Sunday 22 October 2017

ఘర్వాలా


తెల్ల వారు ఝాము మూడున్నరకి ప్రతిరోజూ మాదిరిగానే..

కరిమున్ బస్ స్టాండ్ కి వచ్చేశాడు. రెగ్యులర్ గా వచ్చే బస్ వచ్చి రాగానే డ్రైవర్ ని విష్ చేశాడు.

“కాలి గాయం ఇంకా తగ్గలేదా?”  డ్రైవర్ పలకరించాడు.

“పర్లేదు కుట్ల వద్ద ఇంకా నొప్పిగానే ఉంది” సమాదానం చెబుతూ బస్సు లో నుండి పల్చటి గోనె సంచి లలో ఉన్న పూల మూటలని దించుకున్నాడు.

కరిమున్  ఇంటికి వచ్చేసరికి చెల్లెలు హసీనా, తల్లి ముందు గది శుభ్రం చేసి చాపలు పరిచి సిద్దం గా ఉన్నారు.

పూల మూట లు అక్కడ ఉంచి లోపలి కి వెళ్ళి మళ్ళీ ముసుగు తన్నాడు. 
అమ్మమ్మ దొడ్లో గిన్నెలు శుభ్రం చేస్తూ ఉంది.
కరిమున్ మళ్ళీ నిద్ర లేచే సరికి ముందు గదిలో రెండు మూటలు పూలు, మాలలు గాను, దండలు గాను మారి ఉన్నాయి .

హసీనా అక్కడే గోడ వారగా నిద్ర పోతూ ఉంది.  
కరిమున్ పూలు దగ్గర్లో ఉన్న మార్కెట్ కి వెళ్ళి షాపు లో  ఇచ్చి వచ్చేసరికి
తల్లి నాస్తా చేసి పెట్టింది.

అతను రెడీ అయ్యి మేనత్త గారి బాటరీ షాప్ కి పనిలోకి వెళ్ళాలి
.
తండ్రి చనిపోయాక మేనత్తే వాళ్ళ  కుటుంబాన్ని ఆదుకుంది.  
బర్తని ని ఒప్పించి పదహారేళ్ళ కరీమున్ ని పనిలో పెట్టించింది.

నెలకి ఆరువేలు జీతం ఇప్పించింది. చదువుతున్న ఇంటర్ ని మద్యలో ఆపేయ్యాల్సి వచ్చింది. తల్లి పిల్లా పూల దండలు కట్టి, పాత బట్టలు కుట్టి ఎంతో కొంత సంపాదిస్తుంటారు.

నెల క్రితమే బాటరీ షాపు కలెక్షన్ కోసం బండి మీద వెళ్తుంటే అజాగర్తగా వచ్చిన మరో బైక్ ని తప్పించబోయి కాలి మడెమ వద్ద గాయం అయింది. 
హాస్పిటల్ లో ఆరోగ్య బీమా కి సరిపడే ఎముక డామేజ్ కానందున స్వంత ఖర్చు మీద వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. మొత్తం ముప్పై వేలు అయింది. 
హసీనా నిఖా కోసం పొదుపు చేసుకున్న ఇరవై మూడు వేల తో పాటు అయిదు రూపాయల వడ్డీకి మరో ఏడువేలు అప్పు చేయాల్సి వచ్చింది.

“అన్నా ఇవాళ ఆదివారం..” హసీనా వచ్చి నాస్తా చేస్తున్న అన్న తో చెప్పింది.

ఆదివారం మద్యాహ్నం వరకు షాపు ఉంటుంది.  
మద్యాహ్నం నుండి ఖాళీయే.. చెల్లెలు కి తనతో  ఏమయినా పని పడిందేమో నని ఆమె వైపు చూశాడు కరీమున్ ..

“ఈ వాళ్ళ రెండో ఆదివారం అన్నా” హసీనా మెల్లిగా చెప్పింది.

ఘర్వాలా అయేగా .. ఇంట్లో ముసలమ్మ మెల్లగా గొణిగింది.

పోయిన నెల హాస్పిటల్ లో నే ఎక్కువ రోజులు గడిచి పోయాయి.

జీతం డబ్బులు షాపు లో రాలేదు. 
మూడువేలు అద్దె కట్టాలి. ప్రతి నెలా రెండో ఆదివారం ఇంటి యజమాని వస్తాడు. 
వేరే ఊర్లో  ఉంటాడు. ప్రతి నెలా బాడుగ డబ్బులు వసూలు కి మాత్రమే వస్తుంటాడు.  
తెల్లటి బట్టలు తొడుక్కుని  ఎర్రటి బండి వేసుకుని వచ్చి బయట నిలబడి హారన్ కొడతాడు. 
కరుగ్గా ఉంటాడు. డబ్బు విషయం తప్ప మరోటి మాట్లాడడు. 
ఇంట్లో చిన్న ఇబ్బందులు ఉన్నా ఆ లోకాలిటిలో ఇంత తక్కువ అద్దెకి ఆ మాత్రం ఇల్లు దొరకదు కనుక గమ్మున సర్దుకుపోతుంటారు.

 “అత్త వద్దకి వెళ్ళి కనీసం, సగం జీతం అయినా అడిగి వస్తాను.” కరీమున్ తల్లి తో చెప్పాడు.

కుట్టు మిషను డబ్బాలో నుండి డబ్బులు పోగు చేసి లెక్కపెడుతున్న తల్లి “ పన్నెండు వందలు ఉన్నాయి మరో పద్దెనిమిది వందలు కావాలి అంది”

కరీమున్ తింటున్న చేతిని కడుక్కుని బయటకి వచ్చి సైకిల్ తొక్కుకుంటూ రెండు వీదుల అవతల ఉన్న మేనత్త వద్దకి వెళ్ళాడు.

ఈ లోగా  బయట రోడ్డు మీది నుండి హారన్ మ్రోగింది. ఘర్వాలా బండి హారన్ అది. 
హసీనా లోపలి గది లోకి వచ్చింది.
తల్లి తడబడుతుండటం గమనించింది.

అమ్మమ్మ ముందు గది తలుపు తీసు బయటకి వచ్చి “కొద్ది సేపు కూర్చోండి. అబ్బాయి డబ్బులు తీసుకు రావటానికి వెళ్ళాడు.  పది నిమిషాల్లో వచ్చేస్తాడు.”

ముందు గదిలో కి వచ్చి కూర్చున్నాడతను. 
లోపలి నుండి హసీనా ఒక గాజు గ్లాసులో మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

మా మానమరాలు “ పరిచయం గా అంది. ముసలావిడ.
లోపల తల్లి కూతురు .. ముందు గదిలో ముసలమ్మ ఘర్వాలా..

పది నిమిషాలు అరగంట అయింది.

కరీమున్ వస్తూనే అతనిని విష్ చేశాడు. 
మూడువేలు లెక్క బెట్టి ఇచ్చేశాడు. నిమిషం లో ఘర్వాలా మాయం అయ్యాడు.
**
పది నిమిషాల తర్వాత ముందు గది కుర్చీ లో  ఒక కవరు పడి ఉండటం హసీనా చూసింది.

కవరు తల్లి కి చూయించింది. అందులో సరిగ్గా ఏడువేలు డబ్బు ఉంది.

కొడుకు ఘర్వాలా కి ఫోన్ చేశాడు.

“ సర్ మీ డబ్బుఉన్న కవరు  మా ఇంట్లో పడి పోయింది.”


“ముందు అయిదు రుపాయల వడ్డీ బాకీ తీర్చుకోండి. నెలకి అయిదువందలు చొప్పున నాకు అద్దెతో కలిసి ఇవ్వండి చాలు” అటునుండి ఘర్వాలా కరుగ్గా చెప్పాడు. 

1 comment:

Mamatha said...

ఇది చాలా బావుందండీ.. ఆ రోజే చెప్పాలి అనుకున్నాను..

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...