Tuesday, 17 November 2015

గ్రాఫాలజీ -19

ఆరోజు మద్యాహ్నం తర్వాత బావ వచ్చాడు, అసహాయమయిన తన పరిస్తితికి ఇంకా కుంగి పోయి ఉన్నాడు. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించవు అపుడు ఆ మనిషి పడే వేదన వర్ణనాతీతం. సరిగ్గా అప్పుడే ఎవరికయినా ఒక ఓదార్పు అవసరం. ఒక చేదు నిజం ఏమిటంటే మనం అప్పుడే ముక్కులతో పొడుస్తాము. మనిషిని మాటల్తో చంపేస్తాము. బావ వస్తూ కొంత డబ్బు తెచ్చుకున్నాడు. కూతురి అవసరాలు కొన్ని చూసుకున్నాడు.
పరిస్థితులు సాదారణానికి వచ్చి తల్లి బిడ్డ క్షేమంగా బయటపడే సరికి పదిహేను రోజులు దాటింది. అనూనమైన ఉషస్సుతో వెలుగొందా లని కోరుకుంటూ నేను అనూష అనే పేరు సూచించాను.
నాకోసం ఉంచుకున్న 75 రూపాయలలో 66 రూపాయలు పెట్టి బెంగుళూరు టికెట్ రిజర్వ్  చేయించుకున్నాను. (రిజర్వేషన్ చార్జి లు 1 రూపాయి అదనం) మిగిలిన 9 తొమ్మిది రూపాయలతో నేను బెంగుళూరు బస్ ఎక్కాను.
ఈ పదిహేను రోజుల్లో ఇక్కడ అనేకం జరిగాయి. మా బాస్ సైట్ విజిట్ కి రావటం, రావాల్సిన బిల్స్ పెండింగ్ లో పడిపోవటం గమనించి  ఆయన అసంతృప్తి గా వెళ్ళటం జరిగిపోయింది.
నేను వచ్చి రాగానే పెండింగ్ బిల్ల్స్ క్లియర్ చేసే పనిలో పడ్డాను.
బస్కరరాజు గారి పరిచయం తో గ్రాఫలజీ సర్టిఫికేట్ కోర్సు చేస్తూ ఉన్నాను. (barbaraa hill) అది కుంటు పడింది. అల్సూర్  లేక్ ప్రాంతం లో ఉన్న ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి లేటుగా ప్రారంభం అయిన మరో బ్యాచ్ లోకి పేరు మార్పించుకున్నాను.
సాయంత్రాలు, టి‌వి‌ఎస్ మీద లిడో సెంటర్ దాకా వెళ్ళి వస్తుండేవాడిని. గ్రాఫలజీ అప్పట్లో నా అభిమాన సబ్జెక్ట్. తల్లి గర్భం లో శిశువు కదలికల ఆధారంగా ఏర్పడే చేతి గీతల కన్నా వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ని ప్రతిబంబించే చేతి రాత మనిషిని చాలా పట్టిస్తుంది. ఆర్ధిక క్రమశిక్షణ, మానసిక ఉద్వేగాలు, అంతర్ముఖులుగా ఉండటం, భావోద్వేగాల ప్రదర్శన, వారిలో కళా తుష్ణ, అతి విశ్వాసం, నిర్లక్షం, కన్సిస్ స్టేన్సీ  లాటివి అనేకం చేతి వ్రాత ని స్టడీ చెయ్యటం  ద్వారా మనం చాలా వరకు ఊహించవచ్చు. ఇదే కారణం తో అప్పట్లో ఉద్యోగార్డుల  చేతి వ్రాత తోనే రెజ్యూమ్ లు తేప్పించుకునేవారు.
(srkr లో మా పిల్లలు చదివేటప్పుడు, మా చిన్న పాప హాస్టల్ నుండి వచ్చిన ప్రతి సారి కనీసం  20 చేతివ్రాతలు నెంబర్లు వేసి  తెస్తుండేది. నేను రిపోర్ట్ రాసి ఇస్తుండేవాడిని, ఒక సారి ఇది 35 ఏండ్లు దాటిన స్త్రీ వ్రాత అని నేను రాసినప్పుడు మమ్మాయి నాతో వాదించింది. చివరికి తన ఫ్రెండ్  వాళ్ళ  అమ్మ రాత ని తన రాతగా చెప్పిపంపానని చెప్పి  మా చిన్నదాన్ని ఆశ్చర్య పరిచింది. ఆ పాప కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంది )నేను బెంగుళూరు వచ్చిన మరో పక్షం రోజులకి మా బాస్ వచ్చారు. 15 రోజుల శాలరీ 300 తగ్గించమని మా అకౌంటెంట్ కి చెప్పారు.  “ఈ రోజుల్లో సిజేరియన్ ఏముంది అరగంట పని. అయినా దానికోసం అన్నీ రోజుల సెలవు తీసుకోటం కరెక్ట్ కాదు “ అని నాతో అన్నారు.
ఆయన మాట నిజమే అయ్యుండొచ్చు  కానీ మా కుటుంబ పరిస్థితులు వేరు. ఆ పదిహేను  రోజులు అక్కడ నా అవసరం ఎంతో ఉంది. దాని గురించి నాకు ఎలాటి సందేహమూ లేదు.
తగ్గించిన నెల జీతం ఇస్తూ మా వెంకట్రావు గారు చెప్పారు.
 “ఇప్పుడు అర్ధమయిందా నా అసంతృప్తికి కారణం.
మనకి కుటుంబాలు ఉండకూడదు. మనం  అనారోగ్యం తో ఉన్నా వాళ్ళ పని ఆగ కూడదు. శరవణా కంస్ట్రక్షన్స్ లో జూనియర్ ఇంజనీర్లు అవసరం ఉంది. హైదరాబాదు సైట్ లో. ఎక్కువ జీతం ఇస్తారు. ప్రారంభం నుండి ఉంటే చాలా వర్క్ కూడా నేర్చుకోవచ్చు. డైరెక్ట్ ఇంటర్వ్యూ లు వచ్చే శుక్రవారం ఉంది. ఒక ప్రయత్నం చెయ్యి “

ఆయన ఆ క్షణం నాకో మెంటర్ లాగా కనిపించారు.

నాలో ఘర్షణ మొదలయ్యింది.
Post a Comment