Friday, 26 June 2015

వెంకట్రామయ్య -- నేను

ఈ రోజు అర్జంటుగా మేము దరిశి వెళ్లవలసిన పని పడింది.
మెయిల్ లో లీవు లెటర్, ఫోన్ లో పర్మిషన్ తో 
మా ఆవిడా నేను ఉదయాన్నే బయలు దేరాము. 
దరిశి అంటే సరిగ్గా దరిశి(మా శ్రీమతి ఊరు) కాదు .
అక్కడ నుండి 13 కి.మీ ల దూరం లో ఉన్న దేవారం గ్రామం.
..
అక్కడ మాకో ఆప్త మిత్రుడు ఉన్నాడు .
వెంకట్రామయ్య అని చిన్న రైతు.
నా కంటే పదేళ్ళు చిన్నవాడు. నిరక్షరాస్యుడు.

సూదంటురాయి లాటి అతని నిజాయితీ కి నేను ఫిదా అయిపోయాను.
నా ఫోన్ నెంబరు తన ఇంటి లో వేలాడే కాలండరు మీద రాయించుకుని ఫోన్ చేస్తుంటాడు.
నా మాటంటే అతనికి వేద వాక్కు,
మా కుటుంబం అంటే అంతు లేని అభిమానం.
..
మా స్నేహం 15 ఏండ్ల క్రితం ది...
నేను ముండ్లమూరు మండలం లో పని చేసేటప్పుడు
అతను పులిపాడు నందనవనం అనే గ్రామ శివార్ల లో నిర్మించే ఇండ్లకి
బిల్డింగ్ మెటీరియల్స్ తోలేవాడు. తమ ట్రాక్టరు తో ..
వ్యవసాయ పనులు లేని ఖాళీ సమయాల్లో
బిల్డింగ్ మెటీరియల్స్ తోలటం ఒక ఉపాది.
ట్రాక్టర్ కు వాటి యజమానులకు . కూడా వెసలుబాటే.
..
అతని కి తగినదే బార్య కూడా.. మాకు లాగే ముగ్గురు పిల్లలు .
పెద్ద పిల్ల కి 15 ఏండ్లు స్థానికంగా టెన్త్ పాసయ్యింది.
..
దేవారం గ్రామం సాగరు కాలవ సాగు భూమి ఉంది. ..
మాగాణి లో వరి పంట వేస్తారు.
వెంకట్రామయ్య తన స్వంత భూమి కాకుండా, కొంత కవులు భూమి కూడా సేద్యం చేస్తాడు. వ్యవసాయ పనులప్పుడు పెట్టుబడి కి మా దగ్గరకి వస్తాడు.
పంట చేతికి వచ్చాక లెక్క పూర్తిగా అప్పజెబుతాడు.
మా కోసం ఒక ఎకరం మాగాణి లో దిబ్బ ఎరువులతో వరి సాగు చేస్తాడు.
74 రకం విత్తనాలు లు వేస్తాడు. ధాన్యం తన వద్దే ఉంచుకుని,
రెండు నెలల కొకసారి అతి తక్కువ పాలిష్ తో బియ్యం మర ఆడించి తీసుకు వస్తాడు.
వచ్చే టప్పుడు, గుమ్మడికాయో, సొర కాయో, జున్ను ఫాలో , షరా మామూలే
..
మేము అక్కడి కి వెళ్లామంటే గంప కింద కోడి మాయం కావాల్సిందే...
మా ఇంట్లో శుభ కార్యాలకి , ఇద్దరు వస్తారు
రెండు మూడు రోజులు ఉండి పనులన్నీ చక్క బెట్టి వెళుతుంటారు.
..
ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంది అసూయ పడే అంత స్నేహం .మాది.
నా అదికారులు కొంత మంది ని నాకు పరిచయం ఉంది అని చెప్పుకోటానికి సిగ్గు పడతాను
కానీ అతన్ని స్నేహితుడు అని గర్వంగా చెప్పుకుంటాను.
ఈ మధ్యే తాను వారిస్తున్న వినకుండా కొంత అధునాతనంగా ఇండ్లు
నిర్మిచుకునెట్టు చేశాను. మరుగుదొడ్డి వాడకాన్ని అలవాటు చేశాను .
..
ఇంతకీ విషయం ఏమిటంటే .. ....
వెంకట్రామయ్య పెద్ద కుమార్తె నిన్న సాయంత్రం ఫోన్ చేసింది.
ఎవరో సన్న గొంతుతో తడబడుతు మాట్లాడుతుంటే ఏమి అర్ధమవలేదు “ ఆ పాప మాట్లాడుతుందని గ్రహించడానికి కొంత సమయం పట్టింది.”
“నేను చదువు కుంటాను సారు ..
మా నాన్న కి మీరు చెబితే కానీ కాలేజీ లో చేర్చడు” అంది
విషయం అర్దమయిన నేను రాత్రి మా ఆవిడ తో వెంకట్రామయ్య బార్య తో మాట్లాడించాను. ...
దగ్గర్లో దరిశి పంపి చదివించాల్సి వస్తుంది . అని పెళ్లి చేసే ఏర్పాటు లో ఉన్నాడట !!
వెళ్ళి .. వెంకట్రామయ్యను సున్నితంగా మందలించి ..
ఒప్పించి ఆ పిల్లని మా కార్లో ఎక్కిచుకుని దరిశి లో
మా బావమరిది చెప్పిన కాలేజీ లో చేర్పించి హాస్టల్ కి కావల్సిన వస్తువులు కొనిచ్చి..
నాటు కోడి బోజనమ్ తిని (ఇది తప్పదు)
దరిశి లోని బందువులకు హాయ్ చెప్పి ఇంటికి చేరామ్. శుభ రాత్రి ..

No comments: