Wednesday 29 July 2015

ఆవు కాలు విరిగింది

అనగనగా ఒక రైతు .
అతనికి ఇంటివద్దే ఒక చిన్న డైరీ ఫామ్. 
ముర్రా బర్రెలు కాకుండా ఒక మూడు ముచ్చటయిన జెర్సీ ఆవులు.
ఆవు పాలు, బర్రెపాలు కలిసి పుటకో కాను (40 లీ ) పాలు కేంద్రానికి పంపుతాడు.
..
.నెల రోజుల క్రితం ఒక ఆవు గచ్చు మీద ..
ముందు కాళ్లు ఎడంగా పోయి జారీ పడింది. తుంటి ఎముక విరిగింది.
తిరిగి లేవలేక పోయింది. రైతు మిత్రుల సాయంతో లేవదీసీ పడుకో పెట్టాడు.
స్టానిక గోపాల మిత్ర చేత వైద్యం చేయించాడు. మండలం లోని పశువుల డాక్టర్ తో
సూది మందు ఇప్పించాడు. రెండు మూడు రోజులు గడిచాయి.
ఇసుమంత కూడా మెరుగు కనిపించలేదు..
..
డాక్టరు గారు పశువుని అమ్ముకో .. ఇంక కాలు రావటం కష్టం.
యాబై వేల ఆవు , ఇప్పుడయితే ఆరేడు వేలకి అమ్మోచ్చు.
మరేదయినా అయితే అదికూడా నష్టం.
అని సలహా ఇచ్చాడు. రైతు తట్టుకోలేక పోయాడు ..
ఎక్కడో "త్రిపురంతకం' వద్ద లంబాడీలు కట్టు కడతారు అంటే అక్కడికి చీకటి తో వెళ్ళి ,
వాళ్ళను నచ్చచెప్పుకుని తీసుకు వచ్చాడు . కట్టు కట్టించాడు.
ఉగ్గాణి కట్టించాడు ..
( నులక మంచం లో నాలుగు కాళ్ళు పెట్టి, పొదుగుకి ఇబ్బంది రాకుండా
చేసి నాలుగుమూలలా తాళ్ళతో .. కప్పుకి వేలాడ దీస్తారు.
కాళ్ళు నేలమీద ఆనీ ఆననట్లు ఉంచుతారు.
కాళ్ళ మీద బరువు పడకుండా జాగర్త తీసుకుంటారు.)
..
నెల రోజుల పాటు దాణా, కుడితి ,పెట్టి , మందులతోనూ, కాలికి కట్టు మార్పించడం తోను
ఫిజియో తెరపీ (తనకు తెలిసిన) తో అల్లారుముద్దుగా చూసుకున్నాడు...
..
నిన్ననే ఊగ్గాణీ తీసేశారు. ఆవు చిన్నగా లేచి నుంచుంటుంది.
డాక్టర్ వచ్చి ఆచ్చెరువు చెందాడు...
రైతు ని ఆవు అందినకాడికి నాలుకతో నాకుతుంది.


..
ఆ రైతు తాళ్ళూరు లో మా చేను కవులు చేసే రైతు .. అతని పేరు సాంబిరెడ్డి .
ఈ రోజు నేను వెళ్ళి ఆ ఆవుని చూసి వచ్చాను . ఎంత సంతోషంగా ఉన్నాడు అంటే
యాక్సిడెంటు అయిన బిడ్డ ఆరోగ్యంగా తిరిగి వచ్చినట్లు .. ..చూడటానికి ఆ దృశ్యం
ఎంత గొప్ప గా ఉందంటే .. నా దగ్గర మాటల్లేవు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...