Saturday 27 January 2018

ఏది నిజం?!?

కుటుంబం, సమాజం మనన్ని అనుక్షణం నియంత్రిస్తుంటాయి.
మానవ సంభందాలు కూడా అదుపు చేస్తూ ఉంటాయి.
మనస్పూర్తిగా మాట్లాడటానికి, నిష్కపటం గా ఉండటానికి ఏదీ మనన్ని అనుమతించదు.
మన సంతోషాన్ని అదుపు చేసుకోవాలి. మన బాధలని హద్దులో ఉంచుకోవాలి. నవ్వును మనుషులని బట్టి అనుమతించాలి. కొందరి వద్దే మనసు విప్పాలి. ప్రయోజనాల పరంపర లో మనుష్యులు నిజమయిన స్వేచ్చని, స్వతంత్రాన్ని ఎప్పుడో కోల్పోయారు.
మనం అదుపు చేసినవి, అణిచి పెట్టినవి ఎక్కడికీ పోవు. అవి మనసు పొరల్లో ఉండి పోతాయి. మన లోనే ఉంటాయి. అవే కలలుగా వస్తాయి. మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మన భావాలని సహజం గా వ్యక్తపరచ లేని పక్షం లో అవి అనేక వికారాలుగా మారతాయి.
***
ఒక అన్యోన్యమయిన దంపతులు ఉండేవారు. ఇరుగు పొరుగు ఈర్ష పడేంత అన్యోన్యత. ఒకరంటే ఒకరకి గౌరవం ప్రేమ.
భర్త కి కావలసినవన్నీ సమకూర్చేది. తను ఉద్యోగం చేసేది. అతని ఇంటివద్ద అప్పులని తీర్చడానికి తన జీతం లోంచి డబ్బు ఇచ్చేది. భర్త మాట వేదవాక్కులా ఉండేది. ఇంటా బయటా ఒక్క మాట అని గాని, వ్యతిరేకించి గాని ఎరగదు.
అతనికి కూడా బార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె సలహా లేనిదే ఏమి చేయడు. ఆమెకి కావలసిన అవసరాలన్నీ అతనే సమ కూరుస్తాడు. ఆమె తాలూకు బట్టలు, నగలు కూడా అతనే ఎన్నిక చేస్తాడు.
అంత చక్కని జంట.
..
వాళ్ళ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. లోపల మంచి పూల చెట్లు ఉన్నాయి. ఒక పందిరి కింద ఊగుటుయ్యాల ఉంది. ఇద్దరికీ నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఒక రోజు ఇద్దరు నిద్రలో నడుస్తూ తోట లోకి వచ్చారు ఒకరికి ఎదురుగా ఒకరు నిల్చున్నారు. మాట్లాడుకోవటం మొదలెట్టారు.
“దుర్మార్గుడా? ఆడబిడ్డల పెళ్లి అప్పులు నా జీతం తో తీర్చాలా? నా కంటూ స్వతంత్రం లేదా. ఇష్టపడిన బట్టలు కూడా నేను కొనుక్కో కూడదా? నా జీవితం నీ లాటి అయోగ్యుడి చేతిలో నాశనం అవాల్సిందేనా?” అంది ఆవిడ.
“సంపాదిస్తున్నాని ఎంత పొగరే నీకు? ఏనాడన్నా జీతం మొత్తం.. ఇంటి మొగాడిని నా చేతిలో పెట్టావా? ఎవడో పరాయి వాడికి ఇస్తున్నట్టు అంతా దాచుకుని చిల్లర విదిలిస్తావా? మిగిలిన సొమ్ముమీ అమ్మకి, అయ్యకి పంపుతున్నావా? ఎన్నాళ్లే.. నీ నాటకాలు? ఏదో ఒక రోజు నాకు కాలం కలిసి వస్తుంది. అప్పుడు నీ పని ...” అతను కేకలు వేశాడు.
ఇద్దరు తిట్టుకుని, అలసి పోయి పందిరి ఉయ్యాలలో పడి నిద్ర పోయారు.
ఉదయాన్నే ఆవిడ నిద్ర లేచి “ఏవండీ ఇంత మంచులో ఇక్కడ పడుకుండి పోయారు. కనీసం దుప్పటి కూడా కప్పుకోలేదు. జలుబు చెయ్యదూ?? లేవండి లేచి ఇంట్లో కి రండి.” అంది.
“అయ్యో నువ్వు నాకోసం ఈ వేళ ఆరుబయట వెతుకుతున్నావా? కాసేపు నిద్ర పోకూడదు. మళ్ళీ పొద్దుటే మొదటి షిఫ్ట్ డ్యూటి కి వెళ్ళాలి కదా? ఇంట్లో బోలెడు పని. పద.. పద నేనూ సాయం చేస్తాను.” అన్నాడు.
**
మెలకువ నిజమా ??? నిద్ర లో మాటలు నిజమా???

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...