Friday, 11 November 2016

43. డిటాచ్ మెంట్


ఉదయం అందరి వద్దా వీడ్కోలు తీసుకున్నాను. జీవితపు విలువల్ని నేర్పిన, మణి మారెన్, కన్నడ శ్రీనివాస్, ఏకాంతప్ప, రామచంద్రన్, మా వంట మాస్టర్, సుపర్వైజర్లు, సైకిల్ మీద మా అందరికీ టీలు తెచ్చిచే బుడ్డోడు ఎవరిని వదల్లేదు.
మెకాన్ వాళ్ళ వద్ద సైన్ చేయించాల్సిన ఫైలు సిద్దంగా ఉంది. నా లాగేజ్ కూడా. లాగేజ్ అంటే ఒక పెట్టె. అంతే .
ఈశ్వర మణి ఎప్పటి లాగే తొమ్మిది కల్లా సైట్ కి వచ్చాడు. వస్తూనే నా పేరున ఒక ఎక్స్పెరియన్స్ సర్టిఫికేటు తయారు చేయించాడు. ఆఫీసు నుండి రావలసిన జీతం ఇప్పించాడు. ఒక కవర్లో ఎక్స్పీరియన్స్ సరిఫికేటు పెట్టి ఇచ్చాడు. తన జేబు నుండి కొంత స్వంత  పైకం కవర్లో పెట్టడం గమనించాను.
“ఎప్పుడయినా వర్క్ మీద, కోపం చేసి ఉంటే ఏమి అనుకోవద్దు.. “ అన్నాడు తమిళం లో.
నేను తెలుగు అని తెలిసి అన్నాడంటే అవి మనసు లోనుండి వచ్చిన మాటలు అని గ్రహించాను.
“ మీకు మంచి భవిషత్తు ఉంది. పని ప్రారంభం లో ఉన్న శ్రద్ద చివరి వరకు లేక పోవటం మీ మైనస్ పాయింటు. ప్రతి దాని చుట్టూ ఒక బంధం అల్లుకోవటం కూడా తప్పు. మనం అనుకున్న దానికి సమాంతరంగా ఇది నాది/శాశ్వతం  కాదు అనే వైరాగ్యం కూడా పెంచు కోవాలి. అలా పెంచు కొక పోతే మన జీవనం కష్టం అవుతుంది. నాకూ  ఈ విషయాలు తెలీదు. ఏనిమిదేళ్ళతర్వాత  పుట్టిన కొడుకు చని పోయినప్పుడు మేము ఓదార్పు కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. అప్పుడే ఇది నేను చేయటం అలవాటు చేసుకున్నాను. “ అతను కొద్ది సేపు ఆగాడు. “ఏడు నెలల కాలం కలిసి పని చేశాము. మరెప్పుడు మనం కలవక పోవచ్చు. కానీ మీరు బాగుండాలి రావ్ “ అన్నాడు.
నేను విచలితుదిని అయి పోయాను. ఒక మెటీరియలిస్టిక్ వ్యక్తి, ఎనిమిది వ క్లాసు  డ్రాప్ ఔట్ అంత లోతుగా నన్ను విశ్లేసించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కవర్ అందుకుని బాగ్ లో పెట్టుకుంటుంటే, మీ అమ్మ గారికి ఏదయినా కొనుక్కెళ్లు అన్నాడు. నాకు ఎందుకో గాని ధూఖం తన్నుకు వచ్చింది. దగ్గరగా వెళ్ళి వాటేసుకుని ఏడ్చేశాను.
కంపెనీ జీపు లో మా అకౌంటెంట్ నాతో పాటు ఎక్కాడు, నా లగేజీ సర్దుకుని నేను ఎక్కి కూర్చున్నాక జీపు కదిలింది.
మా ఆఫీసు కాంపస్ దాటి వర్కర్స్ కాలనీ పక్క నుండి మైన్ రోడ్డు ఎక్కేటప్పుడు, దూరం నుండి సవారి సైకిలు మీద వచ్చాడు. జీపు ఆపించాను. ఒక కాశీ దారం నా చేతి కి కట్టాడు.
మణి గారు ఇచ్చిన కవర్ బయటకి తీసి, అందులో నుండి సర్టిఫికేట్ తీసి, మిగిలిన కవరు సవారికి ఇచ్చాను. అందులో ఎంత ఉందో తెలీదు. “ఇది అమినమ్మకి ఇవ్వు” 
జీపు దుమ్ము రేపుకుంటు .. RCI ప్రాజెక్ట్ దాటి పహడి  శరీఫ్ వైపు దూసుకెళ్లింది.No comments: