Saturday 11 August 2018

ఒక నకులుడి కధ

“రవీ ... నేను చీరాల లో ఉన్నాను. మరో అరగంట లో ఇంటికి వస్తాను. నీతో మాట్లాడి బాపట్ల వెళ్లి కమలాకర్ ని కలుస్తాను. అక్కడికి బోజనానికి వస్తాను అని చెప్పాను. నువ్వు ఎక్కడ ఉన్నావు?”
“అన్నా నేను ఆఫీసు లో ఉన్నాను. ఈ నెల ఒక్కటే సెలవు మిగిలింది. పెళ్లి కోసం జాగర్త చేసాను. ఇంట్లో మీ మరదలు కుడా లేదు. స్కూల్ కి వెళ్ళింది. నాలుగు దాటితే కాని తను రాదు. పిల్లలిద్దరూ ఉన్నారు. వాళ్లకి ఇవాళ స్కూల్ లేదు..”
“సరే నేను ఇంటికి వెళ్లి.. పిల్లలని పలకరించి బాపట్ల వెళ్తాను.”
“సరే అన్నా.. రిటర్న్ లో ఇంటికి రా అన్నా.. వీలుంటే..”
“ఖచ్చితంగా..”
రవి అంటే మా పిన్ని గారి పెద్ద కొడుకు. మా ఆమ్మ వాళ్ళు నలుగురు అక్కచెల్లెళ్ళు. మా అమ్మ పెద్దది. నలుగురికి కలసి అయిదుగురు కొడుకులం.
పెద్దావిడ కి అందరికంటే పెద్ద వాడిని నేనూ. అందరి లోకి చిన్న పిన్నికి ఇద్దరు కొడుకులు. వెరసి పాండవుల లెక్క..
నా సంగతి సరే..
భీముడు బొంబాయి లో ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ గా స్థిర పడ్డాడు.
అర్జునుడు బాపట్ల లో సాఫ్ట్ డ్రింక్స్ స్టాకిష్టు కం ఎగ్స్ హోల్సేలర్. బాగానే ఉన్నాడు.
రవి అంటే నకులుడు. తండ్రి (మా బాబాయి ITC కార్మిక ఉద్యోగి) తో పాటు ఇంటివద్దే చిన్న చిల్లర అంగడి నడిపేవాడు.
లోకల్ గా డిగ్రీ చదివాడు. పచ్చళ్ళు అమ్మాడు. data ఎంట్రి జాబ్ వర్కులు చేసాడు. సహదేవుడు ని చదివించాడు.
చాలీ చాలని జీతం తో తండ్రి తో పాటు చాతనయిన పని చేసి తమ్ముడు ని తమిళనాడు లో MCA (అప్పట్లో అందని ద్రాక్ష) చదివించాడు. తమ్ముడు నిలదొక్కుకున్నాడు. ఉద్యోగం... అబ్రాడ్..ఆరు అంకెల జీతం.. మరో ఆరు అంకెల జీతపు బార్య.. ఇక్కడో తల్లి తండ్రులకి ఇల్లు, న్యూజెర్సీ లో ఇల్లు ఇలాటివి ఇంకా చాలని చాలా..
మా బాబాయి వాలంటరీ విరమణ చేసి రవి కి ITC లో ఉద్యోగం వేయించాడు.
తల్లి కి ఇష్టం లేని; చిన్నప్పటి నుండి బీదరికం లో మగ్గుతున్న మేనత్త కూతురు ని వివాహం చేసుకున్నాడు.
అదిగో అక్కడ కధ మలుపు తిరిగింది.
చిన్నాడి కి పెద్దాడికి మధ్య మాటల్లెకుండా పెద్ద వాళ్ళు గొయ్యి తీసారు.
ఒక చిన్న స్థలం తనకి వదిలేసారు. వాడు అందులో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. నా చేతనయిన సాయం చేసాను. ప్రభుత్వ పదకం మంజూరు చేయించాను. వీలయినంత మంచి డిజైన్ ఇచ్చాను.
బార్య అనుకూలవతి. కాన్వెంట్ లో టీచర్ గా కొద్ది జీతానికి పని చేస్తూ ఉంటుంది. ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు. పొదుపుగా ఆదర్శంగా తృప్తిగా ఉండే కుటుంభం.
పిన్ని బాబాయి లో ఎవరు సిక్ అయినా కనిపెట్టుకు చూసే పెద్దాడి కుటుంభం US నుండి చిన్న కొడుకు నెలకు పంపే డబ్బుకి సమానం గా ఇవ్వటం లేదని మా పిన్ని కంప్లైంట్. కొరవ... వాడితో సరిగా మాట్లాడదు. పిల్లలిద్దరికి మాటల్లెకుండా చేయగలిగినంత చేసింది.
అదో ఉన్మాదం...
నేనూ వెళ్ళే సరికి మగ పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారు. పెద్దోడు 7 లోను చిన్నవాడు 4 లోను ఉన్నారు. ఈ రోజు వాళ్ళ స్కూల్ శలవట.
బండి ఆపగానే పెద్ద వాడు వచ్చి “పెదనాన్నా.” అని నోరారా పిలిచాడు. వర్షం బురద తో నిండిన నల్లని బూట్లు విప్పి లోపలి వెళ్లి కూర్చున్నాను.
వాళ్ళ నాన్నకి ఫోన్ నుండి మిస్ కాల్ ఇచ్చాడు.
చిన్నవాడిని పక్క వీది లోకి పంపి కూల్ డ్రింక్ తెప్పించి ఒక గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు.
“టీ.వీ పెట్టనా పెద నాన్నా అన్నాడు”
వద్దని తల ఊపి (అలవాటు లేని) డ్రింక్ తాగుతూ పిల్లలతో మాట్లాడాను.
పది నిమిషాలు కుర్చుని వాళ్లకి బై చెప్పి వాకిట్లో కి వచ్చే సరికి ఎప్పుడు తుడిచారో ఏమో కాని నా బూట్ల శుబ్రంగా ఉన్నాయి.
సాయంత్రం బాపట్ల నుండి మళ్ళీ చీరాల వచ్చాక ఫోన్ చేసాను.
“అన్నా.. ఆఫీస్ టైం అయిపొయింది వచ్చేస్తున్నాను”
“నేను ఇంటికి రావటం లేదు. వేరే పని ఉంది ఇంకొల్లు వెళ్తున్నాను.”
“సరే అన్నా.. సెంటర్ కి రానా.. కలిసి టీ తాగుదాం.”
“వద్దు రా నేను చీరాల దాటాను..”
“ఒరేయ్ రవీ “
“చెప్పన్నా..”
"......."
“అన్నా..వినబడటం లేదు... సిగ్నల్ ఉందా?”
“నీ పిల్లలు ముత్యాలు రా.. బాగా పెంచుతున్నావు. నువ్వు శ్రీమంతుడివి”

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...