ఞాపకం ఆఫీసు నుండి వచ్చినప్పటి నుండి వెతుకుతున్నాను. చొక్కా ఎప్పటిలాగే కొక్కానికి తగిలించి ఉంది. ఉదయం మన ఇంటికి ఎవరయినా వచ్చారా?”
సుజాత రెండు నిమిషాలు అలోచించి “లేదే.. ఎవరూ రాలేదు. ఎక్కడో జాగర్త గా దాచి ఉంటారు.
జాగర్త చేసినవి అవసరానికి కనిపించక పోవటం మధ్య తరగతి ఇళ్ళ లో కామన్” అంది లైట్ చేస్తూ..
“సీను గాడు ఏడి ?” నరసింహం అడిగాడు.
“ఫ్రెండ్స్ తో ఆటలకి వెళ్ళాడు. ఈ రోజే సెవెంత్ ప్రీ ఫైనల్స్ అయ్యాయిట. కాసేపు క్రికెట్ అడుకుంటానని గ్రౌండ్ కి వెళ్ళాడు.”
“కొంపతీసి పిల్లాడి మీద అనుమానమా ఏమిటి?” అంది కప్పు లో వేడిచేసిన కాఫీ ఇస్తూ..
నరసింహం కప్పు అందుకుని “ఏం ఎందుకు కాకూడదు?”
“ఈ మధ్య సోకులు, షికార్లు ఎక్కువయ్యాయి అయ్యగారికి” అంటూ పిల్లాడి పుస్తకాల ఆరమార వెతక సాగాడు.
నీటుగా సర్దిన పుస్తకాల వెనుక కలర్ పెన్నులు, స్టెన్సిల్ స్కేల్లు, గం స్టిక్, బాల్ పెన్నులు .. ఒక్కొక్కటి తీసి వెనక వెతక సాగాడు. సుజాత నరసింహం ని భయంగా చూసింది. అతడి మొహం లో కోపమే కాకుండా మరేదో భావం ఉంది.
సుజాత ఉతకాల్సిన బట్టల జేబులు వెతకసాగింది.
తర్వాత కొడుకు స్కూల్ బాగ్ వెతుకుతుంటే ఒక వుడ్ క్రాఫ్ట్ గిఫ్ట్ పాక్ కనిపించింది.
కాగితం లో చూపిన విధంగా చక్క ముక్కలని వేరు చేసి వరస క్రమం లో అమర్చితే ఒక బొమ్మ టేబుల్, మరో నాలుగు బొమ్మ కుర్చీలు తయారవుతాయి. ఇంకా సీల్ తియ్యని వస్తువది.
నరసింహం దాన్ని రెండువైపులా చూసాడు. price Rs 98/- అని ఉంది. బార్యని కేక వేసి దానిని చూపుతూ “ఇదేక్కడిది?” అని అడిగాడు.
సమాదానం గా ఆవిడ తెలియదన్నట్లు తల ఊపింది.
***
గ్రౌండ్ నుండి రాగానే 'సీను' స్నానం చేసి తల్లి పెట్టిన చక్రాలు తింటూ ఇంట్లో పరిస్థితి తేడా గా ఉండటం గమనించాడు.
ఈ లోగా తండ్రి పిలిచాడు. ఏ ఉపోద్ఘాతమూ లేకుండా “నా జేబులో నుండి వంద కాగితం తీసావా?” అన్నాడు.
“లేదు నాన్నా? వంద పోయిందా?” అన్నాడు కొడుకు.
ఆ ప్రశ్న లో అనుమానం ఉంది.
“నటించకు.. నువ్వు తీసావు” అన్నాడు తండ్రి.
సీను బిగుసుకు పోయాడు. “లేదు నాన్నా నాయినమ్మ మీద ఒట్టు” అన్నాడు.
నరసింహం కి కోపం కట్టలు తెంచుకుంది. పిల్లాడిని వంగ బెట్టి దభీ దభీ మని రెండు గుద్దాడు.
సీను నొప్పి భరిస్తూ బేలగా నిలుచుండి పోయాడు.
నరసింహం కి కోపంగా ఉంది. అది డబ్బు పోయినందుకు కాదు. పిల్లాడు అబద్దం చెబుతున్నందుకు.
సుజాత గడప దగ్గర నిలబడి పిల్లాడిని అనునయిస్తూ “ డబ్బు తీస్తే నాన్నకి చెప్పరా.. తప్పు అయింది నాన్నా ఇంకెప్పుడూ చెయ్యనని ప్రామిస్ చెయ్యి” అంది.
సీను స్థిరంగా “నేను తియ్యందే” అన్నాడు.
నరసింహం చేతికి అందిన కర్ర తీసుకుని పిల్లాడి మీద విరుచుకు పడ్డాడు. తల్లి అడ్డొచ్చింది. “చంపేస్తావా ఏంటి పిల్లాడిని. ముష్టి వంద కోసం “
నరసింహం పులి అయిపోయాడు.
“ముష్టి వందా? సంపాదిస్తే తెలుస్తుందే.. వంద విలువ. దొంగల ముఠా కి ఎంత చెప్పినా దాని విలువ తెలీదు” అంటూ చొక్కా వేసుకుని విసురుగా బయటకి వెళ్లి పోయాడు.
***
అతను తిరిగి ఇంటికి వచ్చే సరికి చీకటి పడింది. వరండా లో పిల్లాడు చదువు కుంటూ ఉన్నాడు.
సుజాత ముభావంగా ఉంది.
“పిల్లాడు అబద్ధం ఆడటం నేను తట్టుకోలేక పోతున్నాను.”మెల్లగా చెప్పాడు.
“నేనూ అడిగి చూసాను. అదే మాట మీద ఉన్నాడు. అది స్కూల్ వ్యాసరచన పోటీ లో ఇచ్చిన బహుమతి అంట. అత్తయ్య ఊరినుండి రాగానే .. వాళ్ళ నాయినమ్మ కి ఫస్ట్ చూపించాలని అనుకున్నాడట. “
నరసింహం భోజనం వద్ద కూర్చుని పిల్లాడిని పిలిచాడు. అతడి గొంతు లో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది.
తండ్రి బాధ ని కొడుకు గమనించాడు. “అరేయ్ సీను నిజం చెప్పరా? డబ్బు ఏం చేసావు అని నేను అడగను. నాకు అన్నం కూడా సయించడం లేదు.”
సీను కొద్ది సేపు మౌనం గా ఉండి పోయాడు.
తండ్రి గొంతులో బాధ వాడిని నులిమి వేసింది.
“నేనే తీశాను నాన్నా” అన్నాడు తలవంచుకుని.
***
మర్నాటి మధ్యానం సుజాత బక్కెట్లో బట్టలు నానబెడుతున్నాప్పుడు నరసింహం పొడుగు చేతుల చొక్కా చేతి మడత లో వంద కాగితం కనిపించింది. చివరి అంకెలు కాల్ గాస్ సీరియల్ నెంబరు వి.

Tuesday, 1 January 2019

O A H


సి పి ఓ గారి వీధి ఈ రోజు నిండుగా ఉంది. వచ్చే పోయే కార్లు, బండ్లు, దండలు,బొకేలు, కేకులు, యాపిల్స్, గ్రీటింగులు, పొద్దుటే ఏడుకి మొదలయిన సందడి, పదకొండుకి పలచబడింది.
జిల్లా అధికారి ని విష్ చేయటం కోసం దూర ప్రాంతాల నుండి, తెల్లవాలుఝామునే బయలు దేరి వచ్చిన డిపార్ట్మెంట్ ఉద్యోగుల సందడి. అంతటా పండగ వాతావరణం.
పదకొండు తర్వాత అయన, జిల్లా కలెక్టర్ ని కలవటానికి వెళ్ళాక కొంత సద్దుమణిగింది.
CPO గారి భార్య అపర్ణ కి చేతినిండా పని పడింది.
అసలు మొగుళ్ళ హోదా ప్రదర్శించు కోటానికి ఇదొక వేదిక.
చుట్టూ పక్కల ఇండ్ల వారందరికి, బొకేలు, తక్కువ రకం స్వీట్స్ పాకెట్లు, కేకు ముక్కలు సర్ది పంపింది.
పూల దండలు కొన్ని గుమ్మాలకి కట్టించింది. ఆయన కారుకి, ఇంట్లో వాహనాలకి అలంకరించింది.
కేకులు, యాపిల్స్ రెఫ్రిజిరేటర్ లో ఓపిగ్గా సర్దింది. స్వీటు పాకెట్లు, డైరీలు, మెమెంటో లు అన్నీ అరమారాల్లో సర్ది, పని మనిషి చేత ఇల్లు శుభ్రం చేయించే సరికి సాయంత్రం అయింది.
మధ్యాహ్నం వెళ్ళిన మనిషి ఎనిమిది దాటాక గాని ఇంటికి రాలేదు.
కలెక్టర్ ని అటునుండి అటు MLA లని, మినిస్టర్స్ ని కలిసి శుభాకాంక్షలు చెప్పి .. వచ్చేసరికి .
వస్తూనే ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుండి పోయాడు.
“టిఫిన్ ఏమయినా చెయ్యనా?” అంది అపర్ణ.
“వద్దు .. ఈ రోజు నానా చెత్త తిన్నాను. ఈ పూట ఏమీ తినను.”
“కిరణ్ ఫోన్ చేసాడా?”
“ఉదయం మనం హడావిడిలో ఉన్నప్పుడు చేసాడు. కాలేజ్ వాళ్ళు ఎక్కడికో తీసుకు వెళ్తున్నారు అని చెప్పాడు. ఈ గోల లో సరిగా వినబడలేదు. నేను జాగర్త అని చెప్పాను.”
“ఇప్పుడు ఫోన్ చెయ్యి.” అపర్ణ కి చెప్పాడు.
ఆమె ఫోన్ కలిపి స్పీకర్ ఆన్ లో ఉంచి టీపాయ్ మీద ఉంచింది.
“హలో .. కిరణ్ “
“హ .. డాడీ.. ఇప్పుడే వచ్చారా?”
“అవును .. ఎక్కడికో వెళ్తాను అన్నావట మమ్మీ తో “
“అదా మా కాలేజ్ వాళ్ళు కొత్త సంవత్సర వేడుకలు ఓల్డ్ ఏజ్ హోం లో చేద్దామని ప్లాన్ చేసారు.”
“బెజవాడ లో నేనా?”
“అవును డాడీ .. ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరం మా కాలేజ్ నుండి”
“అక్కడ వారికి పంచడానికి దుప్పట్లు, యాపిల్స్, బ్రెడ్స్, కొన్ని టాబ్లెట్స్ తీసుకెళ్ళాం”
“మంచిది.” శ్రధగా వింటున్న అపర్ణ ని గమనించాడు ఆతను.
ఆమె అసహనంగా కదిలింది.
“ఓల్డ్ ఏజ్ హోం (OAH) బాగుంది డాడీ. బాగా ఖాళీస్థలం ఉంది పెద్ద చెట్లు, మద్యలో బెంచీలు, పెద్ద హాలు, కలర్ టివి, ప్రతి గదికి ఒక కిటికీ, వాష్ బేసిన్, సీలింగ్ ఫ్యాను , గ్రాండ్ పా ఉన్న OAH కన్నా బాగుంది.”
బార్యా భర్తలు ఇద్దరూ ఒకరి నొకరు చూసు కున్నారు. మౌనం వాళ్ళని చుట్టేసింది.
“డాడీ... “
“ఊ “
“ఇక్కడ ఏసీ గదులు కూడా ఉన్నాయి. నార్త్ వెస్ట్ లో అటాచ్డ్ ఉన్న రూము ఒకటి చూసాను. చాలా బాగుంది. కిటికీల లో నుండి చూస్తే కాయ కూరల చెట్లు, బంతి పూల చెట్లు కనిపిస్తున్నాయి. మంచి గాలి, వెలుతురూ... మమ్మీకి ఈ గది బాగా...... “
గబాల్న వచ్చిన అపర్ణ ఫోన్ కట్ చేసింది.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...