Thursday 29 December 2016

ఆ ఒక్కరూ !!

31 డిశెంబర్ అర్ధరాత్రి భారీ పార్టీ జరుగుతుంది.
..
ఆడవాళ్ళు, మగాళ్లు విడివిడిగా ఒక చోట పొగయ్యి పార్టీ ని ఎంజాయ్ చేస్తున్నారు.
... 
మైక్ లోంచి అనౌస్మెంట్ వినిపించింది.
..
ఎవరిదో లేడి వాయిస్ “డియర్ అల్ .. మీకు ఒక విన్నపం. ..
ఇన్నాళ్ళు మీరు అయినదానికి లేని దానికి మీ బార్యలని ఆడిపోసుకున్నారు.
అనేక జోకులు వేసుకున్నారు. మా గురించి దుష్ప్రచారం చేశారు.
కొంతమంది మామీద రకరకాల పోస్టులు వ్రాసారు.
అవి మీరు మాకు చదివి వినిపించి మరి నవ్వారు.
ఇక చాలు. ఇప్పటికే చాలా అసత్యాలు ప్రచారం చేశారు.
ఒక్క సారి నిజం చెప్పండి.
కొద్ది నిమిషాల్లో 2016 ముగియనుంది.
మిడ్ నైట్ గంట మ్రోగగానే మీరు ఒక్క పని చేయండి.
సిన్సియర్ గా ఆలోచించండి.. మీ జీవితం లో మిమ్మల్ని తలెత్తుకు నిలబడెట్టు, సమాజం లో గర్వంగా నడిచెట్టుగా చేసిన వ్యక్తి మీ అందరి జీవితం లో ఉన్నారు. మీరందరూ పెళ్ళయిన వాళ్ళు.
మిమ్మల్ని అత్యంత సంతోష పరచిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడే ఉన్నారని మీ అందరికీ తెలుసు.
కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచనగా బెల్లు మ్రోగగానే వెళ్ళి వారి ప్రక్కన నిలబడండి. వాళ్ళని సంతోష పరచండి. “
..
23.59.59 31.12.2016
..
క్షణం గడిచింది. బెల్లు మోగింది.
****
న్యూస్ వేడిగా : హైదరా బాదు జనవరి 1 2017. రాత్రి శిల్పా రామం లో జరిగిన కొత్త సంవత్సరం వేడుకలో చిన్న అప్రశ్రుతి దొర్లింది. పార్టీ లో కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచనగా బెల్లు మ్రోగగానే ఒక్క సారిగా పురుషులందరు నెట్టుకుంటుంటూ పార్టీలో మందు సర్వ్ చేస్తున్న ‘సర్వర్’ ల వద్దకి గుంపులు గుంపులుగా పరిగెత్తారు. పెద్ద తొక్కిసలాట జరిగింది. వివరాలు ఈవిధం గా ఉన్నాయి.

Saturday 24 December 2016

మరపురాని రోజు

ఆఫీసులో కూర్చున్నప్పుడు మా సూపరింటెండెంట్ గారి అబ్బాయి ఆయన కోసం వచ్చాడు. 
ఈ వారం లో అతని పెళ్లి కి నాకు ఆహ్వానం ఉంది. లంచ్ అవర్లో కాంటిన్ కి వెళ్దాం అతన్ని కూడా ఉండమని మా సూపరింటెండెంట్ గారికి ఇంటర్ కమ్ లో చెప్పాను. 
కాంటిన్ లో కార్నర్ సీట్లో కూర్చోగానే, వినయంగా ‘మా జి ఏం గారు’ అంటూ కొడుక్కి పరిచయం చేశాడు. 
“ని జీవితం లో ఈ రోజు అద్బుతమయినది. ఇరవై రెండేళ్ల సీనియారిటీ తో చెబుతున్నాను. భవిషత్తులో ఎప్పటికీ ఈ రోజు నీకు గుర్తుండి పోతుంది. అద్భుతమయిన, ఉత్చహమయిన, అపురూపమయిన ఈ రోజు ఎల్లప్పటికి  నిన్ను వెంటాడుతుంది.”
ఆర్డర్ చేసిన ఐటెమ్ వచ్చేవరకు ఆ కుర్రాడి కి చెప్పసాగాను.
“కానీ సార్.. నా మేరేజ్ రేపు సాయంత్రం సర్..” అన్నాడు ఆ అబ్బాయి.
అంతే అయోమయంగా చూశాడు సూపరింటెండెంట్.
“కాదని ఎవడన్నాడయ్యా?? రేపటి నుండి ఏమి మిగిలి చస్తుంది?”
సూపరింటెండెంట్ బేలగాను.. పిల్లాడు బయం బయం గాను చూశారు.

Friday 23 December 2016

ముగ్గురికీ తెలుసు !!

వడియాలు గాడి అంత కక్కుర్తి గాడిని మీరు ఇంతవరకు చూసి ఉండరు.
రెండు గంటల నుండి రిలయన్స్ మాల్ మొత్తం కలియతిరిగాడు.
ఆఫర్ లో ఉన్న లోయర్ లు మూడు పాక్  కొన్నాడు. 599 బిల్లుకి రిలయన్స్ కార్డు లో పాయింట్లు జత చేయించుకుని రెండు రూపాయలు కారిబాగ్ కి ఇవ్వాల్సివస్తుందని కూడా తెచ్చుకున్న క్లాత్ బాగ్ లో పెట్టుకున్నాడు.
“ఇక పద పోదాం” అన్నాడు.
“కొద్దిగా పని ఉందిరా. కాలేజీ డే పాంప్లెట్ లు ప్రింటింగ్ చేయ్యించాల్సిన పని ఉంది.”
“సరే అది చూసుకుని పోదాం’’ అన్నాడు.
నేను సెల్ లో ఫీడ్ చేసుకున్న బాల కృష్ణన్ కి ఫోన్ చేశాను.
“రామనాదం గారు చెప్పారు. ప్రింటింగ్ వర్క్  ఉంది”
అటునుండి ఆరవ తెలుగులో అతను రావాల్సిన చోటు చెప్పాడు. మేమున్న చోటుకి అయిదారు కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్లేస్. ఊరికి దూరం గా అగ్రహారం రైల్వే గేటు దగ్గర. అక్కడ అద్దెలు తక్కువని విని ఉన్నాను.
ఊర్లో ప్రింటింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు గాని బాల కృష్ణన్ తక్కువ రేటుకి ప్రింట్ చేస్తాడని  విని ఉన్నాను కనుక అతన్ని సంప్రదించాను.
“అగ్రహారం వెళ్తున్నామ్ రా.” వడియాలు గాడితో చెప్పాను.
బండి తీసి అగ్రహారం గేటు వైపు బయలు దేరాం. చీకటి చిక్క బడుతుంది. చల్లటి గాలి.
అతను చెప్పిన పాయింట్ వద్దకి చేరేసరికి అక్కడ ఒక వ్యక్తి సైకిల్ పట్టుకు నిలబడి ఉన్నాడు.
మమ్మల్ని చూడగానే నమస్కరిస్తున్నట్టు   చేతులు జోడించి. “నేనే బాలకృష్ణన్. నాతో రండి” అంటూ సైకిల్ ఎక్కి వేగంగా తొక్కసాగాడు. నడివయసు దాటి సన్నగా ఉన్న ఆతని ముఖం మీది మడతలు అతని వయసుని మరో పదేళ్ళు ముందుకు తోస్తున్నట్టు ఉన్నాయి.
రెండు మూడు సందులు తిరిగి ఒక ఇంటి ముందు ఆగాడు.
రేకులు కప్పిన ఒక మాదిరి చిన్న ఇల్లు అది. గది తలుపు తీసి లోపల లైటు వేసి మమ్మల్ని ఆహ్వానించాడు.
గది కి అనుకుని చిన్న వంట గది ఉంది. వెనుక మరో గది ఉంది. ఆ గదిలో ఒక మడత మంచం ఉంది. దానిమీద కుప్పగా బట్టలు వేసి ఉన్నాయి. పక్కనే చిన్న ఆఫ్సెట్ ప్రింటింగ్ మెషీన్ వెంటిలేటర్ మీదున్న పెషంటు లాగా ఉంది.
ఒక సాదారణ స్విచ్ బోర్డ్ కి సాకెట్ ద్వారా లూజు వైరు తో కనెక్ట్ చేసి ఉంది.
నేను  కూర్చున్న కుర్చీ విరిగిన చోట తాడు తో బిగించి కట్టి ఉంది. వడియాలు కుర్చీలో వెనక్కి వాలకుండా ముందుకు వంగి కూర్చున్నాడు. వంట గదిలో ఒక ఇండక్షన్ స్టౌ, పక్కనే నెత్తిన పొయ్యి ఉన్న చిన్న సిలిండర్ స్టౌ ఉంది. కొద్దిగా వంట పాత్రలు ఉన్నాయి. గదంతా నానా కాగితాలతో కలగా పులగంగా ఉంది.
ఎక్కువ సేపు కూర్చోవటం ఇష్టం లేక ‘’మొత్తం నాలుగు వేల కాపీలు కావాలి’’ అని తయారు చేసి వెంట తెచ్చుకున్న  మాస్టర్ కాపీ  ఇచ్చాను. అతను ఒక సారి తన ప్రింటర్ లో దాన్ని సెట్ చేసి  చూసుకుని తన రేటు చెప్పాడు. బజారులో కంటే చాలా తక్కువ. నాకు వెయ్యి మార్జిన్ తో బిల్లు పెట్టుకునే అవకాశం ఉంది.
“మరో రెండు వందలు తగ్గించుకో” అన్నాను.
“రోజంతా పట్టే మీ పని లో నాకు అయిదు కేజీల బియ్యం కూడా మిగలవు” అన్నాడు అతను.
తమిళ నాడు నుండి వచ్చి అక్కడ చిన్న చిన్న పనులు ఒప్పుకుని పదో పరకో కూడబెట్టుకుని ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి బార్య కి పిల్లలకి ఇచ్చి వస్తుంటానని, ఆమె అక్కడ ఆయాగా పని చేస్తూ ఉంటుందని. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె కి పోలియో వ్యాది ఉందని, ఇక్కడ  ఒక్కడే వండుకుని తింటూ తనకు చాతనయిన ప్రింటింగ్ పని తో నెట్టు కొస్తున్నానని మాటల్లో అతను చెప్పాడు.  తన బార్య కి ఆరోగ్యం అంతంత మాత్రమే అని చెప్పెటప్పుడు అతను మొహం తిప్పుకున్నాడు.
అప్పటిదాకా మూల నున్న పాత టేబుల్  మీద ఉన్న డోలక్ ని గమనిస్తున్న వడియాలు బాలకృష్ణన్ వైపు అనుమానంగాను, ఆశ్చర్యంగాను  చూశాడు.
లేచి డోలక్ తీసుకుని రెండు వైపులా ట్యూనింగ్ చేసి చిన్న దరువు వేశాడు.
“సరే నువ్వు అడిగినంత ఇస్తాను.  బిల్లు మాత్రం నేను చెప్పిన రేటుకి ఇవ్వాలి. ఒకసారి ప్రింట్ క్వాలిటీ చూద్దామా?”
ప్రింటర్ ఉన్న గది లోకి అడుగు పెడుతూ చెప్పాను.
అతను సరే అన్నట్టు తల ఊపి ప్రింటర్ ని ఆన్ చేసి వన్సైడ్ పేపర్ ఫీడ్ చేసి నాలుగయిడు ప్రింట్లు తీశాడు.
క్వాలిటీ తో తృప్తి పడ్డాక నేను అతనితో కలిసి ముందు గది లోకి నడిచాను.
అప్పటి దాకా డోలక్ పైన దరువు వేస్తున్న వడియాలు చేత్తో కొత్త అయిదువందల నోటు పట్టుకుని, బాలకృష్ణన్ ని చూస్తూ “ఈ కాగితాలలో పడి ఉంది మీదే అయి ఉంటుంది. తీసుకోండి “ అంటూ డోలక్ తో పాటు టేబుల్ మీద ఉంచాడు.
అది ఆబద్దమని గది లో ఉన్న ముగ్గురుకి తెలుసు.
మాటలు మరిచి పోయిన నన్ను చేత్తో తడుతూ “ఇక వెళదామా?” అన్నాడు వడియాలు




అద్దం లో టైం !

ఉదయాన్నే అంకెల్లేని వాల్ క్లాక్ లో టైమ్ అద్దం లో చూసి రైల్వే స్టేషన్ కి బయలు దేరాను. 
దట్టంగా పొగ మంచు. 20 నిమిషాల ప్రయాణం. 
తీరా అక్కడికి వెళ్ళాక గమనిస్తే అద్దం లో చూసిన టైమ్ కి సరిగ్గా 2.30 గంట రైల్వే క్లాక్ ఎక్కువ చూయిస్తుంది. 
ఇప్పుడు చెప్పండి నేను అద్దం లో చూసినప్పుడు రైట్ టైమ్ ఎంత?
(మా ఇంట్లో వాల్ క్లాక్, రైల్వే టైమ్ రెండు సమానమే) 

Thursday 22 December 2016

నేను అలిగాను.

“నాన్నా రాజా నేను అలుక్కున్నాం”  అంది మా పెద్దమ్మాయి…
టైమ్ చూశాను 7.45 అయింది.
“వింటున్నారా?” మళ్ళీ అడిగింది.
“ లేదు. నా సమస్యలు నాకున్నాయి. కారప్పొడి లో అమ్మ ఇంకా నెయ్యి వేయలేదు” ఇడ్లీ ప్లేటు చూపిస్తూ చెప్పాను.
“నేనన్నది .. తింటున్నారా? అని కాదు”
“మరి?” ...“రమా నెయ్యి కాగబెట్టటం ఎంతసేపు ?”
“ఎందుకు అలిగాను అని అడిగారా?”
“తప్పదా? ఎందుకు?”
“7.30 కి ఫోన్ చెయ్య మన్నాను. చేయలేదు.
“ఫోను సైలెంట్ లో ఉంటుంది చూడు.”
తను ఫోన్ తీసుకుని సైలెంట్ నుండి ఆప్షన్ మార్చింది.
అప్పటికే నాలుగు మిస్ కాల్స్, వాట్స్ అప్ మెసేజ్ లు ఉన్నాయి.
భావనా నా వైపు చూసి నవ్వేలోగా పోన్ మోగింది.
వంట గది నుండి ఇప్పట్లో .. నెయ్యి వచ్చే సూచనలు లేవు.

నేను కూడా అలిగాను.. 

Tuesday 20 December 2016

గమ్యం

వైయెస్సార్ బొమ్మ దగ్గర నుండి, కార్పొరేటర్ అంజన్న ఇల్లు దాటాక రెండో సందులో, రౌడీ షీటర్ కొటేశు ఇంటికి వెళ్ళే దారి లో..
..
కళ్యాణి బారు, నుండి మూడు రౌండ్ లు వెళ్ళాక, ఎడంపక్క చికెన్ కొట్టు రాజన్న ఉంటాడు ; వాడి ఇంటి పక్కనే....
..
మన జూనియర్ శివలక్ష్మి ఉందా? మాత్స్ లెక్చర్ వాళ్ళింటి దగ్గర, అక్కడ నుండి దగ్గరే..
..
Axis బాంకు, టపా చెట్టు బ్రాంచ్ దగ్గర..
..
ఎయిర్టెల్ టవర్ ఉందా? అటునుండి ఐడియా వైపు వెళ్తూ ఉంటే....
...
వెంకటప్పయ్య బోండాల కొట్టు తెలుసుగా, అక్కడికి వెళ్ళి ......
..
మెట్ల వెంకట సుబ్బయ్య వీది లో, కుడివైపు 12 వ ఇల్లు...
..
కళామందిర్ పక్కన ఉన్న సందులో, మూడు ముక్కల చీరలు అమ్ముతారు కదా ఆ ఇంటికి కి నాలుగు ఇల్లు అవతల, ఎర్ర గచ్చు మీద, తెల్ల పేయింట్ తో ఇరవయ్యి ఒక్క చుక్కల ముగ్గు వేసి ఉంటుందే ఆ ఇల్లు ....
***
గమ్యం  ఒకటే.. దారులు ఎన్నెన్నో..

అరగంట లో రిపోర్ట్.

20 రోజుల తర్వాత ఆఫీసుకు వచ్చాను. పద్మవ్యూహం లా ఉంది.
ఎప్పటిలాగే పని వేళలు ముగిసేటప్పుడు, ఒక మెయిల్ వచ్చింది. అర్జంటు అరగంటలో కావాలి అని ఒక ఫార్మేట్ అటాచ్ అయి ఉంది.
ప్రింటు తీసుకుని చూస్తే సెలవలు తీసుకునే ముందు రోజు అడిగిన ఫార్మేట్ (ఇన్ఫర్మేషన్) అది.
అప్పుడు పావుగంట లో కావాలన్నారు. ఇప్పుడు అరగంట టైం ఇచ్చారు.
బుర్రలోంచి అది పొదిగి పిల్లలు పెట్టకుండా, ఫార్మేట్ ఫిల్ చేసి రిప్లై ఇచ్చాను.
..
అరగంట తర్వాత వాట్స్ అప్ లో మెసేజ్ కనిపించింది.
నేనొక్కడినే కరెక్ట్ గా నింపి పంపినట్లు.
***
ఆరేళ్ళ క్రితం కన్యాకుమారి లో కొన్న గవ్వలు అవి.
ఏ ఫార్మేట్ వేసినా కరెక్ట్ గా ఉంటుంది..


Saturday 17 December 2016

వార్ధా... పార్ధా

నాలుగేళ్లుగా చెన్నై లో స్థిరపడ్డ దంపతులు 'వార్ధా' దెబ్బకి ఇబ్బంది పడ్డారు.
పవర్ లేదు, సెల్ సిగ్నల్స్ లేవు. ఛార్జింగ్ లేదు. ఇంటర్నెట్ లేదు. ఏమి లేదు.
హాల్లో చాన్నాళ్లుగా తెరవని కిటికీలు తెరిచి, సోఫాలో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకోసాగారు.
అప్రకటిత సెలవలు కారణంగా ఇంట్లోనే ఉండిపోయాడు ఆయన. 
భార్యకి, తాను ఎప్పుడో నేర్చుకున్న వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాడు. దోస గింజలు వేయించి చింతకాయ రోటీ పచ్చడి నూరిందామె.
పాత ఆల్బమ్ లు తిరగేస్తూ కబుర్లు చెప్పుకున్నారు.
"చూస్తూ ఉంటె మంచోడి లాగే ఉన్నావు"అందామె.
"ఈ నాలుగేళ్లలో ఇంత సేపు మాట్లాడానిచ్చింది ఇప్పుడే" అన్నాడు మొగుడు.
..
కనుక పార్దా.. పాజిటివ్ కోణము కాంచ వలె 

నేనూ వస్తా

చైనా ఫోను లో పక్క సీటు అతను మాట్లాడుతుంటే, బస్సులో తోటి ప్రయాణికులకు సమిష్టిగా టెలీ కాన్ఫరెన్స్ లో ఉన్నట్టు ఉంది.
"లేదు లక్మి .. నన్ను నమ్ము. ఒక్కడినే వెళ్తున్నాను. బస్సు పొదిలి దాటింది"
"పక్కన ఆ ఇడిసేసినది కూడా ఉందా?" 
అతను మెల్లగా "నేను ఒక్కడినే అని చెబుతున్నానుగా"
"మీ వేషాలు నాకు తెలుసు గాని, ఫోను దానికి ఇవ్వు"
"పక్కన ఎవరు లేరన్నానుగా?"
"అబ్బా.. కబుర్లు చాలు. చాలా విన్నాను. ఫోను దానికి ఇవ్వు"
..
..
..
****
పోను ఆపి జేబులో పెట్టుకుంటూ పది అంతస్తులు ఎక్కాక, ఫ్లాట్ తాళం చెవి మర్చి పోయిన వాడికి మళ్లే చూసాడు.
..
"తమ్ముడూ.. బస్సు స్టాండ్ లో దిగి, దగ్గర్లో రామ కృష్ణా ఖాదీ బండారు ఉంటుంది. నాలుగు గజాలు కాషాయం కొనూక్కో. నేరుగా స్టేషన్ కి వెళ్ళు.హరిద్వార్ కి తెల్లవారు ఝామున పాసింజరు ఉంది. రెండు టిక్కెట్లు కొను"
..
"రెండా?? రెండు ఎందుకు?"
" చేతిలో బాగు ఇంట్లో పడేసి, నేను కూడా వచ్చేస్తా"

ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కిల్స్

ఆఫీసుకి వచ్చి సీట్లో కూర్చునే లోపు వాట్స్ అప్ లో అఫిసు వాళ్ల ఎలెర్ట్ లు నాలుగున్నాయి.
విజయవాడ లో Improvement of skills (ఖాళీ చెంచాతో కడుపు నింపడం) గురించి మూడు రోజుల ఓరిఎంటేషన్ ప్రోగ్రామ్ ఉందని, మర్నాడు మొదలయ్యే మొదటి బ్యాచ్ కె అటెండవమని సారాంశం.
..
ఇంటికి ఫోన్ చేసి మర్నాడు పొద్దుటే ఏడుగంటలకి యస్వంతపూర్ రైల్ ఎక్కాలని, బాగ్ సర్దమని, ఒక తాఖీదు వినిపించాను.
..
పొద్దుటే ఇంట్లోనుండి బయట పడబోతు బాగ్ అందుకుంటే బరువుగా అనిపించింది. తీసి చూస్తే కావాల్సిన వాటితో పాటు శనగపిండి, చిన్న కాప్సికం లు కొన్ని, నూనె పాకెట్ ఒక కారిబాగ్ లో ఉన్నాయి.
..
"ఏమిటివి??" కేకెట్టాను.
"మీ ఫ్రెండ్ కుమార్ దగ్గర బజ్జిలు చెయ్యటం నేర్చుకుని రండి.. వస్తూ " అని ఒక సమాదానం.
"నేను వెళ్తున్నది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి"
"ఇంత కంటే ఉపయోగపడేది ఇంకేమయినా చెబుతారా??"
నిజమేననుకో.. అంత తేలిగ్గా బయటపడితే ఎలా??
"బాండి, చిన్న స్టవ్ కూడా సర్దాల్సింది" విసుక్కున్నాను.
"అవి అక్కడుంటాయి లెండి" తిరుగు టపా సమాదానం.
..
Solar Kumar సామి .. నువ్వు వంటగదిలో బజ్జీలు చేసే పోస్ట్ లు  పెట్టమాకు.

Wednesday 14 December 2016

భావనా- రాజ

మా ఇంటి మహారాణి, మా గారాల పట్టి, ప్రధమ పుత్రిక  చిరంజీవి భావనా స్రవంతి కి పాలడుగు రాజ కి డిసెంబరు పదవ తేదీ సాయంత్రం 7-37 కి వివాహం బంధు మిత్రుల సమక్షం లో, ఆహ్లాదంగా జరిగింది.
వేడుకకి విచ్చేసిన అనేక మంది మిత్రులు, బందువులు చిరంజీవులకి శుభాకాంక్షలు తెలియ చేశారు.
అందరికీ నమస్కారాలు.

Tuesday 6 December 2016

ఎంతెంత దూరం

నేను, అర్జున్ కలిసి మరో మిత్రుడి ‘బజాజ్ పల్సర్’ బండి లో 10 లీటర్ల పెట్రోల్ కొట్టించుకుని బయలు దేరాం..
... 
బండి థర్డ్ గేర్ లో స్ట్రక్ అయింది. గంటకి 30 కిలోమీటర్ల సగటు వేగం మాత్రమే ప్రయాణం చేస్తుంది...
.. 
అర్జున్ నడుపుతుంటే, వెనక కూర్చుని, పల్సర్ ఇచ్చిన వాడికి ఫోన్ చేశాను...
..
‘రేయ్ ఉల్లిపాయల బండి ఇచ్చావురా, అది కూడా చుక్క పెట్రోలు లేకుండా ఇచ్చి చచ్చావు. గేరు మారి చావట్లేదు. ఈ ఖర్చు తో కార్లో వెళ్ళి రావచ్చు గదరా గాడిదా ”..
..
అటునుండి వాడు “నీకో విషయం చెప్పటం మరిచిపోయా, మన బండి థర్డ్ గేర్ లో లీటరుకి 20 కిలోమీటర్లే వస్తుంది. పెట్రోల్ కార్బోరేటర్ వద్ద లీక్ అవుతుంది. రన్నింగ్ లో ఉన్నంత సేపు గంటకి సరిగ్గా అరలీటరు వేస్ట్ అవుతుంది. “ అని మరో బాంబు పేల్చాడు...
..
అడ్డ గాడిద..
_____
పని పూర్తి చేసుకుని వచ్చి, దెబ్బకి దెబ్బ వాడి బండి వాడికి,
చుక్క పెట్రోల్ లేకుండా ఇచ్చాం.
..
“ మనం ఈ రోజు ఎంత దూరం తిరిగి ఉంటాం?” అన్నాడు అర్జున్...
..
మంచి ఇరానీ టి లో బిస్కెట్ ముంచుకు తింటున్నాను. ..
నన్ను డిస్ట్రబ్ చేయొద్దు.
..
అర్జున్ కి సమాదానం చెప్పండి. 

కిడ్నాప్

స్వైపింగ్ మెషిన్, ఆన్లైన్ బదిలీ ఫెసిలిటీ ఉన్న B కంపని (బలవంతరావ్ సెటిలర్స్) కోయంబత్తూర్ బ్రాంచ్ కి ఫోన్ వచ్చింది. 
రిసెప్షన్ లో వివరాలు నోట్ చేసుకున్నాక, K సెక్షన్ కి కనెక్షన్ ఇచ్చారు. 
K సెక్షన్ అంటే కిడ్నాపింగ్ వ్యవహారాల సెక్షన్. 
మెయిల్ లో ఒక 20 ఏళ్ల కుర్రాడి ఫోటో, విలాసం , అతను చదువు కుంటున్న కాలేజీ వివరాలు ఉన్నాయి.
“ఫైనాన్స్ క్లియరెన్స్ అయిందా?” సెక్షన్ ఇంచార్జ్ అడిగాడు. 
“మెయిల్ లో రిసీట్ ఆటాచ్మెంట్ వచ్చింది”
“గుడ్ . చెప్పండి ఏమి చెయ్యాలి ?”
“ ఫోటో లో పిల్లవాడిని, కిడ్నాప్ చేసి నెల్లూరు లో ఒక పార్టీ కి అందించాలి. మాన్ హండ్లింగ్ గాని ఎలాటి అస్వోకర్యం గాని ఉండకూడదు ”
“ఓహో.. అయితే కష్టం. డీల్ ప్రైస్ రివైజ్ కోసం ఫైనాన్స్ కి తిప్పి పంపుతామ్”
“అక్కర్లేదు. పార్టీ సహకారం ఉంటుంది. క్లోరోఫామ్ కూడా అవసరం లేదు, చెప్పిన చోట మీరు కారు పార్క్ చేసి ఉంచితే, కుర్రాడు వచ్చి వెనుక సీట్లో కూర్చుంటాడు. రెండు బాగ్ ల లాగేజ్ ఉంటుంది. డిక్కీలో లో జాగర్తగా తీసుకు రావాలి. కార్లో ఏ‌సి పని చేస్తుందో లోదో చెక్ చేసుకోండీ”
“ఒకే అర్ధం అయింది. వారం లోగా మీ పని అవుతుంది.”
అటునుండి నవ్వు.
“వారం అయితే మీరేందుకు??.ఈ రోజే.. ఇప్పుడే జరగాలి.?”
“మీకేమయినా మతి పోయిందా?” సెక్షన్ హెడ్ కేకేట్టాడు . “ఈరోజు తమిళనాడు పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నారా? అమ్మ విషయం .. టీవి లో చూడటం లేదా?”
“ తెలుసు. అందుకే కదా మిమ్మల్ని కాంటాక్ట్ చేసింది. పిల్లాడి కాలేజీకి మూడు రోజులే సెలవు. రెండురోజులు తర్వాత అయితే పిల్లాడు ఇంటికి రైలెక్కి వచ్చేయగలడు. మీ వల్ల అవుతుందా కాదా?” అటునుండి విసుకున్నాడు ఆ తండ్రి.

Monday 5 December 2016

చిరునామా

లాండ్ లైన్ అటునుండి ఒక మొగ గొంతు
“హల్లో”
“ టు డబల్ త్రీ సిక్స్ యైట్ ఫోరా? “ 
“కాదు. ట్వెంటీత్రీ థర్టీ సిక్స్ యైటీఫోర్ ”
“నువ్వు గద్దలగుంట లో ఉండే పద్మగారి కొడుకువా?”
“అవును.”
“అమ్మ ఉందా? పోను ఇవ్వు “
ఫోన్ లో ఇంటి అడ్రెస్ అడిగాను. మళ్ళీ అబ్బాయికి ఇచ్చింది ఆమె. చిరునామా చెప్పటం కోసం.
“పెద్ద రావి చెట్టు పోయిన సంవత్సరం పడిపోయింది కదా అక్కడ నుండి కొత్తగా సిమెంట్ రోడ్డు వేసిన గల్లీ లోకి వస్తే, ____ పక్క సందులో రెండో గొంది ఎదురుగా వచ్చి మూడో పెంకుటిల్లు పక్కన పోస్టర్ లు మెసే ఆవులు ఉంటాయి...”
“అమ్మకి ఇవ్వు”
“ఆ శ్రీను చెప్పు,”
“ పద్మక్కా, మీ ఇంటి ఎదురుగా ఉన్న వేణు గోపాల్ నాకు తెలుసు?”
“మా ఇంటి ఎదురు ఉంది అడపా రమేశ్, మూడు బొమ్మల సెంటర్ వద్ద చిల్లర కొట్టు ఉంది ఆయనకి”
“సరే వస్తున్నాను. పది నిమిషాలు. అన్నట్టు పిల్లాడు టీచర్ ట్రైనింగ్ పూర్తయినట్టుంది. మంచి భవిషత్తు ఉంది” 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...