Tuesday, 10 November 2015

రెండు కాళ్ళ ఎలుక -11

మా సీనియర్ ఎకౌంటెంట్  నారాయణ రావు గారు, ఆరోజు మధ్యాన్నం అవుతున్నా ఇంకా రాలేదు. మా బాస్ ఆఫీసులో కూర్చుని ఉన్నారు . గారిజన్ ఇంజనీరు, MES Works, వారికి కొంత కరెస్పాండెన్స్ చేయాల్సి ఉంది. అప్పటికే రెండు మూడు సార్లు మిగిలిన మా ఇద్దరినీ అడిగి ఉన్నాడు.
టెన్త్ ఇంటర్ మద్య కాలం లో చాలామంది మాతరం వారి లాగే  నేను కూడా  ఇంగ్లీష్ టైపింగ్ , కొన్ని క్లాసుల షార్ట్ హాండ్ నేర్చుకుని ఉన్నాను.
మా బాస్ నన్ను పిలిచి యు నో టైపింగ్ అని అడిగారు.  
తెలుసు అన్నట్లు తల ఊపి ఆయన ముందు నోట్స్ తీసుకుని కూర్చున్నాను.
ఆయన ఒక ముఖ్యమయిన లెటర్ డిక్టేట్ చేస్తే నేను వ్రాసుకుని వచ్చి, నిఘంటువు దగ్గర ఉంచుకుని టైప్ చేసి తీసు కెల్లాను. ఆయన దానిలో తప్పులు సరిచేస్తున్నప్పుడు నారాయణ రావు గారు హడావిడిగా వచ్చారు.
“ఆవడి పాత వర్క్ కి యర్తింగ్ కి 10 కే‌జి ల కాపర్ వైరు కావాలని సైట్ నుండి ఫోన్ చేశారు. రామనాదం (మా రెండో కొలీగ్ . రోజు అక్కడనుండే వస్తాడు) గారి చేత పంపుదామని, మనం రెగ్యులర్ గా కొనే షాపు నుండి తెప్పించాను”
ఆయన చేతి లో ఆ వైరు కట్ట అలానే ఉంది.
“నాకెందుకో ఇది అంత బరువు ఉండదని పించింది. మన వీది చివర వేయింగ్ మెషీన్ మీద అర్ధరూపాయి కాయిన్ వేసి తుస్తే 7.5 కే‌జిలు అని వచ్చింది. మరి రెండు చోట్ల చూస్తే ఒక చోట 8 కే‌జి అని మరో చోట 8.5 కే‌జి అని వచ్చింది. అందుకని పారిస్ మన షాపు కి వెళ్ళి తూయించుకుని వచ్చాను. అక్కడ 10 కే‌జిలు కరెక్ట్ గా ఉంది.” తను ఎంత బాధ్యత గా ఉంటున్నాడో చెప్పే ప్రయత్నం చేశాడు.
“ మనం బరువు చూసుకునే మిషిన్స్ స్ప్రింగ్ ఆధారితంగా ఉంటాయి. మీరు నిలబడి ఒక సారి, వైరు తో కలిసి మరొక సారి కాటా వేస్తే 1-00 పని అయిపోయేది. డబ్బు సమయము రెండు మిగిలేవీ” నేను చెప్పాను.
నారాయణ మూర్తి గారు నీకేం తెలీదు చిన్న పిల్లాడివి అన్నట్టు , బాసు మెచ్చుకోలుగాను చూశాడు.
ఆయన ఎవరిని ఏమి అనకుండా చేతి లోని సరి చేసిన  లెటర్ నన్ను టైప్ చెయ్యమని చెప్పి , మిగిలినవి తనకి డిక్టేట్ చేశారు.


******
నేను అక్కడ ఉన్నపుడే అపర్ణ అక్క పెళ్లి అయింది. పద్మిని ప్రీమియర్ కారు , అంబాసిడర్ కారు లో తాళ్ళూరు వెళ్ళి అక్కడే స్వగ్రామం లో వివాహం జరిపించుకుని తెల్లవారు జామున మద్రాస్ వచ్చారు. మర్నాడు ఒక పెద్ద ఫంక్షన్  హాల్లో అక్క రిసెప్షన్ ఉంది . ఒక రోజుకి అద్దె 6000 ట, కరెంటు బిల్లులు, వంట, డెకరేషన్ లాటివి అదనం. ధరలు నారాయణ రావు గారి నుండి వింటుంటే నాకు కళ్ళు తిరిగాయి. రెసెప్షన్ ముందు రోజు వంట సరుకులు ఫంక్షన్ హాలు కి చేర్చారు. అక్కడ పనివారు చేతి వాటం చూపకుండా, ఇంకా వచ్చేవి జాగర్త చెయ్యటం కోసం నన్ను ఆ రాత్రికి అక్కడే కాపలా ఉంచారు. ఆ సరుకుల పక్కన చాప మీద పడుకున్నాను.

****
అపర్ణ అక్క పెళ్లి రిసెప్షన్ లో ఏదో చాతనయిన పని చేస్తుంటే .. నాకెంతో ఆనందం గా ఉంది. ఆ రాత్రి సరుకులలో లోంచి కనీసం అరకేజీ జీడిపప్పు , కిస్మిస్ మాత్రం ఒక రెండు కాళ్ళ ఎలుక తినేసింది. J

No comments: