Tuesday, 17 November 2015

మేనకోడలి ఏడుపు -18

పదోనెల నిండవస్తుందని. అయినా డెలివరీ అయ్యే సూచనలు లేవని,
అమ్మా వాళ్ళతో ఇమడలేక ..తన స్నేహితురాలు అధిలక్ష్మి వాళ్ళ కి సి‌ఆర్‌పి క్వార్తెర్స్ వద్ద ఉన్న పూరింట్లో తనే వండుకు తింటున్నానని, ఒక ప్రెస్ లో కొంపోజింగ్ వర్క్ కి వెళ్తున్నానని, బావ గుంటూరు నుండి ఆదివారాలు వచ్చి వెళ్తున్నాడని  పరిస్తితి ఏమి అర్ధం కావటం లేదని ఉందా ఉత్తరం లో.
నేను వెంటనే వెంకట్రావు గారి వద్ద శెలవు తీసుకుని, బాస్ కి సమాచారం చేరవెయ్యమని (ఓన్లీ ట్రంక్ బుకింగ్ ఫోన్ మాత్రమే ఉండేది) చెప్పి అదే రోజు బయలు దేరి మెజెస్టిక్ లో  సాయంత్రం 7-30 కి బస్ ఎక్కాను(65 రూపాయలు టికెట్). జేబులో ఉన్న 1350-00 జాగర్త చేసుకుంటూ .
తెల్లారి 7 గంటలకి ఒంగోలు చేరగానే బస్టాండ్ నుండి 3 కిలోమీటర్లు దూరం లో ఉండే సి‌ఆర్‌పి క్వార్టర్స్ కి అరగంట లోపే చేరాను.
నాకు ఆదిలక్ష్మి అక్క వాళ్ళ ఒకే గది గా ఉన్న పూరిల్లు తెలుసు. వెళ్ళే సరికి తలుపు తీసి ఉంది. కట్టెలపొయ్యి వద్ద అన్నం వండుకుంటూ అటుతిరిగి కూర్చొని ఉంది వాకిలి వద్ద నుల్చుని “అక్కా “ పిలిచాను.
పొయ్యి ముందు నుండి లేచి నిలబడింది. నిండు గర్భిణీ భారంగాను భారీగాను ఉంది. మెడలో నైటీ మీద  ఉన్న తువాలు సరిచేసుకుంటూ లేసి ‘చిన్నా’ అంది. పొయ్యిలోంచి వచ్చే పొగ వల్ల నేమో కళ్ళు తుడుచుకుంది.
“ఎందక్కా ఇది. ఏం జరుగుతుంది ?” అక్కని కరుచుకుని ఏడ్చేశాను.
అదృష్టవశాత్తు అధిలక్ష్మి అక్క (మా అక్క లక్ష్మి రాజ్యం కి డిగ్రీ క్లాస్ మేట్) అన్న డాక్టర్ వీరబ్రమాచారి గారు ఇరాన్, ఇరాక్ లలో 8 సంవత్సరాలకి పైగా పని చేసి వచ్చి ఒంగోలు లో ఒక చిన్న డిస్పెంసరీ తెరిచి ఉన్నాడు. ఒక మెల్ అసిస్టెంట్ తప్ప మరో ఆధారం లేదు. ఇంకా పూర్తిగా సెటిల్ అవలేదు . తన మిత్రుడు రంగుతోట లో ఉండే శంకరరావు గారికి సర్జరీ లు రిఫర్ చేస్తుంటాడు.
ఆరోజే నేను, అక్క ను తీసుకెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డంత పని చేశాను. ఆయన సిజేరియన్ చెయ్యక తప్పదు అన్నాడు. అప్పట్లో సిజేరియన్ కి దాదాపు 3000 ఖర్చు అయ్యేది.
నావద్ద 1200 మాత్రమే ఉందని చెప్పాను. ఇంకో రెండు మూడు వందలు పోగు చేయగలను మీరేలాగయినా కాపాడాలి అని ఆయన్ని వేడు కున్నాను.
ఆయన అంగీకరించాక, సీతారాం పురం లో ఉండే అమ్మా నాన్న వద్దకి వెళ్ళాను. నేను వచ్చినది జరిగినది చెప్పాను, “బావ పట్ల అసంతృప్తి ఉంటే అక్కని తరిమేస్తారా?” ఉడుక్కుంటూ అడిగాను.
సాయంత్రానికి అందరినీ పోగేశాను, మర్నాడు పొద్దుటే సర్జరీ ఏర్పాట్లు.
బావ పని చేసే రేడియో షాపు కి ఫోన్ చేశాను. ఆరోజు శెలవు తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరకి వినుకొండ వెళ్లాడట. వచ్చాక చెప్పమని చెప్పాను.
మర్నాడు ఉదయం శంకరరావు గారి హాస్పిటల్ నుండి ఫిమేల్ నర్సులని అరువు తెప్పించుకుని 28-06-1986 ఉదయం ఆయన సర్జరీ చేశారు. బి పి డౌన్ అయిన అక్కని కాపాడే ప్రయత్నం లో పుట్టిన శిశువుని కొంత సేపు పట్టించుకోలేదు. ఇంకా ఏడుపు అందుకొని ఆబిడ్డ మజాయిక్ ఫ్లోర్ మీద ప్లాజంటా లో నేలమీద జారటం వాకిలి వద్ద నుండి నేను గమనించాను.
అయిదు నిమిషాల తర్వాత ఆ శిశువుని రెండు కాళ్ళు పట్టుకుని పైకి లేపి వీపు మీద ఒక దెబ్బ వేశాడు ఆయన.

ఉదయం 8-12 నిమిషాలకి (ప్రస్తుతం బర్త లో పాటు డల్లాస్ లో ఉద్యోగం చేస్తూ ఉంటున్న) నా మేనకోడలు 'అనూష' ఏడుపు లంకించుకుంది .
‪#‎33grade‬

No comments: