Thursday, 23 July 2015

చేసింది చెప్పు

చాలా కాలం (1986 లో ) క్రితం (నాకు 21 ఏండ్ల వయసులో ) ,
ఒంగోలు లో ఇరానీ చాయ్ 0.30 పైసలు చేసినప్పుడు,
వేంకటేశ్వర ధియేటర్ లో నేల క్లాసు టిక్కెట్ 0.70 నుండి 0.90 పైసలు కి ,
నెలవారి మెస్ బిల్లు (60 బోజనాలు)రూ 150.00 కి పెరిగినప్పుడు..
నేను హైదరాబాదు మామిడిపల్లి దగ్గర్లో పహడి షరీఫ్ లో నిర్మాణం లో ఉన్న
RCI (Reach Center Imrat ) https://rcilab.in/ లో శరవణ కంస్ట్రక్షన్ కంపెనీ తరపున
ఒక్క బుల్లి ఇంజనీరుగా నెలకి 750-00 జీతం, ఆకామిడేషన్, ఉచిత బోజన సదుపాయాలతో
గర్వంగా పనిచేస్తున్న రోజులు ....
కేబుల్ చానల్ (యూనిట్1010) కి ఇంచార్జి గా ఉన్నాను. వివిద రకాల మిల్టరి అవసరాల కోసం
నిర్మించే పెద్ద భవనాలకి లింక్ చేస్తూ నడపాలిసిన కేబుల్స్ కోసం భూమి లో u ఆకారపు
నిర్మాణాన్ని కంక్రీట్ తో చేసి దానిని ప్రీకాస్ట్ శ్లాబులతో క్లోజ్ చేసే విడం గా జరిగే సివిల్ వర్కు.అది
సివిల్ ఇంజనీరుగా నేనేదయినా నేర్చుకున్నాను అంటే అది అక్కడే..
అక్కడున్న ప్రతిరోజూ అనేక విషయాలు, సాంకేతిక , లాజికల్ విషయాలు నేర్చుకునేవాడిని.
అలాటి పని చేసే రోజుల్లో ..
ఒకసారి' రికాన్దో' సంస్థ నిర్మించే రోడ్డు కట్ చేస్తూ జి‌ఐ పైపు లు వేసి ఇరువైపులా
వస్తున్న కేబుల్ చానెల్ ను లింక్ చేయాల్సి వచ్చింది. అందుకోసం జి‌ఐ పైపులు రోడ్డువారగా
నిల్వ చేసి ఉంచాము. రోడ్డు ని డోజర్ తో కట్ చేశాక నిపుణులయిన పనివాళ్లు జి‌ఐ పైపులు
కప్లింగ్ ల సాయంతో కలుపుతుంటే..వరుస లేయర్స్ తో కాంక్రీట్ కుషన్ వేయిస్తున్నాం.
..
నేను వ్యూ మొత్తం కేప్చర్ అయ్యే విధంగా థియోదలైట్(theodolite) ను సెట్ చేసుకుని
పనివాళ్ళకి సూచనలిస్తూ, అలైన్మెంట్ చూసుకుంటున్నాను. కన్నడ, తమిళ కూలీలు
పనిచేస్తున్నారు, మూడు భాషలలోకి స్విచ్ ఓవర్ అవుతూ అందరినీ
సమన్వయం చేసుకుంటూ మంచి ఔట్ పుట్ కోసం .. అందరం శ్రమిస్తున్నాం...
మరికొద్ది నిమిషాల్లో ఆ రోజు పని ముగిస్తాము ఆనంగా ...
అప్పుడు హటాత్తుగా అప్పుడు రోడ్డు వారగా నిలవ చేసిన GI పైపులు కదిలి
నేను త్రిపాడ్ మీద ఉంచిన థియోడలైట్ వరకు దొర్లుకుంటూ వచ్చాయి.
స్టాండు పక్కకి జారి చాలా ఖరీదయైన (అప్పట్లోరూ 50,000.00) సర్వే పరికరం
విసురుగా నేలకి కొట్టుకుంది.
దూరంగా ఉన్న నేను గబాలున అక్కడికి వచ్చాను. నిలువుగా ఉండే అలైన్మెంట్ డాట్స్ కదిలిపోయాయి.
అన్మౌంట్ చేసిన థియోడలైట్ తిరిగి బాక్స్ లో పట్టలేదు, ఒక పని వాడు
బలవంతాన పెట్టెలో ఇరికించాడు. మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న కంపనీ
ఆఫీసులో నాపేరు మీద ఉదయాన్నే తీసుకున్న ఇన్స్ట్రుమెంట్ ను తిరిగి ఇచ్చేశాము .
నేనేమీ చెప్పలేదు. యాదృచ్చికంగా జరిగినా జరిగిన నష్టం మాత్రం చాలా ఎక్కువ.
నేను సంవత్సరకాలం పని చేసినా దానిని రీప్లేస్ చేయలేను.
ఎవరితో మాట్లాడకుండా.. క్వార్టర్స్ కి వెళ్ళాను.. తలానిండా ఉన్న దుమ్ము వదిలించుకొటానికి
రోజు తల స్నానం చేస్తాము . ఆ రోజు అది కూడా చేయలేదు..
మెస్సు లో ఏమి తిన్నానో, అసలు తిన్నానో లేదో కూడా గుర్తు లేదు.
అక్కడున్న కామన్ టి‌వి రూములో నేషనల్ చానెల్ లో 'బనియాద్' సీరియల్
వస్తుంది అప్పట్లో నా ఫేవరేట్ టి‌వి షో అది . దానిని చూడలేదు. వెళ్ళి రూములో పడుకున్నాను.
మనసంతా తెలీని బాద.. ఎవరితో షేర్ చేసుకోలేని బాద.
మరో రోజు మరో ఇంజనీరు దానిని సైట్ కి తీసుకెళతారు . ఇన్స్ట్రుమెంట్ డామెజి ని గుర్తిస్తారు
గతం లో దానిని ఎవరు వాడారో రికార్డులలో ఉంటుంది. అప్పుడు జనరల్ మేనేజరు
' మణీ' సార్ ముందు చేతులు కట్టుకుని...దోషి లాగా .. మా నాన్న గుర్తు వచ్చారు ..
నో ..నో ..
పగలంతా చాకిరీ చేసినా .. నిద్ర పట్టలేదు ,, ప్రాజెక్ట్ మేనేజరు ..
‘దొడ్డప్ప’ కన్నడం లో ఏమి అంటాడో అని ఆలోచిస్తూనే ఉన్నాను ..
ఆ రాత్రి నేను నిద్ర పోయిన గుర్తు లేదు. ఉదయానికి నా బుగ్గల మీద కన్నీళ్లు చారలు
కట్టడం గమనించాను.
నేనొక నిర్ణయానికి వచ్చాను. నేరుగా జనరల్ మేనేజరు 'ఈశ్వర మణి' రూము వద్దకు
వెళ్ళి బయట నుంచున్నాను. ఆయన ఇంకా రాలేదు . దగ్గరలోని పల్లెటూర్లో ఉండే ఆయన అందరి కంటే ముందే ఉదయం 8.00 గంటలకే యెజ్ది బండి మీద టంచనుగా వచ్చేస్తాడు.
నేను వెళ్ళిన పది నిమిషాలకి ఆయన వచ్చారు.
" ఏం మిస్టర్ రావ్ . లీవు కావాలా?" నవ్వుతూ అడిగారాయన. నేనంటే మంచి అభిప్రాయం ఉంది ఆయనకి ..అయిదు భాషలు అనర్గళంగా మాట్లాడే ఆయన సైట్ ఇంచార్జీ .
"లేదండీ.." నా గొంతు నాకే వినబడలేదు.
నా ముఖం లోని దైన్యాన్ని గుర్తించి " ఏమయింది రావ్ ?" అన్నాడు.
అప్పటి దాకా ఆపుకున్న దుఖం కట్టలు తెచ్చుకుంది.బోరున ఎడ్చాను .
కన్నీళ్లు చెంపలమీదికి జారీ పోతుంటే ఆయన కంగారు పడ్డాడు.
దగ్గరగా వచ్చి అనునయంగా బుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు.
నేను పెద్దగా ఏడ్ఛాను. రెండు మూడు నిమిషాల్లో తెరుకుని మొత్తం చెప్పేశాను.
నా మనసులోని భారం అంతా దిగిపోయింది. ఏమయినా జరగని. ఒక యడాది పాటు
జీతం లేకుండా పని చేసినా సరే. నేను తప్పుని దాచలేక పోయాను.
ఆ రాక్షసి ని మనసులో బంధించడం నావల్ల కాలేదు.
..
.. కొద్ది నిమిషాలు మౌనం గా గడిచి పోయాయి.
“ మీరు కావాలని చెయ్యలేదుగా రావ్ .. ఇట్స్ యాక్సిడెంట్ . అంతే .. బాదపడకండి. సికిందరాబాదులో రిపేర్ షాపు ఉంది అక్కడికి పంపి చేయిస్తాను. సివిల్ వర్క్ లలో ఇలాటివి సాధారణమే. మీరేమీ మనసులో పెట్టుకోకండి. బాదపదొడ్డు .. వెళ్ళి టిఫిన్ చేసి సైట్ కి వెళ్ళండి. మరో ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళండి.” అంటూ దైర్యం చెప్పాడు ...
అంతే .. మరేమీ లేదు ..
అంతేనా ? అంతేనా? మరేదయినా అంటే బాగుండు.
నా జీతం లో కోత విదిస్తే బాగుండు అనుకున్నాను.
కాని అలాటివేవీ జరగలేదు. ఆయన ..మరేమీ మాట్లాడ లేదు . ఆయన ముఖం లోకి చూశాను .
ఆయన చెప్పిందే ఉంది ముఖం లో ..
..
నేను తలవంచుకుని మెస్ వైపు నడిచాను.
మెస్సు లోకి వచ్చే సరికి చపాతి శనగల కూర ‘మెనూ’
రోజు కంటే ఎక్కువగా తిన్నాను...
తల పూర్తిగా ఎత్తుకుని విశ్వాసంతో పనిలోకి అడుగువేశాను.
మా నాన్న చెప్పేమాటకి “ చేసింది చెప్పు” కి చాలా గౌరవం ఉంది అని తెలుకున్న రోజు అది. :)

No comments: