Saturday, 30 July 2016

నిర్మల


1994 నవంబర్/డిశంబర్ నెలలో ఒక రోజు.
ఒంగోలు, కొండమీది శివాలయం ముందున్న ఒక మెస్ లో బోజనమ్ చేయటానికి ఆగాను. రెడ్డి మెస్ అని బోర్డు ఉంది. (బి‌జే‌పి రెడ్డి అంటే ఫేమస్ అప్పట్లో). అప్పటికే  రెండు రోజులయింది కడుపునిండా బోజనం చేసి నాన్న బేతున్ నర్సింగ్ హోం లో ఉన్నాడు. మా చిన్నమ్మాయి రోజుల పిల్ల. రమ పిల్లలు మా అత్తగారింట్లో ఉన్నారు. హాస్పిటల్ లో అమ్మ నాన్నకి తోడుగా ఉంది. బోజనమ్ చేసి అమ్మకి నాన్నకి ఒక పార్సిల్ బోజనమ్ తీసుకెళ్దామని బైట ఉంచిన తొట్టిలో నీళ్ళతో చేతులు మొహం కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాను.
పాతకాలం నాటి మిద్దె ఇల్లు అది. వరండా లో టేబుల్ కుర్చీలు వేసి ఉన్నాయి. అరటి ఆకులు వేసి ఉంచారు. ఆకు కడుక్కోగానే ఒక అమ్మాయి, కూరలు వడ్డించింది. రెడ్డి గారు వేడి వేడి అన్నం వడ్డించి మద్యలో నెయ్యి వంచి అప్పడం వేశారు. తెల్లటి అన్నం శుబ్రంగా రుచిగా ఉన్న కూరలు కడుపులో ఆకలి. పెద్ద పెద్ద ముద్దలు నాలుగు మింగాక కానీ నాకు కళ్ళు తిరగటం ఆగలేదు. ఈ లోగా పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి పలకరించాడు రోశయ్య పంతులు గారి పిల్లాడివి కదూ ?’ అని . అవునండి. ఆయన కొడుకునే” ఉదాసీనంగా చెప్పాను.
పిచ్చాపాటి నడిచాక “నాన్న ఆరోగ్యం బాగాలేదండీ. అర్జంటుగా GJ (అన్నవాహిక నుండి పెద్దపేగు కి వెళ్ళే మార్గాన్ని మరో మార్గం ద్వారా కలపటం) చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ లో ఉన్నారు. సర్జరీకి రక్తం HB కౌంట్ చాలా తక్కువ ఉంది. ప్రొఫెషనల్ డోనర్స్ బ్లడ్ నుండి హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా పెరగటం లేదు. ఫ్రెష్ బ్లడ్ అయితే మంచిది అని చెబుతున్నారు. పైగా నాన్నారికి A + రక్తం. అంత విరివిగా దొరికేది కాదు. కనీసం 50 శాతం కి చేరితే కానీ సర్జరీ వీలవదట.” అనవసరం అయినా దొరికిన చిన్న ఆదారాన్ని కూడా వదులుకోవటం ఇష్టం లేక వివరంగా చెప్పాను.
ఆయన అనవసరంగా వీడిని కదిలించాను అనట్టుగా చూశాడు.
అప్పుడు బోజనం వడ్డించే అమ్మాయి, ఒక్కసారి నాముందు ఆగి “నాది A+ బ్లడ్డే నేను ఇస్తాను” అంది స్థిరంగా.
అప్పుడామెని గమనించాను. సుమారు ఇరవై ఏళ్ల అమ్మాయి, ఎర్రగా చక్కటి పుటక, ముఖాన చదువు వల్ల వచ్చిన అందం. నేను ఆమెని అనుమానం గా చూశాను.
“రేపు సాయంత్రం తిరుపతి వెళ్తున్నాను. ఎల్లుండి నుండి ఎం‌ఏ క్లాసులు మొదలవుతాయి. ఎస్‌వి యూనివర్సిటీ లో ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అయితే నాకు వీలవుతుంది.” నాకు షాక్ మీద షాకు.
ఇంతలో పక్క నుండి నన్ను పలకరించిన ఆయన మొత్తానికి రెడ్డి గారి కూతురు అనిపించుకున్నావు” అన్నాడు.
అప్పుడు బి‌జే‌పి రెడ్డి గారి కి స్వయానా కుమార్తె అని నాకు అర్ధమయింది.
బోజనం పూర్తి చేసి పార్సిల్ కట్టించుకుని రెడ్డి గారితో చిన్నగా” మీ అమ్మాయి మా ఫాదర్ కి బ్లడ్ ఇస్తానని అంటుంది” నేను మాటలకోసం వెతుక్కుంటుంటే “ఇస్తానంటే తీసుకెళ్లు” అన్నాడాయన విషయం చాలా మామూలన్నట్లు.
మర్నాటి ఉదయం తొమ్మిది గంటలకి వచ్చాను. గేటు తీసుకుని లోనికి వెళ్ళేసరికి కూరగాయలు కోస్తున్ననిర్మల ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి డ్రస్ మార్చుకుని నాతో వచ్చేసింది. నేను రిక్షా పిలవబోతుంటే “డబల్స్ తోలటం రాదా అంది?”  నా bajaj M -80 బండి వెనుక కూర్చుని వచ్చి 300ఎం‌ఎల్ బ్లడ్ ఇచ్చింది. (నాన్న బ్లడ్ కి మ్యాచ్ చెయ్యటం నాన్నకి ఎక్కించడం దాదాపు 18 శాతం పెరిగి సర్జరీకి సరిపడే స్థితికి రావటం జరిగింది.)
తిరిగి నా బండి మీదే వాళ్ళ ఇంటి వద్ద దించాను. ఆ సాయంత్రం ఆమె బస్సులో తిరుపతి వెళ్ళేటపుడు బస్స్టాండ్ కి వెళ్ళి బలవంతాన “విజయానికి అయిదు మెట్లు” పుస్తకం చదవమని ఇచ్చాను.  
తరువాత కాలం లో నాలుగయిడు సార్లు రెడ్డి గార్ని కలిశాను కానీ నిర్మల ని మాత్రం కలవలేక పోయాను. ఎందుకో తెలీదు. ఈ రోజు ఆమె గుర్తొచ్చింది. ఈ పోస్ట్ ద్వారా ఆమె తారసపడితే సంతోషం.
నిర్మలా ఎక్కడున్నా, గొప్ప మనసున్న నీవు బాగుండాలి . stay blessed.  No comments: