Tuesday, 13 September 2016

నా డైరీ లో ఒక పేజీ

ఇంటి దగ్గర బయలు దేరిన 19 గంటల తర్వాత కాలేజీ గేటు వద్దకి మేమిద్దరం అడుగు పెట్టాం. వాడికి కావలసిన వస్తువుల బాగ్ మోసుకుంటూ.. సాయంత్రం 5.15 అయింది. నేను ఫోన్ రింగ్ చేసేసరికి దూరం నుండి పరిగెత్తు కొస్తూ సాయి. 
ఎదురోచ్చి వాళ్ళ అమ్మని కరుచుకున్నాడు. నా దగ్గర బాగ్ లాక్కున్నాడు. తన కళ్ళు తడిబారటం నాకు తెలుస్తూనే ఉంది. నేను కళ్ళతోనే స్కాన్ చేసుకున్నాను. కిలోమీటర్ పైగా ఉన్న హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. వాడి కొత్త స్నేహితులకి మమ్మల్ని పరిచయం చేస్తూ.. కాలేజీ విషయాలు చెబుతున్నాడు. హాస్టల్ లోపలికి ఆమెని రానివ్వరు. తను రిసెప్షన్ లో కూర్చుని ఉంటే.. నేను వాడి రూమ్ కి వెళ్ళాను. పక్కనే కూర్చొబెట్టుకుని మరోసారి వాడి కళ్లలోకి చూశాను. “మీరు వస్తున్నారని మొన్ననే క్రాఫ్ చేయించుకున్నాను” అన్నాడు. నేను నవ్వాను. వాడి ఫ్రెండ్స్ కి అమ్మ చేతి వంటకాలు పంపిణీ చేశాడు. వార్డెన్ పర్మిషన్ తీసుకుని వాడి మిత్రులతో కొద్దిసేపు మాట్లాడి, బస్ ఎక్కి గంట ప్రయాణం చేసి Trichy వచ్చాం. బస చేసిన హోటల్ రూమ్ కి వెళ్ళి బోజనం ఆర్డర్ చేశాం. 
హాస్టల్ నుండి తెచ్చిన దుప్పట్లు, బకెట్ లో నానబెట్టి ఎలా ఉతకాలో వాడికి చిన్న డెమో ఇచ్చింది. తల్లి. “అక్కర్లేదమ్మా మా హాస్టల్ లో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. 9 కే‌జి కెపాసిటీ వి రెండు వారాలకి ఒక సారి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు అందులో వేస్తాను.. రోజు స్నానం చేసేటప్పుడు ఏరోజువి ఆరోజు ఉతుక్కుంటాను.” చెప్పాడు వాడు. 
ఆ రాత్రి మేం నిదరపోయింది తక్కువ. 
కాలేజీ ఆక్టివిటీస్ గురించి బోలెడు చెప్పాడు. మాకు కొన్ని అర్ధం అవకపోయినా సంగీతం లాగా వాడి మాటలు విన్నాం. 
ఆదివారం అంతా ముగ్గురం కలిసే Trichi లో తిరిగాం.
ఒకటి రెండు దేవాలయాలు కి ప్రశాంతంగా చూశాం. మద్యాన్నం ముగ్గురం హోటల్ గది లోనే బోజనం చేశాం. సాయంత్రం దాకా వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆరున్నర లోపు కాలేజీ కి వెళ్ళాలి trichi నుండి గంట జర్నీ ఉంది.
అయిదవుతుండగా నేను కర్కశంగా 'ఇక వెళ్దామా' అన్నాను. ఆమె నావైపు చూసింది. సెల్ నొక్కి టైమ్ చూసుకుంది. లేచి తయారయింది. సాయి తన బాగ్ సర్దుకున్నాడు. ముగ్గురం హోటల్ నుండి ఎదురుగా ఉన్న బస్స్టాండ్ కి నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరిమీ ఏమి మాట్లాడుకోలేదు. 1 వ నెంబరు బస్టాండ్ వద్ద వాడిని తంజావూరు బస్ ఎక్కించాక, కిటికీ లోంచి వీడ్కోలు చెప్పాము. వాడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అనేకం చెప్పాలనుకున్నాను. ఏమి మాట్లాడలేక పోయాను. నా శరీరం నుండి, మా ఆవిడ కళ్ల నుండి అనేక విషయాలు వాడికి చేరాయి. వాడు నా చెయ్యి వత్తాడు. చెప్పలేకపోయిన అనేక జాగర్తలకి సమాదానం ఉంది అందులో. 
నిర్ధాక్షణ్యంగా బస్ ‘హారన్’ మ్రోగిస్తూ కదిలింది. మలుపు తిరిగెంతవరకు చూస్తూనే ఉన్నాం. 
నా బార్య కళ్లలోకి చూడటానికి నాకు దైర్యం చాలలేదు. ఆమె కళ్ళలో కన్నీరు నన్ను వేటాడుతుంది. మౌనంగా బస్ స్టాండ్ లో ఒక బెంచీ మీద కూర్చుండి పోయాను. మరో వైపు ఆమె కూర్చుంది. ఎవరిమీ ఏమి మాట్లాడుకోలేదు. 
నా ఫోన్ మోగింది. “నాన్నా .. నేను కాలేజీ దగ్గర బస్సు దిగాను. మీరు ఇంకా అక్కడే ఉండి ఉంటారు. హోటల్ కి వెళ్ళండి. I can manage. డిసెంబర్ లో నేను ఇంటికి వస్తాను. అమ్మకి చెప్పండి.” అన్నాడు స్థిరంగా.

No comments: