Friday 19 January 2018

కార్డు మీద ఫోటో

నాలుగో రౌండ్ గ్లాసు దించిన తర్వాత అతను గంభీరం గా అయిపోయాడు. 
మాటలు లేకుండా ఎటో చూస్తూ సాలోచనగా తల ఉపాడు. 
“రావు గారి కి సరిపోయినట్లుంది” సాగర్ అన్నాడు. 
రావు ఏమి మాట్లాడలేదు.
“సాగర్ గారూ.. మీకో విషయం చెప్పాలి”
ఏమిటన్నట్లు చూశాడు సాగర్.
“నేను చనిపోయి ఈ రోజు కి నిండా పది.”
సాగర్ చేతిలో గ్లాసు ఆగిపోయింది. కుర్చీ లో వెనక్కి కూర్చుని జోగుతున్న బాగీ అంత మత్తులోను చురుగ్గా చూశాడు.
“రావు గారికి ఎక్కువయింది” మాటలు కూడా దీసుకుంటూ అనుమానంగా సాగర్
రావు గారి పొడవాటి జుట్టు ముఖం ముందుకు వేలాడుతుంది. నోట్లో సిగిరెట్టు పొగ జుట్టు పాయల్లోంచి బయటకి వస్తుంది. కుర్చీలో ముందుకి వంగి ఉన్నాడు.
“సుయొధనా.. రావు గారి కాళ్ళు గమనింపుము” బాగి నవ్వుతూ అన్నాడు.
“కొన్ని చూసినా నమ్మరు. నమ్మేవాటికి ఆధారాలు ఉండవు.” రావు సాలోచనగా చెప్పాడు.
ఇక వెల్ధామా? సాగర్ బిల్లు సెటిల్ చేస్తూ అన్నాడు.
ముగ్గురూ బయటకి నడిచారు.
చీకటి చిక్కగా ఉంది. చలి దాడి మొదలయ్యింది.
ఆటొ ఆపాడు బాగి. “మార్కెట్ సెంటర్ కి వస్తావా?”
“వస్తాను యాబై ఇవ్వండి”
“న్యాయం ఇంకా నడుస్తుంది. ముగ్గురికి యాబై లక్షణంగా ఇవ్వొచ్చు?”
‘ఇద్దరేగా? మూడో అతను ఎక్కడ?”
పక్క నుండి వచ్చి రావు కూడా ఆటో ఎక్కాడు. సాగర్, బాగి ఒక పక్కగా సర్దుకున్నారు.
“చివరికి జరక్కండి. బాలన్స్ ఉండదు. సిమెంట్ రోడ్ల మీద టర్నింగ్ ల వద్ద జారుద్ది”
మార్కెట్ సెంటర్లో దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు.
డ్రస్ మార్చుకుని సాగర్ నిద్ర కి పడక చేరాడు. ఫోన్ మోగింది.
అటునుండి బాగి. “సాగర్ నేను రూముకి వచ్చేసరికి ఒక కార్డు ఉంది. కాటుక పూసి ఉంది. పెద్దకర్మ అని ప్రింట్ అయి ఉంది.”
“ఉంటే.. ?!!”
“కార్డు మీద రావు గారి ఫోటో ఉంది.” 


*****
ఫోన్ కట్ చేయగానే బాగి ఫోన్ మోగింది. అటునుండి రావు గారు,
“మనం అనుకున్నట్లే చెప్పావా?”
“ఊ .. చెప్పాను. ఈ రోజు నిద్ర పోడు. ఖాయం.”
“కొన్నాళ్లు నేను ఫోన్ తియ్యను. కాలర్ టోన్ మంచి దెయ్యం మ్యూజిక్ కి మార్చాను. పెద్దాడి దగ్గరకి వెళ్తున్నాను. రెండు నెలలు ఇక్కడ కనిపించను.”
ఇద్దరు నవ్వుకున్నారు.
“నిన్న కాక మొన్న సిగిరెట్లు మానేసిన కన్నె సామి, నాకు మా ఆవిడ ముందు సలహాలు ఇస్తున్నాడు." రావు తో చెప్పాడు భాగి.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...