Saturday 7 January 2017

కొండెక్కని ధైర్యం


నరీందర్ కుమార్ ఆ మ్యాపు మీదకు వంగి పరిశీలనగా చూస్తున్నాడు.
అమెరికన్లు తయారు చేసిన కాశ్మీర్ మ్యాప్ అది.
“పాయింట్ 9842 …. ఇదిగో ఇక్కడుండి” అనుకున్నాడు మ్యాప్ లోని ఆ పాయింట్ పై వేలుంచి….
ఆ తరువాత ఈశాన్య దిశగా దృష్టిని పోనిచ్చాడు…. ఒక చోట ఆయన చూపులు ఆగిపోయాయి….
కళ్లు పెద్దవయ్యాయి….
ఆశ్చర్యం…. ఆ తరువాత కోపం … ఉప్పెనలా పొంగుకొచ్చాయి.
“ ఈ మ్యాప్ తప్పు…. మన దేశానికి చెందిన భూభాగాన్ని పాకిస్తాన్ భాగంగా చూపించారు. ఈ మ్యాప్ శుద్ధ తప్పు” అని గట్టిగా అరిచాడు నరీందర్ కుమార్.
అది 1978. కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఉన్న హై యాల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (ఎత్తైన ప్రదేశాల్లో యుధ్దం చేయడంలో శిక్షణనిచ్చే కేంద్రం) లో నరీందర్ కుమార్ కమాండెంట్.
మ్యాప్ లో దురాక్రమణే కదా అని నరీందర్ కుమార్ ఊరుకోలేదు. కాగితంపై కలం రాతల వెనుల మానసిక దురాక్రమణల దురూహలుంటాయి. ఆ తరువాత జరిగే భౌగోళిక దాడులకు అవి ముందస్తు సూచనలు.
మన నేల పాకిస్తాన్ ది ఎలా అవుతుంది?
ఈ ఒక్క ఆలోచన నరీందర్ కుమార్ ను నిద్రపోనీయలేదు. కొద్ది రోజుల్లోనే ఆయన పాయింట్ 9842 కి తన వెళ్లేందుకు తన పర్వతారోహకుల బృందంతో సిద్ధమయ్యాడు.
మొత్తం తెల్లగా మృత్యువస్త్రంలా పరుచుకున్న మంచు…
ఎక్కడ లోయ ఉందో …. ఎక్కడ అగాధం ఉందో తెలియదు….
కొద్ది గంటలు మాత్రమే సూర్యరశ్మి ఉంటుంది…..
ఆ తరువాత అంతా చీకటే…
ఇక ఉష్ణోగ్రత ….. మైనస్ 40 డిగ్రీలు….
అదొక హిమానీ నదం. అంటే చలికాలంలో శిలాఖండంలా ఉంటుంది. ఎండకి కరిగి నదిగా మారుతుంది. ఏప్రిల్ నెల వచ్చే సరికి ఆ మంచు ఖండాలపై నల్ల గులాబీలు మొలుస్తాయి. ఆ నల్ల గులాబీలను బాల్టీ భాషలో సియా అంటారు. నలభై యాభై మైళ్ల వైశాల్యం ఉన్న హిమఖండం అది....
పీర్ పంజాల్, జన్స్ కార్, లడాఖ్, సాల్టోరో, కారకోరం, ఆగిల్ మంచుకొండలను దాటి నాలుగున్నర నెలల ప్రయాణం తరువాత ఆ హిమానీ నదం శిఖరాగ్రాన్ని చేరుకునేసరికి అక్కడ పాకిస్తానీ సిగరెట్ ప్యాకెట్లు, తిని పారేసిన ఆహారపొట్లాలు, పర్వతారోహణ సామగ్రి పడున్నాయి. పాకిస్తానీలు అక్కడకి వచ్చారని చెప్పేందుకు ఇవే సాక్ష్యాధారాలు. వాటిని పక్కన పారేసి నరీందర్ కుమార్ తనతో తెచ్చిన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాడు. మంచుకొండలపై మన పతాకం గర్వంగా రెపరెపలాడింది.
అది ఏప్రిల్ 1981
నరీందర్ కుమార్ ప్రయత్నాలతో మన మంచుకొండలపై పాక్ పడగ విప్పుతోందన్న భయంకరమైన నిజం బయటపడింది. మన సేనావాహిని ఆ హిమానీ నదానికి వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జిని నిర్మించింది. 1984 నాటికి మన సైనికులు ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధభూమిపై స్థావరం ఏర్పాటు చేశారు. మేఘాలు కింద, మంచుకొండలు పైన ఉండే ఆ విచిత్ర స్థలికి చేరుకునేందుకు ఆపరేషన్ మేఘదూత్ అనే ప్రత్యేక ఆపరేషన్ నే నిర్వహించాల్సి వచ్చింది.
ఆ హిమానీనదం మన చేతుల్లో ఉంటే కాశ్మీర్ సురక్షితం. పాక్ కుట్రలు పనిచేయవు. చైనా ఎత్తుగడలు ఫలించవు. ఆ హిమానీ నదాన్నే సియాచిన్ గ్లేసియర్ అంటారు. సియాచిన్ అంటే నల్లగులాబీలు పెరిగే చోటు.
ఇప్పటికీ సియాచిన్ ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. కానీ సియాచిన్ మన చేతుల్లోనే ఉంది.
నరీందర్ కుమార్ ప్రాణాలకు తెగించి చేసిన ఈ అత్యద్భుత సాహసానికి గుర్తుగా సియాచిన్ లో ఆర్మీ బేస్ క్యాంప్ కి కుమార్ క్యాంప్ అని పేరు పెట్టారు. అది నేలకి 4880 మీటర్ల ఎత్తున ఉంది.
ఒక్క వ్యక్తి మ్యాప్ లో తప్పు చూసి ఉండకపోతే.....
చూసిన తరువాత నాకెందుకులే అనుకోకుండా ముందుకు నడిచి ఉండకపోతే....
నాలుగున్నర నెలల పాటు మైనస్ 40 డిగ్రీల మంచుకొండలపై కాలినడకన ఎక్కి సియాచిన్ చేరుకుని ఉండకపోతే...
కల్నల్ నరీందర్ ఈ సాహసోపేత యాత్ర చేసి ఉండకపోతే....
ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించుకొండి.... ఒక్క వ్యక్తి వల్ల భారతదేశపు చిత్రపటానికి కొత్త అర్థం వచ్చింది. మంచుకొండపై యుద్ధం చేసేందుకు ప్రత్యేక బ్రిగేడ్లు పుట్టుకొచ్చాయి. ఈ రోజు ప్రపంచం హై యాల్టిట్యూడ్ యుద్ధం ఎలా చేయాలో నేర్చుకునేందుకు భారతీయ మిలటరీ పాదాల దగ్గరికి వస్తోంది.
కల్నల్ నరీందర్ కుమార్ కి పర్వతారోహణ అంటే ప్రాణం. 1961 లో ఇలాగే మంచుకొండలు ఎక్కుతూంటే చలికి కాలు గడ్డకట్టుకుపోయింది. కాలికి నాలుగు వేళ్లు తెగిపోయాయి. అంటే కొండలు ఎక్కేటప్పుడు పట్టు ఉండదు. అయినా ఆయన పర్వతారోహణ ఆపలేదు. మనసు కొండలు ఎక్కిందే తప్ప ధైర్యం కొండెక్కలేదు. ఇరవై సార్లు 8000 మీటర్ల ఎత్తు ఎక్కాడు. 8000 మీటర్లంటే వాతావరణంలో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఊపిరి అందదు. అయినా పర్వతాలను ప్రేమిస్తూనే వచ్చారు కల్నల్ నరీందర్ కుమార్. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సియాచిన్ కి మొట్టమొదటిసారి సాహసయాత్రకు బయలుదేరినప్పుడు నాన్ లయబిలిటీ అగ్రీమెంట్ అంటే పర్వతారోహణలో ప్రాణాలు పోతే నాదే బాధ్యత అని లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే నిజంగా దేశమాత కోసం ప్రాణాలు పణంగా పెట్టేందుకు కల్నల్ కుమార్ సిద్ధమయ్యారన్నమాట.
ఆ యుద్ధభూమి మ్యాప్ ఇది (see map in images)కీర్తిచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్, పద్మశ్రీ, సైనిక గూఢచర్యానికి ఇచ్చే సర్వోత్తమ మెక్ గ్రెగర్ మెడల్ వంటివి కల్నల్ కుమార్ ను వరించాయి. కానీ విషాదం ఏమిటంటే మన భద్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఈ సాహస వీరుడి గురించి దేశానికి పెద్దగా తెలియదు. నాలుగో ఫోటో తరువాత మోడల్స్ బొమ్మలు రాకపోతే నన్నడగండి.
సియాచిన్ను, తద్వారా కాశ్మీర్ ను, తద్వారా దేశాన్ని కాపాడిన కల్నల్ కుమార్ గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు లేదు?
ఇలాంటి వారి గురించి యువతరానికి తెలియకూడదనా?
తెలిస్తే దేశభక్తి పేరుగుతుందనా?
యువకుల్లో కర్తవ్యభావన పెరుగుతుందనా?
పెరిగితే దేశాన్ని అమ్మేసేవాళ్ల ఆటలు సాగవనా?



(2011 లో రాకా సుధాకర రావు గారు వ్రాసిన కధనం)

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...