Monday, 18 May 2015

సన్నాఫ్ రోశయ్య


ఉదయం నుండి అన్నీ వెతుకుతున్నాను. అమ్మ కుట్టు మిషన్ సొరుగు ,
తిరగమాత గింజల పెట్టె , అక్క పుస్తకాలు, అన్నీ ..
అవకాశము ఉన్న అన్నీ చోట్ల చిల్లర కోసం.
.
పోపుల పెట్టె లో పావలా బిల్లా దొరికింది.
మరోచోట వెతుకుతూ అది నోట్లో వేసుకున్నాను.
అక్క పుస్తకాల మద్య ఒక రెండు రూపాయల కాగితం.
నాన్న ఇచ్చిన 15 రూపాయలకి ఇది అదనం.
.
8.30 కి పది మంది పైగా పిల్లలం రోడ్డు మీదకు చేరాము.
మా నాన్నే వచ్చి మమ్మల్ని బస్ ఎక్కించారు
.
మద్దిపాడు నుండి 15 km దూరం లోని ఒంగోలు వచ్చాము.
బస్సు బయలుదేరెంతవరకు నాన్న జాగర్తలు చెబుతూనే ఉన్నారు.
బస్సు బయలుదేరుతుండగా గుర్తొచ్చింది డబ్బుల వెతుకులాట లో
ఉదయం నోట్లో వేసుకున్న పావలా బిల్ల మింగేసానని.
యేమవుతుందో అని కంగార పడ్డాను గాని ఫ్రెండ్స్ తో కలిసి
కండక్టర్ తో పోట్లాడి హాఫ్ టికెట్ (11 యేళ్ల లోపని వాదించి... నిజానికి 13”4 నెలలు )
40 పైసలు కొట్టించి ఆ పావలా అలా ఆదా చేశాను.
.
ఒంగోలు దిగగానే పోలోమని అందరం స్టార్ స్టూడియో కి వెళ్ళాం.
10 రూపాయలిచ్చి passport ఫోటో దిగాము.
జీవితం లో మొదటి పాస్ పోర్ట్.
1979 December 10th.
సాయంత్రానికి ఇవాలన్న ఒప్పందం తో. పది పరీక్షలకి ఫోటోలు కావాలి మరి.
.
అప్పట్లో స్టార్ స్టూడియో లో black & white ఫోటోలకి మంచి డిమాండ్.
అక్కడినుండి పోలో మని పోలీసు గ్రౌండ్ కి .
అంత అంత దూరాలు నడవటం తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు.
లగేజ్ ఉన్నవారు అనారోగస్తులు మాత్రమే సైకిలు రిక్షాలు ఎక్కేవారు.
ఇప్పటీ కీ ఆశ్చర్యం.ఎంతదూరాలయిన ఇప్పటిలా సైకిలు , బండ్లు ఏతుక్కోవటం ఉండేది కాదు.
.
పోలీసు గ్రౌండ్ అంతా అప్పటికే జనలతో కిక్కిరిసి పోయింది.
సెక్యూరిటి పోలీసులు చెప్పిన విదంగా వెళ్ళి అతి పెద్ద డయాస్ యెదురు
చాలా దూరంలో కూర్చున్నామ్.
కొద్ది నిమిషాల్లోనే helicopter రావటం వేదిక కి దగ్గరలో దిగటం,
అందులోంచి దిగిన ఆవిడ చక చకా ఓపెన్ జీప్ లో పూల వాన మద్య
వేదికని ఎక్కడం. హోరుణ జనం గోల.
మొదటిసారి helicopter అంత దగ్గరగా చూడటం.
.
ఇందిరాగాంధీకి జై.. అంటూ నినాదాలు.
పెద్ద పెద్ద జండాలు ఊపటం.
వేదిక నుండి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రజల నుద్దేశించి
చేతులు ఊపుతూ వ్రాసుకున్న తెలుగు ప్రారంభ వాక్యం చెప్పగానే.
పెద్ద హోరు. జనం తోసుకుని చూసేవాళ్ళు.. వాళ్ళని కూర్చోబెట్టే పోలీసులు
.
ఆమె రాజకీయ ప్రసంగం కొద్ది నిమిషాలు వినగానే ఇక బయలు దేరాము.
రేపు నాన్న అడిగితే ఆమె ఏమి మాట్లాడిందో నని చెప్పటానికి
రెండు మూడు ఇంగ్లీష్ వాక్యాలు hard disk లోకి నేట్టాను.
.
దారిలో ఫోటోలు తీసుకున్నాం.
అక్కడి నుండి కనీసం రెండు కిలోమీటర్లు ఉండే బాలకృష్ణ దియేటర్ కి.
యుగంధర్ ( సీనియర్ ntr తో అమితాబ్ Don కి రీమేక్ ) ఆడుతుంది.
ఎన్‌టి‌ఆర్ సినిమా.. రాజకీయ మీటింగు కి వచ్చిన జనం,
బయంకరమైన రష్ క్యూ లైన్ వద్ద. నేల టికెట్ రు 0-70 పై లది,
బెంచీ రు1-10 పై అంతకుమించి మేము చూసే వాళ్ళం కాదు.
అది సమాజం లోని ఉన్నత వర్గాలకి అని అప్పటి అభిప్రాయం.
.
మాలో ఒక సాహసి క్యూ లో దూరాడు .
అరగంట తర్వాత టిక్కెట్స్ లేకుండా వచ్చాడు.
నా ముందే house full బోర్డు పెట్టాడురా అంటూ.
వాడి చొక్కా చిరిగిన విషయం కూడా పట్టిచ్చుకోలేదు.
.
వేంకటేశ్వర దియేటర్ లో ‘ బుర్రిపాలెం బుల్లోడు’ కి వెళ్దాం
అనుకుని పరిగెత్తుకుంటూ... అక్కడికి వెళ్ళాం.
ఇంకా భీతావహం గా ఉంది పరిస్తితి. చొక్కాచింపుకున్న
వీరుడే వెళ్ళి చాలా సేపటి తర్వాత గుర్తు పట్టటానికి వీలులేకుండా వచ్చాడు.
చేతిలో సరిపడా నేల క్లాస్ టిక్కెట్స్. అది ఫస్ట్ షో. కి.
.
ఆరోజు ఏమి తిన్నామో తినలేదో గుర్తు లేదు కానీ ,
మొత్తానికి బుర్రిపాలెం బుల్లోడు సినిమా చూశాం.
సెకండ్ హాఫ్ లో కృష్ణ రివెంజీ సీను లన్నీ పరకాయ ప్రవేశం చేసి ఎంజాయ్ చేశాం.
.
సినిమా నుండి బయటకొచ్చాక చీకటి చూశాక గాని నాన్న పెండలాడే రమ్మని
పదే పదే చెప్పిన మాటలు గుర్తొచాయి. అందరం గబ గబా బస్ స్టాండ్ కి వెళ్ళాం.
.
మద్దిపాడు వెళ్ళటానికి లాస్ట్ బస్ లు కూడా లేవు.
మాలో కొంచెం పెద్ద కుర్రాళ్ళు మాకు దైర్యం చెప్పారు.
బైపాస్ కి వెళ్ళి లారీ ఎక్కి మద్దిపాడు సెంటర్ లో దిగామ్. రాత్రి 11 దాటి ఉంటుంది.
రోడ్డు మీద నాన్న .. ఎప్పటినుండి ఉన్నాడో... తెలీదు.
రోడ్డు నుండి నేను ఇంటికి నడవాల్సిన అవసరం లేకుండా తన్నుకుంటూ...తీసుకెళ్లారు.

No comments: