Wednesday, 8 February 2017

మొహమాటానికి 'జై జవాన్' అందామా?!

అమర్‌ జవాన్‌ జ్యోతి....
ఢిల్లీలో ఉన్న అమర్‌జవాన్‌ జ్యోతి ముందు ఆగస్టు పదిహేనుకో, రిపబ్లిక్‌ డే నాడో పుష్పగుచ్ఛాలుంచడం మన నేతలకు ఆనవాయితీ. స్వాతంత్ర్యానంతరం మన దేశ సరిహద్దుల్నీ, సార్వభౌమత్వాన్నీ కాపాడేందుకు ప్రాణాలర్పించిన అమర జవాన్లకు స్మృతిగా బయోనెట్‌ నేలకు గుచ్చిన ఒక తుపాకీ, తుపాకీ మడపమై బోర్లించి ఉంచిన హెల్మెట్‌ ఉంటాయి. చనిపోయిన 20 వేలకు పైగా అమర జవాన్లకు గుర్తుగా ఈ స్మృతి చిహ్నం ఏర్పాటైంది. ..
దీని వెనుకే ఆకాశంలోకి దూసుకుపోయినట్టు ఇండియా గేట్‌ ఉంటుంది. 42 మీటర్ల ఎత్తైన గేట్‌ ఇది. ఢిల్లీకి వెళ్లిన వారు ఇండియా గేట్‌ను మిస్సయే ప్రసక్తే లేదు. మన సేనావాహినుల కవాతులు మొదలయ్యేది ఇక్కడ్నుంచే.
ఇంతకీ ఇండియా గేట్‌ను ఎవరు నిర్మించారు?
మనల్ని బానిసలుగా చేసిన బ్రిటిష్‌ పాలకులు...
ఎప్పుడు నిర్మించారు?
1921లో....
ఎందుకు నిర్మించారు? మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సామ్రాజ్య ప్రయోజనాల కోసం ప్రపంచం నలుమూలలా పోరాటాలు చేసి చనిపోయిన 90 వేల మంది భారతీయ సైనికుల స్మృతి చిహ్నంగా దీన్ని నిర్మించారు.

తమాషా చూడండి. మన జవాన్ల త్యాగాలను బ్రిటిష్‌ పాలకులు గుర్తించారు. కానీ మన సొంత ప్రభుత్వం ఓ తుపాకీ, ఓ టోపీతో సరిపెట్టేసింది. బానిసలకు పాలకులిచ్చినంత గుర్తింపు కూడా మన వారికి మన పాలకులు ఇవ్వడం లేదన్న మాట. ఆకాశంలోకి దూసుకుపోయే ఇండియాగేట్‌ నీడలో బిక్కుబిక్కుమంటూ అనాథలా మన జవాన్లను మన సర్కారు కట్టిన స్మృతిచిహ్నం ఉంటుంది.
రెండో ప్రపంచ యుద్ధంలోనూ మన జవాన్లు ప్రపంచమంతటా పోరాడారు. మిత్ర రాజ్యాల తరఫున శత్రువులపై విరుచుకుపడ్డారు. సైగాన్‌ నుంచి సింగపూర్‌ దాకా, అరకాన్‌ లోయ నుంచి ఒసాకా దాకా, సూడన్‌ నుంచి స్వీడెన్‌ దాకా అన్ని చోట్లా మన వీర జవాన్లు తమ రణభీకర రూపాన్ని ప్రదర్శించారు. ఎంతో మంది అసువులు బాశారు.
వారి పట్ల కృతజ్ఙతతో బ్రిటిషర్లు ఒక మిలటరీ ట్రెయినింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. దీనికి రిక్రూట్‌మెంట్‌ చేయడం కోసం దేశ వ్యాప్తంగా 16 ఫీడర్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కూడా భావించారు. అంతేకాదు...దీనికోసం ప్రజల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విరాళాలు సేకరించాలని, మిగతాది తాము భరించాలని భావించారు. ఆ మేరకు 1946లో ఒక నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు.
అయితే ఏ కారణంచేతనో అవి జరగలేదు.
చివరికి పూణేలోని ఖడక్‌వాస్లాలో నేషనల్‌ డిఫెన్స్‌ ఎకాడమీ ఏర్పడింది. అది రెండో ప్రపంచయుద్ధంలో మన వీరుల త్యాగాలకు కృతజ్ఙతగా కట్టిందన్నది చాలా మందికి తెలియదు. నేటికీ ఆ ఎకాడమీ నుంచి ఏటా వేలాది మంది మిలటరీ ఆఫీసర్లు తయారవుతూనే ఉన్నారు. దేశం కోసం పోరాడుతూనే ఉన్నారు. ..
..
మరి మన సర్కారు ఏం చేసింది? మీరు అడక్కూడదు...మనం మాట్లాడకూడదు.
భారత్‌ వదలి వెళ్లే హడావిడిలో బ్రిటిషర్లు నేషనల్‌ డిఫెన్స్‌ ఎకాడమీకి నిధులు కేటాయించలేకపోయారు. కానీ భవన నిర్మాణం మాత్రం చేయించారు.
అదెలాగ అనుకుంటున్నారా? రెండో ప్రపంచ యుద్ధంలో సూడాన్‌లో మన సైనికులు అసమాన సాహస పరాక్రమాలను ప్రదర్శించారు.
వారి వల్లే సూడాన్‌ ముస్సోలినీల కబంధహస్తాలనుంచి విముక్తమైంది.
భారతీయ జవాన్ల సాహసోపేత త్యాగాల పట్ల కృతజ్ఙతగా సూడాన్‌ జనత లక్ష పౌండ్లు విరాళంగా ఇచ్చింది. దానితోనే ఎన్‌డీఏ నిర్మాణం అయింది. ఖడక్‌వాస్లా లోని ఎన్‌డీఏలో ఇప్పటికీ ఒక సూడాన్‌ బ్లాక్‌ ఉంది.
ఈ బ్లాక్‌కే తలమానికంగా అద్భుతమైన జోధ్‌పూరీ రెడ్‌ సాండ్‌స్టోన్‌తో బాసాల్ట్‌తో కూడిన అందమైన గుమ్మటం ఉంటుంది. ఈ మహాద్వారం లోనుంచే నడిచివచ్చిన వేలాది మంది మన దేశం కోసం ప్రాణాలిస్తున్నారు.
..
మన ప్రభుత్వం సైనికులకు సరైన జీతాలివ్వదు. పే కమీషన్ల మేఘాలు సివిలియన్లపై వరాల వానలు కురిపిస్తూ సైనికుల దగ్గరికి వచ్చేసరికి వట్టిపోతున్నాయి. మేజర్‌ హోదా జిల్లా కలెక్టర్‌ హోదా ఒకటే అయినా జీతాల్లో, భత్యాల్లో, పవర్‌లో, ప్రభావంలో ఎంతో తేడా. ఇవన్నీ సరే ...కనీసం సైనికులకు సామూహిక స్మృతి చిహ్నం కట్టించడానికేం వచ్చింది? ఢిల్లీలో ప్రతి ఛోటామోటా నేతకీ ఓ సమాధి కట్టించి యాభై అరవై ఎకరాలు ధారపోస్తున్న సర్కారీ సుయోధన సార్వభౌముడికి జవాన్ల స్మృతి చిహ్నం దగ్గరికి వచ్చేసరికి సూదిమొన సైతం మోపేంత భూమిని ఇవ్వడానికి కూడా మనసు రావడం లేదు.
దేశం కోసం చనిపోయిన వారి కోసం కన్నీరుకార్చని సర్కారుకు, జనానికి భవిష్యత్తేముంటుంది? బంతులాటలో ప్రపంచ కప్పులు గెలిచిన వారికి కోట్లు ధారపోస్తూ బందూకులాటలో దేశం కోసం ప్రాణాలిచ్చిన వారికి తిరగేసిన తుపాకీ, బోర్లించిన టోపీతో సరిపెట్టే వారికి భవిష్యత్తేముంటుంది?
పి.ఎస్‌ - నేషనల్‌ డిఫెన్స్‌ ఎకాడమీతో పాటూ 16 ఫీడర్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని బ్రిటిషర్లు భావించారు కదా? అవే సైనిక స్కూళ్లయ్యాయి. మన రాష్ట్రంలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ అలా ఏర్పడిందే....

No comments: