Sunday, 12 February 2017

అరకేజీ చింతపండు

మా చిన్నప్పుడు గాజు సీసాకి తాడు కట్టుకుని, పావుకేజీ కొబ్బరినూనే, అరకేజీ బెల్లం కోసం అంగడికి వెళ్తే ఆవిమాత్రమే కొనుక్కుని ఖాతా పుస్తకం లో వ్రాయించుకుని వచ్చేవాళ్లం.
ఇది అప్పుడు.. ...
మరి ఇప్పుడో .....
షాపింగ్ మాల్ కి బుడ్డ కార్లో అమ్మగార్ని బుడ్డొడిని ఎక్కించుకుని వెళ్తామా?.. అక్కడ నుండి మొదలు..
మాల్ ముందే టేమ్టింగ్ గా స్వీట్ కారన్ స్వాగతం పలుకుతాయి. గుప్పెడు కూడా ఉండని గింజలకి మూడు ఇరవై లతో క్షవరం ప్రారంభం.
మాల్ లోకి ఎంటరవగానే వయసయిపోయిన ముసలి సామానుకి ప్రకటించే బంపర్ ఆఫర్లలో వద్దనుకుంటూనే వేలేడతాం వీలయితే కాలేడతాం.
రంగు రంగుల పాకెట్లు, పాకింగ్ లు extra లు చూసుకుంటూ.. వీధుల్లో కూరగాయాలమ్మేవాడిలాగా బండి తోచుకుంటూ బాస్కెట్ లో నింపేస్తాం.
ఈ లోగా బుడ్డోడు రెండు లీటర్ల తక్కువ కాకుండా కలిసికట్టుగా నిలబడ్డ సాఫ్ట్ డ్రింక్స్ వైపు వేలు లేపుతాడు. వాటిని కూడా బాస్కెట్ లో వేసేస్తాం.
ఆటాలు, అందమయిన పాకింగ్ లో ఉన్న మసిగుడ్డలు, సిత్ర్హూ పాకింగ్ తో ఉన్న నానా చెత్త కొంటాము. కౌంటర్ వద్ద బంగ్లా నుండి వచ్చిన కాందిశీకుల్లా నిలబడి కాష్ పే చేసే వారిని పురుగుల్లాగా చూస్తూ కార్డు గీకుతాం.
వాకిట్లో సలాం చేసినోడికి పార్కింగ్ లో దోవ చూయించినవాడికి బక్షిసులు ఇచ్చేస్తాం. వీలయితే కౌంటర్ పక్క నున్న ఐస్ క్రీం నాజూగ్గా నాకేస్తాం. ..
ఇంటి కొచ్చి చూస్తే అనవసరమయినవి, ఎందుకో కొన్నామో తెలియనివి, గతం లో కొని ఇంట్లో వాడకుండా ఉన్నవి అన్నీ కనబడతాయి. బెల్లం, కొబ్బరి నూనె మాత్రం వాటిల్లో ఉండవు.
ఇందుమూలంగా చెప్పదలుచుకున్నదేమిటంటే...ఇదంతా స్వయంగా చేసుకునే మంగలి పని..
పది రూపాయలు ఎక్కువయినా లిస్ట్ వ్రాసి ఇస్తే, మంచి శుబ్రమయిన సరుకులు ఇంటికి తెచ్చి ఇచ్చి డబ్బు పట్టుకెల్లే వాళ్ళు బోలెడు మంది ఉంటారు.
.
వాళ్ళకి చీటి వ్రాసి ఇచ్చి ఒక 'కిచెన్ స్కేలు' దగ్గర ఉంచుకుని రాండమ్ గా బరువు చెక్ చేసుకుని తీసుకోవటం.. చాలా మంచి పని.. .
ఆర్ధికంగా కూడా చాలా డబ్బు మిగులుతుంది.
ఉదయాన్నే మార్కెట్ దాకా నడిచి లేదా సైకిల్ మీద వెళ్తే తాజా ఆకుకూరాలతో పాటు....
****
ఆర్టికల్ వ్రాస్తున్నానా?
గుండమ్మ కేక..
“ఇదిగో వింటున్నావా? కాగితం పెన్ను తీసుకో.. పట్టీ చెబుతాను” అని


“ఏమి.. ఏమేమి .. కొసమెరుపు కధకుడిని, బ్లాగ్ కి వందలాది మంది రీడర్స్ ఉన్న వాడిని, పోస్ట్ పెడితే గంటలో పాతిక మందికి తగ్గకుండా లైకులు పొందేవాడిని, బోలెడు మంది ఫాలోయర్స్ ఉన్నవాడిని నన్ను సరుకుల పట్టి వ్రాయమందువా? ఎంత మాట? హేంత మాట? “
“తోటకూర కట్టెం కాదూ .. వ్రాయి చింతపండు అరకేజీ.. వేరుశనగ గుండ్లు రెండు కేజీలు .. వ్రాస్తున్నావా?”

No comments: