Friday 31 July 2015

వళ్ళంతా నొప్పి

ఒక పెద్దాయన చెప్పేవారు ..
దెబ్బ తగిలిన చోటే నొప్పి
డబ్బులేకుంటే వళ్ళంతా నోప్పే అని ..
అలాటి వళ్ళంతా నొప్పిగా ఉన్న రోజు
ఉదయాన్నే కేబుల్ కనెక్షన్ బాయ్ కాలింగ్ బెల్ కొడతాడు.
“కనెక్షన్ ఆపేయండి. ఏ ప్రోగ్రామ్ సరిగా రాదు. వినబడేవి కొన్ని.. కనబడేవి కొన్ని
అసలు పిల్లల చదువు పాడవుతుంది “ అని కరుస్తాము మనం.
అదేం ఖర్మో అప్పుడే వచ్చి చస్తాడు  పేపర్ కుర్రాడు ..
“మొన్న మంగళవారం జిల్లా ఎడిషన్ మధ్యలో పేపర్ వేయలేదు ..
అయిదు రూపాయలు కట్ చేస్తా ఈ నెల “ కేక లేడతాం మనం.
మనం వెళ్ళగానే ఇంటావిడ సర్ద్ధిచెప్పి పంపుతుంది.
పొద్దుగాలే అరుగుమీద కూర్చుని అందర్నీ పోగేస్తాం.
“వేదవది ఉల్లిపాయలు ఎంతనుకున్నారు. అప్పట్లో హిందూ పేపర్ నెలంతా కలిపి తొమ్మిది రూపాయలు,
యబై రూపాలకీ సంచి నిండా కూరగాయలు, మరి ఇప్పుడు పచారి సామాను మండిపోతుంది,
బియ్యం కోనెట్టు లేదు, గాసు , పాలు ....” అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటాం.
ఇంట్లోంచి కాఫీ వస్తుంది. తాగాక ఎవరి దారిని వాళ్ళు పోతారు .
మనం గడ్డం పెంచేసి (పెంచక్కరలేదు అదే పెరుగుతుంది.) రామ కృష్ణ పరమహంస పుస్తకం దుమ్ము  దులిపి
అది ఎవరు పబ్లిష్ చేశారో చూస్తుంటాము . 
వంటింట్లోంచి “పెసర దోసె లోకి జీలకర్ర , అల్లం తురుము కావాలా వద్దా అని టెంప్టింగ్ ప్రశ్న వినబడింది.
మనం పది నిమిషాల్లో రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ వద్ద వాళ్తాం.
దోసెలు తిన్నాక పరిస్తితి లో మార్పు వస్తుంది.
ఎవడికయినా చేబదులు ఇచ్చామేమో గుర్తుచేసుకుంటాం
మనకి ఇచ్చిన వాళ్ళే గాని మనదగ్గర తీసుకున్న వాళ్ళు గుర్తు కు రారు .
బాంకు బుక్కులు పోగేసి , ఆకవుంటూ లో ఎంత ఉందో లెక్క చూస్తాం 
అంతా కలిపినా బండి పంచరు వేయించడానికి కూడా చాలవు .
ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ దాస్తారో ఆలోచించి అక్కడ వెతకటం మొదలెడతాం.
పిల్లోడు స్కూల్ కి వెళ్ళేముందు “ నాన్నా నోట్స్ లు కావాలి “ అంటాడు.
“మొన్ననే కదరా బండెడు కొన్నాను . చించి పడవలు చేస్తున్నావా ఏమిటి ?”
వాడు బయంగా మనవైపు చూసి వాళ్ళ అమ్మ వెనుక చేర్తాడు..
చిట్టీల వాడికి ఫోన్ చేస్తాం . రెండు నెలల క్రితం మొదలెట్టినది ఈ నెల పాడితే వడ్డీ ఎంత పడుద్దీ? అని
ఫోనే లోనే అంత వడ్డీనా ? అని నిట్టూరుస్తాం.
ఈ వ్యవహారం అంతా ఉదయం నుండి గమనిస్తున్న ఇంటావిడ .
మనం ఫాంటు చొక్కా తొడుక్కునే సరికి .చేతిలో డబ్బు పట్టుకొని వస్తుంది. రాక రకాల నోట్లు ఉంటాయి అందులో ..
“మా అమ్మ మొన్న పండక్కి చీర కొనుక్కోమని ఇచ్చింది .(అప్పు సుమా అనే అర్ధం వఛేట్టు ) “
అది అబ్బద్దం అని మనకు తెలుసు.  మనకి తెలుసని ఆమెకి తెల్సు ..
వివేకవంతుడు వివాదాల జోలికి వెళ్ళడు ..
ఒరకంట ఆవిడని చూస్తాం. ఎందుకో ఆమె అందంగా కనబడుద్ది.
చిలిపిగా ఏదో అంటాం.”దీనికేం కొడవలేదు “ ఆమె ఇంట్లోకి వెళ్తుంది.


మనం బండి తీసి బజార్న పడతాం.  ఆడాళ్లు మీకు బాలచందర్ .!! 

Wednesday 29 July 2015

దూడలు గట్టునే మేస్తాయా?

అడుగులు నేర్చుకునే బుడ్డోడిని,మనమే లేపుతాం.
‘ఏడవకు నాన్నా’ అని గుర్తు చేసి మరీ ఏడిపిస్తాం.
..
చీకట్లో బుచోడు ఉన్నాడు అని చెబుతాం.
గణితం , ఆంగ్లం లాగా భయాన్ని నేర్పుతాం ..
..
అది చేస్తే ఇది; ఇది చేస్తే అది అంటూ బ్రైబ్ చేస్తాం.
అమ్మకి/ నాన్నకి చెప్పొద్దు అంటూ చాటు పనులు నేర్పుతాం...
..
అతనయితే ‘ ఇంట్లో లేనని చెప్పు’ ఆమెయితే ‘చక్కెర నిండుకుందని చెప్పు ‘
తాత పిలిస్తే చదువు కోవాలి అని చెప్పు, మాషాలా కూరేస్తాం....
..
అవసరమయినవే కాదు ,
అనవసరమయినవీ కొనిస్తాం,..
ఎందూకలా? అని అడిగితే 'ప్రేమ' అని చెబుతాం.
..
బాల్యం వీడని వాడిని హాస్టళ్లకి తరిమేస్తాం.
ఉన్న అరఎకరం అమ్మి ఏ ఎన్యూ లో చదివిస్తాం
సద్ది బువ్వ తింటూ .. పిజ్జాలకు పైసలిస్తాం ....
..
ఏనాడూ పంతుళ్లని కలవం,
పాతికవేలు సెల్లు ఎందుకని అడగం.
కాలేజీ లో వాడేంటో తెలీదు. ..
..
సహద్యాయి 'తోబుట్టువ' అని మనం చెప్పం.
వాడు ఎవరిని వెంటాడుతున్నాడో తెలీదు,
ఎవరిని వేటాడుతున్నాడో తెలీదు. వేదిస్తున్నాడో తెలీదు . ..
..
నెలాఖరుకి టంచనుగా పైసలు పంపటం తప్ప మరేమీ తెలీదు.
వసంతం లోకి అడుగేట్టే శరీరాన్ని 'ఫాను' కి వేలాడ దీశాక గాని ,
మనమెంత తప్పు చేస్తున్నామో తేలేదు.
....
అందాకా పిల్లల్ని
కనేస్తాం ..
పెంచేస్తాం,
వదిలేస్తాం ....
..
వదిలేసిన దూడలు గట్టున మాత్రమే మేస్తాయా?..
29/7/15

ఆవు కాలు విరిగింది

అనగనగా ఒక రైతు .
అతనికి ఇంటివద్దే ఒక చిన్న డైరీ ఫామ్. 
ముర్రా బర్రెలు కాకుండా ఒక మూడు ముచ్చటయిన జెర్సీ ఆవులు.
ఆవు పాలు, బర్రెపాలు కలిసి పుటకో కాను (40 లీ ) పాలు కేంద్రానికి పంపుతాడు.
..
.నెల రోజుల క్రితం ఒక ఆవు గచ్చు మీద ..
ముందు కాళ్లు ఎడంగా పోయి జారీ పడింది. తుంటి ఎముక విరిగింది.
తిరిగి లేవలేక పోయింది. రైతు మిత్రుల సాయంతో లేవదీసీ పడుకో పెట్టాడు.
స్టానిక గోపాల మిత్ర చేత వైద్యం చేయించాడు. మండలం లోని పశువుల డాక్టర్ తో
సూది మందు ఇప్పించాడు. రెండు మూడు రోజులు గడిచాయి.
ఇసుమంత కూడా మెరుగు కనిపించలేదు..
..
డాక్టరు గారు పశువుని అమ్ముకో .. ఇంక కాలు రావటం కష్టం.
యాబై వేల ఆవు , ఇప్పుడయితే ఆరేడు వేలకి అమ్మోచ్చు.
మరేదయినా అయితే అదికూడా నష్టం.
అని సలహా ఇచ్చాడు. రైతు తట్టుకోలేక పోయాడు ..
ఎక్కడో "త్రిపురంతకం' వద్ద లంబాడీలు కట్టు కడతారు అంటే అక్కడికి చీకటి తో వెళ్ళి ,
వాళ్ళను నచ్చచెప్పుకుని తీసుకు వచ్చాడు . కట్టు కట్టించాడు.
ఉగ్గాణి కట్టించాడు ..
( నులక మంచం లో నాలుగు కాళ్ళు పెట్టి, పొదుగుకి ఇబ్బంది రాకుండా
చేసి నాలుగుమూలలా తాళ్ళతో .. కప్పుకి వేలాడ దీస్తారు.
కాళ్ళు నేలమీద ఆనీ ఆననట్లు ఉంచుతారు.
కాళ్ళ మీద బరువు పడకుండా జాగర్త తీసుకుంటారు.)
..
నెల రోజుల పాటు దాణా, కుడితి ,పెట్టి , మందులతోనూ, కాలికి కట్టు మార్పించడం తోను
ఫిజియో తెరపీ (తనకు తెలిసిన) తో అల్లారుముద్దుగా చూసుకున్నాడు...
..
నిన్ననే ఊగ్గాణీ తీసేశారు. ఆవు చిన్నగా లేచి నుంచుంటుంది.
డాక్టర్ వచ్చి ఆచ్చెరువు చెందాడు...
రైతు ని ఆవు అందినకాడికి నాలుకతో నాకుతుంది.


..
ఆ రైతు తాళ్ళూరు లో మా చేను కవులు చేసే రైతు .. అతని పేరు సాంబిరెడ్డి .
ఈ రోజు నేను వెళ్ళి ఆ ఆవుని చూసి వచ్చాను . ఎంత సంతోషంగా ఉన్నాడు అంటే
యాక్సిడెంటు అయిన బిడ్డ ఆరోగ్యంగా తిరిగి వచ్చినట్లు .. ..చూడటానికి ఆ దృశ్యం
ఎంత గొప్ప గా ఉందంటే .. నా దగ్గర మాటల్లేవు.

Thursday 23 July 2015

చేసింది చెప్పు





చాలా కాలం (1986 లో ) క్రితం (నాకు 21 ఏండ్ల వయసులో ) ,
ఒంగోలు లో ఇరానీ చాయ్ 0.30 పైసలు చేసినప్పుడు,
వేంకటేశ్వర ధియేటర్ లో నేల క్లాసు టిక్కెట్ 0.70 నుండి 0.90 పైసలు కి ,
నెలవారి మెస్ బిల్లు (60 బోజనాలు)రూ 150.00 కి పెరిగినప్పుడు..
నేను హైదరాబాదు మామిడిపల్లి దగ్గర్లో పహడి షరీఫ్ లో నిర్మాణం లో ఉన్న
RCI (Reach Center Imrat ) https://rcilab.in/ లో శరవణ కంస్ట్రక్షన్ కంపెనీ తరపున
ఒక్క బుల్లి ఇంజనీరుగా నెలకి 750-00 జీతం, ఆకామిడేషన్, ఉచిత బోజన సదుపాయాలతో
గర్వంగా పనిచేస్తున్న రోజులు ....
కేబుల్ చానల్ (యూనిట్1010) కి ఇంచార్జి గా ఉన్నాను. వివిద రకాల మిల్టరి అవసరాల కోసం
నిర్మించే పెద్ద భవనాలకి లింక్ చేస్తూ నడపాలిసిన కేబుల్స్ కోసం భూమి లో u ఆకారపు
నిర్మాణాన్ని కంక్రీట్ తో చేసి దానిని ప్రీకాస్ట్ శ్లాబులతో క్లోజ్ చేసే విడం గా జరిగే సివిల్ వర్కు.అది
సివిల్ ఇంజనీరుగా నేనేదయినా నేర్చుకున్నాను అంటే అది అక్కడే..
అక్కడున్న ప్రతిరోజూ అనేక విషయాలు, సాంకేతిక , లాజికల్ విషయాలు నేర్చుకునేవాడిని.
అలాటి పని చేసే రోజుల్లో ..
ఒకసారి' రికాన్దో' సంస్థ నిర్మించే రోడ్డు కట్ చేస్తూ జి‌ఐ పైపు లు వేసి ఇరువైపులా
వస్తున్న కేబుల్ చానెల్ ను లింక్ చేయాల్సి వచ్చింది. అందుకోసం జి‌ఐ పైపులు రోడ్డువారగా
నిల్వ చేసి ఉంచాము. రోడ్డు ని డోజర్ తో కట్ చేశాక నిపుణులయిన పనివాళ్లు జి‌ఐ పైపులు
కప్లింగ్ ల సాయంతో కలుపుతుంటే..వరుస లేయర్స్ తో కాంక్రీట్ కుషన్ వేయిస్తున్నాం.
..
నేను వ్యూ మొత్తం కేప్చర్ అయ్యే విధంగా థియోదలైట్(theodolite) ను సెట్ చేసుకుని
పనివాళ్ళకి సూచనలిస్తూ, అలైన్మెంట్ చూసుకుంటున్నాను. కన్నడ, తమిళ కూలీలు
పనిచేస్తున్నారు, మూడు భాషలలోకి స్విచ్ ఓవర్ అవుతూ అందరినీ
సమన్వయం చేసుకుంటూ మంచి ఔట్ పుట్ కోసం .. అందరం శ్రమిస్తున్నాం...
మరికొద్ది నిమిషాల్లో ఆ రోజు పని ముగిస్తాము ఆనంగా ...
అప్పుడు హటాత్తుగా అప్పుడు రోడ్డు వారగా నిలవ చేసిన GI పైపులు కదిలి
నేను త్రిపాడ్ మీద ఉంచిన థియోడలైట్ వరకు దొర్లుకుంటూ వచ్చాయి.
స్టాండు పక్కకి జారి చాలా ఖరీదయైన (అప్పట్లోరూ 50,000.00) సర్వే పరికరం
విసురుగా నేలకి కొట్టుకుంది.
దూరంగా ఉన్న నేను గబాలున అక్కడికి వచ్చాను. నిలువుగా ఉండే అలైన్మెంట్ డాట్స్ కదిలిపోయాయి.
అన్మౌంట్ చేసిన థియోడలైట్ తిరిగి బాక్స్ లో పట్టలేదు, ఒక పని వాడు
బలవంతాన పెట్టెలో ఇరికించాడు. మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న కంపనీ
ఆఫీసులో నాపేరు మీద ఉదయాన్నే తీసుకున్న ఇన్స్ట్రుమెంట్ ను తిరిగి ఇచ్చేశాము .
నేనేమీ చెప్పలేదు. యాదృచ్చికంగా జరిగినా జరిగిన నష్టం మాత్రం చాలా ఎక్కువ.
నేను సంవత్సరకాలం పని చేసినా దానిని రీప్లేస్ చేయలేను.
ఎవరితో మాట్లాడకుండా.. క్వార్టర్స్ కి వెళ్ళాను.. తలానిండా ఉన్న దుమ్ము వదిలించుకొటానికి
రోజు తల స్నానం చేస్తాము . ఆ రోజు అది కూడా చేయలేదు..
మెస్సు లో ఏమి తిన్నానో, అసలు తిన్నానో లేదో కూడా గుర్తు లేదు.
అక్కడున్న కామన్ టి‌వి రూములో నేషనల్ చానెల్ లో 'బనియాద్' సీరియల్
వస్తుంది అప్పట్లో నా ఫేవరేట్ టి‌వి షో అది . దానిని చూడలేదు. వెళ్ళి రూములో పడుకున్నాను.
మనసంతా తెలీని బాద.. ఎవరితో షేర్ చేసుకోలేని బాద.
మరో రోజు మరో ఇంజనీరు దానిని సైట్ కి తీసుకెళతారు . ఇన్స్ట్రుమెంట్ డామెజి ని గుర్తిస్తారు
గతం లో దానిని ఎవరు వాడారో రికార్డులలో ఉంటుంది. అప్పుడు జనరల్ మేనేజరు
' మణీ' సార్ ముందు చేతులు కట్టుకుని...దోషి లాగా .. మా నాన్న గుర్తు వచ్చారు ..
నో ..నో ..
పగలంతా చాకిరీ చేసినా .. నిద్ర పట్టలేదు ,, ప్రాజెక్ట్ మేనేజరు ..
‘దొడ్డప్ప’ కన్నడం లో ఏమి అంటాడో అని ఆలోచిస్తూనే ఉన్నాను ..
ఆ రాత్రి నేను నిద్ర పోయిన గుర్తు లేదు. ఉదయానికి నా బుగ్గల మీద కన్నీళ్లు చారలు
కట్టడం గమనించాను.
నేనొక నిర్ణయానికి వచ్చాను. నేరుగా జనరల్ మేనేజరు 'ఈశ్వర మణి' రూము వద్దకు
వెళ్ళి బయట నుంచున్నాను. ఆయన ఇంకా రాలేదు . దగ్గరలోని పల్లెటూర్లో ఉండే ఆయన అందరి కంటే ముందే ఉదయం 8.00 గంటలకే యెజ్ది బండి మీద టంచనుగా వచ్చేస్తాడు.
నేను వెళ్ళిన పది నిమిషాలకి ఆయన వచ్చారు.
" ఏం మిస్టర్ రావ్ . లీవు కావాలా?" నవ్వుతూ అడిగారాయన. నేనంటే మంచి అభిప్రాయం ఉంది ఆయనకి ..అయిదు భాషలు అనర్గళంగా మాట్లాడే ఆయన సైట్ ఇంచార్జీ .
"లేదండీ.." నా గొంతు నాకే వినబడలేదు.
నా ముఖం లోని దైన్యాన్ని గుర్తించి " ఏమయింది రావ్ ?" అన్నాడు.
అప్పటి దాకా ఆపుకున్న దుఖం కట్టలు తెచ్చుకుంది.బోరున ఎడ్చాను .
కన్నీళ్లు చెంపలమీదికి జారీ పోతుంటే ఆయన కంగారు పడ్డాడు.
దగ్గరగా వచ్చి అనునయంగా బుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు.
నేను పెద్దగా ఏడ్ఛాను. రెండు మూడు నిమిషాల్లో తెరుకుని మొత్తం చెప్పేశాను.
నా మనసులోని భారం అంతా దిగిపోయింది. ఏమయినా జరగని. ఒక యడాది పాటు
జీతం లేకుండా పని చేసినా సరే. నేను తప్పుని దాచలేక పోయాను.
ఆ రాక్షసి ని మనసులో బంధించడం నావల్ల కాలేదు.
..
.. కొద్ది నిమిషాలు మౌనం గా గడిచి పోయాయి.
“ మీరు కావాలని చెయ్యలేదుగా రావ్ .. ఇట్స్ యాక్సిడెంట్ . అంతే .. బాదపడకండి. సికిందరాబాదులో రిపేర్ షాపు ఉంది అక్కడికి పంపి చేయిస్తాను. సివిల్ వర్క్ లలో ఇలాటివి సాధారణమే. మీరేమీ మనసులో పెట్టుకోకండి. బాదపదొడ్డు .. వెళ్ళి టిఫిన్ చేసి సైట్ కి వెళ్ళండి. మరో ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళండి.” అంటూ దైర్యం చెప్పాడు ...
అంతే .. మరేమీ లేదు ..
అంతేనా ? అంతేనా? మరేదయినా అంటే బాగుండు.
నా జీతం లో కోత విదిస్తే బాగుండు అనుకున్నాను.
కాని అలాటివేవీ జరగలేదు. ఆయన ..మరేమీ మాట్లాడ లేదు . ఆయన ముఖం లోకి చూశాను .
ఆయన చెప్పిందే ఉంది ముఖం లో ..
..
నేను తలవంచుకుని మెస్ వైపు నడిచాను.
మెస్సు లోకి వచ్చే సరికి చపాతి శనగల కూర ‘మెనూ’
రోజు కంటే ఎక్కువగా తిన్నాను...
తల పూర్తిగా ఎత్తుకుని విశ్వాసంతో పనిలోకి అడుగువేశాను.
మా నాన్న చెప్పేమాటకి “ చేసింది చెప్పు” కి చాలా గౌరవం ఉంది అని తెలుకున్న రోజు అది. :)

Saturday 18 July 2015

ఔట్ ఆఫ్ ది బాక్స్ !

మన చుట్టూ మనం ఒక బాక్స్ నిర్మించుకుంటాము .
ప్రతిదీ దాని పరిదిలోనే ఆలోచిస్తాము.
సమస్యని మన కోణం నుండే ఆలోచిస్తాం .
..
అందుకే పక్కవారి సమస్య ఒక్కోసారి హాస్యాస్పదం గాను,వింతగాను తోస్తుంది.
ఇంత చిన్న సమస్యకా కుంగి పోవటం అనిపిస్తుంది.
..
ఒక ఎలిమెంటరీ స్కూల్ లే చదివే పిల్ల చెయ్యి పొరపాటున తగిలి
గుప్తా గారి అమ్మాయి పూసల దండ తెగొచ్చు. దానికా పిల్ల
రోజువారీ తండ్రి కొనుక్కోటానికి ఇచ్చే డబ్బులోంచి వాయిదాలు చెల్లించాల్సి రావచ్చు...
..
ఒక పెద్ద కంపెనీ కొత్తగా చేరిన ఎర్రచీర అమ్మాయిని ఎం‌డి స్త్రీ గా గుర్తించడం వల్ల
కంపెనీ చంక నాకి పోవచ్చు. హెచ్చరించిన మిత్రులని దూరం చెయ్యొచ్చు ...
..
పెట్టేడు లాగేజీ తో జీవన పోరాటం చేయటానికి
ఒక బీద మెడికల్ గ్రాడ్యుయేట్ పెట్టేడు పుస్తకాలతో కోజికోడు NIT వద్ద
రెండురోజుల షెల్టర్ కోసం దీనంగా ఎదురు చూస్తుండొచ్చు. ..
..
పుస్కారాలలో తనకి తలనొప్పిగా ఉన్నబినామీ ముసలమ్మని
రాజమండ్రి లో దించి రావటానికి ఒకాయన బయలుదేరుతుండవచ్చు....
..
ఇంట్లో తిని , పెద్దలకి ఎదురుతిరిగే బలాదూరు కొడుకు,
వరస కానీ పిళ్లతో వ్యవహారం నడుపుతుండొచ్చు ....
..
నెల నెలా పదివేలు అందుకునే కొడుకుని చూద్దామని బయలుదేరిని
తండ్రికి యేడాది క్రితమే అతను డీటైన్ అయినట్టు SRM ప్రిన్సిపల్
చెప్పొచ్చు. కాలేజీ వారి రికార్డ్స్ లో తన అడ్రెస్స్ మరోలా మారి ఉండవచ్చు...
..
సమస్యలు అనేకం.. పరిష్కారాలు పరిమితం..
పలాయనం కానీ , 'తప్పుకోటాలూ' కానీ సమాదానం కాదు.
...
బాక్స్ బయటకొచ్చి ఆలోచించనంత వరకు సమస్య నుండి
బయటి దారి దొరకదు..అందాకా అంతా పద్మవ్యూహం..
18/07/15

Monday 13 July 2015

మూర్తి గారి కారు ప్రయాణం

KN మూర్తి చిన్నగా కారు తోలటం నేర్చుకున్నాడు.
లేటు వయసులో మొదలెట్టినా పట్టుదలతో నేర్చుకుని 
ఒక రోజు మిత్రుడి కారు తీసుకుని విజయవాడ బయలు దేరాడు .
..
గంట ప్రయాణం తర్వాత చిన్న కుదుపుతో కారు ఆగి పోయింది.
ఎందుకో అర్ధం కాలేదు మూర్తి కి ...బాటరీ డౌన్ అయ్యేదాకా ట్రై చేశాడు .
..
కారు దిగి ఏదయినా బస్ స్టాప్ వచ్చేవరకు నడుద్దామని బయలు దేరాడు .
వర్షం మొదలయ్యింది. చీకటి పడింది.
వణుకుతూ వడివడిగా నడవసాగాడు ...
త్రోవలో వెనుక నుండి వచ్చే వాహనాలను ఆపే ప్రయత్నం చేశాడు
కానీ అవేవీ సాద్య పడలేదు.
...
కొద్ది సేపటికి వర్షం తో పాటు హోరున గాలి ,
ఛీకట్లో తలలు ఊపుతున్న పొడవాటి చెట్లు.
ఎక్కడినుండో నక్కల ఊళలు.
ఆకాశానికి పగుళ్లు వస్తున్నట్లు మెరుపులు.
..
మూర్తి కి ఒక్క సారిగా భయం వేసింది.
తాను రాసే దయ్యాల కధల నేపద్యం.
కీ బోర్డు ముందు కూర్చుని వెళ్ళు కదిలించడం కాదు.
సరిగ్గా తన కధల్లోని వాతావరణం.
..
ఏదో కారు తక్కువ లైటింగు తో చిన్నగా వస్తుంది.
మరో ఆలోచన లేకుండా మూర్తి కారు వెనుక డోరు తీసుకుని ఎక్కి కూర్చున్నాడు .
కారు వేగం ఇంకా తగ్గినట్లు అనిపించింది.
" క్షమించండి .. మరో మార్గం లేదు .. మిమ్మల్ని అడక్కుండా ఎక్కినందుకు సారి '
మాట్లుడుతూ డ్రైవింగ్ సీటు వైపు చూశాడు.
..
ఆశ్చర్యం ..
అ క్క డ ఎ వ రూ లే రు ..
..
మూర్తికి ఒక్క క్షణం ..లో బిగుసుకు పోయాడు .
రోడ్డు పల్లం గా ఉంది . కారు వేగం అందుకుంది.
మూర్తి నోరు తడి ఆరి పోయింది.
సిగిరెట్టు కోసం జేబులు తడుము కున్నాడు.
..
తడిచిన జేబులోంచి తీసిన లైటర్ వెలిగించి చూశాడు.
కారులో ఎవరు లేరు. కారు వేగంగా వెళుతుంది.
హటాత్తుగా మలుపు వచ్చింది. ముందు పెద్ద లోయ..
మూర్తి పెద్దగా అరిచాడు భయంతో..శబ్దం బయటకి రాక పోవటం గమనించాడు.
అయిపోయింది.. తన జీవితం ముగిసింది. బార్యా పిల్లలు గుర్తొచ్చారు.
..
హటాత్తుగా జరిగినది ఆ సంఘటన ..
ఏదో ఒక చెయ్యి ఒక .మహిళ దీ డ్రైవింగ్ సీటు పక్క విండో నుండి
లోనికొచ్చి స్టీరింగు పక్కకి తిప్పింది. కారు మళ్ళీ రోడ్డు మలుపులో కి
వచ్చింది. మూర్తి కట్రాటు అయిపోయాడు.
ఎవరు ఎవరది ,, రజియానా? రజియానేనా?
నోట మాట రాలేదు .. కారు ఇంకా వేగం పుంజుకుంది.
..
మూర్తికి క్రైసిస్ మేనేజ్మెంట్ క్లాసులు గుర్తొచాయి.
కారు డోరు తెరుచుకుని .కిందకి దూకాడు .
తన వయసు గాని , గాయాలవుతాయన్న ఆలోచన కానీ ఏమి లేవు.
ఒక్క సారి తూలు ని ఆపుకుని దూరంగా కనబడుతున్న వెలుగు వైపు
వేగంగా పరిగెత్త సాగాడు . ఎక్కడా ఆగలేదు.
..
అదొక చిన్న టీ హోటల్ .. బంకు మీద టార్పాలిన్ పట్టని ముందుకు కప్పి ఉంచి
లాందరు తగిలించి ఉంది. ఆయాసం తీర్చుకున్నాక సిగిరెట్టు వెలిగించి.
గట్టి గా దమ్ము పీల్చాడు .. గుండెల నిండా వేడి పొగ . వేడి చాయ్ ఒకటి చెప్పాడు.
..
..
..
..
..
..
..
..
పావుగంట గడిచింది .అక్కడి కి ఒక బాగా తడిచి అలసి పోయిన జంట వచ్చారు.
" బాబూ ఇక్కడ కారు మెకానిక్ ఎవరయినా దొరుకుతారా.?
రెండు కిలో మీటర్లు నెట్టుకుని వచ్చాం కారుని "
..
ఆ ఇల్లాలు మూర్తిని చూపిస్తూ బర్తతో చిన్నగా చెబుతుండటం
అతని దృష్టి నుండి తప్పించుకోలేదు ..
"మనం తోసిన కార్లో కూర్చుని వచ్చింది ఇతనే "
tongue emoticon pacman emoticon pacman emoticon pacman emoticon
-----------------W A

Wednesday 8 July 2015

మా వారు కారు కొంటున్నారు



హటాత్తుగా మావారు నిన్న రాత్రి బోజనాలపుడు 'రేపు మనం కారు కొందాము' అన్నాడు .
ఇంటర్ చదువుతున్నఒక్కగానొక్క మా అమ్మాయికి, నాకు., కొద్ది సేపు ఏమి అర్ధం కాలేదు.
మధ్య తరగతి కుటుంబం అని దైర్యంగా చెప్పుకోలేని ఆర్దిక స్థితి మాది .
మా మామగారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తీసుకున్న పర్సనల్ లోనులు,
ఎప్పుడూ బాగోని నా ఆరోగ్యం.. దాని కోసం తీసుకున్న చేబదుళ్ళు, వాటి సర్దుబాట్లు ..
ఈ మహారణ్యం లో ఇంటి అద్దెలు , పప్పు.. ఉప్పులు, రోగాలు రొప్పులు అవసరాలు.... అనేకం
వీటితో కుస్తీ పట్టటం తోనే సరిపోయే మా కుటుంబానికి !?!?
ఆయన చెప్పిన మాటలు చాలా వింతగా అనిపించాయి.
మేము కరెక్టుగా నే విన్నామని ఋజువు చెయ్యటానికా అన్నట్లు .
ఆయన మరో సారి అన్నారు "రేపు ఉదయం టాటా షో రుము లో యూస్డ్ కార్స్ వేలం జరుగుతుంది, మనం వెళుతున్నాం కారు కొంటున్నాం "
.
ఈ మధ్యకాలం లో ఈయన మానసిక పరిస్తితి అంత బాగున్నట్లు అనిపించలేదు.
చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం తో ఒంటి చేతి మీద కుటుంబాన్ని లాక్కురావటం ,
ఆర్ధికంగా మాపెద్దల నుండి ఏవిదమయినా సపోర్ట్ లేకపోవటం ,
ఏదయినా కొద్ది ఖర్చు ఎక్కువ తగిలిన నెలలో ఆయన విలవిల లాడటం నాకు తెలుసు. .
.
ఈ మధ్యే చుట్టు పక్కల వాళ్ళ తో సోది మాటాడటం కట్టిపెట్టి
నేను మగ్గం పని నేర్చుకుంటున్నాను, వేడి నీళ్ళకు చన్నీళ్ళు గా
మా కుటుంబాన్ని నిలకడగా ఉంచాలని నా వంతు ప్రయత్నం.
.
అలాటి మా కు ఆయన మాటలు వింత గాను 'ఒకింత' భయం గాను అనిపించాయి.
ఆయన ఏమి తమాషా చెయ్యటం లేదని... మర్నాడు అమ్మాయిని కాలేజీ కి పంపకుండా, మా ఇద్దరినీ కలుపుకుని సిటీ బస్ ఎక్కించి టాటా షోరూం కి తీసుకెళ్ళాడు. .
.
ఊరికి కొద్ది దూరంగా ఉన్న ఆ షో రూము గారేజ్ లో అనేక కార్లు పార్కు చేసి ఉన్నాయి.
కారు అద్దం లోపల వైపు 'ఆ కారు మోడల్ , సి‌సి , తిరిగిన మైలేజ్, కండిషన్, సుమారుగా ధర రాసిన కాగితాలు అంటించి ఉన్నాయి..
.
మమ్మల్ని ఆశ్చర్యం నుండి తేరుకొనివ్వకుండా మంచి కారు సెలెక్ట్ చెయ్యమని, దాని రంగు బాగుండాలని, చూడటానికి అందంగా ఉండాలని, పక్కన నిలబడి పోటో తీయించుకుంటే హుందాగా ఉండాలని, ఇంజను ఎలా ఉన్నా పర్లేదనీ, కాగితాలలో ఎన్ని లొసుగులున్నా, ఫైనాన్స్ లో ఉన్న కారయినా పర్లేదనీ ఒక ట్రాన్స్ లో ఉన్నవాడి లాగా చెప్పాడు .
..
చెప్పటమే కాదు, మంచి కలర్ లో ఉండి చూడటానికి అంధంగా ఉన్న కారొకటి సెలెక్ట్ కూడా చేశాడు
ఎలాఉంది ? మా అమ్మాయిని అడిగాడు.
అప్పటికే అయోమయంగా ఉన్న మా అమ్మాయి 'బాగుంది' అన్నట్లు తల ఊపింది.
సంతోషం కన్నా అయోమయం ఎక్కువగా ఉంది ఆమె మొహంలో. నాకయితే నోట మాట రాలేదు.
"ఏం జరుగుతుందండి?" భయంగా అడిగాను.
"తిక్కమొహం దానా (ఆయన నన్ను అలానే పిలుస్తారు)" మనమ్మాయి పెళ్ళికి ఈ కారు గిఫ్ట్ చేస్తాను. నెల నెల కిస్తిలు కట్టి దీన్ని కొంటాను. షౌరూమ్ యజమాని నాతో హైస్కూల్ చదివినవాడు .
నెల నెలా ఇంస్టాల్మెంట్స్ కి ఒప్పుకున్నాడు. ఆయన ఆనందంగా చెప్పాడు.
మిమ్మల్ని ఇంటి వద్ద దించి వచ్చి, కారు మొదటి ఇంస్టాల్ మెంట్ కడతాను.
తిరునాళ్ళలో పీచు మిఠాయి తినే పిల్లాడిలాగా సంబరంగా చెప్పాడు ..
.
అప్పటి దాకా మౌనంగా ఉన్న మా అమ్మాయి
“నాన్నా, మీకు తెలుసు నేను మెడిసన్ చదువుతాను , అది చిన్నప్పటినుండి నా కోరిక, మెడిసిన్ పూర్తి అయ్యిందాకా పెళ్లి చేసుకొను. ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల తరవాత జరగబోయే దానికి ఇప్పటి నుండి పాత కారుకి ఇంస్టాల్ మెంట్స్ కడతారా?”..
ఒక్క నిమిషం గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడాయన...
“ఎమ్మా కారు బాలేదా ? అయినా మైలేజ్ కూడా బాగానే వస్తుందట “..
“నాన్నా .. మీరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు.
మనం కారు కొనదలుచుకున్నప్పుడు అప్పటికి మార్కెట్ లో ఇంతకన్నా మంచి కార్లు, మోడల్స్ రావచ్చు అప్పుడు ఎంచుకుని మంచి కారు కొనుక్కోవచ్చు కదా?”.
వాళ్ళ నాన్నతో ఇంత స్పష్టంగా మమ్మాయి మాట్లాడగలదని నేను ఊహించలేదు.
ఒకింత కోపం కూడా నాకు కలిగింది...
మా వారు నవ్వారు. తల మీద బరువును దించుకున్నట్లు రిలీఫ్ గా ఉన్నారు...
“నీ ఎనలైజేషన్ బాగుంది. నువ్వు పెద్దాదానివవుతున్నావు. యు ఆర్ నో మోర్ ఎ కిడ్ .”. అన్నాడు రిలీఫ్ గా .
"మరి రోజుకి రెండు గంటలు నువ్వు మాట్లాడే మీ క్లాస్స్ మెట్.
' సుదాకర్' కి ఈ సూత్రం వర్తించదా?..' సూటిగా అడిగారు ఆయన..
.
మా ముగ్గురి మధ్య ఒక విస్ఫోటం జరిగింది..
నేను దిగ్బ్రాంతికి లోనయ్యాను .
..
మా అమ్మాయి ముఖం లో తెలీని బాద. జ్ణాన దంతం వచ్చేటప్పుడు కలిగే బాద ..
   ..

Thursday 2 July 2015

అం ఆ

చదువు విలువ తెలిసి 
అక్షర జ్ణానమ్ కలిగిన 
ఒక బీద ఇంటి ఇల్లాలు ,
తమ బుడతడిని తండ్రి తో పాటు 
మేకలని కాయటానికి పంపకుండా 
పొరాడి మరి ప్రబుత్వ పాఠశాల కు పంపుతుంది.
..
నెల రోజుల్లోనే అచ్చులు నేర్చుకుంటాడు. పిల్లాడు ...
..
" నీ పేరు రాస్తాను అమ్మా అంటాడు "..
..
"లేదు కన్నా ఇంకా హల్లు లు నేర్చుకోవాలి, ద్విత్తాక్షరాలు,
గుణింతాలు , వత్తులు బోలెడన్ని నేర్చుకోవాలి
అప్పుడే నా పేరు రాయగలవు " అంటుంది తల్లి.
..
ఆ రాత్రి సీసా బుడ్డి ముందు అక్షరాలు వచ్చినవరకు పదే పదే..
రాసిన బుడ్డోడు తన పలక తెచ్చి తల్లికి చూపిస్తాడు.
..
దానిపైన రెండే రెండు అచ్చులు ...
..
" అం ఆ "..
..
ఇక ఆ తల్లిని కానీ , బుడ్డోడిని కానీ ఆపటం ఎవరి తరం?..
--------------------------------- ( ఒక జ్నాపకం)

సుత్తి

కోర్టులో ముద్దాయిని జడ్జి ప్రశ్నిస్తున్నాడు.
2014 డిశంబరు 14 వతేదీన నువ్వు మీ అత్తని 
'సుత్తి' తో మోది చంపావు అవునా?
..
"అవును . దానికి నేనెంతో బాద పడుతున్నాను " ..
ముద్దాయి కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు.
..
' దొంగ గాడిద వీడిని నరికినా పాపం లేదు " ..
ప్రేక్షకుల లోంచి ఎవరో అరిశారు.
..
సైలెన్స్ ప్లీజ్ .. జడ్గి గారు మందలించారు...
..
"2015 మార్చి రెండో తేదీ ఇరవై యేళ్ళు కాపరం చేసిన బార్యని ..
అదే విదంగా సుత్తి తో మోది చంపావు అవునా? " మళ్ళీ అడిగాడు జడ్జి.
..
" అవును దానికి నేనెంతో పచ్చతాప పడుతున్నాను " ..
తలవంచు కున్నాడు ముద్దాయి.
..
" దొంగ లమ్దీ కొxx,, చంపేయ్యాలి . నా కొడుకుని ?" ..
మళ్ళీ గాలారీ లోంచి అతనే పెద్దగా అరిచాడు .
..
జడ్జి అతన్ని పిలిచాడు .. ..
..
నీ కోపం నేను అర్ధం చేసుకోగలను. ..
కోర్టులో వ్యక్తిగత అభిప్రాయాలూ వెల్లడించకూడదు.
కోర్టు మర్యాదలు పాటించాలి . లేదా మిమ్మల్ని ప్రాసికూటే చేయాల్సి వస్తుంది.
ఇంతకీ మీకు అతను ఏమవుతాడు.
..
" మా పక్కిట్లో ఉంటాడు అతను "..
..
"మీ బాద అర్ధమయింది. ఇతగాడి కిరాతకం తట్టుకోలేక పోతున్నారు కదా ?"..
..
" నా బాద మీకు అర్ధం కాదు జడ్జి గారు. ..
నేను సుత్తి అడిగిన ప్రతిసారి లేదని చెప్పేవాడు నా xxx....." pacman emoticon pacman emoticon pacman emoticon

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...