Wednesday, 14 June 2017

అప్పట్లో ఒక నెల బడ్జెట్


మా చిన్నమ్మాయి హై స్కూల్ లో ఉన్నప్పుడు, పొదిలి నుండి ఒంగోలు కి షిఫ్ట్ అయ్యాం.
స్కూల్ కి దగ్గర్లో ఒక చిన్న ఇల్లు 1500 రూపాయల అద్దెకి తీసుకున్నాం.
మ చిన్నది 9th క్లాస్ లోనూ, పెద్దది 10th లోనూ, సాయి 4th లోనూ ఉన్నారు.
చిన్నమ్మాయికి డబ్బు గురించి చెప్పాల్సిన వయసు వచ్చిందని అనిపించింది.
ఒక రోజు అందరం బోజనం చేసేటప్పుడు స్క్రిప్ట్ ప్రకారం మా చిన్నమ్మాయికి ఉన్న తెలివితేటలు గుండమ్మకి లేవని నమ్మేట్టు చెప్పాను. కావాలంటే ఒక నెల బడ్జెట్ తను చూస్తుంది అని చెప్పాను.
ఒకటవతేదీ జీతం 8,600 రూపాయలు, మా చిన్న దానికి ఇచ్చాం. తానొక నోట్సు పెట్టుకుని చిన్న బాగ్ ఒకటి వేరుగా ఉంచుకుని అందులో డబ్బు ఉంచుకుంది.
ప్రతి రోజు మా ఆవిడ ఖర్చులకి డబ్బు అడగటం, తను తీసి ఇవ్వటం, ఇంత ఎందుకయిందని ఆరా తియ్యటం. నోట్సు లో ఖర్చు వ్రాసుకోవటం. తీసివేతలు వేసి, బాలన్స్ చెక్ చేసుకోవటం మొదలయ్యింది.
ఈ విషయం లో ఎదురు దెబ్బలు తిన్న పెద్దమ్మాయి, చిన్న దాన్ని జాలిగా చూడటం మాత్రం దాచలేక పోయింది.
ఇంటి అద్దె, పాలు, కరెంటు బిల్లు, గాస్, స్కూల్ ఫీజులు, కూరగాయలు ఖర్చు పోను మూడు వేలు దాకా మిగిలాయి.
రెండు రోజులకి ఒక సారి పెట్రోల్ కి వంద అడిగే వాడిని, రెండు సార్లు బానే ఇచ్చింది. తర్వాత పెట్రోల్ వినియోగం వల్ల జరిగే అనర్ధాలు, భూమి వాతావరణ వేడి పెరగటం, ఓజోన్ పొర దెబ్బతినటం గురించి క్లాస్ ఇచ్చి, శుభ్రంగా బస్సు కి వెళ్ళండి అని 50 రూపాయలు చేత పెట్టింది.
ఈలోగా ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది. ఇంట్లో వాషింగ్ మెషీన్ పని చెయ్యటం మానేసింది.
అందరం దగ్గర్లో షాపు కి వెళ్ళి కొత్తది చూసి వచ్చాం. మా చిన్నది ఎన్నిరకాలుగా అడిగినా 7200 కి ఒక్క పైసా తగ్గేది లేదని ఖరాకండిగా చెప్పేశాడు.
ఇంటికొచ్చాక వాళ్ళ తమ్ముడిని అక్కని కూర్చోబెట్టి, పాత మిషను ఎందుకు చెడిపోయింది. దానిని ఎలా రిపైర్ చెయ్యొచ్చు అనే దానిమీద పరిశోదన చేసింది.
బట్టలు చేతితో ఉతకటం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో వాళ్ళ అమ్మకి చెప్పింది. మా ఆవిడ రెండు రోజులు ఉతికిన బట్టలు చిన్నదానితో ఆరేయించింది.
అది టప్పున మనసు మార్చుకుని "నాన్నా వాషింగ్ మెషీన్ వాయిదాల్లో ఇస్తారటగా" అంది.
పాత దాన్ని అమ్మేసాము.
అయిదొందలు కి మేం సిద్దపడ్డప్పుడు కొనేవాడి పీసు తీసి 550 వసూలు చేసింది.
ఆనెలలో అదొక్కటే జమ.
నాలుగు ఇంస్టాల్మెంట్స్ లో చెల్లించేట్టుగా వాషింగ్ మెషీన్ తెచ్చాము.
నెలలో మరో పది రోజులు మిగిలి ఉండగానే బాలన్స్ మూడు అంకెల్లోకి మారి పోయింది.
ఇంట్లో ఏ అవసరం వచ్చినా, చిన్నదాన్ని అడగాలంటే భయం వేసెట్టు గా క్లాసులు పీకటం మొదలెట్టింది.
ఈలోగా ఒక సెల్ ఫోన్ కోనాల్సిన పరిస్తితి వచ్చింది. కనీసం 2600 ధర ఉంది. (చైనా ఫోన్ లు రాలేదు)
“జీవనా ఒక ఫోన్ కొంటె ఎలా ఉంటుంది. “ పొద్దుటే టిఫిన్ చేస్తూ అడిగాను.
ఒక్క ఉదుటున వెళ్ళి డబ్బు సంచి, లెక్కలు వ్రాసి పెట్టిన పుస్తకం తెచ్చి....మా ముందు పెట్టి
” అయ్యా నా వల్ల కాదు. మీరే కొనుక్కోండి. ఈ నెల్లోనే వాషింగ్ మెషిన్లు, ఫోన్లు అన్నీ కొనెయ్యండి."
ఉడుకుమోతు తనంగా అరిచింది.
పెద్ద దాని చూపు కి పూర్తి అర్ధం చిన్నదానికి తెలిసింది.
“అమ్మ ఊరికే డబ్బు దుబారా చేస్తుంది తల్లి నువ్వయితే బాగా ఉంటుందని “ నేను ఉడికించాను. ..
“అయ్యా నాకు ఈ డబ్బు వద్దు.. ఈ పెత్తనం అసలే వద్దు.. “
అంటూ అలిగి మూతి ముడిచింది చిన్నది.
ఒక జ్ణాపకం

No comments: