Thursday, 10 November 2016

39. స్టార్ట్ ఇమిడియట్లి


ఆదివారం రోజు యూనిట్ 1818 వద్ద కొందరం పోగయ్యాం, ఏం చేస్తే బాగుంటుంది అని మణి గారు అడిగారు, కింద నుండి స్టీల్ కట్ చేసి, సువ్వలు వచ్చి ఇరుక్కు పోయిన రేకు తొలగించి యదావిదిగా స్టీల్ రాడ్లు వెల్డింగ్ చేసి అంతవరకూ కాంక్రీట్ చేద్దాం. అని చెప్పాను. మరి కొందరు వాళ్లకి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చారు. చివరకి మణి గారు చెప్పినట్లు పై నుండి ఆ భాగాన్ని దొల్లగా చేసి రేకు తీసి వేసి, కాంక్రీట్ స్లర్రి తో నింపాము. నింపే ముందు లీక్ ప్రూఫ్ ట్రీట్మెంట్ చేయించాం. ఇదంతా సాయంత్రానికి పూర్తి చేసాం.
సైట్ ఇంజనీర్లు అందరిని మణి ఆఫీసు ఓపెన్ జీప్ లో దగ్గ్గర గ్రామం లో ఉండే తన ఇంటికి తీసుకెళ్ళాడు ఆ సాయంత్రం. తన భార్యని పరిచయం చేసాడు. మా అందరికి భోజనాలు వడ్డించారు ఇద్దరు కలిసి. తర్వాత గాజు కప్పుల్లో సేమ్యా పాయసం ఇస్తూ ఆవిడ “ఆ రోజు తమ పెళ్లి రోజని చెప్పారు”
సైట్ లో ఉండే టప్పుడు ఎంత రాక్షసంగా ఉంటాడో దానికి భిన్నంగా ఇంట్లో ఉండటం గమనించాను. చాలా మర్యాదగా, చక్కగా పలకరిస్తూ, ఒక బంధువు లాగా... అతని ప్రవర్తన లో ఎటువంటి నాటకీయత లేదు.
నేను బెంగుళూరు వెంకట్రావు గారి వద్ద గమనించిన అదే విదానం. కంపార్ట్మెంటలైజేషన్ .. అది అదే.. ఇది ఇదే..
***
హనుమంతప్ప రిజైన్ చేసి వెళ్ళాడు. బెంగుళూరు లో మరో జాబ్ ఎదో చూసుకున్నానని చెప్పాడు. ఎందుకో గాని అతని నిష్క్రమణ ఎవరిని ప్రభావితం చెయ్యలేక పోయింది. అది ఆదివారం తర్వాత సోమవారం వచ్చినంత సాధారణ కార్యక్రమం లా జరిగింది.
యూనిట్ 1010 పని మళ్ళి కొనసాగించాను. నాతో ఎక్కువ గా అవసరం లేకుండానే అది నడుస్తుంది. నేను మిలటరీ మోటార్ వెహికల్ స్టాండ్ పని చూడటం మొదలెట్టాను. ఆ పనిలో విశేషంగా నేర్చుకోటానికి పెద్దగా ఏమి లేదు వరుసగా రో గా గోడలు కట్టించడం అర్ధ చంద్రాకారం లో స్లాబ్ లు వెయ్యటం అంతే. స్తిరియో వర్కు. మద్యాహ్నం వరకు ఇదే పని. సాయంత్రం కేబుల్ చానెల్ వర్కు చూసుకోవటం..
హనుమంతప్ప వెళ్లి పోయిన నాలుగయిదు రోజుల తర్వాత అనుకుంటా ఒక శని వారం తిరిగి అదే జరిగింది. కేబుల్ చానెల్ పర్యవేక్షణ చేస్తుండగా అమినమ్మ నన్ను దాటి వేగంగా సబ్ సెంటర్ భవనం వైపు నడవటం. నాకు ఆశ్చర్యం వేసింది. క్వార్టర్స్ వైపు నడుస్తూ సబ్ సెంటర్ వైపు చూసాను. మరేవరయినా ఉన్నారేమో నని. ఇంకా అద్దాలు బిగించని భవనం దాదాపుగా లోపల భాగం అంతా కనబడుతుంది. సబ్ సెంటర్ ఖాళి గా ఉంది. ఆమె ఒక్కతే ఉంది. ఆమె నన్నే చూస్తుంది.. నా కోసమే చూస్తున్నట్లు ఉంది. ఆ కళ్ళలో ఎదో ఉంది .. ఏమిటది?? ఆకలా? కాదు.
దూరం నుండి సవారి సైకిలు తొక్కుకుంటూ వచ్చాడు.. సార్ మీ కోసం వెతుకుతున్నాను. అని ఫ్లాస్క్ లో టి వంచి గ్లాసు ఇచ్చాడు. జేబు లోంచి ఒక కాగితం తీసాడు.
అది టెలిగ్రాం.. అప్పటి టెలిగ్రాం లలో కామన్ గా ఉండే మాటే...” స్టార్ట్ ఇమిడియట్లి”

#33 Grade

No comments: