Friday, 18 November 2016

45. మర్చి పోలేని జోక్

మూసివున్న తలుపుల వైపు వింతగా చూస్తూ మెట్లు దిగుతుంటే.. ఒక సన్నటి వాచ్ మెన్ మరో, నున్నటి పనావిడ కలిసి మెట్లు ఎక్కుతూ ఎదురొచ్చారు. 
నేను అతన్ని ఫాలో అయి వెనక్కి వచ్చి తలుపు తీసే దాకా ఆగాను. 
ఏం కావాలన్నట్టు చూసి “ ఇ ఇ ఇ వాళ సెలవు. సే సే సే సెకండ్ శా శా శాటర్ డే “ అన్నాడు. 
నేను కొత్తగా ఉద్యోగం జాయిన్ అవటానికి వచ్చానని, అతనితో చెప్పాను.
“సోమవారం రమ్మని. రెండు రోజులు ఎవరు దొరకరని.”
రెండు వాక్యాలు పదే పదినిమిషాల్లో చెప్పేసాడు.
నేను వెనక్కి తిరిగి వస్తుంటే పిలిచాడు. ఏమిటన్నట్టు చూసాను.
పాపం అప్పుడే అతనికి తల జిల పుట్టినట్టుంది. ఒక చేత్తో గోక్కున్నాడు.
అతనేం మాట్లాడక పోయేసరికి నేను ఏమిటన్నట్టు సైగ చేసాను. అతను చేత్తో మళ్ళి తల గోక్కున్నాడు.
నేను అయోమయంగా అతన్ని చూస్తూ మెట్లు దిగాను.
నేరుగా నా డిప్లోమో క్లాస్మేట్ ‘అల్లుడు రమేశ్’ దగ్గరకి వెళ్లాను.
“మామా ఇది ప్రబుత్వ ఉద్యోగం మామా. ఇలానే ఉంటాయి. మీ సూపరింటెండెంట్ ఫోన్ నెంబరు నాదగ్గర ఉంది అతనితో మాట్లాడి ఒకసారి చెబుదాం “ అంటూ నాతో బయలు దేరాడు.
జేబులో ఉంచుకున్న చిన్న ఫోన్ బుక్ తీసి పబ్లిక్ ఫోన్ నుండి ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి “నే చెప్పానా? మామా? సోమవారం రమ్మన్నాడు.” అన్నాడు.
ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకుని విడిపోయాం.
**
సోమవారం ఉదయం తీరిగ్గా వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను.
మద్దిపాడు AE, M. రమేశ్ ని కలిసాను. .
“ పెద కొత్తపల్లి, SC కాలానికి వెళ్లి వంటుఫోర్ (1:2:4 సిమెంటు, ఇసుక, కంకర రేషియో, కాంక్రేట్ అని కాబోలు) వేస్తున్నారు, దగ్గర ఉండి వేయింఛి రా” అన్నాడు.
..
వెంటనే బస్ స్టాండ్ కి వెళ్లి పెద కొత్తపల్లి బస్ ఎక్కాను. 10 లేదా 12 కిలోమీటర్ల ఉండే ఆ వూరు చేరటానికి గంట పైగా పట్టింది. ఊర్లో దిగి sc కాలని ఎక్కడో విచారణ చేసుకుని అక్కడికి నడుచుకుంటూ వెళ్లాను...
ఉరికి ఒక చివర అయిదు సెంట్ల స్తలం లో ఒక చిన్న బలిచిన వాడి బాత్ రూము అంత గది కి, సబుకు కర్రలు నిలబెట్టి, నల్ల మట్టి పోసి నునుపుగా చేసి పేడ అలికి ఉంది. దాని మిద నిలువుగా అడ్డంగా కొన్ని టార్ స్టిల్ రాడ్లు మొహమాటానికి కట్టి ఉన్నాయి. (shuttering వర్కు, ఇలా చేస్తారని నాకు అంతకు మునుపు తెలీదు.)
..
ఒక పది, పన్నెండు మంది కాయకష్టం చేసే వాళ్ళు పోగయి ఉన్నారు. నాప బండల తో చేసిన ఫ్లాట్ ఫారం మిద కాకర కుప్ప గా పోసి ఉంది ఆ పైన ఇసుక మరో పొరగా పోసి ఉంది.
నేను ఆ beneficiary (లబ్దిదారుడు అట. అదే వినటం ) ని కలిసి, AE పంపారని, ఇక్కడ ఎక్కడో ఇంటి స్లాబ్ వేస్తున్నారు చూడమని పంపాడని చెప్పాడు. ఆతను ఒక ఇనప మడత కుర్చీ సంపాదించి తెచ్చి అక్కడ నీడ లో వేసి కూర్చో మన్నాడు.
ఇదే ఇల్లు అన్నాడు. నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉంటె ..
“ఇక మొదలెట్టండి.” అంటూ సిమెంటు బస్తాలు నేర్పుగా విప్పదీసి ఇందాకటి కుప్ప మిద పలచగా ఒక పోర లాగా పరిచాడు. తర్వాత, బుంగ లతో నీళ్ళు వంపుతూ మూడు కలిసేట్టు గా తిరగ గొట్టాడు. బోచ్చల్లో వేసిన దానిని మంచే మిద నిలబడిన ఇద్దరు పైకి చేరిస్తే పైన ఉన్న మరో ఇద్దరు దాన్ని చదరంగా పరవ సాగారు..
..
మూడు గంటల్లో అది పూర్తి అయింది.
మొత్తం పద్నాలుగు బస్తాలు కాంక్రీట్ !!
మర్నాడు AE ఆఫీసులో కలవగానే,
“నేర్చుకున్నావుగా వంటుఫోర్ ఎలా వేస్తారో “ అన్నాడు.
నా జీవితం లో మర్చి పోలేని జోక్ ఇప్పటి వరకు అదే.

No comments: