Wednesday, 22 November 2017

బండరాయి

రహదారి మార్గం లో ఒక పెద్ద బండరాయిని అడ్డుగా వేయించి చాటుగా గమనించసాగాడు రాజు గారు.
“ఏం రాజు? ఏం పరిపాలనా? శిస్తులకే గాని ప్రజల పనులు పట్టించుకొని రాజ్యం లో ఉన్నాం మనం. ఖర్మ” అంటూ ఈసడించుకున్నారు ఆ మార్గాన పోతున్న వారు కొందరు.
అదికారులు ఆ బండరాయిని చూసి హుంకరించారు. “ఎవరు ఈ పని చేసింది. కనుక్కుని కారాగారం లో ఉంచండి” హుకుం లు జారీ చేశారు.
రాజు గారు వింతగా చూస్తున్నారు. కొద్దిగా శ్రమ పడి బాద్యత తీసుకుంటే దానిని తొలగించడం పెద్ద పనేమీ కాదు.
చాలా సేపటికి ఆ దారినే ఒక కుటుంబం ఎద్దుల బండి మీద ప్రయాణం చేస్తుంది.
రహదారి మీద బండ రాయి ని చూసి బండి ని పక్కకి మర్లించాడు కొడుకు.
తండ్రి బండిని ఆపించి, ఇద్దరు కుమారులతో కలిసి చకచక్యంగా రాతిని పక్కకి నేట్టాడు. మార్గం సుగమం చేశాడు.
దొర్లించిన రాతి కింద బంగారు నాణేలు వారి కి కనిపించాయి.
తిట్టుకోవటమో, ఇతరులకు పురమాయించడమో కాదు సమస్య /సవాలో ఎదురొచ్చినప్పుడు స్వయంగా పరిష్కారానికి పూనుకోవాలి.
సమస్య అనే బండరాయి క్రింద అవకాశము అనే లబ్ధి దొరుకుతుందేమో...

Tuesday, 21 November 2017

గార్గి

అయిదువేల సంవత్సరాల క్రితం, ఉపనిషత్తుల కాలం లో గార్గి అనే ఒక మహిళ ఉండేది.
స్త్రీ ల పట్ల ఇంత వివక్ష ఉండేది కాదు.  
తాత్వికుదయిన రాజు ప్రతి సంవత్సరం వివేకవంతులయిన పండితులని పిలిపించి పోటీ పెట్టేవాడు. గొప్ప జ్ణానులు మాత్రమే పోటీలకి హాజరయ్యే వారు. వాళ్ళలో కపటం అనేది ఉండేది కాదు.
ఒక సంవత్సరం రాజు వేయి ఆవుల బహుమతి ప్రకటించాడు. ఆవుల కొమ్ములకు రత్నాలు తాపడం చేసిన బంగారు తొడుగులు ఉంటాయని చెప్పాడు.
ఆ రోజుల్లో యజ్నవాల్యుడు సుప్రసిద్దుడు. విజయం పట్ల అనుమాత్రం కూడా సందేహం లేని వాడు. ఎక్కడ పోటీ జరుగుతుందో అక్కడ తన తత్వ పరిజ్ననమ్ తో పోటీ గెలిచేవాడు.
ఆ స్తలానికి వచ్చి వజ్రాలు, రత్నాలు తాపడం చేసిన కొమ్ములు ఉన్న ఆవుల గుంపుని చేసాడు. సూర్య కాంతి లో  ఆ దృశ్యం ఎంతో అద్ద్బుతంగా ఉంది.
వస్తూనే “వీటిని మన ఆశ్రమానికి తోలుకేళ్ళండి ఇవి అనవసరంగా ఎండలో బాధపడటం ఎదుకు? ఎటూ విజయం మనదే అని” శిష్యులని పురమాయించాడు.
అక్కడున్న జ్ణానులు ఎవరు ఆయన్ని నిలువరించలేక పోయారు. చివరికి రాజు గారు కూడా నిస్సహాయం గా ఉండిపోయాడు.
యాజ్ఞవల్యూడిని జయించడం ఆసాద్యమ్ అని వాళ్ళకి తెలిసి పోయింది. విజేతగా ప్రకటించే సమయం లో గార్గి ఆటల్లో పడి ఇంటికి రాని బిడ్డడిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది.
విజయానికి ముందే ఆవులని తోలుకెళ్లటం తెలుసుకుంది.
ఆమె చక్రవర్తి తో “మీరు ఆయన్ని విజేతగా ప్రకటించకండి. నేను నా బిడ్డ కోసం వచ్చాను. నా బిడ్డని వెతకమని ఎవరినయినా పురమాయించండి. నేను యాజ్ఞవల్యూడి తో వాదనకు సిద్దంగా ఉన్నాను. ఆయన చదువు కున్నవారు, పండితుడు కానీ పండితుడికి సత్యం అవగాహన కాదు” అంది.
అవి గొప్ప రోజులు స్త్రీలు కూడా గొప్పగా సవాలు చేయగలిగిన రోజులు. చక్రవర్తి ప్రకటనే చేయకుండా వాదన చేయటానికి అంగీకారం తెలిపాడు.

యాజ్ఞవల్యూడి ని ఆమె ఒక సాధారణమయిన ప్రశ్న వేసింది. “ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించాడు?” అంది.
ఆమె చిన్న ప్రశ్నకు బదులుగా యాజ్ఞవల్యూడు నవ్వాడు. చిన్న పిల్లల ప్రశ్నలు అడుగుతుంది. అనుకుంటూ “దేవుడు సృష్టించాడు. ఎందుకంటే ఏదయితే ఉన్నదో దాన్ని ఎవరో ఒకరు సృష్టించాలి కాబట్టి” అన్నాడు.
గార్గి నెమ్మదిగా “ దేవుడు ఉన్నాడు కదా? ఆయన్ని ఎవరు సృష్టించాడు?” అని అడిగింది.
యాజ్ఞవల్యూడు వలలో పడి పోయాడు. “దానికి సమాదానం గా మరో దేవుడు అని చెబితే తిరిగి ఆయన్ని ఎవరు సృష్టించాడు అని అడుగుతుంది. సమాదానం గా మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది”
యాజ్ఞవల్యూడు తను ఇరకాటం లో పడి పోయినట్లు గ్రహించాడు. సహజం గానే ఆగ్రహం వచ్చింది. కత్తి దూశాడు.
గార్గి “మహారజా అతన్ని బంధించి ఆవులని వెనక్కి రప్పించండీ” అని పిల్లవాడిని ఎత్తుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది.
........................ ఓషో కధ నా మాటల్లో ...


విశ్రాంతి.

మనుషులు అంతులేని శ్రమ లో మునిగి ఉండటమే కాదు. విశ్రాంతి పొందే సమయము ఉంటుంది.
అనంత ఆహ్లాదాన్ని అందుకునే ఘడియలు ఉంటాయి. 
మనుషులు మరీ గంభీరం గా ఉండకూడదు.అది కూడా అనారోగ్య లక్షణమే.
నవ్వుతూ ఉండటం అనేది జీవ లక్షణం. విశ్రాంతి సమయం లో పద్దతులు, ప్రణాళికలు ఉండవు. విరామమే విస్తరించి వుంటుంది.
ఒక గొప్ప జెన్ గురువు ఉండేవాడు.
ఆయనకు దేశం లో ఎంతో గొప్ప పేరు ఉండేది.
చైనా దేశ చక్రవర్తి కూడా ఆయన పట్ల భక్తి ప్రవత్తులు ప్రదర్శించే వాడు.
ఒకసారి చక్రవర్తి కి ఆ జెన్ గురువును చూడాలన్న కోరిక కలిగింది. వెంటనే మంది మార్బలం తో గురువు గారి ఆశ్రమానికి వెళ్ళాడు.
ఆశ్రమం లో ప్రవేశించాడు. అక్కడి దృశ్యం చూసి చక్రవర్తి నిశ్చేష్టుడయిపోయాడు. ఆయనకి నోట మాట రాలేదు. తనెక్కడికి వచ్చాడు? పవిత్రమయిన ఆశ్రమాని కేనా? అని ఆశ్చర్యపోయాడు.
ఆశ్రమం లో గురువు నేల మీద పడి దొర్లుతూ బిగ్గరగా నవ్వుతున్నాడు. శిష్యులు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.
గురువు ఏదయినా ఛలోక్తి చెప్పి ఉండాలి. లేదా శిష్యుడు ఎవరయినా ఏదో నవ్వు పుట్టించేది చెప్పి ఉండాలి.
ఏది ఏమయినా చక్రవర్తి కి చాలా ఇబ్బంది కలిగింది.
చిరాకు వేసింది. తన కళ్లను తానే నమ్మలేక పోయాడు.
ఎందుకంటే అక్కడి వాతావరణం లో గంభీరత లేదు. ఆశ్రమ పవిత్రత లేదు. ఆ విషయాన్ని రాజు గారు గురువు తోనే సూటిగా చెప్పేశాడు.
“ఇది అమర్యాదకరం గా ఉంది. మీలాంటి గురువు నుండి ఇది ఊహించ లేకుండా ఉన్నాను. గౌరవనీయమైన ప్రవర్తన మీరే నేర్పాలి. అట్లాంటిది మీరే నేలమీద పడి దొర్లుతున్నారు. పిచ్చివాడిలా పగలబడి నవ్వుతున్నారు. మీ శిష్యులంతా మీతో కలిసి అల్లరి చేస్తున్నారు” అన్నాడు.
గురువు చక్రవర్తి ని చూశాడు. గురువు ఏం సమాధానం చెబుతాడా? అని చక్రవర్తి చూశాడు.
గురువు చక్రవర్తి విళ్ళంబులు ధరించి ఉండటం చూశాడు.
ప్రాచీన కాలం లో రాజులకు ఆనవాయితి.
గురువు “చక్రవర్తి గారూ! నాకో విషయం చెప్పండి. మీరు ఈ వింటిని ఎప్పుడూ సంధించి. అప్రమత్తం గా ఉంటారా? లేక మామూలుగా భుజానికి తగిలించుకుంటారా? అని అడిగాడు.
చక్రవర్తి “దాన్ని అవసరం అయినప్పుడు సంధిస్తాం. ఎప్పుడూ సంధించి పెడితే అది సాగే గుణాన్ని కోల్పోతుంది. వదులవుతుంది. అప్పుడేందుకూ పనికి రాదు. దాని విశ్రాంతిగా వాడలాలి. ఎప్ప్దుడు కావాలో అప్పుడు సంధించి వదలాలి.” అన్నాడు.
రాజు గారూ చెప్పిన మాటలు గురువు శ్రద్ధగా విన్నాడు.
గురువు ఒకే మాట్లో సమాధానం చెప్పాడు.
“నేను చేస్తున్నదీ అదే కదా?”
(ఓషో తన బోధనలలో చెప్పిన చిన్న కధ)

Saturday, 18 November 2017

పరిగెత్తిన ముసలావిడ

మహారాష్ట్ర బుల్ఢానా జిల్లా లో ని ఒక చిన్న కు గ్రామం లో ఉండే 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవిస్తూ ఉండేది.
ఆదంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్న డబ్బు హరించుకు పోయింది. అందినంతవరకు చేసిన అప్పులు మిగిలాయి.
కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి శ్రమిస్తున్న ఆ జంటకి అనుకోకుండా ఒక విపత్తు వచ్చి పడింది.
దాని పేరు అనారోగ్యం
ఒకరోజు  నలతగా ఉందని చెప్పాడు.
స్థానికంగా అందుబాటు లో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పెద్ద ఆసుపత్రి లో చూయించాల్సిందే నని చెప్పాడు.
లతమ్మ కి నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది. అసలే ఇద్దరు రాత్రింబగళ్ళు చాకిరీ చేస్తే తప్ప పోయిల్లో పిల్లి లేవని స్థితి. ఇప్పుడు ఆసుపత్రి అంటే డబ్బులు?
చేతి లో చిల్లిగవ్వ లేని స్థితిలో లతమ్మ కి ఏమి చెయ్యాలో పాలు పోలేదు.
దగ్గరలో ఉన్న ప్రబుత్వ ఆసుపత్రికి అతన్ని తీసుకువెళ్లింది. రెండు రోజుల్లోనే  నడవలేని స్థితికి వచ్చాడు.
ప్రభుత్వ అసుపత్రి లో సరయిన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణ కి కీలకమయిన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతి లో ని 'టెర్మినల్ హాస్పిటల్' కి వెళ్ళి కీలకమయిన టెస్ట్లు చేయించడం అత్యవసరం అని చెప్పారు.
లతమ్మ కి దుఖం ఒక్కటే మిగిలింగి. తన దౌర్భాగ్యానికి బాధ పడింది.  పరిస్థితి పూట పూటకి దిగజారి పోతూ ఉంది
తన భర్త తన చేతుల్లో చనిపోవటం అనే 'ఉహే' ఆమెని కుదిపేసింది.
నిస్సహాయం గా రోదించింది.
మౌనంగా ఉండటానికి కానీ, మొహమాట పడటానికి కానీ ఇది సమయం కాదని ఆమె గ్రహించింది.
వెంటనే చుట్టూ పక్కల వారిని, బంధు మిత్రులని కొంగు చాచి సాయం అడిగింది. మనసున్న మారాజులు అందించిన కొద్దిపాటి సాయం తో భర్తని బారామతి హాస్పిటల్ కి తీసుకెళ్లింది.
అక్కడి డాక్టర్లు అతన్ని చెక్ అప్ కి రిఫర్ చేశారు.
వరండాలో ఆమె దీనంగా కూర్చుని ఉంది. తన ఇంటి దీపాన్ని ఆర్ప వద్దని కనబడని దేవుళ్లందరికి మొక్కుతూ ఉంది. కానీ తలచినది జరిగితే విధి గొప్పతనం ఏముంది??.
ఆ టెస్ట్ లు చాల్లేదు. MRI చేయించాలి మరి కొన్ని ఖరీదయిన పరీక్షలు చేయిస్తే కానీ జబ్బు నిర్ధారణ చెయ్యలేమని తేల్చి చెప్పేశారు.
లతమ్మ ఏడుపు ఆపుకోలేక పోయింది. అయిపోయింది తన మాంగల్యం తన కళ్ల ముందే కోడిగొట్టబోతుంది. చేతిలో పైసా లేదు. ఇంకా ఖరీదయిన పరీక్షలు? ఆమె కన్నీళ్లు ఆమె మాట వినటం లేదు. బోరున ఏడువ సాగింది.
ఆ రాత్రి ఆసుపత్రి వరండా లో పడుకుండి పోయారు. భర్త ఆకలి గా ఉందన్నాడు.
ఆమె ఆసుపత్రి బయటకి వచ్చి వీది చివర ఉన్న చిన్న అంగడి లో తన వద్ద ఉన్న చిల్లర తో రెండు సమోసా తీసుకుంది. గబ గబా నడిచి వచ్చి భర్త కి ఇచ్చింది నేను తిన్నాను నువ్వు తినేయ్ అంది.
సమోసా చుట్టిన కాగితం పారవేయ్య బోతూ మరాఠీ లో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. . బారామతి మారథాన్ గెలవండి_3000 వేలు నగదు పొందండిఅని ఉన్నది.
ఆమె మనసులో అనేక ఆలోచనలు చేసింది. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమత మయ్యింది. ఒక నిర్ణయానికి వచ్చింది.
***
మర్నాడు 19-12-2013 'బారామతి మారథాన్' మొదలవబోతూ ఉంది.
పోటీ దారులు అందరూ స్పొర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్దంగా ఉన్నారు.
9
గజాల నేత చీర కల్లుకుని, కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా,
తడి కళ్ల తో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీ లో పోల్గొనటానికి అనుమతి అడిగినప్పుడు అందరూ ఆమెని పిచ్చి దానిలా చూశారు . ఆమె ని పోటీకి అంగీకరించలేదు.
కానీ ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది.
ప్రాదేయపడింది. బ్రతిమాలింది.
చివరికి అబ్యర్దిగా రంగం లోకి దిగింది.
***
పోటీ మొదలయ్యింది. లతమ్మ చీర నుండి కాళ్ళు బయటకి లాగింది.
ఉడుములా పరిగెత్త సాగింది. ఆమెకి తన వయసుగాని రోడ్డున కాళ్ళకి గుచ్చుకుంటున్న, రాళ్ళు కాని, ఎర్రటి ఎండ కానీ, తెలీదు. తెలిసిందల్లా తను గెలవాలి మూడు వేలు తీసుకోవాలి
భర్తకి టెస్టు లు చేయించాలి సరైన వైద్యం చేయించాలి.
తన భర్త బతకాలి. తన కి జీవితాంతం తోడు ఉండాలి.
అదే లక్షం.
అదే వేగం.
అదే పరుగు.
అదే విజయం.
బారామతి మారథాన్ ఒక చరిత్ర .. బారామతి ప్రజలకి ఒక గొప్ప అదృష్టం.
ప్రజలు చప్పట్లు తో వెంట రాగా ఆమె మారథాన్ నెగ్గింది.
నిర్వాహకులు ఆమె కన్నీటి గాధ విని చలించి పోయారు.
సీనియర్ సిటిజన్ విభాగం లో ప్రైజ్ మని ని 5000 గా చేసి అందించారు.
ఆమె ఆ డబ్బుతో తిరిగి ఆసుపత్రికి పరిగెట్టింది.
***
ఆమె ప్రేమ ఊరికే పోలేదు. ఆమె లక్షం ముందు సమస్య చిన్న బోయింది.
భర్త కి మెరుగైన వైద్యం అందింది.


అన్నీ పత్రికలు లతమ్మ గురించి గొప్పగా వ్రాసాయి.
దేశం నలుమూల నుండి ప్రశంశలు వెల్లువెత్తాయి.
నెల తిరిగే సరికి ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బాంకు ఖాతాకి 1,75,000 పైగా పొగయ్యాయి.

ఆ కుటుంబం అన్నీ విదాలా గట్టెక్కింది.
ఆసాద్యాన్ని పట్టుదలతో సుసాద్యం చేసిన 'లతా భగవాన్ ఖరే' అందరికీ ఆదర్శం.
భర్త ని కాపాడుకున్న ఆమె ఒక నిజమయిన ప్రేమ మూర్తి.

Wednesday, 15 November 2017

వక్క పొడి


“అబద్దాలు ఆడటం అనేది పిల్లలకి మనమే నేర్పుతాం. కాపీ పుస్తకం లో అబద్దం ఆడరాదు అని రాయిస్తాం. వెంకట్రావు అంకుల్ వస్తే మా నాన్న ఇంట్లో లేడు అని చెప్పమని కూడా మనమే చెబుతాం.”
బస్సులో పక్క సీటు అతనికి మాత్రమే చెబుతున్నాడు కానీ. 
ప్రశాంతంగా సిటింగు మించని బస్సులో అందరికీ బోర్డు మీద వ్రాసి,
పాఠం చెబుతున్నంత కమాండింగా ఉన్నది అతని వాయిస్.
ఈపాటికే అమరావతి బోటు ప్రమాదానికి కారణాలు విశ్లేషించి,
నివారణకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమేం చెయ్యాలో,
ప్రజానీకం ఎవరెవరి కాలర్లు పట్టుకుని ఎలా నిలదీయ్యాలో
ఒక పావుగంట పాటు చెప్పి ఉన్నాడు.
సింగిల్ టీచర్ పిల్లలకి అన్నీ సబ్జెక్ట్లు చెప్పినట్లు మరో టాపిక్ లోకి వెళ్ళి ధారాళంగా మాట్లాడుతున్నాడు.
అప్పుడప్పుడే చిక్కబడుతున్న చీకటిని చీల్చుకుంటూ బస్సు..
చీమకుర్తి దాటి వెళ్తూ ఉంది.
చాలాకాలం సెలవు పెట్టి తిరిగి జాయిన్ అయ్యాక సిలబస్ మొత్తం చెప్పేయ్యాలి
అన్నంత ఆత్రంగా మాట్లాడుతున్నాడు.
“అసలు అబద్దం అనేది మన సంస్కృతి కాదు. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చటానికి అనేక జి‌బి ల మెమొరీ వృదా చేసుకోవాలి. అంత జ్నాపక శక్తిని ఏదైనా పనికొచ్చే విషయం మీద కేటాయిస్తే బోలెడు ఉపయోగం. చిన్నదే కదా అని అశ్రద్ద చేస్తే అదే పెరిగి అబద్దం జన్మహక్కు అంటారే అలా అయిపోతుంది. వాడేవాడో చివర్లో ఉరిశిక్ష పడ్డాక చివరి కోరికగా తల్లి ని పిలిచి, చెవి కొరికి గోంగూర కట్ట దొంగిలించినప్పుడే ఎందుకు దండిచలేదు అని అడిగాడట.. అలా అవుతుంది.”
పక్క సీటు లో పెద్దాయన నోట్లో వక్క పొడి ఉందో లేదో కానీ, దవడలు ఆడిస్తూ ఉన్నాడు.
మద్య మద్యలో వింటున్నట్టు ఆతగాడి వైపు చూసి మొహమాటపు నవ్వు నవ్వుతున్నాడు.
ఇలాటి వాగుడు కాయ ల నుండి కాపాడుకోటానికయినా సరే దేవుడు చెవులకి రెప్పలు ఇచ్చి ఉంటే బాగుందనిపించింది.
మరో అరగంట కి తిరుమల వెంకన్న దర్శనం అయినట్లు ఒంగోలు చేరినట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కనిపించింది. బైపాస్ లో దిగటానికి లేచి బాగ్ తీసుకుంటుంటే...
వాగుడు కాయ కి ఫోన్ వచ్చింది.
“ఇంకా... చీమకుర్తి రాలేదే.. ఇంకో గంట పడుతుంది ఇంటికి వచ్చే సరికి “ అని చెప్పాడు. ఫోన్ లో గట్టిగా...
“ఈ టీట్ణీలు నాదగ్గర కుదరదు.. నేరుగా ఇంటికి రా.. ఇవాళ కూడా తాగి వచ్చావో *%$” అటునుండి ఫోన్ లో ఆడగొంతు మొరటుగా వినబడింది.
వాగుడు కాయ పక్క సీటు ఆయన లేచి కిటికీ లోనుండి నోట్లో వక్క పొడి “థూ “ అని ఊచాడు.
బస్సు స్లో అయ్యింది.

Tuesday, 14 November 2017

తియ్యటి లడ్డు

ఒక్కోసారి అనుకోకుండా కొన్ని వేదికలు పంచుకోవాల్సి వస్తుంది.
“చినమనగుండం” అనే ఒక మారుమూల ఊరికి వృతి రీత్యా ఈ ఉదయం వెళ్లినప్పుడు ఆ గ్రామ సర్పంచ్ నేను గ్రామం లోకి వచ్చానని తెలుసుకుని అక్కడి ఎలిమెంటరీ స్కూల్ లో జరిగే బాలల దినోత్సవానికి అతిదిగా ఆహ్వానించాడు.
నాకు గంట పైగా లేటు ఉందని మీరు కొనసాగించండి వీలుంటే వచ్చి కనబడతానని చెప్పాను.
కానీ నా కోసం కార్యక్రమం ప్రారంభం చేయలేదని తెలిసి వెంటనే వెళ్ళాను.
చిన్న చిన్న పిల్లలు, బుగ్గలమీద పౌడర్, కొత్త రిబ్బన్లు, పెట్టెలో దాచిన మడతల బట్టలు, నూనె పూసి దువ్విన తలలు ముగ్గురు టీచర్లు, సర్పంచ్, మరో ఇద్దరు అతిదులు సిద్దంగా ఉన్నారు.
పిల్లలని చూస్తే ముచ్చటేసింది. వాళ్ళని సిద్దం చేయించిన టీచర్లు ని అభినందించాను.
ప్రధానోపాద్యాయుడు చక్కగా పరిచయం చేశాడు. వక్తలు పిల్లలు వయసుని గమనించకుండాను, టీచర్లు హిస్టరీ పాటం బోదిస్తున్నట్టుగాను మాట్లాడారు.
నా వంతు వచ్చే సరికి చిన్న పిల్లల కి ఏమి చెప్పాలో ఒక్క క్షణం స్పురించలేదు.
ప్రశ్న సమాదానం లాగా నేను మాట్లాడటం మొదలెట్టాను.
మీరందరికి పార్కు అంటే తెలుసా?
తెలుసు
అక్కడ ఏమి ఉంటాయి?
చెట్లు, ఇంకా పక్షులు ..
ఇంకా?
నీళ్ళ గుంటలు..
కదా? ఒక సారి ఒక పిల్లాడు ఆ పార్కు లో నుండి ఇంటికి వెళుతూ ఉంటే ఆ నీళ్ళలో ఒక మెరుస్తున్న ఉంగరం కనిపించింది. ఉంగరం అంటే తెలుసా?
తెలుసు .. తెలుసు ..
(ఒకసారి ఎఫ్‌బి లో వ్రాసిన గుర్తు. పిల్లలకి అనుకూలంగా మార్చి చెప్పాను)
ఇలా మొదలెట్టి నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పేశాను.
వారి వద్ద సెలవు తీసుకుని నా బండి వద్దకి నడుస్తుంటే .. ఒక చిన్న పిల్ల ఆరేడు ఏళ్ళు ఉంటాయి.. పరిగెట్టుకుంటూ వచ్చి .. తనకి ఇచ్చిన 'బూందీ లడ్డు' పొట్లం లోనుండి ఒక లడ్డు ముక్క తుంచి నా చేతిలో పెట్టింది.
అంత తియ్యటి లడ్డు నేనెప్పుడూ గతం లో తిన్న గుర్తు లేదు. 

Tuesday, 7 November 2017

అతీంద్రీయ శక్తి

పంకజానికి అతీంద్రీయ శక్తులు ఉన్నట్లు రామకృష్ణకి గత రాత్రి అర్ధమయింది.

గదిలో వేడి చల్లబడ్డాక ?  బాల్కనీ లో చల్లగాలిలో ఒక దమ్ము లాగి పడక గది లోకి వెళ్ళినప్పుడు

 ముసుగు తన్ని పడుకున్న 'పంకజం' నుండి ఒక వింత వెలుగు రావటం గమనించాడు.
...
కొద్దీ నిమిషాలు ఏం తోచలేదు. భయం వేసింది. హాల్లో కి వెళ్లి, ల్యాప్టాప్ ఆన్ చేసి  తన గురువు  కిషోర్ తో స్కైప్ కలిపాడు. 
భయం భయం గా జరిగిన విషయం చెప్పాడు.
...
అప్పటి దాకా హౌస్ కీపింగ్ చేసి అలసిపోయిన కిషోర్. " ఓరి నాయనా నీ మొబైల్ లో వాట్స్ ఆప్ చెక్ చేస్తూ వుండి ఉంటుంది. నెరమూ శిక్ష రెండో భాగంలో ఉన్నాను నేను"

Sunday, 5 November 2017

ఎటు కూడినా సమానంగా!

మరో చిన్న పజిల్
మొదటి చిత్రం లో చూపించినట్లు ఒక 9x9 చట్రం ఉంది 

అటుచూసినా 9 ఖాళీ గదులు ఉన్న పజిల్. అంటే మొత్తం 9x9 గదులు = 81 గదులు ఉన్న పెట్టె.
1 నుండి మొదలెట్టి చివరి గది వరకు వరస సంఖ్యలు వ్రాస్తే మొత్తం 81 అంకెలు తో మొత్తం గదులు నింపవచ్చు. 
అలా నింపిన చిత్రం 2 లో చూడండి. అడ్డంగా ఉన్న 9 అంకెలని, నిలువుగా ఉన్న 9 అంకెలని ఐ మూలలుగా ఉన్న అంకెలని ఎటు కూడినా సమానంగా 369 వచ్చేట్టుగా అమర్చాలి.
ఎంత తక్కువ సమయం లో మీరు అమర్చగలరు. దానికి ఏదయినా శాస్త్రీయ పద్దతి ఉన్నదా? ఉంటే ఏమిటి ? ఎవరయినా try చేయండి.
ఐ‌ఐ‌టి లలో చదివినవారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఉన్నత చదువులు చదివిన పెద్దవారు కూడా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇది సామాన్యుల కోసం అని దయచేసి గ్రహించండి.
( 1 నుండి 81 వరకు అంకెల మొత్తం N * (N+1)/2 అని మనకి తెలుసు అంటే 81x82/2 = 3321. వీటిని తొమ్మిది వరసల్లో సర్దినప్పుడు ఒక్కో వరసకి 3321/9 =369 వస్తుంది. అంతే కదా??)
ప్రయత్నించండి. కొద్దిసేపు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే చక్కటి నిద్ర వస్తుంది. మెదడు అలిసిపోయినప్పుడు అలాటి ఘాడ మయిన నిద్ర వస్తుంది. 
(ఇది నేను ‘యాకోవ్ పెరల్మాన్’ వ్రాసిన పుస్తకం లో దాదాపు ఇరవై అయిదేళ్ళ క్రితం చూసి నేర్చుకున్నాను)
ఫోటో వివరణ ఇచ్చాను. అర్ధం చేసుకోటానికి వీలుగా చూడండి. 


ముందే తెలిసిన మొత్తం

ఎఫ్‌బి లో తొమ్మిది అంకె గురించి ఒక చర్చ నడిచింది. ఈ సందర్భం గా కొన్ని 9 తో తమాషాలు గుర్తుకు వచ్చాయి 
వాటిలో ఒకటి. 
టీచర్ ఒక నాలుగు అంకెల సంఖ్యను బోర్డ్ మీద ఒక విద్యార్ధి ని వేయమంటాడు.
ఉదాహరణకి 4268 అనుకుందాం. 
ఒక కాగితం మీద ఏదో ఒకటి వ్రాసి మడిచి అదే విద్యార్ధి జేబులో పెడతాడు. తను చెప్పేంత వరకు మడత విప్పి చూడవద్దు అని చెబుతాడు. 
మరో విద్యార్ధి చేత మరో నాలుగంకెల సంఖ్య మొదటి సంఖ్య కిందనే వ్రాయమంటాడు. 
ఉదా హరణ కి 8762 అనుకుందాం. 
అప్పుడు టీచర్ ఒక సంఖ్యని తను వరుసలో వ్రాస్తాడు. 
ఉదాహరణకి 1237 అనుకుందాం. 
మరో విద్యార్ధి చేత మరో సంఖ్య 5340 అనుకుందాం. 
మళ్ళీ తను 4659 అనే అంకె వేసి, మొదటి సంఖ్య వ్రాసిన విద్యార్ధిని కూడమంటాడు.
4268
8762
1237
5340
4659
--------
24266
అనే సమాధానం వస్తుంది.
ఇప్పుడు టీచరు ఇచ్చిన కాగితం మడత విప్పి చూస్తే 24266 అనే సంఖ్య వ్రాసి ఉంటుంది.
పిల్లలని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తే ఈ తమాషా ని విధ్యార్డుల ని లెక్కల పట్ల అనురక్తి కలిగించడం కోసం వాడుకోవచ్చు.
ఇది ఒక '9' మాజిక్. పెద్దలకి అర్ధం అయి ఉంటుందని తలుస్తున్నాను. 

శకుంతలా దేవి

అతను సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.
కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా స్థిరపడటాన్ని వ్యతిరేకించాడు.
మెజీషియన్ గా అవతరించాడు.
భుక్తి కోసం ఒక సర్కస్ కంపెనీ లో జంతువుల ట్రైనర్ గా, మెజీషియన్ గా వివిద పనులు చేసేవాడు. ఉయ్యాల నుండి గాలిలో పల్టీలు కొట్టి మరో ఉయ్యాల పట్టుకునే విన్యాసాలు చేసేవాడు. (Trapeze)
1929 నంవంబరు 4 వ తేదీ ఒక చక్కటి ఆడపిల్లకి తండ్రి అయ్యాడు.
తనతో పాటే సర్కస్ లో తిరుగుతుండే చిన్నారికి మూడేళ్ళ వయసులో ప్లేయింగ్ కార్డ్స్ తో ఒక చిన్న మాజిక్ నేర్పే టానికి ప్రయత్నించినప్పుడు తన కూతురికి అంకెలని అద్భుతంగా జ్నాపకం పెట్టుకునే శక్తి ఉందని గ్రహించాడు.
అతను సర్కస్ లో పని మానేశాడు. అనేక చోట్ల కుమార్తె తో కలిసి మేజిక్ లెక్కలతో కలిపి ప్రదర్శనలు ఇచ్చేవాడు. కుమార్తె కి ఉన్న శక్తి ని పరిపూర్ణంగా ప్రోత్చహించాడు.
ఆమె తన గణన శక్తి ని యూనివర్శిటీ ఆఫ్ మైసూర్ లో ప్రదర్శించింది. అప్పటికి ఆ బుడ్డ దాని వయసు నిండా ఆరేళ్లు!!.
తన పేరు శకుంతలా దేవి.
అది ప్రారంభం.
1944 లో ఆమెకి పదిహేనేళ్ళ వయసప్పుడు తండ్రి తో కలిసి లండన్ చేరింది.
ఆమె తన అర్ధమేటిక్ జ్ణానాన్ని అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తూ యూరప్, న్యూ యార్క్ లు పర్యటిస్తూ ఉండేది.
Arthur Jensen, అనే సైకాలజీ ప్రోఫ్ఫెసర్ (University of California, Berkeley ) ఆమెను అనేక సమస్యలకి సమాధానాలు రాబట్టాడు. అతని అసిస్టెంట్స్ ఆయన ఆడిగిన సమస్యని వ్రాసేలోగా ఆమె సమాదానం తో సిద్దం గా ఉండేది.
61,629,875 కి క్యూబ్ రూట్, 170,859,375 కి సెవెన్త్ రూట్ ఆయన నోట్ బుక్ లో వ్రాసేలోగా 395, 15 అని సమాదానం చెప్పింది. 1990 లో Intelligence అనే పత్రిక లో వీటిని ప్రొఫెసర్ పొందుపరిచారు.
1977 లో Southern Methodist University, లో జరిగిన ఒక ప్రదర్శనలో 201 అంకెల సంఖ్యకి 23వ క్యూబ్ రూట్ ఆమె 50 సెకండ్ల లో చెప్పేసింది. అప్పట్లో అత్యంత వేగమయిన UNIVAC 1101 కంప్యూటర్ లో ప్రత్యేక ప్రోగ్రాం వ్రాసి , సమాదానాన్ని నిర్ధారించుకోవలసి వచ్చింది.
1980 లో Imperial College London. వారు నిర్వహించిన ఒక కార్యక్రమం లో రెండు పదమూడు అంకెల లబ్దాన్ని 28 సెకండ్ల లో చెప్పి ఆందరి ని ఆశ్చర్యపరిచింది. 1982 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇది నమోదయ్యింది.
(7,686,369,774,870 × 2,465,099,745,779=18,947,668,177,995,426,462,773,730)
ఫిగరింగ్, ది జాయ్ ఒఫ్ కౌంటింగ్ అనే ఆమె వ్రాసిన పుస్తకాలలో అనేకి కీలక విషయాలు ప్రపంచానికి తెలియపరిచింది.
1960 ప్రాంతాలలో ఇండియా తిరిగి వచ్చిన ఆవిడ ఒక ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ ని వివాహం చేసుకుని. 1979 లో 50 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది.
తమాషా ఏమిటంటే 1977 లో ‘హోమో సెక్సువాలిటీ’ మీద ఆమె తన తొలి రచన చేసింది. దీనికి కారణం ఒక చీకటి కోణం.
1980 లో ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఇందిరా గాంధీ మీద పోటీ చేసింది. (ఇందిర నుండి మెదక్ ప్రజలని ని కాపాడటానికి అని ఇంటర్వ్యూ లలో చెప్పింది. ) చివరి రోజుల్లో ఆమె ఆస్ట్రాలజీ లో కూడా ప్రావీణ్యం ఉందని నిరూపించుకున్నారు.
21-04-2013 న బెంగుళూరు లో కుమార్తె అనుపమ కేర్ టేకింగ్ లో శ్వాసకోశ ఇబ్బందులతో 83 ఏండ్ల గణిత మేధావి తన జ్ణాపకం గా అనేక గ్రంధాలు మిగిల్చి బౌతికంగా ‘సైపర్’ (cypher) ఆయిపోయారు.
4, నవంబర్ 2013 న గూగుల్ ఆమె 84 పుట్టిన రోజు సందర్భంగా ఒక చిత్రాన్ని ప్రదర్శించింది. ఆమె వ్రాసిన కొన్న పుస్తకాలు:
• Astrology for You (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0067-6
• Book of Numbers (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0006-5
• Figuring: The Joy of Numbers (New York: Harper & Row, 1977), ISBN 978-0-06-011069-7, OCLC 4228589
• In the Wonderland of Numbers (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0399-8
• Mathability: Awaken the Math Genius in Your Child (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0316-5
• More Puzzles to Puzzle You (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0048-5
• Perfect Murder (New Delhi: Orient, 1976), OCLC 3432320
• Puzzles to Puzzle You (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0014-0
• Super Memory: It Can Be Yours (New Delhi: Orient, 2011). ISBN 978-81-222-0507-7; (Sydney: New Holland, 2012). ISBN 978-1-74257-240-6, OCLC 781171515
• The World of Homosexuals (Vikas Publishing House, 1977), ISBN 978-0706904789[11][21]