Wednesday, 14 November 2018

మా తాతకి ఏమీ తెలియదు

మా తాతకి ఏమీ తెలియదని నా ఒక్కడికే స్వయంగా తెలుసు.
రాత్రంగా అమ్మని నిద్రపోనీకుండా ఆట్లాడుకుని ఎప్పుడో తెల్లవారు ఝామున ఒక చిన్న కునుకు తీస్తామా, సరిగా అప్పుడే నాకు తెలీకుండా తాత బయటకి వెళ్ళిపోతాడు సోకు చేసుకుని, అసలు నా పౌడర్ పూసుకుంటున్నాడని నాకు గొప్ప డౌటనుమానం.
నేను నిద్ర లేచేసరికి దొంగలాగా ఇంట్లో కి వచ్చేస్తాడు.
గుడి దగ్గర కుళాయి నీళ్ళు తో చొక్కా తడుపుకునేలా ఉంది. అసలు నాకు తెలీక అడుగుతాను అంత పోద్దుటే బజార్లో ఏం పని?. అమ్మమ్మలకి షోకు గా కనబడాలని తప్పితే..
వస్తాడా? వచ్చి నన్నుఎత్తుకుని తీసుకుని వెళ్లి కారెక్కు అంటాడు. అప్పటికే మనకి బోలెడు సమస్యలు ఉంటాయి.
వాటి సంగతి చూడడు. కారు మీద ఎర్రటి వేపకాయ ఒకటి ఉంటుంది. పక్కనే కాకుల ఇస్సూ ఉంటుంది. రెండూ ముట్టుకోనివ్వడు.
డోరు తీసి సీట్లో కూర్చోబెట్టి దౌర్జన్యంగా సీటు బెల్టు పెడతాడు. సీటుకి ఒక చిన్న బెజ్జం ఉంటుంది. అందులో వేలు పెడితే పట్టదు. అదేం పట్టించుకోకుండా కారు నడుపుతాడు.
కారేమయినా బావుంటుందా? అదీ ముసల్డే.. చుట్టూ బెజ్జాలే చల్లటి గాలి లీక్ అవుతూ ఉంటుంది.
రోడ్డు మీదికి వెళ్ళగానే గుంపులుగా బర్రెలు అడ్డు వస్తాయి.
తాత కారు ఆపుతాడు. నల్లగా బలే ఉంటాయి. నన్ను దించి వాటి మీద ఎక్కించాలి కదా? అది తెలీదు. ఎప్పుడు నేర్చుకుంటాడో .
అలా వెళ్లి కూరగాయల షాపు కి తీసుకెళ్ళి ఆపుతాడు.
మనవడి ని తీసుకెళ్ళాల్సిన చోటా ఇది? ఏమీ తెలియదు.
సరే తీసుకెళ్ళాడు పో.. ఏమీ ముట్టుకోనివ్వడు.
దొండకాయ ఒకటి తుడిచి ఇస్తాడు. లేదా నోట్లో పట్టని దోసకాయ ఇస్తాడు.
పక్కనే చిన్న చిన్నవి నావేలంత సైజువి ఉంటాయి. అవి కావాలని చూపిస్తాను.
“వద్దమ్మా.. కాం..వద్దు..” అని రొప్పుతాడు. ఏం కాం ఉండదు. మనదగ్గర ఆల్రేడి ఒకటి ఉంది. అమ్మ నిక్కరు వెయ్యనప్పుడు చూసాను.
అక్కడ నుండి నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. సెల్ లో అలారం మోగుతుంది. ఇంక హడావిడి మొదలెడతాడు.
అమ్మమ్మని కేకలు వేస్తాడు. బాగు సర్డుతాడు.
సర్లే మాస్టారూ ఇవన్నీ రోజు ఉండేవే గాని అదిగో ఆ ఎర్రటి బంతి ఉంది చూడు.. అది తెస్తావా, లేదా?
తేలేదో నీకేం తెలియనట్టే... అంతే.. ఊరికే సుత్తి Good Morning లు మీ ఫ్రెండ్స్ కి చెప్పు నాక్కాదు..
.... లోహిత్ రుద్రాంషు (మా మనమడు.. మా పెద్దమ్మాయి బిడ్డ)

Wednesday, 7 November 2018

శ్యామలాంబ


“మా అమ్మ చేతి పలావ్ తినటానికి పెట్టి పుట్టాలి” అంది. శామలాంబ మూడో కూతురు బెంగుళూరు లో హార్మోని పెట్టె (software) పని చేసే భర్త తో.. 
సముద్రం రొయ్యలు గోంగూర కూర తిని ఎన్నాలయిందో.. పెద్దల్లుడు అత్తగారు వినేట్టుగానే కోమలి తో అన్నాడు. 
మనమడిని, మనమరాళ్ళని బజారంతా తిప్పి వాకింగ్ కి కూడా వచ్చే మిత్రులందరికి పరిచయం చేసి అప్పుడే ఇంట్లోకి వస్తున్న పరంధామయ్య కి ఎదురొచ్చి చేతి సంచీ,,, కొంగున ముడి వేసుకున్న డబ్బులు చేతిలో పెట్టింది. న్యూస్ పేపర్ చించి దాని మీద పెన్సిల్ తో వ్రాసిన లిస్టు కూడా చేతికిచ్చింది. “అర్జంటుగా అటో కి వెళ్లి అన్నీ తీసుకుని ఆటోకి వచ్చేయండి. లోబించకండి. నడిచి వస్తే.. బోజనానికి అందవు.” అంది. 
కళ్ళజోడు లోనుండి పెన్సిల్ రాతలని ఒక్క సారి చూసి “ఇవన్నీ ఇవాల్టికేనా?” అడిగాడు. 
శామలాంబ కోపంగా చూడబోయింది కానీ... తమాయించు కుంది. 
తీరా ఆయన సంచీ తో బజారు మూల తిరగాగానే..”అయ్యో ఒక్క చుక్క కాఫీ నీళ్ళయినా ఇచ్చాను కాదు.” అనుకోని బాధపడింది. 
దసరా పండక్కి రావటం వీలుపడని పిల్లలు అందరూ కూడబలుక్కుని, దీపావళి కి ప్లాన్ చేసుకున్నారని తెలిసి, శ్యామల, పరంధామయ్య సంతోషం సంతోషం కాదు. రెండో అమ్మాయి వాళ్ళు హైటెక్ సిటీ దగ్గర అపార్ట్ మెంట్ కొనేటప్పుడు ఆర్ధిక సాయం చెయ్య లేదని రెండో అల్లుడు మనసు కొరవ పెట్టుకుని ఉన్నాడు. 
దైవానుగ్రహం ముగ్గురు కూతుర్లు, అల్లుళ్ళు, ఇద్దరు మనవళ్ళు , ముగ్గురు మనమరాళ్ళు... అందరూ అత్తగారి ఇంట్లో పోగవటం అంటే మాటలా?? పండగకి అందం వచ్చినట్లు కదూ...
శ్యామలాంబ హడావిడి వారం నుండే మొదలయ్యింది. చేతికి ఉన్న రెండు గాజుల్లో ఒకటి పరంధామయ్య కి ఇచ్చి, తెలిసిన వాళ్ళ వద్ద హామీ ఉంచి ఒక పాతిక వేలు తీసుకురండి. అంది. 
“పాతిక వేలా?..నా దగ్గర ఒక పది పన్నెండు వేలు ఉన్నాయి. ఓహో.. అవి కాకనేనా? నీ గాజులు తీయోద్దులేవే... మా వెంకటేశం గాడిని అప్పడుగుతాను” అని చెప్పాడు గాని మర్నాడు శ్యామలాంబ రెండు గాజులు స్థానబ్రంశం చెందితే గాని పాతిక వేలు పుట్టలేదు. 
కుతుర్లకి, అల్లుళ్ళకి, మనవళ్ళకి, మనమరాల్లకి కావాల్సిన బట్టలు వాళ్ళని ఫోన్ లో సంప్రదిస్తూ క్లాత్ మార్కెట్ అంటా హడావిడి చేసి కొనింది. కూతుర్లకి జాకెట్లు వాళ్ళ అభీష్టం మేరకు కుట్టించింది. 
వెన్నపూస వేసి కారప్పూస వత్తింది. బియ్యపు పిండి పరంధామయ్య చేత కొట్టించి చక్కలు చేసి పెట్టింది. రెండు మానికల నెయ్యి తెప్పించి, నువ్వుల ఉండలు చేసింది. ఇది పెద్దమ్మాయి కి, ఈ డబ్బాలు రెండో దానికి, ఈ స్టీలు డబ్బాలో మూడో పిల్లకి, అంటూ అన్ని సర్ది పెట్టింది. 
వారం నుండి బొంగరం లాగా పని చేస్తూనే ఉంది. పరంధామయ్య ని నిమిషం కూర్చో నివ్వలేదు. తను కూర్చో లేదు. 
ముందు రోజు నరక చతుర్దశి. 
అనుకున్నట్లు గానే పిల్లలందరూ వచ్చేశారు. చిన్నల్లుడు, అమ్మాయి ట్రైన్ కి మిగలిన వాళ్ళు బస్ కి వచ్చేశారు. వచ్చీ రాగానే బాయిలర్ పొయ్యి వెలిగించి కుంకుళ్ళు కొట్టి పిల్లలందరికీ తల స్నానం చేయించింది. శ్యామలాంబ... పులగం వండి నేటి గారెలు చేసింది. నాటు కోళ్ళు కోయించి కూర చేసి పెట్టింది. సాయంత్రం తాత తో కలిసి పిల్లలు దీపావళి మతాబులు కొనటం పూర్తి అయింది. 
***
“మా అమ్మ చేతి పలావ్ తినటానికి పెట్టి పుట్టాలి” అంది. శామలాంబ మూడో కూతురు బెంగుళూరు లో హార్మోని పెట్టె (software) పని చేసే భర్త తో.. 
సముద్రం రొయ్యలు గోంగూర కూర తిని ఎన్నాలయిందో.. పెద్దల్లుడు అత్తగారు వినేట్టుగానే కోమలి తో అన్నాడు. 
***
మద్యానం బోజనాలప్ప్పుడు అల్లుళ్ళు ముగ్గురికి పోటీ పడింది. వండిన పలావు, గారెలు, మెతుకు కూడా వదలకుండా తినెయ్యాలని, చిన్న పిల్లలు ఉత్యాహపరుస్తుంటే.. కూతుర్లు కొసరి కొసరి వడ్డిస్తుంటే... ముగ్గురూ పందెం లో విజేతలు అయ్యారు. 
సాయంత్రం పకోడీలు, ఉల్లి బజ్జీలు పలహారం పూర్తి అయ్యాక.. 
ఒక్కొక్కరూ తిరుగు ప్రయాణానికి సర్దటం మొదలయ్యింది. 
పిల్లలకి తినుబండారాలు డబ్బాలు.. బట్టలు అన్నీ సర్దుకోవటం పూర్తి అయింది.
పండగ సంబరం అంతా చేత్తో తీసేసినట్లు దూరం అవుతుండటం తో శ్యామలాంబ మొఖం మీద మళ్ళీ దిగులు మొదలయ్యింది. 
పెద్దమ్మాయి కుటుంబం, రెండో అమ్మాయి కుటుంబం రాత్రి తొమ్మిది కే బస్టాండ్ కి అటో లో వెళ్లి పోయారు.
పదిన్నరప్పుడు చిన్నమ్మాయి, చిన్నల్లుడు, చంటి దాన్ని తీసుకుని రైల్యే స్టేషన్ కి సెండ్ ఆఫ్ కి వెళ్ళారు శ్యామలాంబ, పరంధామయ్య లు..
ట్రైన్ అరగంట లేటు గా వచ్చింది. జాగర్త లు చెప్పి పిల్లలని ఎక్కించి ఇంటికొచ్చేసరికి పదకొండున్నర దాటింది. 
“నాకు తృప్తిగా ఉందండీ..” అంది శ్యామలాంబ భర్త తో..
పరంధామయ్య చేతి సంచీ లో నుండి ఒక పొట్లం తీసి “ ఈ రెండు ఇడ్లీ తిని కాసిని మజ్జిగ కలుపుకుని తాగు. శోష వచ్చి అడ్డం పడగలవు” అన్నాడు. 
శ్యామలాంబ పరంధామయ్య కళ్ళలోకి నేరుగా చూసింది.  



www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...