Wednesday, 18 November 2015

నేను అబద్దం చెప్పాను -22

సరిగ్గా పదంటే పది రోజులు ఉన్నాయి కొత్త కొలువు లో చేరటానికి. జాయినింగ్ ఆర్డర్ అయితే హుషారుగా తీసుకున్నాను గాని, నాకు మొదటి అవకాశం ఇచ్చిన మా బాస్ కోటిరెడ్డి గారితో చెప్పటం ఎలా?
ముందుగా మాకు రావాలసిన పెండింగ్ బిల్ల్స్ అన్నిటిని చేయించి అప్పుడు ఆయన కి ఈ చెబుదామని మూడు రోజుల పాటు రాత్రి పగళ్ళు కూర్చుని ఆ పని చేశాను. ఈ లోగా ఆఫీసులో శాంక్షన్ అదికారి శెలవులో ఉండటం తో బిల్ల్స్ ‘చెక్’ దశ కి రాలేదు. టైమ్ దగ్గర పడుతుంది. ఎలా? ఎలా? 
వెంకట్రావు గారి సలహా తీసుకుని, ఫోనులో అబద్దం చెప్పాను. “ సార్ నేను మళ్ళీ చదువుకోవాలని అనుకుంటున్నాను. ఇంటికి వెళ్లిపోతాను “
కొద్ది నిమిషాల మౌనం అటునుండి. 
ఆయన బిల్స్ పరిస్తితి అడిగాడు. వివరంగా చెప్పాను.
“నువ్వు ఎక్కువ రోజులు ఉండవని నాకు తెలుసు. కాపర్ వైరు కాటా గురించి భాస్కర రావు తో అన్నప్పుడే అనుకున్నాను. సరే ని ఇష్టం” చెప్పడాయన. 
చాలా అసంతృప్తి ద్వనించింది ఆ స్వరం లో. 
వెంకట్రావు గారితో చెప్పి బాద పడ్డాను. 
ఒక అరగంట తర్వాత అటునుండి మరో సారి ఫోను భాస్కర రావు గారికి. నా జీతం మరో వంద పెంచడానికి సిద్దం అని . 
నా డెసిషన్ అయిపోయింది. నేను వెళ్ళే మూడ్ లోకి వచ్చేశాను. 
నా జీవితం లో మార్చి పోలేని మెంటర్ అయిన వెంకట్రావు గారికి వీడ్కోలు చెప్పి ఒంగోలు బయలు దేరాను. 

**
అక్క వాళ్ళ పరిస్తితి కొంత కుదుట పడింది. బావ పెర్ణమిట్ట సుబ్బయ్య స్కూల్ లో టీచరుగా చేరాడు. చాలా వరకు సర్దుకు పోగల ఆదాయం దొరికింది. అటువంటి ఆధారం కోసమే చూస్తున్న వాళ్ళు దానిని అందిపుచ్చు కున్నారు. అక్కకి కొంత యూస్డ్ ఫర్నిచర్, వంట ఇంటి సామాను కొనిచ్చాను. ఒంగోలు నుండి 13 కి మీ దూరం లో ఉన్న సీతారాంపురం లోని మా తల్లి తండ్రుల ఇంటి కి వచ్చాను. 
మా అమ్మ కుంకుళ్ళ తో తలంటి పోసి నా బట్టలన్నీ ఉతికింది. నాన్న నేను సంపాదించి దాచింది ఏమి లేదని చూచాయగా అన్నాడు. అర్ధం కానంత చిన్నవాడినేమీ కాదు. నాన్నా మనిద్దరం కలిసి నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అన్నాను. ఏమను కున్నాడో ఏమో గాని నవ్వాడు. “ఎంరోయ్ పెద్ద మాటలు మాట్లాడు తున్నావ్ ?”
నాకే ఆయనతో అలా మాట్లాడటం వింతగా అనిపించింది. మర్నాడు ఒంగోలు వెళ్ళి 55 రూపాయలతో అద్దంకి మీదుగా వెళ్ళే హైదరాబాదు బస్సు కి టికెట్ రిజర్వ్ చేయించుకున్నాను.
సూటికేసు లో లగేజ్ మొత్తం మళ్ళీ సర్దుతుంటే అమ్మ ఆశ్చర్య పోయింది. “ నేను హైదరాబడు వెళుతున్నాను. అక్కడ కొత్త ఉద్యోగం లో చేరాలి, రేపు ఉదయానికల్లా” చెప్పాను.
ఆరాత్రి బస్సులో నిద్రలోకి జారుకునే ముందు ఆరునెలల గతమంతా గుర్తొచ్చింది. ఇప్పటి దాకా లెర్నింగ్ అండ్ వర్కింగ్ , ఇక నుండి వర్కింగ్ అండ్ ఎర్నింగ్ అనుకున్నాను స్థిరంగా.
**
తెల్లారి హైదరాబాదు అమ్లీబిన్ బస్ స్టాండ్ లో దిగి సులబ్ కాంప్లెక్స్ వాడుకుని, సిటీ బస్సెక్కి ఛార్మినార్ వరకు అక్కడి నుండి మరో బస్ లో మామిడి పల్లి పహాడి శరీఫ్ గ్రామానికి చేరేటప్పటికి బాగా ఎండెక్కింది. 
బరువైన సూటికేసు మోసుకుంటూ ఒక దోశలు పోసే ముసలవిడ ని చూసుకుని టిఫిన్ తిన్నాను. 
అక్కడ కొన్ని వందల ఎకరాల స్థలం చుట్టూ రాతి గోడ (సెక్యూరిటీ వాల్ ) నిర్మాణం జరుగుతుంది. లోపల రోడ్లు ఇంకా వివిద భవనాల నిర్మాణం పని జరుగుతుంది. తాత్కాలికంగా ఎంట్రీ వద్ద ఏర్పాటు చేసిన గేట్ వద్ద సెక్యూరిటి కి నా జాయినింగ్ ఆర్డర్ చూయించాను. 

“ శర్వాణా .. ఉంలోగోమ్ కా ఆఫీస్ తో యహసే కామ్ సే కామ్ చార్ కిలోమీటర్ రాహ్తా. . తుమ్ ఆటొ లేకే సీదా జానా” చెప్పడతాను.
లోపలి నుండి వస్తున్న ఆటో ని ఆపి అడిగాను. 
“చాలిస్ రూపాయా దొగే?’
“అరె బయ్యా హామ్ గావ్ సే పచాస్ రూపయే సే యహ తక్ ఆయా!! ఔర్ ఆప్ ఇస్కే వాస్తే చాలిస్ మాంగ్ తే క్యా ?” నేను హింది ని ఉర్దు యాస లో కి మార్చి అడిగాను.
వాడి కుందేలుకి మూడే కాళ్ళు.
నేను దాదాపు 40 కిలోల బరువున్న సూటికేసు ని ఎత్తి నెత్తిన పెట్టుకుని ఆ ఎండలో, కొత్తగా వేస్తున్న గ్రవెల్ రోడ్డు మీద నెల కులీ పని కోసం నడవటం ప్రారంభించాను. 
‪#‎33grade‬

No comments: